ప్రధాన మంత్రి కార్యాలయం
వినూత్న ఆలోచనలను విజయవంతమైన అంకుర సంస్థలుగా మారుస్తూ... తొమ్మిదేళ్లుగా యువతను సాధికారులను చేస్తున్న ‘స్టార్టప్ ఇండియా’: ప్రధాని
అంకుర సంస్థల సంస్కృతిని ప్రోత్సహించడానికి ఏ అవకాశాన్నీ ప్రభుత్వం వదల్లేదు: ప్రధాని
నేటి భారత క్రియాశీలతనూ, ఆత్మవిశ్వాసాన్నీ, భవిష్యత్ సన్నద్ధతనూ స్టార్టప్ ఇండియా ప్రతిబింబిస్తోంది: ప్రధాని
Posted On:
16 JAN 2025 1:39PM by PIB Hyderabad
స్టార్టప్ ఇండియా కార్యక్రమానికి నేటితో తొమ్మిదేళ్లు పూర్తయినట్టు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేశారు. వినూత్న ఆలోచనలతో విజయవంతమైన అంకుర సంస్థల ఏర్పాటు ద్వారా తొమ్మిదేళ్లుగా అసంఖ్యాకంగా యువతను ఈ విప్లవాత్మక కార్యక్రమం సాధికారులను చేసిందని ప్రధానమంత్రి శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ప్రభుత్వానికి సంబంధించినంత వరకు, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడానికి అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్నీ మేం వదిలిపెట్టలేదు’’ అని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. స్టార్టప్ ఇండియా సాధించిన ఈ విజయం నేటి భారత క్రియాశీలతనూ, ఆత్మవిశ్వాసాన్నీ, భవిష్యత్ సన్నద్ధతనూ ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ‘‘స్టార్టప్ ప్రపంచంలోని ప్రతీ యువకుడికీ నా అభినందనలు.. మరింత మంది యువత దీన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు నిరాశ చెందబోరని చెప్పడానికి నాదీ హామీ’’ అని శ్రీ మోదీ భరోసానిచ్చారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘#9YearsOfStartupIndia ను నేడు మనం నిర్వహించుకుంటున్నాం. ఆవిష్కరణలకూ, కొత్త పారిశ్రామికవేత్తల ఆవిర్భవానికీ, అభివృద్ధికీ కొత్త భాష్యం చెప్పిన విప్లవాత్మకమైన కార్యక్రమం. యువత సాధికారతను ముందుకు తీసుకెళ్లగల శక్తిమంతమైన మార్గం. నా మనస్సు గెలుచుకున్న పథకం కూడా ఇదే. వినూత్న ఆలోచనలతో విజయవంతమైన అంకుర సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా గత తొమ్మిదేళ్లుగా ఈ పథకం పెద్దఎత్తున యువత జీవితాలను మార్చేస్తున్నది’’.
‘‘ప్రభుత్వానికి సంబంధించినంత వరకు.. స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడానికి గల ఏ అవకాశాన్నీ మేం వదులుకోలేదు. విధాన రూపకల్పనలో సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేశాం. వనరులను భారీగా అందుబాటులోకి తెచ్చాం. మరీ ముఖ్యంగా, ప్రతీ దశలోనూ వారికి అండగా నిలిచాం. ఆవిష్కరణలతోపాటు అంకుర సంస్థల ఏర్పాటుకు అవసరమైన తొలిదశ మాతృసంస్థలను (ఇంక్యుబేషన్ సెంటర్లు) ప్రోత్సహించాం. తద్వారా, సవాళ్లను ఎదుర్కొనగల సమర్థతను మన యువతకు అందించాం. కొత్తగా అంకుర సంస్థలను ఏర్పాటు చేస్తున్న వారితో నేను ఎప్పటికప్పుడు స్వయంగా మాట్లాడుతూ, ప్రోత్సహిస్తూ వస్తున్నాను.’’
‘‘భారత్ నేడు క్రియాశీలకంగా, ఆత్మవిశ్వాసంతో, భవిష్యత్ సన్నద్ధంగా ఉన్నదనడానికి స్టార్టప్ ఇండియా సాధించిన ఈ విజయమే నిదర్శనం. ఈ ప్రస్థానం సందర్భంగా ఔత్సాహిక పారిశ్రామిక వాతావరణాన్ని సృష్టించడంలో మా నిబద్ధతను కొనసాగిస్తామని పునరుద్ఘాటిస్తున్నాం. ఆత్మనిర్భర భారతావని దిశగా ప్రతి కలనూ సాకారం చేస్తూ ముందుకు సాగుతాం. స్టార్టప్ జగత్తులోని ప్రతీ యువతేజానికీ నా అభినందనలు. ఈ స్పూర్తికి కొనసాగింపుగా మరింతగా యువత ముందుకు రావాలని పిలుపునిస్తున్నాను. మీరు నిరాశ చెందబోరని చెప్పడానికి నాదీ హామీ.’’
***
MJPS/VJ
(Release ID: 2093462)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam