ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారిశ్రామికవేత్త నిఖిల్ కామత్‌తో తన తొలి పాడ్‌కాస్ట్‌ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ

Posted On: 10 JAN 2025 8:30PM by PIB Hyderabad

  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన తొలి పాడ్‌కాస్ట్‌ ద్వారా పారిశ్రామికవేత్త, పెట్టుబడిదారు నిఖిల్‌ కామత్‌తో వివిధ అంశాలపై ముచ్చటించారు. ఈ సందర్భంగా తన బాల్యం గురించి వాకబు చేసినపుడు ఎలాంటి దాపరికం లేకుండా ఆయనతో చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. ఉత్తర గుజరాత్‌లోని మెహసానా జిల్లా పరిధిలోగల వద్‌నగర్ అనే చిన్న పట్టణంతో ముడిపడిన తన మూలాలను ప్రముఖంగా ప్రస్తావించారు. గైక్వాడ్ల రాజ్యంలో భాగమైన ఈ పట్టణం విద్యారంగంపై నిబద్ధతకు ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. అక్కడ ఓ చెరువు, తపాలా కార్యాలయం, గ్రంథాలయం వంటి సౌకర్యాలు కూడా ఉండేవని  చెప్పారు. గైక్వాడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, భాగవతాచార్య నారాయణాచార్య ఉన్నత పాఠశాలల్లో తన విద్యాభ్యాసం నాటి రోజులను ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఈ జ్ఞాపకాల్లో భాగంగా ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఈ మేరకు వద్‌నగర్‌లో చాలాకాలం బసచేసిన చైనా తత్త్వవేత్త షాన్‌జాంగ్‌పై తీసిన చలన చిత్రం గురించి తానొకసారి చైనా రాయబార కార్యాలయానికి రాశానని గుర్తుచేసుకున్నారు. అలాగే 2014లో తాను ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ఒక అనుభవాన్ని ప్రస్తావిస్తూ- భారత పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ గుజరాత్‌లోని వద్‌నగర్‌ సందర్శనకు ఆసక్తి చూపారని తెలిపారు. తమ స్వస్థలాలతో షాన్‌జాంగ్‌కుగల చారిత్రక సంబంధాన్ని ఈ సందర్భంగా ఆయన ఉటంకించినట్లు పేర్కొన్నారు. రెండు దేశాల ఉమ్మడి వారసత్వాన్ని, బలమైన సంబంధాలను ఈ అనుబంధం ప్రస్ఫుటం చేస్తున్నదని ఆయన అన్నారు.

   విద్యాభ్యాసం రోజులను జ్ఞప్తికి తెచ్చుకుంటూ తానొక సగటు విద్యార్థినని, తనకంటూ పెద్దగా గుర్తింపేమీ లేదని శ్రీ మోదీ పేర్కొన్నారు. అయితే, తనలో అపార సామర్థ్యం ఉందని, అత్యున్నత స్థాయికి ఎదుగుతాననే గట్టి నమ్మకం ఉందని తమ ఉపాధ్యాయుడు వేల్జీభాయ్‌ చౌధరి తన తండ్రితో చెప్పేవారని తెలిపారు. మోదీ ఏకసంథాగ్రాహి అయినప్పటికీ కాసేపటికే తనదైన లోకంలో మునిగిపోయేవాడని వేల్జీభాయ్‌ చెప్పారన్నారు. పాఠశాలలోని  ఉపాధ్యాయులందరూ తనపై ఎనలేని ప్రేమాభిమానాలు కనబరచేవారని మోదీ గుర్తుచేసుకున్నారు. కానీ, ఇతరులతో పోటీపడటంపై తనకు ఆసక్తి ఉండేది కాదని చెప్పారు. పెద్దగా శ్రమించకుండానే పరీక్షల్లో గట్టెక్కడానికి ప్రయత్నించేవాడినని, ఇతరత్రా కార్యక్రమాల వైపే ఎక్కువగా మొగ్గు చూపేవాడినని వివరించారు. కొత్త విషయాలను తక్షణం గ్రహించడం, విభిన్న కార్యకలాపాల్లో నిమగ్నం కావడం తన స్వభావమని వెల్లడించారు.

   చాలా చిన్న వయసులోనే ఇల్లొదిలి వెళ్లానని, బంధుమిత్రులతో సంబంధాలు తెగిపోయాయని చెబుతూ అరుదైన తన జీవన విశేషాలను ప్రధానమంత్రి వెల్లడించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో తనకు కొన్ని కోరికలు ఉండేవన్నారు. పాఠశాల కాలంనాటి మిత్రులను కలుసుకోవడం అందులో ఒకటని చెప్పారు. ఈ మేరకు 30-35 మంది మిత్రులను ముఖ్యమంత్రి నివాసానికి ఆహ్వానించానని తెలిపారు. అయితే, వారు తనను పాత స్నేహితుడిగా కాకుండా ముఖ్యమంత్రిగానే చూశారన్నారు. తన విద్యార్జనకు తోడ్పడిన ఉపాధ్యాయులందరికీ బహిరంగ సత్కారం చేయాలనే కోరిక కూడా ఉండేదని ప్రధాని అన్నారు. తదనుగుణంగా ఒక భారీ కార్యక్రమం నిర్వహించి, అందరిలోనూ పెద్దవాడైన 93 ఏళ్ల గురువు రాస్‌బిహారి మణిహార్‌ సహా సుమారు 30-32 మంది ఉపాధ్యాయులను సత్కరించినట్లు తెలిపారు. ఆ కార్యక్రమానికి గుజరాత్‌ గవర్నర్‌ సహా పలువురు రాష్ట్ర ప్రముఖులు హాజరయ్యారని చెప్పారు. మరోవైపు కుటుంబంతో అనుబంధాన్ని పునరుద్ధరించుకుంటూ   అందర్నీ ముఖ్యమంత్రి నివాసానికి ఆహ్వానించానని తెలిపారు. అలాగే ‘ఆర్‌ఎస్‌ఎస్‌’ కార్యకర్తగా తొలినాళ్లలో తనకు భోజన సదుపాయం కల్పించిన కుటుంబాలను కూడా పిలిపించి గౌరవించానని పేర్కొన్నారు. తన జీవనయానంలో ఈ నాలుగు ఉదంతాలు ఎంతో కీలకమైనవన్నారు. మూలాలతో బంధంపై ప్రగాఢ వాంఛతోపాటు తన కృతజ్ఞతా భావన వెల్లడికి ఇవి ప్రతిబింబాలని ఆయన అభివర్ణించారు.

   తనకంటూ మార్గనిర్దేశక సిద్ధాంతమంటూ ఏదీ లేదని, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనే తాపత్రయం లేకుండా పరీక్షలలో ఉత్తీర్ణతతో సంతృప్తి చెందేవాడినని ప్రధానమంత్రి తెలిపారు. వివిధ కార్యకలాపాలలో అప్పటికప్పుడు పాల్గొనడం, పెద్దగా సన్నద్ధం కాకుండానే నాటక పోటీలలో పాల్గొనడం తన ధోరణిగా ఉండేదని ప్రధాని గుర్తుచేసుకున్నారు. తమ వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీ పర్మార్ గురించి ఓ జ్ఞాపకాన్ని పంచుకుంటూ- మల్లఖంబ్‌, కుస్తీ క్రీడల కసరత్తులు క్రమం తప్పకుండా చేసేలా ఆయన ప్రేరణనిచ్చారని చెప్పారు. ఆయన ఎంత ప్రోత్సహించినా తాను వృత్తి క్రీడాకారుణ్ని కాలేకపోయానని, చివరకు ఆ క్రీడలకు స్వస్తి చెప్పానని వెల్లడించారు.

   రాజకీయాల్లో ఒక నాయకుడి ప్రతిభకు కొలబద్ద ఏమిటన్న ప్రశ్నకు- రాజకీయ నాయకుడు కావడం, రాజకీయాల్లో విజయం సాధించడం.. రెండూ వేర్వేరు అంశాలని శ్రీ మోదీ బదులిచ్చారు. రాజకీయాల్లో విజయం సాధించాలంటే ప్రజల సుఖదుఃఖాలపై అంకితభావం, నిబద్ధత, సానుభూతి అవసరమని వ్యాఖ్యానించారు. ఆధిపత్యం చలాయించే నాయకుడిలా  కాకుండా జట్టులో మంచి ఆటగాడిలా వ్యవహరించడంలో ప్రాధాన్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని గుర్తుచేస్తూ- ఆనాడు ఎందరో దేశభక్తులు రాజకీయాలతో నిమిత్తం లేకుండా లక్ష్య సాధనలో తమవంతు పాత్ర పోషించారని చెప్పారు. నాటి ఉద్యమం నుంచి ఆవిర్భవించిన నాయకులు స్వాతంత్ర్యానంతరం సమాజం పట్ల లోతైన అంకితభావం కనబరచారని ఆయన అన్నారు. “సమాజంలోని మంచి వ్యక్తులు ఏదో ఒక ఆశతో కాకుండా సదాశయంతో రాజకీయాల్లోకి రావాలి” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీని ఉదాహరిస్తూ- ఆయన జీవితం-కార్యాచరణ ఇందుకు నిదర్శనాలని, యావద్భారత ప్రజానీకానికి అవి స్ఫూర్తినిచ్చాయని శ్రీ మోదీ అన్నారు. అనర్గళ ప్రసంగాలకన్నా సందేశాత్మక సంబంధం ఏర్పరచుకోగల సామర్థ్యం చాలా ముఖ్యమని ప్రధానమంత్రి విశదం చేశారు. ఉద్యమ కార్యకలాపాల్లో సంకేతాత్మక కార్యాచరణ ద్వారా జనానికి శక్తిమంతమైన సందేశం పంపడంలో గాంధీజీ సామర్థ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఒకవైపు అహింసను ప్రబోధిస్తూ... మరోవైపు పొడవాటి కర్రతో సంచరించడం ఒక శక్తియుత సంకేతాత్మక సందేశానికి నిదర్శనమని శ్రీ మోదీ గుర్తుచేశారు. వృత్తి నైపుణ్యం లేదా వాక్పటిమపై ఆధారపడటంగాక అంకితభావంతో జీవించడం, ప్రజా సంబంధాలు నెరపడంలో సామర్థ్యం వంటి వాటితోనే రాజకీయాల్లో నిజమైన విజయం సాధ్యమని ప్రధాని స్పష్టం చేశారు.

   ఏదో ఒక ఆకాంక్షతో కాకుండా నిర్దిష్ట లక్ష్యంతో నేడు లక్ష మంది యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతయినా ఉందని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. పారిశ్రామికవేత్తలు వృద్ధిపై దృష్టి సారిస్తే, ఆత్మ త్యాగం, దేశాన్ని అగ్రస్థానాన నిలపడమే రాజకీయాలకు అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. దేశానికి ప్రాధాన్యమిచ్చే వారిని సమాజం అంగీకరిస్తుందని చెబుతూ, రాజకీయ జీవితం అంత సులువేమీ కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా- పలుమార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినా నిరాడంబర జీవనం గడిపిన ప్రజా సేవకుడు అశోక్‌భట్‌ గురించి ఒక ఉదంతాన్ని ప్రధాని పంచుకున్నారు. ఆయన ప్రజలకు సదా అందుబాటులో ఉండేవారని, అర్ధరాత్రి వేళ వచ్చినవారికి కూడా తన వంతు సాయం చేసేవారని చెప్పారు. నిరంతర సేవాభావంతో రాజకీయ జీవితం గడిపారు తప్ప ఏనాడూ వ్యక్తిగత ప్రయోజనానికి తావివ్వలేదని పేర్కొన్నారు. రాజకీయాల్లో అంకితభావం, నిస్వార్థం ప్రాముఖ్యాన్ని శ్రీ భట్‌ జీవితమే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయమంటే ఒంటరిగా ఎన్నికల పోరాటం కాదని, సామాన్యుల హృదయాలను గెలవడమని చెప్పారు. ఇందుకోసం వారి మధ్యనే ఉంటూ, వారి జీవితాలతో మమేకం కావడం ప్రధానమని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

   జీవితాన్ని మలచడంలో వివిధ పరిస్థితుల ప్రభావం గురించి ప్రశ్నించినపుడు- “నా జీవితమే నాకు అత్యంత ప్రధాన గురువు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. సవాళ్లు నిండిన బాల్యమే తన “విపత్తుల విశ్వవిద్యాలయం” అని అభివర్ణించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కూడా తన రాష్ట్రంలోని మహిళలు నీళ్లకోసం మైళ్లకుమైళ్లు నడవాల్సిన దుస్థితిని చూశాక వారికి ఆ కష్టం తప్పించాలన్న బలమైన సంకల్పం తనలో వేళ్లూనుకున్నదని ఆయన చెప్పారు. వివిధ ప్రణాళికల రూపకల్పన తన ఘనతేనని ప్రధానిగా తానెన్నడూ ప్రకటించుకోనని పేర్కొన్నారు. దేశ ప్రయోజనకర స్వప్నాల సాకారానికి తననుతాను అంకితం చేసుకున్నానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా తన పదవీకాలం ప్రారంభం నుంచి తనవైన మార్గదర్శక సూత్రాలను నిర్దేశించుకున్నానని వివరించారు. ఈ మేరకు నిర్విరామ కృషి, స్వార్థ త్యాగం, ఉద్దేశపూర్వక తప్పుల నివారణ వంటి పద్ధతులను అనుసరించానని చెప్పారు. తప్పులు మానవ సహజమే అయినా, సదుద్దేశంతో వ్యవహరించడంపై తన నిబద్ధతను స్పష్టం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తన ప్రసంగాన్ని గుర్తుచేస్తూ- ‘కష్టపడి పనిచేయడం, స్వార్థపూరిత చర్యలకు దూరంగా ఉండటం, దురుద్దేశపూర్వక తప్పిదాలకు తావివ్వకపోవడం’ అనే మూడు సూత్రాలను తన జీవన తారకమంత్రంగా స్వీకరించానని చెప్పారు.

   ఆదర్శవాదం, ఆలోచన ధోరణి ప్రాధాన్యంపై మాట్లాడుతూ- ‘దేశమే ప్రధానం’ అనే సూత్రమే సదా తనకు దిక్సూచి వంటిదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ భావజాలం సంప్రదాయ, సైద్ధాంతిక హద్దులకు అతీతమన్నారు. కొత్త ఆలోచనల స్వీకరణతోపాటు దేశానికి ప్రయోజనకరమైతే పాత వాటిని విడనాడేందుకు ఇది తోడ్పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఏదేమైనా “దేశమే ప్రధాన” అన్నది తనకు అచంచల ప్రమాణమని పేర్కొన్నారు. ప్రభావశీల రాజకీయాల్లో ఆలోచన ధోరణికన్నా ఆదర్శవాదమే మిన్న అని  ప్రధాని చెప్పారు. ఆలోచన ధోరణికి ప్రాముఖ్యం ఉన్నప్పటికీ అర్థవంతమైన రాజకీయ ప్రభావం దిశగా ఆదర్శవాదం చాలా కీలకమని వివరించారు. విభిన్న భావజాలంగల వారంతా స్వాతంత్ర్యమనే సమష్టి లక్ష్యం వైపు ఉద్యమం సాగించడమే ఇందుకు నిదర్శనమని ఉదాహరించారు.

   ప్రజా జీవితంలో హేళనలు, అవాంఛిత విమర్శలను యువ రాజకీయ నాయకులు ఎలా ఎదుర్కోవాలన్న ప్రశ్నకు బదులిస్తూ- ఇతరులకు సాయం చేయడంలో ఆనందానుభూతిని  పొందే అవగాహనగల వ్యక్తులు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఎంతయినా ఉందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఆరోపణలు-ప్రత్యారోపణలను స్వీకరించగలగాలని, అదే సమయంలో తాము ఏ తప్పూ చేయనపుడు, సముచిత రీతిలో నడచుకున్నపుడు వాటి గురించి ఆందోళన అనవసరమని ఆయన వ్యాఖ్యానించారు.

   సామాజిక మాధ్యమాలకు ముందు-తర్వాతి కాలంలో రాజకీయాలు, నాయకులపై వాటి ప్రభావం మీద చర్చ, ఆ మాధ్యమాల వినియోగంపై యువ నాయకులకు మీరిచ్చే సలహా ఏమిటన్న ప్రశ్నపై ప్రధాని స్పందిస్తూ- తాను బాలలతో ముచ్చటించే సందర్భాల్లో చోటుచేసుకున్న ఒక హాస్యపూరిత ఉదంతాన్ని ఉటంకించారు. టీవీలో కనిపించడం, విమర్శలకు గురికావడంపై మీ అభిప్రాయం ఏమిటని పిల్లలు తనను తరచూ ప్రశ్నిస్తుంటారని గుర్తుచేశారు. ఎన్ని అవమానాలు ఎదురైనా ఏ మాత్రం చలించని ఒక వ్యక్తి కథనాన్ని గుర్తు చేసుకుంటూ చిత్తశుద్ధితో, నిజాయితీగా నడచుకునే వ్యక్తి అటువంటి విమర్శలను లెక్కచేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.  తాను కూడా అటువంటి ఆలోచన ధోరణినే అనుసరిస్తానని, కార్యాచరణకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ సత్యమార్గంలో సాగుతానని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో అవగాహన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆ చైతన్యం లేకపోతే వాస్తవిక ప్రజా సేవ అసాధ్యమని స్పష్టం చేశారు. రాజకీయాలు, పని ప్రదేశాలే కాకుండా ప్రతి రంగంలోనూ విమర్శలు, భిన్నాభిప్రాయాలు సర్వసాధారణమన్నారు. వాటన్నిటినీ అధిగమిస్తూ ముందడుగు వేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో సామాజిక మాధ్యమాలకుగల పరివర్తనాత్మక సామర్థ్యాన్ని ప్రధాని విశదీకరించారు. గతంలో కొన్ని వనరుల ద్వారా మాత్రమే సమాచార సౌలభ్యం ఉండగా, నేడు ప్రజలు వివిధ మార్గాల్లో సులువుగా వాస్తవాలను నిర్ధారణ చేసుకోగలుగుతున్నారని ఆయన అన్నారు. సామాజిక మాధ్యమాల్లో... ముఖ్యంగా అంతరిక్ష అన్వేషణ వంటి రంగాల సమాచారాన్ని ప్రజలు నేడు చురుగ్గా నిర్ధారించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. “సామాజిక మాధ్యమాలు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కీలక ఉపకరణంగా రూపొందాయి. సత్య నిర్ధారణ, సమాచార ధ్రువీకరణకు ఇది వీలు కల్పిస్తుంది” అని శ్రీ మోదీ అన్నారు. నేటి యువతరం సామాజిక మాధ్యమాల్లో  ముఖ్యంగా అంతరిక్ష పరిశోధన వంటి రంగాల సమాచారాన్ని చురుగ్గా విశ్లేషిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రయాన్ విజయం వారిలో కొత్త ఉత్సాహం నింపిన నేపథ్యంలో గగన్‌యాన్ కార్యక్రమం వంటి తాజా పరిణామాలను ఆసక్తితో అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల వల్ల ప్రయోజనాలను వివరిస్తూ- “సామాజిక మాధ్యమాలు నవ తరానికి శక్తిమంతమైన ఉపకరణం” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో తన తొలినాళ్ల అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ- ఈ మాధ్యమాలు లేని రోజుల్లోనూ విమర్శలు, నిరాధార ఆరోపణలు సర్వసాధారణమేనని ఆయన గుర్తుచేశారు. అయితే, నేడు వివిధ వేదికల సౌలభ్యం వల్ల సత్యాన్వేషణ, నిర్ధారణకు విస్తృత అవకాశాలున్నాయని చెప్పారు. యువతకు, ప్రజాస్వామ్యానికి సాధికారత కల్పించడం ద్వారా సామాజిక మాధ్యమాలు సమాజానికి విలువైన వనరుగా మారగలవని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

   ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఆందోళనకు గురికావడం సహజమేనని, ఇందుకు తాను అతీతుణ్ని కాదని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. అయితే, దాన్ని అదుపు చేసుకోవడంలో వ్యక్తుల మధ్య వ్యత్యాసం ఉంటుందని, ఎవరి సామర్థ్యం మేరకు వారు తమదైన శైలిలో ఆందోళనను నిభాయించుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా తనకు వ్యక్తిగతంగా ఎదురైన 2002నాటి గుజరాత్‌ ఎన్నికలు, గోధ్రా ఉదంతం వంటి అనుభవాలను ప్రధాని ఉటంకించారు. ఎన్నో సవాళ్లు విసిరే అటువంటి సమయాల్లో తన భావోద్వేగాలను నియంత్రించుకుంటూ బాధ్యతలు నిర్వర్తించిన తీరును వివరించారు. స్వాభావిక మానవ నైజానికి భిన్నంగా మసలుకుంటూ లక్ష్యంపై తదేక దృష్టితో ముందడుగు వేయడం ప్రధానమని స్పష్టం చేశారు. అనవసర ఒత్తిడికి తావివ్వకుండా వార్షిక పరీక్షలను తమ దైనందిన కార్యకలాపాల్లో భాగంగా పరిగణిస్తూ సాగిపోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. మన జీవితంలో అంతర్భాగంగా దాన్ని పరిగణించాలంటూ విద్యార్థులలో ఉత్సాహం నింపారు.

   జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను పదేపదే గుర్తుచేసుకోరాదనే తన దృక్పథాన్ని వివరిస్తూ, ప్రస్తుత స్థాయికి చేరడంలో తనకెన్నడూ, ఎలాంటి ప్రణాళిక లేదని, తన బాధ్యతలను చక్కగా నెరవేర్చడంపైనే సదా దృష్టి సారించానని శ్రీ మోదీ అన్నారు. విజయం లేదా వైఫల్యంపై ఆలోచనలు తన వివేకంపై ఆధిపత్యం చలాయించడానికి ఎన్నడూ అనుమతించలేదని ఆయన స్పష్టం చేశారు.

   అపజయాల నుంచి గుణపాఠం నేర్వడంపై చర్చిస్తూ- చంద్రయాన్-2 ప్రయోగ వైఫల్యాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆ వైఫల్యం బాధ్యతను తాను స్వీకరించి, శాస్త్రవేత్తలు ఆశాభావంతో ముందుకెళ్లేలా స్ఫూర్తినిచ్చారు. అదేవిధంగా రాజకీయాల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం, యువ నేతలకు చేయూతనివ్వడం, దేశం కోసం కృషి చేసేలా వారిని ప్రోత్సహించడంలోని ప్రాధాన్యాన్ని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాల ప్రతిష్ఠ పెంచడం, మంచి వ్యక్తులు భాగస్వాములయ్యేలా ప్రోత్సహించడం రాజకీయ రంగ ప్రక్షాళనకు చాలా అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. యువ నాయకులు అపరిచితులమనే భయాన్ని అధిగమించి, దేశ భవిష్యత్తు విజయాలు తమ చేతుల్లోనే ఉన్నాయనే వాస్తవాన్ని గుర్తించాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత ప్రయోజనం కోసం కాకుండా దేశమే ప్రధానమనే స్ఫూర్తితో పనిచేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థ గౌరవ ప్రతిష్ఠలను నిలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

   రాజకీయాలను ‘మలిన వ్యవస్థ’గా భావించడం గురించి ప్రశ్నించగా- రాజకీయమంటే ఎన్నికలు-గెలుపోటములు మాత్రమే కాదని శ్రీ మోదీ జవాబిచ్చారు. విధాన రూపకల్పన, పరిపాలన కూడా ఇందులో అంతర్భాగాలని, సమాజంలో గణనీయ సానుకూల మార్పులు తేవాలంటే ఇదొక మార్గమని స్పష్టం చేశారు. పరిస్థితులను మార్చడంలో ఉత్తమ విధానాల ప్రాధాన్యం, వాటి అమలును ప్రస్తావిస్తూ- అత్యంత అణగారిన గిరిజన వర్గాలకు చేయూతగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్గదర్శకత్వంలో రూపొందించిన ‘పిఎం జన్మన్‌ యోజన’ పథకాన్ని శ్రీ మోదీ ఉదాహరించారు. దీనివల్ల రాజకీయ ప్రయోజనాలేవీ ఒనగూడకపోయినా దేశవ్యాప్తంగా 250 ప్రాంతాల్లో 25 లక్షల మంది ప్రజల జీవితాలపై లోతైన ప్రభావం  చూపగలదని పేర్కొన్నారు. రాజకీయాల్లో సరైన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకుంటే గణనీయ సానుకూల మార్పులు వస్తాయని, తద్వారా ఎంతో సాఫల్యం, సంతృప్తి కలుగుతాయని ఆయన స్పష్టం చేశారు.

   ఎదురుదెబ్బలు, వైఫల్యాలతో కూడిన తన తన జీవితానుభవాలను శ్రీ మోదీ పంచుకున్నారు. ఈ మేరకు సైనిక పాఠశాలలో చేరాలనే తన చిన్ననాటి ఆకాంక్షను, ఆర్థిక పరిమితుల దృష్ట్యా అది నెరవేరకపోవడాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే రామకృష్ణ మిషన్‌లో చేరి, సన్యసించాలనే ప్రయత్నం కూడా విఫలమైందని పేర్కొన్నారు. జీవితంలో ఎదురుదెబ్బలు ఒక భాగమని, వ్యక్తిత్వ వికాసానికి అవి ఎంతగానో దోహదం చేస్తాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌’ కార్యకర్తగా తనకెదురైన ఒక అనుభవాన్ని పంచుకుంటూ డ్రైవింగ్ చేస్తుండగా చేసిన తప్పు నుంచి గుణపాఠం నేర్చుకున్నానంటూ వైఫల్యాన్ని విజయానికి మెట్టుగా మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉందన్నారు. సులువైన దారులు వెతకడానికి అతీతంగా సదా మసలుకున్నానని, అది తన వ్యక్తిత్వ వికాసానికి, జీవన దృక్పథం రూపకల్పనకు తోడ్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తి పురోగమనానికి, విజయం దిశగా సాహిసించడానికి ఈ లక్షణం ఎంతో అవసరమన్నది తన విశ్వాసమని చెప్పారు. సులువైన దారుల అన్వేషణ మన తుది లక్ష్యాల సాధనకు అవరోధం కాగలదని, కాబట్టే ఆ మనస్తత్వం నుంచి విముక్తులం కావాలని స్పష్టం చేశారు.

   సాహసోపేత నిర్ణయాలు తీసుకునే తన సామర్థ్యం కాలక్రమంలో ఎలా వృద్ధి చెందిందో వివరిస్తూ- తానెప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఎలాంటి సంకోచం లేకుండా నిర్ణయాలు తీసుకోవడానికి తనకు వీలు కల్పించింది ఈ నిర్భీకతేనని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మారుమూల ప్రాంతాల్లో ఒంటరిగా గడుపుతూ ఆత్మశోధన, స్వీయ సంధానానికి కృషి చేసేవాడినని, ఇప్పుడు తనకు అలాంటి అవకాశమే లేకుండా పోయిందని చెప్పారు. లోగడ 1980 దశకంలో ఎడారిలో కాలం గడపడం, అక్కడ తనలో ఆధ్యాత్మికత మేల్కొనడం వంటి అనుభూతిని శ్రీ మోదీ ఉటంకించారు. ‘రాన్‌ ఉత్సవ్‌’కు శ్రీకారం చుట్టడంలో ఈ అనుభవమే తనకు ప్రేరణనిచ్చిందని తెలిపారు. ఇప్పుడు ఇదొక కీలక పర్యాటక ఆకర్షణగా మారి, ఆ ప్రాంతం ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రపంచ ప్రసిద్ధమైందని గుర్తుచేశారు. రాజకీయాల్లోనే కాకుండా పారిశ్రామికంగానూ వృద్ధికి, పురోగమనానికి సులువైన దారులు వెతికే లక్షణం నుంచి విముక్తం కావడం అవసరమని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించారు. సాహసించడం, సవాళ్లను ఢీకొనడం గొప్ప విజయాలకు బాటలు వేస్తుందని ఆయన స్పష్టీకరించారు.

   వ్యక్తిగత సంబంధాలను ప్రస్తావిస్తూ- తల్లిదండ్రులలో ఒకరిని కోల్పోవడంతో ముడిపడిన భావోద్వేగంపై శ్రీ మోదీ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. చిన్న వయసులోనే ఇల్లు వదిలి వెళ్లినందున సంప్రదాయక అనుబంధం తనకు అనుభవంలోకి రాలేదన్నారు. కానీ, తన తల్లి 100వ పుట్టినరోజు సందర్భంగా “వివేకంతో పనిచెయ్యి... స్వచ్ఛంగా జీవించు” అంటూ ఆమె తనకెంతో విలువైన సలహా ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. తన మాతృమూర్తి విద్యావంతురాలు కాకపోయినా లోతైన జ్ఞానాన్నిచ్చిందని, ఇప్పుడు ఆమెతో అటువంటి ఆత్మీయ భాషణ అవకాశాన్ని కోల్పోయానని వ్యాఖ్యానించారు. ఆమె స్వాభావికంగా తనను సదా ప్రోత్సహించడంపైనే దృష్టి సారించిందని పేర్కొన్నారు. తల్లిదండ్రులను కోల్పోవడం మిశ్రమ భావోద్వేగాలకు దారితీసినా, వారందించే జ్ఞానం, విలువలు మనకొక శాశ్వత సంపదగా మిగులుతాయని ప్రధాని అన్నారు.

   రాజకీయాలను “మలినమైనవి” అనే భావనను ప్రస్తావిస్తూ- నాయకుల చర్యలే ఈ రంగం ప్రతిష్ఠకు మచ్చ తెస్తాయని శ్రీ మోదీ స్పష్టం చేశారు. సమాజంలో మార్పు దిశగా కృషిచేసే ఆదర్శవాదులకు రాజకీయాలు ఇప్పటికీ ఒక ఉత్తమ మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా- తన బాల్యంలో స్థానిక వైద్యుడొకరు ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా స్వల్ప వ్యయంతో ప్రచారం నిర్వహించడాన్ని ప్రధాని గుర్తుచేసుకున్నారు. సత్యాన్ని, అంకిత భావాన్ని సమాజం సదా గుర్తించి, మద్దతిస్తుందని ఈ ఉదంతం నిరూపించినట్లు చెప్పారు. రాజకీయాల్లో సహనం, నిబద్ధత అవశ్యమని, దాన్ని ఎన్నికల దృష్టితో మాత్రమే చూడరాదని ఆయన స్పష్టీకరించారు. గణనీయమైన మార్పులకు దోహదం చేసే సామాజిక కృషి, విధాన రూపకల్పనలో భాగం పంచుకోవాల్సిన ప్రాముఖ్యాన్ని ఆయన వివరించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో భూకంప బాధితుల పునరావాసం దిశగా అధికారులకు ప్రేరణనిచ్చిన ఉదంతాన్ని ప్రధాని ఉదాహరించారు. ఆ మేరకు కాలం చెల్లిన నిబంధనల మార్పు ద్వారా ప్రభావశీల నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కలిగిందన్నారు. అంతేకాకుండా అధికారులు తమ ఉద్యోగ జీవితం ప్రారంభించిన ప్రాంతంలోని గ్రామాల పునఃసందర్శనకు వెళ్లాల్సిందిగా సూచించారు. ఆ విధంగా గ్రామీణ జీవన వాస్తవికతతో పునఃసంధానం ద్వారా వారి కర్తవ్య నిర్వహణ ప్రభావాన్ని అవగతం చేసుకోవాలని ప్రోత్సహించడాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. కఠిన పదజాల ప్రయోగం లేదా మందలింపులతో నిమిత్తం లేకుండా తన జట్టుకు స్ఫూర్తినిచ్చి మార్గనిర్దేశం చేయడం తన పాలన విధానంలో భాగంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

   “కనిష్ఠ ప్రభుత్వ జోక్యం-గరిష్ఠ పాలన” భావన గురించి ప్రశ్నించగా- అది మంత్రులు లేదా ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం కాదని, అందుకు బదులుగా ప్రక్రియల క్రమబద్ధీకరణ, యంత్రాంగంపై భారం తగ్గింపుపై దృష్టి సారించే విధానమని ప్రధానమంత్రి విశదీకరించారు. అదే సమయంలో పౌరులపై నిబంధనానుసరణ భారం తగ్గిస్తూ దాదాపు 40,000 నియమనిబంధనల తొలగింపును ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే సుమారు 1,500 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశామని, క్రిమినల్ చట్టాలను సంస్కరించామని పేర్కొన్నారు. పాలనను సరళం, మరింత సమర్థంగా రూపొందించడమే తమ లక్ష్యమని, తదనుగుణ చర్యలతో అవన్నీ ప్రస్తుతం విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు.

   ‘ఇండియా శ్టాక్‌’ వ్యవస్థ రూపకల్పన గురించి వివరిస్తూ- “యుపిఐ, ఇ-కెవైసి, ఆధార్”  వంటి భారత డిజిటల్ కార్యక్రమాలతో వచ్చిన గణనీయ మార్పుల ప్రభావాన్ని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో రైతుల ఖాతాలకు లబ్ధి ప్రత్యక్ష బదిలీ సాధ్యమైందని, అవినీతి, నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత సాంకేతికాధారిత శతాబ్దంలో ఆ పరిజ్ఞానాల ప్రజాస్వామ్యీకరణలో భారత్‌ సామర్థ్యం ప్రపంచానికి వెల్లడైందన్నారు. ఇందులో ‘యుపిఐ’ అంతర్జాతీయ అద్భుతంగా మారిందని ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా తన తైవాన్‌ పర్యటన జ్ఞాపకాన్ని ప్రస్తావిస్తూ అత్యంత ఉన్నత స్థాయిలోని నాయకులను చూసి తాను స్ఫూర్తి పొందిన ఉదంతాన్ని ప్రధాని పంచుకున్నారు. భారత యువతరం కూడా ఆ స్థాయిలో రాణించాలనే తన ఆకాంక్షను ఆయన ప్రకటించారు. పాతకాలపు కథల ఆధారంగా భారత్‌ను ఊహించుకుంటున్న తైవాన్‌ దుబాసీ ఒకరితో తన సంభాషణను ఆయన గుర్తు చేసుకున్నారు. భారత్‌ అంటే లోగడ పాములు ఆడించేవారి దేశమనే భావన వారిలో ఉండేదని, తద్విరుద్ధంగా నేటి భారత్‌ సాంకేతిక సాధికారత సాధించిందని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి బిడ్డ ఇప్పుడు కంప్యూటర్ మౌస్‌ వాడటంలో నిపుణులుగా మారుతున్నారని ప్రధానమంత్రి చమత్కరించారు. భారత్‌ బలం నేడు దాని సాంకేతిక పురోగమనంలోనే ఉందని, ఆవిష్కరణలకు మద్దతుగా ప్రభుత్వం ప్రత్యేక నిధులు, సంస్థలను సృష్టించిందని పేర్కొన్నారు. యువత సాహసోపేతంగా ముందడుగు వేయాలని, ఆ ప్రయత్నంలో విఫలమైనా వారికి మద్దతిస్తామని హామీ ఇచ్చారు.

   భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా అవగాహన మెరుగుపడటాన్ని ప్రస్తావిస్తూ- ఇది తన ఒక్కడి విజయం కాదని, భారతీయుల సమష్టి కృషి అని ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పారు. విదేశాలకు వెళ్లే ప్రతి భారతీయుడూ దేశ రాయబారిలా మాతృభూమి ప్రతిష్ఠ పెరిగేందుకు తోడ్పడుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా భారత సమాజంతో సంధానం, వారి బలం ఇనుమడించేలా చేయడం నీతి ఆయోగ్ లక్ష్యమని ఆయన ప్రకటించారు. గుజరాత్‌ ముఖ్యమంత్రి కావడానికి ముందు తన విస్తృత ప్రయాణానుభవాన్ని పంచుకుంటూ ప్రవాస భారతీయుల సామర్థ్యాన్ని తాను పసిగట్టిన తీరును ప్రధాని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు బలమైన గుర్తింపు తేవడంలో తోడ్పడింది ఈ సామర్థ్యమేనని చెప్పారు. అలాగే ఉన్నత విద్యాస్థాయి, తక్కువ నేరాల రేటు, చట్టాలను గౌరవించే భారతీయుల స్వభావం కూడా అంతర్జాతీయంగా సానుకూల అవగాహనకు దోహదం చేశాయన్నారు. సమష్టి బలాల సద్వినియోగం, సానుకూల ప్రతిష్ఠ కొనసాగింపు, బలమైన నెట్‌వర్క్‌లు-సంబంధాల నిర్మాణం వగైరాలపై దృష్టి సారించడం ద్వారా పారిశ్రామికవేత్తలు ఈ విధానాన్ని అనుసరించవచ్చునని ప్రధాని చెప్పారు.

   రాజకీయాల్లోనేగాక పారిశ్రామిక రంగంలోనూ పోటీతత్వం ప్రాముఖ్యాన్ని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా 2005లో అమెరికా ప్రభుత్వం తనకు వీసా నిరాకరించడాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికే కాకుండా దేశానికే ఇదొక అవమానంగా అప్పట్లో పరిగణించినట్లు పేర్కొన్నారు. అయితే, భవిష్యత్తులో భారత వీసాల కోసం ప్రపంచ దేశాలు బారులుతీరే రోజొకటి వస్తుందని ఆనాడే తాను ఊహించానని, ఇవాళ 2025లో అది నిజమైందని చెప్పారు. ప్రవాస భారత యువతరం, సామాన్యుల ఆకాంక్షలకు ఉదాహరణగా ఇటీవలి తన కువైట్ పర్యటనలో చోటుచేసుకున్న ఉదంతాన్ని ప్రధానమంత్రి ఉటంకించారు. వారితో సంభాషణ సందర్భంగా తమ జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలని కలలుగన్నట్లు ఓ కార్మికుడు చెప్పాడని వెల్లడించారు. దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్‌గా రూపొందించేది ఇలాంటి ఆకాంక్షలేనని ప్రధాని స్పష్టం చేశారు. దేశ పురోగమనానికి భారత యువత స్ఫూర్తి, ఆకాంక్షలే కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.

   విశ్వశాంతి కోసం నిరంతర కృషి వల్లనే ప్రపంచవ్యాప్తంగా భారత్‌ ఎనలేని విశ్వసనీయత, విశ్వాసాన్ని సముపార్జించుకున్నదని ప్రధానమంత్రి చెప్పారు. భారత్‌ తటస్థంగా లేదని, శాంతి దిశగా దృఢ సంకల్పంతో ఉందని పేర్కొంటూ- రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్‌ సహా సంబంధిత పక్షాలన్నిటికీ స్పష్టం చేశామని ఆయన వ్యాఖ్యానించారు. కోవిడ్‌-19 మహమ్మారి సంక్షోభ సమయంలో భారత పౌరులతోపాటు మన ఇరుగుపొరుగు దేశాల వారిని కూడా భారత్‌ సురక్షితంగా తరలించడాన్ని గుర్తుచేశారు. ఆనాడు మన పౌరులను వెనక్కు తీసుకొచ్చే ప్రమాదకర కార్యాచరణకు భారత వైమానిక దళ సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారని, తన ప్రజలపై భారత్‌కు నిబద్ధతకు ఇది నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నేపాల్ భూకంపం నాటి ఒక సంఘటనను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రజలు చెల్లించే పన్నుల విలువ ఎంతటిదో భారత్‌ చేపట్టిన ప్రాణరక్షక చర్యల ద్వారా గ్రహించిన వైద్యుడొకరు పౌరులను సురక్షితంగా మాతృభూమికి తరలించడంలో భారత్‌ కృషిని ప్రశంసించారని పేర్కొన్నారు. అంతేగాక ప్రపంచవ్యాప్తంగాగల పౌరులకు సేవ చేయడం మన మంచితనాన్ని, ప్రతిస్పందనాత్మకతను రుజువు చేస్తుందని ప్రధాని చెప్పారు. ఇస్లామిక్ దేశమైన అబుధాబిలో ఆలయ నిర్మాణానికి భారత్‌ అభ్యర్థన ఫలించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అంతర్జాతీయంగా భారత్‌ పొందుతున్న గౌరవం, విశ్వసనీయతను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. అక్కడి లక్షలాది భారతీయులకు ఈ పరిణామం అపరిమిత ఆనందం కలిగించిందని పేర్కొన్నారు. ప్రపంచం నలుమూలలగల తన పౌరులకు శాంతి, మద్దతు విషయంలో భారత్‌ నిబద్ధత తిరుగులేనిదని, అందుకే అంతర్జాతీయ యవనికపై మన దేశ విశ్వసనీయత సదా ఇనుమడిస్తూనే ఉంటుందని ప్రధాని పునరుద్ఘాటించారు.

   ఆహార ప్రాధాన్యాలపై తన మనోభావాన్ని పంచుకుంటూ- తాను ఆహార ప్రియుడిని కాకపోయినా, వివిధ దేశాల్లో పర్యటించినపుడు తనకు ఏ వంటకం వడ్డించినా ఆస్వాదిస్తానని శ్రీ మోదీ పేర్కొన్నారు. తాను సంస్థతో పనిచేస్తున్నపుడు దేశవ్యాప్తంగాగల అత్యుత్తమ రెస్టారెంట్లు, వంటకాల విషయంలో ప్రావీణ్యంగల దివంగత శ్రీ అరుణ్ జైట్లీపై తాను ఆధారపడే వాడినని ఆయన చెప్పారు.

   కాలక్రమంలో తన హోదాలో వచ్చిన మార్పును ప్రస్తావిస్తూ- పరిస్థితులు, పాత్రలు మారినా ఒకే వ్యక్తిగా తనలో ఎలాంటి మార్పుగానీ, వ్యత్యాసంగానీ లేవని ప్రధాని పేర్కొన్నారు. పదవులు, బాధ్యతలలో వచ్చిన మార్పు తన మూల విలువలు-సూత్రాలను ఎంతమాత్రం ప్రభావితం చేయలేదని తెలిపారు. ఎప్పటిలాగానే స్థిరంగా, ఏ ప్రభావమూ తనపై పడకుండా తన పనిమీద అదే వినమ్రత, అంకితభావంతో కొనసాగుతున్నానని ఆయన వివరించారు.

   బహిరంగ సభల్లో ప్రసంగించేటపుడు స్వీయానుభవం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని చెప్పారు. ఎవరైనా తమ సొంత అనుభవాల ప్రాతిపదికన మాట్లాడితే వారి మాటలు, వ్యక్తీకరణలు, కథనం తదితరాలు సహజంగానే ప్రభావశీలం కాగలవని ఆయన వ్యాఖ్యానించారు. తాను గుజరాతీ అయినప్పటికీ, రైల్వే స్టేషన్లలో టీ అమ్మడం, వివిధ ప్రాంతాల ప్రజలతో సంభాషించడం వంటి తన బాల్య జీవితానుభవాల వల్ల హిందీలో ధారాళంగా మాట్లాడగల సామర్థ్యం అబ్బిందని వివరించారు. మూలాలతో సుస్థిర సంబంధబాంధవ్యాలు ప్రభావశీల సంభాషణకు దోహదం చేస్తాయని ఆయన అన్నారు. మనసు లోతుల నుంచి మాట్లాడుతూ, వాస్తవానుభవాలను పంచుకోవడంపైనే వాగ్ధాటి ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.

   దేశంలో అంకురావరణ వ్యవస్థ పరిణామాన్ని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. భారత యువతరం శక్తిసామర్థ్యాలపై విశ్వాసం ప్రకటిస్తూ- తొలి అంకుర సమావేశంలో కోల్‌కతా యువతి ఉదంతాన్ని ప్రధాని పంచుకున్నారు. అంకుర సంస్థల భావనను ఆదిలో వైఫల్యానికి మార్గంగా పరిగణించినట్లు ఆమె పేర్కొన్నట్లు తెలిపారు. అయితే, అంకుర సంస్థలు నేడు ప్రతిష్ఠకు, విశ్వసనీయతకు మారుపేరుగా మారాయని వ్యాఖ్యానించారు. భారీ కలలు, ఆకాంక్షలే దేశంలో వ్యవస్థాపన స్ఫూర్తికి చోదకాలని, యువతరం ఇవాళ సంప్రదాయ ఉద్యోగార్థులుగా కాకుండా సొంత సంస్థలతో ఉద్యోగ ప్రదాతలుగా మారడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నదని స్పష్టం చేశారు.

   ‘ఎన్‌డిఎ’ ప్రభుత్వ తొలి, మలి, మూడో పదవీ కాలాల్లో తేడాల గురించి ప్రస్తావించినపుడు- దేశాభివృద్ధి దిశగా తన పరిణామశీల దృక్పథాన్ని ప్రధానమంత్రి వివరించారు. తన తొలి పదవీకాలంలో తాను, ప్రజానీకం పరస్పరం అర్థం చేసుకోవడానికి కృషి చేసినట్లు తెలిపారు. అదే సమయంలో తాను కేంద్ర పాలనను అర్థం చేసుకునే ప్రయత్నం చేశానన్నారు. అలాగే తొలి, మలి పదవీ కాలాల్లో తన మునుపటి విజయాలను సరిపోల్చుకుంటూ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. అయితే, ప్రస్తుత మూడో పదవీకాలంలో తన దృక్పథం విస్తృతి గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఆ మేరకు 2047 నాటికి వికసిత భారత్‌ దిశగా సుస్పష్ట దార్శనికత, స్వప్నాలు, సంకల్పాలు మరింత విస్తరించాయని విశదీకరించారు.

   ప్రత్యేకించి ఈ మూడోదఫా పదవీ కాలంలో తన దృక్కోణం 2047 నాటికి వికసిత భారత్‌ నిర్మాణంపై కేంద్రీకృతమైందని ప్రధాని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి పౌరుడికీ మరుగుదొడ్డి సదుపాయం, విద్యుత్ సౌకర్యం, కొళాయిల ద్వారా నీటి సరఫరా వంటి ప్రాథమిక అవసరాలను 100 శాతం తీర్చడం అగ్ర ప్రాథమ్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఇవి హక్కులు, ప్రయోజనాలు కావని ఆయన స్పష్టం చేశారు. వివక్షకు తావులేని రీతిలో ప్రతి భారతీయుడూ ప్రయోజనం పొందేలా చూడటంలోనే నిజమైన సామాజిక న్యాయం, లౌకికవాదం ఇమిడి ఉన్నాయని ప్రధానమంత్రి చెప్పారు. “ఆకాంక్షాత్మక భారతదేశం” తనను నడిపించే ఏకైక చోదకమని, 2047 నాటికి గణనీయ విజయాలు సాధించడమే తన భవిష్యత్‌ లక్ష్యమని దృఢంగా ప్రకటించారు. అందుకే తన మూడో దఫా పదవీకాలం మునుపటికన్నా భిన్నమేగాక ఉన్నతాశయాలు, దృఢ సంకల్పంతో ముడిపడి ఉందని పేర్కొన్నారు.

   భవిష్యత్తరం నాయకులను సన్నద్ధం చేయాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రి స్పష్టం చేశారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా తన పదవీకాలంలో రాబోయే రెండు దశాబ్దాల్లో సంభావ్య నాయకులు తయారయ్యేలా తర్ఫీదు ఇవ్వడంపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా తన బృందాన్ని ఎంత బాగా సిద్ధం చేయగలననే అంశమే తన విజయానికి కొలమానమని ఆయన చెప్పారు. ఆ మేరకు బలమైన, సమర్థ నాయకత్వాన్ని తీర్చిదిద్దేలా యువ ప్రతిభను పెంపొందించి, ప్రోత్సహించడంపై తన నిబద్ధతను ప్రధాని సుస్పష్టం చేశారు.

   అభ్యర్థిగా లేదా విజయవంతమైన రాజకీయ నాయకుడిగా ఎదిగే అర్హతల మధ్య వ్యత్యాసాన్ని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అభ్యర్థిత్వానికి ప్రాథమిక అర్హతలు కనీస స్థాయిలోనే ఉంటాయని, రాజకీయ నాయకుడిగా విజయవంతం కావడానికి మాత్రం అసాధారణ ప్రతిభాపాటవాలు అవశ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఒక రాజకీయ నాయకుడిపై నిరంతర పరిశీలన ఉంటుంది కాబట్టి, ఒక్క తప్పటడుగు వేసినా కొన్నేళ్ల  అవిరళ కృషి దెబ్బతింటుందని ప్రధాని ఉద్ఘాటించారు. అవిచ్ఛిన్న అంకిత భావం, చైతన్యం వంటి లక్షణాలు అవశ్యమని, విశ్వవిద్యాలయ పట్టాలతో అవి లభించవని వివరించారు. నిజమైన రాజకీయ విజయానికి అసమాన నిబద్ధత, నిజాయితీ అవసరమని ఆయన చెప్పారు.

   చివరగా- దేశ యువత, మహిళలనుద్దేశించి మాట్లాడుతూ- నాయకత్వం, రాజకీయాల్లో భాగస్వామ్యం ప్రాధాన్యాన్ని శ్రీ మోదీ వివరించారు. స్థానిక స్వపరిపాలన సంస్థలలో 50 శాతం రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే శాసనసభలు, లోక్‌సభలో 33 శాతం రిజర్వేషన్‌ ప్రతిపాదన నేపథ్యంలో నాయకత్వ పాత్ర పోషణకు తమనుతాము సన్నద్ధం చేసుకోవాల్సిందిగా యువతకు సలహా ఇచ్చారు. యువత రాజకీయాలను ప్రతికూల దృష్టితో చూడరాదని, లక్ష్యనిర్దేశిత విధానంతో జనజీవనంలో పాలుపంచుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దేశం ముందంజ వేయాలంటే సృజనాత్మకత, పరిష్కార దృక్పథం, అంకితభావంగల నాయకులు అవసరమని చెప్పారు. నేటి యువత 2047 నాటికి కీలక స్థానాల్లో నిలిచి, దేశాన్ని ప్రగతి పథంలో నడపగలరని ఆశాభావం వెలిబుచ్చారు. రాజకీయాల్లో యువతరం భాగస్వామ్యం దిశగా తన పిలుపు ఏదో ఒక పార్టీకి పరిమితం కాదని స్పష్టం చేశారు. సరికొత్త దృక్పథం, సామర్థ్యంగల నవశక్తిని అన్ని రాజకీయ పార్టీలలోకి తేవాలన్నదే తన లక్ష్యమని ప్రకటించారు. దేశ వృద్ధిని నడిపించడంలో, జాతి ఉజ్వల భవిష్యత్తుకు హామీ ఇవ్వడంలో యువ నాయకత్వ ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.

 

****


(Release ID: 2092253) Visitor Counter : 12