ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఒకరి నుంచి మరొకరికి సోకని వ్యాధుల (ఎన్‌సీడీల)పై జాతీయ కార్యశాల:


తెలంగాణలోని హైదరాబాద్‌లో నిర్వహించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

ఎన్‌సీడీ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది:
ఈ సమస్య తీవ్రతను పరిష్కరించాలంటే వివిధ రంగాల మధ్య సహకారం,
మరిన్ని పరిశోధనలు, వినూత్న చికిత్స విధానాలు
అవసరం: కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి

" ‘ఆరోగ్యప్రద భారత్’ ఆవిష్కారానికి ప్రభుత్వ విజన్:
ఈ విజన్‌ను సాకారం చేసే దిశలో జాతీయ కార్యశాల ఒక ముఖ్య ముందడుగు,
ఎన్‌సీడీల వల్ల సంభవిస్తున్న అకాల మరణాలకు అడ్డుకట్టతోపాటు
అందరికీ అందుబాటులోకి నాణ్యమైన ఆరోగ్యసంరక్షణ సేవలు..
ఈ విషయాలపై శ్రద్ధ వహించాలి’’

సమావేశంలో సమగ్ర చర్చలు, క్షేత్ర పర్యటనలు:
మధుమేహం, రక్తపోటు, సీకేడీ, సీఆర్‌డీ, ఎన్ఏఎఫ్ఎల్‌డీ, స్ట్రోక్, కేన్సర్ వంటి వాటితో పాటు ప్రధాన ఎన్‌సీడీల్లోని భిన్న కోణాలపై జ్ఞానాన్ని పంచుకొనే తరహా కార్యక్రమాల నిర్వహణ


Posted On: 10 JAN 2025 10:03AM by PIB Hyderabad

నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌సీడీస్.. ఒకరి నుంచి మరొకరికి అంటని వ్యాధుల)పై రెండు రోజుల జాతీయ కార్యశాల (వర్క్‌షాపు)ను 2025 జనవరి 8, 9 తేదీలలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కేంద్ర ఆరోగ్య శాఖ హైదరాబాద్ లో నిర్వహించింది. ఈ వర్క్‌షాపు ఎన్‌సీడీల నివారణ, పరీక్షలు, నిర్వహణ, చికిత్సలపైనా, వాటి విషయంలో అమలుచేయాల్సిన వ్యూహాలపైనా  దృష్టి కేంద్రీకరించింది. ఈ వర్క్‌షాపులో దేశవ్యాప్త విధాన రూపకర్తలు, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు, జాతీయ ఆరోగ్య మిషన్‌లోని  మిషన్ డైరెక్టరు,  అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉన్నతాధికారులు, ఆరోగ్య రంగానికి చెందిన వ‌ృత్తినిపుణులు సహా ముఖ్య ఆసక్తిదారులు సమావేశమై వారి ఆలోచనలు పంచుకొన్నారు.

అసాంక్రామిక వ్యాధుల (ఇది కూడా ఎన్‌సీడీలకు మరో మాటే) వల్ల బాధితులవుతున్న  వారి సంఖ్య అంతకంతకూ పెచ్చుపెరిగిపోతున్నందువల్ల  ఈ సమస్య తీవ్రతను తగ్గించడానికి వివిధ రంగాల మధ్య సహకారంతోపాటు పరిశోధనలు, వినూత్న చికిత్స పద్ధతులు పెరగాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీమతి పుణ్య సలిల శ్రీవాస్తవ ప్రధానంగా చెప్పారు. ‘‘ఆరోగ్యప్రద భారత్’’ను ఆవిష్కరించాలన్న ప్రభుత్వ విజన్‌‌‌ను సాధించే కృషిలో ఈ జాతీయ వర్క్‌షాప్ నిర్వహణ ఒక ముఖ్య ముందడుగును సూచిస్తోందన్నారు. ఎన్‌సీడీల వల్ల అకాల మరణాలు సంభవించడాన్ని తగ్గించడంపైనా, అందరికీ నాణ్యమైన ఆరోగ్యసంరక్షణ సేవలను అందించడంపైనా శ్రద్ధ వహిస్తూ ఈ వర్క్‌షాపును నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు.

ఎన్‌సీడీల నివారణ, నియంత్రణ సహా ఆరోగ్యసంరక్షణ వ్యవస్థను పటిష్టపరచడానికి 16వ ఇండియా ఫైనాన్స్ కమిషన్‌కు ప్రతిపాదనలను సమర్పించడం, అలాగే ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు కీలక ప్రాథమ్యాలను సిద్ధం చేయడంలో ఈ సమావేశం తోడ్పడనుందని కూడా శ్రీమతి పుణ్య సలిల శ్రీవాస్తవ అన్నారు.

సమావేశంలో మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలకు సంబంధించిన దీర్ఘకాలిక  వ్యాధి (సీకేడీ), దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి (సీఆర్‌డీ), నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(ఎన్ఏఎఫ్ఎల్‌డీ.. ఇది ఆల్కహాల్ తీసుకోకపోయినా సరైన ఆహార, వ్యాయామం లేకపోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు సాధారణ పరిమాణానికి మించి అదనంగా పేరుకుపోయే ధోరణితో కూడిన జీవనశైలి వ్యాధి), స్ట్రోక్ (మనిషి మెదడులోపల రక్తనాళం పగిలి కణజాలం చీలిక లేదా ఆక్సిజన్‌ను స్వీకరించలేకపోయి ఒక భాగానికి రక్తప్రసరణ బలహీనపడి కణాల మరణానికి కారణమయ్యే వైద్య స్థితి), కేన్సర్ సహా ప్రధాన ఎన్‌సీడీల విభిన్న కోణాలపై లోతైన చర్చలు, క్షేత్రపర్యటనలు, సంబంధిత అవగాహనను పరస్పరం తెలియజెప్పుకొనే కార్యక్రమాలు చోటుచేసుకొన్నాయి.

వర్క్‌షాపులో పాల్గొనే వారు తెలంగాణలో కీలక ఆసుపత్రులను సందర్శించడం వర్క్‌షాపులో ప్రారంభ దశగా ఉంది. ఆయా ఆసుపత్రులకు వెళ్లిన వారు క్షేత్ర స్థాయిలో ఎన్‌సీడీ నిర్వహణకు అవలంబిస్తున్న వినూత్న పద్ధతులను, అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను గమనించారు.  ప్రాథమిక, మాధ్యమిక ఆరోగ్యసంరక్షణ పద్ధతుల క్రియాశీలత్వాన్ని ప్రత్యక్షంగా చూసి మెలకువలను తెలుసుకొనేందుకు ఈ పర్యటనలు వారికి ఒక అవకాశాన్నిచ్చాయి.

సముదాయాలతో నేరుగా సంభాషించడం (కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్‌వెన్షన్స్)పై ప్రధానంగా  దృష్టి సారించారు. ఈ తరహా కార్యక్రమాలలో భాగంగా ఫిట్ ఇండియా, ఈట్ రైట్ ఇండియా వంటి ప్రచార ఉద్యమాలు ఎలాంటి పాత్రను పోషిస్తున్నాయో తెలుసుకోవడానికి ప్రాధాన్యాన్నిచ్చారు. తెలంగాణలో యోగాను వెల్‌నెస్‌ను కలగలిపే విధానాలను ఆచరణలో పెడుతున్న తీరు, అలాగే నాగాలాండ్‌లో పొగాకు నమిలే అలవాటుకు స్వస్తి పలకడానికీ, ఆ దుర్వ్యసనం బారి నుంచి విముక్తిని పొందడానికీ అమలుచేస్తున్న కార్యక్రమాలు మార్గదర్శకమైనవిగా ఉన్నాయనీ, ఇవి ఇతర రాష్ట్రాల్లోనూ అమలుపరచదగ్గవనీ ప్రధానంగా ప్రస్తావించారు.

ఆయా రాష్ట్రాల్లో ఆచరిస్తున్న విధానాలు విశేషంగా ఆకట్టుకొనేవిగా ఉన్నాయి. రక్తపోటును అదుపు చేసేందుకు అసోంలో అమలుచేస్తున్న కార్యక్రమం, ఎన్‌సీడీ కేసులను గుర్తించేందుకు తమిళనాడులో అవలంబిస్తున్న సమగ్ర పరీక్షల పద్ధతి,  కేన్సర్ వ్యాధి బాధితులకు ఆంధ్ర ప్రదేశ్‌లో అమలుచేస్తున్న చక్కనైన మౌలిక సదుపాయాల వ్యవస్థ.. వీటిని సమావేశంలో వివరించి, అవి వినూత్న విధానాలనీ, వాటి వల్ల మెరుగైన ఫలితాలు వస్తున్నాయనీ వివరించారు. ఇతర రాష్ట్రాలు సమర్పించిన నివేదికలు ఒక్కొక్క ప్రాంతంలో తలెత్తుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కొని సమర్థంగా పరిష్కరించడానికి అమలుచేస్తున్న ప్రత్యేక వ్యూహాలను గురించి వివరించాయి. సంస్కృతిపరంగానూ, ప్రాంతీయ స్థాయిల్లోనూ అక్కడ సరిపోయే విధానాలను ఆచరణలో పెట్టడం వల్ల చక్కని ఫలితాలు దక్కాయనీ, అలాంటి విధానాలను ఇతర రాష్ట్రాలు వాటి నేపథ్యానికి అనుగుణంగా రూపొందించుకొని అమలుపరచవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది.

పరిశోధనల్లో ఏయే అంశాలకు పెద్దపీట వేయాలనే విషయంపై ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నివారణ, పరీక్షలు, చికిత్స దశలలో అంతరాలను పూడ్చడానికంటూ ఆచరణాత్మక  పరిశోధనలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రత్యేక కార్యక్రమం తేల్చింది.

పరీక్షలు, రోగనిర్ధారణ, ఎన్‌సీడీల నిర్వహణలో తలెత్తుతున్న సవాళ్లపై వివిధ వైద్య సంస్థలకు చెందిన ఎస్‌టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్‌ఫార్క్‌షన్ (గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు కుంచించుకుపోయే లక్షణంతో కూడిన రుగ్మత), మూత్రపిండాలకు సంబంధించిన దీర్ఘకాలిక  వ్యాధి, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, స్ట్రోక్.. వీటిని నయం చేయడంలో మంచి పట్టున్న వైద్యనిపుణులు వారి వారి నివేదికలను (ప్రెజెంటేషన్స్) సమర్పించారు. ఈ నివేదికల్లో వారు వారి అభిప్రాయాలనూ, ఎన్‌సీడీ ప్రాబల్యాన్ని తగ్గించడంలో వారు సంపాదించిన అనుభవాల సారాన్నీ తెలియజేశారు.

కేన్సర్ చికిత్సలో ఉపయోగపడే మౌలిక సదుపాయాల వ్యవస్థను బలపరచడంపైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లా ఆసుపత్రుల్లో కేన్సర్ సంరక్షణ సౌకర్యాలను ఇప్పటికన్నా పెంచడం, మూడో అంచె సంరక్షణ కేంద్రాలు పోషించదగ్గ పాత్ర, జనాభా ఆధారిత కేన్సర్ రిజిస్ట్రీ.. ఈ అంశాలు కార్యక్రమాలలో ప్రస్తావనకు వచ్చాయి. పరీక్షలను నిర్వహించడం మొదలుకొని క్రమానుగతంగా కేసుల పర్యవేక్షణ వరకు కేన్సర్ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో ఎదురవుతున్న లోటుపాటులను చక్కదిద్దేందుకు ఎలాంటి వ్యూహాలను అమలుపరచవచ్చో నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నోటి కేన్సర్, రొమ్ము కేన్సర్, గర్భాశయ సంబంధ కేన్సర్ చికిత్సల నిపుణులు వారి ఆలోచనలను తెలియజేశారు.

మాధ్యమిక స్థాయికి చెందిన ఎన్‌సీడీ వైద్యశాలలను పటిష్టపరచడం గురించీ, పరీక్షలను సమగ్రంగా నిర్వహించడానికి చేపట్టే కార్యక్రమాలను తరచుగా నిర్వహించడాన్ని గురించి సమావేశంలో చర్చించారు. తెలంగాణలో, తమిళ నాడులో  అనుసరిస్తున్న విధానాలు ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయని గమనించారు.

నేపథ్యం:

ప్రస్తుతం ఒక వ్యక్తి నుంచి ఇతరులకు అంటని వ్యాధులు ఇదివరకు ఎన్నడూ లేనంత స్థాయిలో విజృంభిస్తున్న సవాలును ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా  66 శాతానికన్నా ఎక్కువ మరణాలకు ఎన్‌సీడీలే కారణమవుతున్నాయి. జనాభాలో వివిధ వయస్సుల పౌరుల సంఖ్యలో, అంటువ్యాధుల అధ్యయనానికి సంబంధించిన సమాచారంలో మార్పులు శీఘ్రంగా చోటు చేసుకొంటూ ఉండడంతో, గుండె నాళాల సంబంధిత వ్యాధులు, చక్కెర వ్యాధి, దీర్ఘకాలం పాటు బాధించే శ్వాసకోశ సంబంధ వ్యాధులు, మనిషి శరీరంలో వివిధ అవయవాలకు వచ్చే కేన్సర్లు ప్రజారోగ్య సంరక్షణ రంగంలో, ముఖ్యంగా 30 ఏళ్ల వయస్సు పైబడిన వ్యక్తుల స్వస్థత పరిరక్షణలో పెనుసవాళ్లుగా మారాయి.

ఈ సవాళ్ల భారం పెరుగుతూ పోతుండగా ఈ స్థితిని వెంటనే చక్కదిద్దాల్సిన అవసరాన్ని కేంద్ర  ప్రభుత్వం గుర్తించి జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో నేషనల్ ప్రోగ్రాం ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్‌పీ-ఎన్‌సీడీ) పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అత్యంత సాధారణమైన అసాంక్రామిక వ్యాధులను మాత్రమే కాకుండా ప్రధాన్ మంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రాం (పీఎంఎన్‌డీపీ)లో భాగంగా ఉన్న  దీర్ఘకాలంపాటు ఊపిరితిత్తులకు ఇబ్బందిని కలిగించే వ్యాధి (క్రానిక్ ఒబ్‌స్ట్రక్టివ్ పల్మొనరీ డిసీజ్ ..సీఓపీడీ), మూత్రపిండాలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధి (సీకేడీ), నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్ఏఎఫ్ఎల్‌డీ), రక్తశుద్ధి చికిత్సల వంటి క్లిష్ట ఆరోగ్యస్థితులను సైతం ఈ కార్యక్రమం పరిధిలో భాగం అయ్యేలా ఎన్‌పీ-ఎన్‌సీడీని విస్తరించారు.

 

***


(Release ID: 2092267) Visitor Counter : 73