గనుల మంత్రిత్వ శాఖ
దేశంలోని విస్తారమైన మైనింగ్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాలంటూ గ్లోబల్ కమ్యూనిటీని ఆహ్వానించిన కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
प्रविष्टि तिथि:
15 JAN 2025 3:40PM by PIB Hyderabad
సౌదీ అరేబియా వేదికగా రియాద్‌లో ఈనెల 14న జరిగిన ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ - 2025 మినిస్టీరియల్ రౌండ్ టేబుల్‌కు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఇతర సంబంధిత అంశాలతో పాటు కీలకమైన ఖనిజాలు, విలువ సృష్టి అవకాశాల్లో సప్లయి చెయిన్ నిర్మాణంపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ... పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను చేరుకోవడానికి క్లీన్ ఎనర్జీ సిస్టమ్స్ పరంగా పెరుగుతున్న సామర్థ్యాలకు అవసరమైన కీలకమైన ఖనిజాల లభ్యతను పొందడానికి భారత ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యతను వివరించారు. భారతదేశంలోని సహజ వనరులకు విలువను జోడించే అపారమైన సామర్థ్యంతో... దేశంలోని విస్తారమైన మైనింగ్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాలని కేంద్ర మంత్రి ప్రపంచ పెట్టుబడిదారుల సంఘాన్ని ఆహ్వానించారు. ప్రజల శ్రేయస్సు కోసం మొత్తం సరఫరా వ్యవస్థలో విలువ జోడింపు కీలకమని ఆయన పేర్కొన్నారు.
సదస్సులో భాగంగా, సౌదీ అరేబియా పరిశ్రమలు, ఖనిజ వనరుల శాఖ మంత్రి శ్రీ బందర్ బిన్ ఇబ్రహీం అల్ఖోరాయేఫ్‌ను శ్రీ కిషన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సౌదీ మంత్రితో విస్తృతంగా చర్చించిన శ్రీ కిషన్ రెడ్డి ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మెరుగుపరచడం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. బ్రెజిల్, ఇటలీ, మొరాకో మంత్రులతో విడివిడిగా సమావేశమైన కేంద్ర మంత్రి, ముఖ్యంగా ఖనిజ రంగంలో ఆర్థిక, సాంకేతిక సహకారం ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం, స్థానిక ప్రవాస భారతీయులతో సంభాషించారు.
ఈ రోజు... కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో ఫ్యూచర్ మినరల్స్ ఫోరమ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఇక్కడ భాగస్వామ్య దేశాలు, గ్లోబల్ కంపెనీల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. ఈనెల 14 నుండి రియాద్ అధికారిక పర్యటనలో ఉన్న శ్రీ కిషన్ రెడ్డి కోల్ ఇండియా, జిఎస్‌ఐ, ఎన్‌ఎండిసి, నాల్కో, ఎంఇసిఎల్‌లతో కలిసి గనుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఇండియా పెవిలియన్‌ను సందర్శించారు.
***
(रिलीज़ आईडी: 2093186)
आगंतुक पटल : 75