గనుల మంత్రిత్వ శాఖ
కోణార్క్ సూర్యదేవాలయం వద్ద డిఎమ్ఎఫ్ ప్రదర్శనను సందర్శించిన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
ఎన్ఎమ్ఎమ్‌సి 2వ రోజు: పర్యావరణ పునరుద్ధరణ, సుస్థిరత కోసం హరిత కార్యక్రమాలతో గనుల మూసివేత బాధ్యతను ప్రధానంగా ప్రస్తావించిన కేంద్ర మంత్రి
Posted On:
21 JAN 2025 6:45PM by PIB Hyderabad
కేంద్ర గనుల శాఖా మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, కోణార్క్‌లోని ప్రసిద్ధ సూర్య దేవాలయంలో నిర్వహిస్తున్న జిల్లా మినరల్ ఫౌండేషన్ (డిఎమ్ఎఫ్) ప్రదర్శనను సందర్శించారు. ఒడిశా ప్రభుత్వ సహకారంతో ఈనెల 18 నుంచి 21 వరకు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈ ప్రదర్శనను నిర్వహించింది. తన పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రి వివిధ స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జిల) సభ్యులతో సంభాషించారు. అలాగే గనుల ప్రభావ ప్రాంతాల్లో డిఎమ్ఎఫ్ నిధుల కారణంగా సాధ్యమైన గణనీయమైన మార్పు ప్రభావాన్ని ప్రదర్శించే వినూత్న ఉత్పత్తులు, పరిష్కారాలు గల ఈ ప్రదర్శనను ఆయన ఆసక్తిగా తిలకించారు.
“సుస్థిర అభివృద్ధి ద్వారా కమ్యూనిటీలకు సాధికారత కల్పించడం” అనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ప్రదర్శనలో డిఎమ్ఎఫ్ నిధుల సహాయంతో స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జిలు), జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ), హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సిఎల్), ఎన్ఎఎల్సివో, హెచ్‌జెడ్‌ఎల్/వేదాంత, ఒడిషా ప్రభుత్వాల కృషిని చాటుతూ ఏర్పాటైన 18 అద్భుతమైన స్టాళ్లు ప్రదర్శనకు ప్రాణం పోశాయి. ఎస్‌హెచ్‌జిల మహిళలు చేతితో తయారు చేసిన వస్తువులు, చేతితో నేసిన బట్టలు, ధృడమైన దారాలు, అలాగే డిఎమ్ఎఫ్ నిధులతో కొనసాగుతున్న సుస్థిర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నమూనాలు సహా పర్యావరణ అనుకూలమైన, సుస్థిర పరిష్కారాలపై దృష్టి సారించిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. దీనిలో పాలుపంచుకున్న వారి సృజనాత్మకతను, సామర్థ్యాలను ప్రతిబింబిస్తూ పర్యావరణ అనుకూలమైన, స్థానికంగా రూపొందించిన ఉత్పత్తులు ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఈనెల 21 నాటికి, ఈ ప్రదర్శనలో పాల్గొన్న మహిళా సంఘాలు రూ. 9 లక్షలు పోగు చేయడం ద్వారా ఈ ప్రదర్శన ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. అలాగే ఆర్థిక సాధికారతను పెంపొందించుటలో ఇలాంటి కార్యక్రమాల ప్రభావాన్ని చాటి చెప్పింది. ఎన్ఎఎల్సివో, ఓఎమ్సీలకు చెందిన సీనియర్ అధికారులతో కలిసి ఈ ప్రదర్శనను గనుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి ఫరీదా ఎమ్. నాయక్ ఈ నెల 18న ప్రారంభించారు. సుస్థిర అభివృద్ధి, సమాజ సంక్షేమం పట్ల మంత్రిత్వ శాఖ నిబద్ధతకు ఈ ప్రదర్శన నిదర్శనంగా నిలిచింది.
3వ జాతీయ మంత్రుల సదస్సు 2వ రోజు
కోణార్క్‌లోని ఎకో రిట్రీట్‌లో జరిగిన 3వ జాతీయ గనుల మంత్రుల సదస్సులో రెండో రోజు సహకారం, ఆవిష్కరణలను పెంపొందించడం, విజ్ఞానాన్ని పంచుకోవడం వంటి అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయి. 11 రాష్ట్రాలు అందించిన వివరణాత్మక ప్రెజెంటేషన్లు, వేలం ప్రక్రియల ప్రదర్శనలు, వినూత్న పద్ధతులు, పారదర్శకంగా, సమర్థంగా వనరుల వినియోగాన్ని పెంచే వ్యూహాలు వంటి ప్రధాన అంశాలు సదస్సులో ప్రధానాంశాలుగా ఉన్నాయి.
కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ముఖ్యంగా గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించడంలో మైనింగ్ రంగం పాత్ర కీలకమని చెప్పారు. అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం ఏమాత్రం ఉదాసీనత లేకుండా పనిచేస్తుందని పునరుద్ఘాటించారు అలాగే పర్యవేక్షణ, అమలు విధానాలను బలోపేతం చేయడంలో అత్యాధునిక సాంకేతికతలను అవలంబించాలని ఆయా రాష్ట్రాల మంత్రులను కోరారు. పర్యావరణ పునరుద్ధరణ, సుస్థిరత కోసం బాధ్యతాయుతమైన గనుల మూసివేత విధానాల ప్రాముఖ్యతను కూడా శ్రీ కిషన్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావించారు. పర్యావరణంపై మైనింగ్ కార్యకలాపాల ప్రభావాన్ని తగ్గించడానికి అడవుల పెంపకం, సౌరశక్తి వినియోగం, సుస్థిరమైన వ్యర్థాల నిర్వహణ పద్ధతులు సహా హరిత కార్యక్రమాలను ఏకీకృతం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను ఆయన స్పష్టం చేశారు.
ఈ సదస్సులో అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ గురించి విలువైన సూచనలు చేసిన పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎమ్ఓఇఎఫ్సీసీ) గణనీయమైన సహకారం అందించింది. పర్యావరణ పరిరక్షణతో ఆర్థిక వృద్ధిని సమతుల్యం చేసే విధానాలను అమలు చేయడంలో రాష్ట్రాలు, వాటాదారులకు ఈ సూచనలు మార్గనిర్దేశం చేశాయి. అలాగే, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎమ్‌ఎస్) సైతం మైనింగ్ కార్యకలాపాల్లో కార్మికుల భద్రతను మెరుగుపరచడం కోసం భద్రతా ప్రమాణాలను, సాంకేతిక పురోగతి, శిక్షణా కార్యక్రమాలను గురించి కీలకమైన సూచనలు చేసింది.
రాష్ట్రాలు, వాటాదారులు ఆలోచనలను పరస్పరం పంచుకోవడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి అలాగే భారత మైనింగ్ రంగ సుస్థిరమైన అభివృద్ధికి భాగస్వామ్యాలను నిర్మించడానికి ఈ వేదిక ఒక ప్రత్యేక అవకాశంగా నిలిచింది. నూతన ఆవిష్కరణలు, సామర్థ్యాలను పెంపొందించుకోవడం, మైనింగ్ కార్యకలాపాల ప్రయోజనాలు కింది స్థాయి వరకూ చేరుకునేందుకు చర్యలు చేపట్టడం వంటి లక్ష్య సాధన కోసం మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.
***
(Release ID: 2094999)
Visitor Counter : 4