ప్రధాన మంత్రి కార్యాలయం
గ్రామీణ్ భారత్ మహోత్సవ్ 2025ను ప్రారంభించిన ప్రధానమంత్రి
వృద్ధి పథంలో పయనిస్తూ, అవకాశాలతో నిండి ఉండే చైతన్య కేంద్రాలుగా
గ్రామాల రూపురేఖల్ని మార్చి దేశానికి సాధికారతను కల్పించాలన్నదే మా దృష్టికోణం: ప్రధాని
ప్రతి పల్లెటూళ్లో కనీస సదుపాయాలకు హామీనిచ్చే ఒక ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించాం: ప్రధానమంత్రి
మా ప్రభుత్వ ఉద్దేశాలు, విధానాలు, నిర్ణయాలు గ్రామీణ భారతానికి కొత్త శక్తిని అందిస్తున్నాయి: ప్రధాని
ప్రస్తుతం, సహకార సంఘాల అండతో సమృద్ధిని సాధించే పనిలో దేశం నిమగ్నమైంది: ప్రధానమంత్రి
Posted On:
04 JAN 2025 12:38PM by PIB Hyderabad
గ్రామీణ్ భారత్ మహోత్సవ్ 2025ను ఈరోజు న్యూ ఢిల్లీలో భారత్ మండపంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. వికసిత్ భారత్ 2024 కోసం ఒక దృఢమైన గ్రామీణ భారత్‌ను నిర్మించడం ఈ మహోత్సవ్ ప్రధానోద్దేశం. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, సభకు హాజరైన వారందరికీ 2025వ సంవత్సరం చాలా సంతోషాన్ని పంచాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆరంభంలో గ్రామీణ్ భారత్ మహోత్సవ్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించడం భారత అభివృద్ధి ప్రయాణానికి ప్రతీకలా నిలుస్తోందని, అంతేకాక ఈ విషయంలో ఒక గుర్తింపును ఆవిష్కరిస్తోందని కూడా ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ‘నాబార్డ్’ (ఎన్ఏబీఏఆర్‌డీ) కు, దాని అనుబంధ సంస్థలకూ ఆయన అభినందనలు తెలిపారు.
మనలో గ్రామాల్లో పుట్టి పెరిగిన వారికి గ్రామాల శక్తిసామర్థ్యాలు ఏమిటో తెలుసంటూ ప్రధాని వ్యాఖ్యానించారు. గ్రామ స్ఫూర్తి కూడా గ్రామాల్లో నివసించే వారిలో వ్యక్తం అవుతుందని ఆయన అన్నారు. పల్లెసీమలో జీవించడమంటే ఎలా ఉంటుందో పల్లెలో నివసించిన వారికి ఎరుకేనని కూడా ప్రధానమంత్రి చెప్పారు. తాను తన బాల్యాన్ని ఒక చిన్న పట్టణంలో సాదాసీదా వాతావరణంలో గడిపిన అదృష్టానికి నోచుకొన్నానని శ్రీ మోదీ అన్నారు. పట్టణాన్ని వీడిన తరువాత తాను పల్లెపట్టులో కాలాన్ని గడిపానని కూడా ఆయన చెప్పారు. ‘‘ఇబ్బందులేమిటో తెలుసుకొన్నా, గ్రామంలో ఉండే అవకాశాల గురించి కూడా నాకు తెలుసు" అని ప్రధానమంత్రి అన్నారు. చిన్నతనం నుంచీ తాను పరిశీలించిన దాన్ని బట్టి గ్రామస్తులు కష్టపడి పనిచేసే వారే అయినప్పటికీ, పెట్టుబడి లేని కారణంగా వారు సరైన అవకాశాలకు నోచుకోవడం లేదని అర్థం చేసుకొన్నానని ఆయన తెలిపారు. వివిధ రంగాల్లో గ్రామీణులకు విభిన్నమైన బలాలున్నా, వారి కనీస సదుపాయాలను తీర్చుకొనే క్రమంలో ఆ బలాలను కోల్పోతూ ఉంటారని అన్నారు. రైతులకు ఎదురయ్యే వివిధ సవాళ్లలో ప్రకృతి విపత్తులు, మార్కెట్లు వారికి అందుబాటులో లేకపోవడం వంటి అనేక విధాలైన సవాళ్లున్నాయని ప్రధానమంత్రి వివరించారు. ఇవన్నీ చూశాక, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించాలనే ప్రోత్సాహం తనలో కలిగి, తాను అందుకు సంకల్పాన్ని చెప్పుకొన్నానని ఆయన అన్నారు. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు పల్లెల్లో నేర్చుకొన్న పాఠాలు, పల్లెల్లో ఎదురైన అనుభవాలే స్ఫూర్తిగా నిలిచాయి అని కూడా ఆయన చెప్పారు. 2014వ సంవత్సరం మొదలుకొని, తాను భారత్‌లోని గ్రామీణ ప్రాంతాలకు నిరంతరాయంగా సేవ చేస్తున్నట్లు శ్రీ మోదీ తెలిపారు. ‘‘భారత్‌లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆత్మగౌరవంతో కూడిన జీవనాన్ని అందించాలన్నదే నా ప్రభుత్వ ప్రాధాన్యం’’ అని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. సాధికార గ్రామీణ భారత్ నిర్మాణం, పల్లెవాసులకు కావలసినన్ని అవకాశాలను అందించడం, వలసల సంఖ్యను తగ్గించడంతోపాటు పల్లెవాసులకు జీవన సౌలభ్యానికి పూచీపడడం.. ఇవన్నీ తమ దృష్టికోణంలో భాగంగా ఉన్నాయని ఆయన వివరించారు. ఈ కారణంగా, ప్రతి పల్లెటూళ్లోనూ కనీస సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని అమలుచేసింది అని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క ఇంటికీ ఒక టాయిలెట్‌ను స్వచ్ఛ్ భారత్ మిషన్‌లో భాగంగా సమకూర్చారు, దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది ప్రజలకు పక్కా ఇళ్లను పీఎం ఆవాస్ యోజనలో భాగంగా ఇచ్చారు, అలాగే పల్లెల్లోని లక్షలాది ఇళ్లకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని జల్ జీవన్ మిషన్‌లో భాగంగా అందించారు అని శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారు.
‘‘ప్రస్తుతం, 1.5 లక్షల కన్నా ఎక్కువ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో ప్రజలకు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను సమకూరుస్తున్నారు’’ అని ప్రధానమంత్రి తెలిపారు. డిజిటల్ టెక్నాలజీల అండతో గ్రామాల్లో అత్యుత్తమ వైద్యుల, అత్యుత్తమ ఆసుపత్రుల ఐచ్ఛికాన్నిటెలీమెడిసిన్ కల్పించింది అని ఆయన చెప్పారు. ఈ-సంజీవిని (e-Sanjeevini) ద్వారా పల్లె ప్రాంతాల్లో కోట్లాది ప్రజలు ప్రయోజనాల్ని అందుకొన్నారు అని కూడా ఆయన వెల్లడించారు. కోవిడ్-19 మహమ్మారి విజృంభించిన కాలంలో, దేశంలో గ్రామాలు ఎలా నెట్టుకొస్తాయా అని ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. ఏమైనప్పటికీ, టీకామందులు ప్రతి ఒక్క గ్రామంలోనూ అందరికీ అందేటట్టు ప్రభుత్వం జాగ్రత్త చర్యలు చేపట్టింది అని ఆయన అన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలపరచడానికిగాను గ్రామీణ సమాజంలోని ప్రతి ఒక్క వర్గాన్ని లెక్కలోకి తీసుకొని ఆర్థిక విధానాలను రూపొందించడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని ప్రధానమంత్రి అన్నారు. గత పది సంవత్సరాల్లో, ప్రభుత్వం గ్రామాల్లోని ప్రతి వర్గం కోసం నిర్ణయాల్ని తీసుకొందనీ, ప్రత్యేక విధానాలను రూపొందించిందనీ ఆయన చెబుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కొద్ది రోజుల కిందటే, పీఎం పంట బీమా పథకాన్ని మరో సంవత్సరం పాటు పొడిగించడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని, అలాగే డీఏపీపై సబ్సిడీని కొనసాగించాలని నిర్ణయించిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్దేశాలు, విధానాలు, నిర్ణయాలు గ్రామీణ భారతంలో కొత్త శక్తిని నింపుతున్నాయని ప్రధాని స్పష్టంచేశారు. గ్రామీణ ప్రాంతాల వారు సాగుపనుల్లో నిమగ్నం అయ్యేటట్టుగా చూడడంతోపాటు నూతన ఉద్యోగావకాశాలను కల్పించడానికీ, స్వయం-ఉపాధి అవకాశాలను కల్పించడానికీ వారి గ్రామాల్లోపలే వీలయినంత ఎక్కువగా ఆర్థిక సహాయాన్ని అందించాలన్నదే లక్ష్యం అని ప్రధాని అన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి రైతులు సుమారుగా రూ.3లక్షల కోట్ల ఆర్థిక సహాయాన్ని అందుకొన్నారని ఆయన తెలిపారు. గత పది సంవత్సరాల్లో, వ్యవసాయ రుణాల మొత్తం 3.5 రెట్ల మేరకు పెరిగిందని శ్రీ మోదీ చెబుతూ, ప్రస్తుతం పశుపాలనలో నిమగ్నమైన వారికి, చేపల రైతులకూ కూడా కిసాన్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నారని వివరించారు. దీనికి అదనంగా, దేశంలో 9,000కు పైగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీఓలు) ఆర్థిక సహాయాన్ని అందుకొంటున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం గత 10 ఏళ్లలో అనేక పంటలకు ఎంఎస్‌పీ (కనీస మద్దతు ధర)ను పెంచుకొంటూ వచ్చిందని కూడా ఆయన స్పష్టంచేశారు.
గ్రామీణులు ఆస్తుల పత్రాలను అందుకొంటున్న స్వామిత్వ యోజన వంటి కార్యక్రమాలను ప్రారంభించిన విషయాన్ని శ్రీ మోదీ ప్రధానంగా ప్రస్తావించారు. గత పదేళ్లలో, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడానికి అనేక విధానాలను అమలుచేసినట్లు ఆయన వెల్లడించారు. క్రెడిట్ లింక్ గ్యారంటీ స్కీమ్‌తో ఎంఎస్ఎంఈలు ప్రయోజనాలను అందుకొన్నాయని, ఈ పథకం వల్ల ఒక కోటికి పైగా గ్రామీణ ఎంఎస్ఎంఈలు లాభపడ్డాయని ప్రధాని స్పష్టంచేశారు. ప్రస్తుతం, గ్రామీణ ప్రాంతాల యువతీయువకులు ముద్ర యోజన, స్టార్ట్-అప్ ఇండియా, స్టాండ్-అప్ ఇండియా వంటి పథకాల ప్రయోజనాలను అందుకొంటున్నారని ఆయన తెలిపారు.
గ్రామీణ భారతం రూపురేఖలలో పెను మార్పులను తీసుకురావడంలో సహకార సంఘాలు సార్ధక పాత్రను పోషించిన సంగతిని ప్రధాని ప్రధానంగా ప్రస్తావించారు. సహకారం ద్వారా మన దేశం సమృద్ధి బాటలో పయనిస్తోందని, ఈ ఉద్దేశంతో 2021లో సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రైతులు, పల్లెవాసులు వారి ఉత్పాదనలకు మంచి విలువను రాబట్టుకోవడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలపరచడంలో వారు సాయపడడానికిగాను దాదాపు 70,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)లలో కంప్యూటర్ వ్యవస్థను ప్రవేశపెట్టే పనులు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.
వ్యవసాయం ఒక్కటే కాకుండా, కమ్మరి, వడ్రంగి, కుమ్మరి పని వంటి సాంప్రదాయక చేతిపనులు, నైపుణ్యాలు కూడా మన పల్లెపట్టుల్లో ఉనికిలో ఉన్నాయని శ్రీ మోదీ గుర్తుకు తెచ్చారు. ఈ చేతివృత్తులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, స్థానిక ఆర్థిక వ్యవస్థకు చెప్పుకోదగ్గ తోడ్పాటును అందించాయనీ, అయితే వాటిని ఇంతకు ముందు ఆదరించలేదనీ ఆయన వ్యాఖ్యానించారు. ఆయా వృత్తిదారుల్లో ప్రావీణ్యాన్ని పెంచడానికి, వారికి వారు భరించగలిగే స్థాయిల్లో సహాయాన్ని అందించడానికి ‘విశ్వకర్మ యోజన’ను అమలు చేస్తున్నారనీ, దీంతో లక్షల మంది విశ్వకర్మ చేతివృత్తుల వారు జీవనంలో పైకెదిగేందుకు అవకాశాలు కలుగుతున్నాయనీ ఆయన అన్నారు.
‘‘ఉద్దేశాలు పవిత్రంగా ఉన్నప్పుడు, ఫలితాలు సంతోషదాయకంగా ఉంటాయి’’ అని శ్రీ మోదీ అన్నారు. గత పది సంవత్సరాల్లో చేసిన కఠోర శ్రమ ఫలితాలను దేశం ఇప్పుడు పొందుతోందని ఆయన అన్నారు. ఇటీవల విస్తృత స్థాయిలో నిర్వహించిన ఒక సర్వేలో అనేక ముఖ్య వాస్తవాలు బయటపడ్డాయని శ్రీ మోదీ చెబుతూ, భారత్‌లో గ్రామ ప్రాంతాల్లో 2011వ తో పోలిస్తే వినియోగం దాదాపు మూడు రెట్లు అయిందని, ఈ సరళి ప్రజలు వారికి నచ్చిన వస్తువులకు ఎక్కువ డబ్బును ఖర్చుపెడుతున్నారని తెలియజేస్తోందన్నారు. ఇదివరకు, పల్లెవాసులు వారి ఆదాయంలో సగానికి పైగా ఆహారానికే ఖర్చుపెట్టాల్సి వచ్చేది, అయితే స్వాతంత్య్రం వచ్చిన తరువాత నుంచి చూస్తే మొట్టమొదటిసారి, గ్రామీణ ప్రాంతాల్లో ఆహారంపై పెట్టే ఖర్చులు 50 శాతాని కన్నా తక్కువ స్థాయికి తగ్గాయని ప్రధాని చెప్పారు. దీని అర్థం.. ప్రజలు ఇక వారి ఇతర అవసరాలపైనా, ఇష్టాలపైనా డబ్బును ఖర్చు చేస్తున్నారనీ, వారు వారి జీవన నాణ్యతను మెరుగుపర్చుకొంటున్నారనీ.. అని ఆయన వివరించారు.
పట్టణ ప్రాంతాలకు, గ్రామాలకు మధ్య వినియోగం పరంగా అంతరం తగ్గిపోయిందని వెల్లడించిన ఆ సర్వేలో ఇతర ముఖ్యాంశాలను కూడా ప్రధాని ప్రధానంగా ప్రస్తావించారు. ఎక్కువ మొత్తాల్ని ఖర్చు పెట్టే స్తోమత పల్లెల్లో నివసించే వారి కన్నా పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికే ఉంటుందని మునుపు నమ్మే వారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, నిరంతరంగా కొనసాగుతూ వచ్చిన ప్రయత్నాలు ఈ భేదాన్ని తగ్గించివేశాయని ఆయన చెప్పారు. గ్రామీణ భారతంలో అనేక విజయ గాథలు మనకు ప్రేరణనిస్తున్నాయని ఆయన స్పష్టంచేశారు.
ఈ విజయాల్ని ఇంతకు ముందటి ప్రభుత్వాల పదవీకాలాల్లోనే సాధించి ఉండవచ్చు, కానీ స్వాతంత్య్రం వచ్చాక దశాబ్దాల పాటు లక్షల కొద్దీ గ్రామాలు కనీస అవసరాలకయినా నోచుకోకుండా ఉండిపోయాయని ప్రధాన మంత్రి అన్నారు. ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ వర్గాల ప్రజల్లో అత్యధికులు గ్రామాల్లో నివసిస్తున్నారు, వారిని వెనుకటి ప్రభుత్వాలు ఉపేక్షించాయని ఆయన తెలిపారు. ఇది గ్రామాల నుంచి వలసలకు దారితీసి, పేదరికాన్ని పెంచి, గ్రామాలకు పట్టణ ప్రాంతాలకు మధ్య అంతరం విస్తరించేటట్టు చేసిందన్నారు. ఇదివరకు సరిహద్దు గ్రామాలంటే అవి దేశానికి చివరి గ్రామాలు అనే భావన ఉండేదని ఒక ఉదాహరణగా ప్రధాని చెబుతూ, తన ప్రభుత్వం వాటికి మొదటి గ్రామాల స్థాయిని కట్టబెట్టిందని, వాటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వైబ్రంట్ విలేజెస్ స్కీమును ప్రవేశపెట్టిందన్నారు. సరిహద్దు గ్రామాల అభివృద్ధి ఆయా గ్రామాలలో నివసించే వారి ఆదాయాన్ని పెంచుతోందని ఆయన ప్రధానంగా చెప్పారు. ఇంతకు ముందు అనాదరణకు లోను అయిన వారిని ఇప్పుడు తన ప్రభుత్వం ప్రాధాన్యాన్నిచ్చి చూసుకొంటోందన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ‘పీఎం జన్‌మన్ యోజన’ను తెచ్చినట్లు, దశాబ్దాల తరబడి వికాసానికి ఆమడదూరంలో నిలిపిన ప్రాంతాలకు సమాన హక్కులు దక్కేలా చూసినట్లు ప్రధానమంత్రి ప్రస్తావించారు. గత పదేళ్లలో, తన ప్రభుత్వం మునపటి సర్కార్ల అనేక తప్పులను సరిదిద్దిందని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామాల అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి సాధన అనే మంత్రాన్ని పఠిస్తూ ప్రభుత్వం ముందుకు పోతోందని ఆయన స్పష్టంచేశారు. ఈ ప్రయత్నాల ఫలితంగా, గడచిన 10 సంవత్సరాల్లో 25 కోట్ల మంది పేదరికంలో నుంచి బయటకు వచ్చారు, వారిలో చాలా మంది గ్రామ ప్రాంతాలవారే అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. భారతీయ స్టేట్ బ్యాంకు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం మన దేశంలో గ్రామ ప్రాంతాల పేదరికం 2012లో సుమారు 26 శాతంగా ఉన్నది కాస్తా 2024లో 5 శాతాని కన్నా తక్కువకు దిగివచ్చింది అని ఆయన చెప్పారు. కొంత మంది దశాబ్దాలుగా పేదరికాన్ని నిర్మూలించాలని నినాదాలు చేస్తున్నారనీ, పేదరికం స్థాయిలో నిజమైన తగ్గింపును దేశం ఇప్పుడు గమనిస్తోందనీ ఆయన అన్నారు.
దేశంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళలది ముఖ్య పాత్ర అనీ, ఈ పాత్ర పరిధిని పెంచాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందనీ శ్రీ మోదీ స్పష్టంచేశారు. మహిళలు బ్యాంకు సఖిలుగా, బీమా సఖిలుగా గ్రామీణ జీవనానికి సరికొత్త నిర్వచనాన్ని అందిస్తున్నారని, వారు స్వయంసహాయ బృందాల మాధ్యమం ద్వారా ఒక కొత్త క్రాంతికి నాయకత్వం వహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పల్లెల్లో 1.15 కోట్ల మంది మహిళలు లఖ్‌పతి దీదీలు (లక్షాధికారి సోదరీమణులు)గా ఎదిగారనీ, 3 కోట్ల మంది మహిళలను లఖ్‌పతి దీదీలుగా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొందనీ ప్రధాని తెలిపారు. దళితులు, వంచితులు, గిరిజన సముదాయాల్లోని మహిళల కోసం ప్రత్యేక పథకాలను కూడా అమలుపరుస్తున్నారని ఆయన చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ఇదివరకు ఎన్నడూ లేనంత శ్రద్ధ వహిస్తున్న సంగతిని ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ, చాలావరకు గ్రామాలు ఇప్పుడిక హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, రైలుమార్గాలతో ముడిపడ్డాయన్నారు. గత పది సంవత్సరాల్లో ‘ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన’లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 4 లక్షల కిలోమీటర్ల రహదారులను నిర్మించారని ఆయన వివరించారు. ‘‘గ్రామాలు డిజిటల్ మౌలిక సదుపాయాల పరంగా చూస్తే, ఆధునిక 21వ శతాబ్దపు గ్రామసీమలుగా మారుతున్నాయి’’ అని ప్రధాని అభివర్ణించారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల కుటుంబాల్లో 94 శాతానికి పైగా కుటుంబాల వద్ద టెలిఫోన్‌లు గాని, లేదా మొబైల్ ఫోన్‌లు గాని ఉన్నాయనీ, బ్యాంకింగ్ సేవలు, యూపీఐ వంటి ప్రపంచ శ్రేణి టెక్నాలజీ పల్లెల్లో చోటు చేసుకొందనీ ఆయన అన్నారు. కామన్ సర్వీస్ సెంటర్ల సంఖ్య 2014 కన్నా ముందు ఒక లక్ష లోపే ఉండగా, ప్రస్తుతం 5 లక్షల కన్నా ఎక్కువకు చేరుకోవడంతోపాటు డజన్ల కొద్దీ ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్ మాధ్యమంలో ప్రజలకు అందిస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు. ఈ మౌలిక సదుపాయాలు గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేస్తూ, ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తూ, దేశ ప్రగతిలో పల్లెలూ పాలుపంచుకొనేటట్టు చేస్తున్నాయని ఆయన చెప్పారు.
స్వయంసహాయ బృందాల మొదలు కిసాన్ క్రెడిట్ కార్డుల వరకు.. అనేక కార్యక్రమాలు సఫలం కావడంలో నాబార్డ్ సీనియర్ మేనేజ్‌మెంట్ పోషించిన ముఖ్య పాత్రను శ్రీ మోదీ గుర్తిస్తూ, దేశం పెట్టుకొన్న లక్ష్యాల్ని సాధించడంలో నాబార్ద్ కీలక పాత్ర నిర్వహించడాన్ని కొనసాగిస్తుందని కూడా స్పష్టంచేశారు. రైతు పండించిన పంటకు చక్కని ధరలు లభించేటట్టు చూడడంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్‌పీఓల) శక్తి, వాటి పాత్రను గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. పాల ఉత్పత్తి ప్రస్తుతం రైతులకు అత్యధిక లాభాలను తెచ్చిపెడుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు. అమూల్ వంటి జాతీయ స్థాయి విస్తృతి కలిగిన మరో అయిదారు సహకార సంఘాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రాకృతిక వ్యవసాయాన్ని దేశం ఉద్యమం తరహాలో ముందుకు తీసుకు పోతోందంటూ, ఈ కార్యక్రమంలో మరింత మంది రైతులు చేరాలని విజ్ఞప్తి చేశారు. స్వయంసహాయ బృందాల (ఎస్‌హెచ్‌జీ) ఉత్పాదనలకు దేశమంతటా ఉన్న డిమాండును తీర్చడానికి వాటిని సూక్ష్మ, చిన్న పరిశ్రమల (ఎంఎస్ఎంఈల)తో లంకె పెట్టడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలన్నారు. ఈ ఉత్పాదనలకు సరైన బ్రాండింగ్, మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జీఐ ఉత్పాదనల నాణ్యత, ప్యాకేజింగ్, బ్రాండింగ్‌లపైనా శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో వివిధ మార్గాల్లో ఆదాయమార్గాల్ని సృష్టించాల్సిన అవసరం ఉందని ప్రధాని అంటూ, సేద్యాన్ని భరించగలిగే స్థాయికి తీసుకు రావాలని, సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించాలని, గ్రామీణ వాణిజ్య వ్యవస్థలను నెలకొల్పాలని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొమ్ముకాసే విధంగా ప్రాకృతిక వ్యవసాయంలో లాభాల్ని వీలైనంత ఎక్కువ స్థాయికి చేర్చాలని అన్నారు. ఈ దిశలో ఒక గడువును పెట్టుకొని ఆ కాలం లోపల నిర్దిష్టంగా కృషి చేయాలని ఆయన కోరారు.
గ్రామస్తులు వారి గ్రామంలో నిర్మించిన అమృత్ సరోవరాన్ని అంతా కలిసికట్టుగా శ్రద్ధతో నిర్వహించుకోవాలని శ్రీ మోదీ సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఏక్ పేడ్ మాఁ కే నామ్’ (తల్లి పేరిట ఒక మొక్కను నాటుదాం) కార్యక్రమాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. మరిన్ని మొక్కలను నాటడానికి గ్రామంలో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని ఆయన చెప్పారు. సద్భావన, ప్రేమ-ఆదరణలు గ్రామానికి గుర్తింపును తెచ్చిపెడతాయి అని ఆయన అన్నారు. కొంత మంది కులం పేరుతో సమాజంలో విషాన్ని చిమ్మే ప్రయత్నం, సమాజ ఏకతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారని శ్రీ మోదీ అంటూ,ఈ తరహా కుట్రలను వమ్ము చేయాలని, పల్లె ఉమ్మడి సంస్కృతిని కాపాడాలనీ కోరారు.
పల్లెలకు సాధికారితను కల్పించడానికి నిరంతర కృషి అవసరమనీ, ప్రతి ఒక్క పల్లె తనదైన సంకల్పాలను చెప్పుకోవాలనీ ప్రధానమంత్రి స్పష్టంచేస్తూ ప్రసంగాన్ని ముగించారు. పల్లెల ప్రగతే అభివృద్ధి చెందిన భారత్ కలను సాకారం చేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌధరి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నేపథ్యం
భారతదేశ గ్రామీణ ప్రాంతాలలో వ్యక్తమయ్యే ఔత్సాహిక వ్యాపారవేత్తల స్ఫూర్తి, సాంస్కృతిక వారసత్వాలు ప్రధానాంశంగా గ్రామీణ్ భారత్ మహోత్సవ్ 2025 ను జనవరిలో 4 న మొదలుపెట్టి, జనవరి 9 వరకు నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాన్ని ‘వికసిత్ భారత్ 2047 కోసం దృఢమైన గ్రామీణ భారతాన్ని నిర్మించడం’ అనే ఇతివృత్తంతో, ‘‘గాఁవ్ బఢే, తో దేశ్ బఢే’’ (గ్రామం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది) అనే ఆదర్శవాక్యం స్ఫూర్తితో నిర్వహిస్తున్నారు.
చర్చలు, కార్యశాలలు (వర్క్‌షాపులు), శిక్షణ తరగతుల నిర్వహణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను విస్తరించడంతో పాటు, స్వావలంబన సహిత ఆర్థిక వ్యవస్థను రూపొందించడం, గ్రామీణులలో నవకల్పన (ఇన్నొవేషన్) లను ప్రోత్సహించడం ఈ మహోత్సవ్ లక్ష్యాలు. ఆర్థికస్థిరత్వాన్ని ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాల నివాసులలో ఆర్థిక భద్రతను పెంచడం, దేశ ఈశాన్య ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటూ సుస్థిర వ్యవసాయ పద్దతులకు మద్దతిచ్చి, ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేయడం కూడా ఈ మహోత్సవ్ ప్రధాన ఉద్దేశాలలో భాగంగా ఉన్నాయి.
ఈ మహోత్సవ్‌లో దృష్టి సారించే అంశాలలో.. ఔత్సాహిక ప్రారిశ్రామికవేత్తలుగా గ్రామీణ ప్రాంతాల మహిళలను ప్రోత్సహించి వారికి సాధికారత కల్పించడం; గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చే దిశగా సమష్టి, సహకార పూర్వక ప్రణాళికల్ని రూపొందించడానికి ప్రభుత్వ అధికారులను, మేధావులను, గ్రామీణ ప్రాంతాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, చేతివృత్తిదారులను, వివిధ రంగాలకు చెందిన ఆసక్తిదారులను ఒక్కచోట చేర్చడం, గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని పెంచడానికి టెక్నాలజీని వినియోగించుకోవడం, ఇతరత్ర వినూత్న పద్ధతుల్ని అవలంబించడంపై చర్చలు జరిగేలా చూడడంతోపాటు చైతన్యభరిత కళారూపాల ప్రదర్శనలను, ఎగ్జిబిషన్లను నిర్వహించడం ద్వారా దేశ సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని కళ్లకు కట్టడం వంటివి ఉన్నాయి.
***
(Release ID: 2090914)
Visitor Counter : 11
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam