ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఢిల్లీలో రూ.12,200 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ

సాహిబాబాద్, న్యూ అశోక్ నగర్ మధ్య నమో భారత్ కారిడార్‌‌కు ప్రధాని ప్రారంభం, మొదటి నమోభారత్ వ్యవస్థతో అనుసంధానమైన ఢిల్లీ

భారతీయ మెట్రో వ్యవస్థ 1,000 కి.మీ.లకు చేరుకుంది, ఇది గొప్ప విజయం: పీఎం

‘మేక్ ఇన్ ఇండియా’తో పాటు ‘హీల్ ఇన్ ఇండియా’ మంత్రాన్ని కూడా ప్రపంచం స్వీకరిస్తుంది: పీఎం

ఆరోగ్య, వైద్య సేవల కేంద్రంగా ఎదిగేందుకు అవసరమైన సామర్థ్యం భారత్‌కు ఉంది: పీఎం

Posted On: 05 JAN 2025 2:23PM by PIB Hyderabad

రూ. 12,200 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ప్రాంతీయ రవాణా అనుసంధానాన్ని మెరుగుపరిచి, ప్రయాణాన్ని సులభతరం చేయడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. సాహిబాబాద్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ నుంచి న్యూ అశోక్ ‌నగర్ ఆర్ఆర్‌టీఎస్ స్టేషన్ వరకు నమో భారత్ రైల్లో ప్రధానమంత్రి ప్రయాణించారు.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌‌కు భారత ప్రభుత్వం మంచి బహుమానం ఇచ్చిందని, దేశంలో నగర రవాణా వ్యవస్థను మరింత విస్తరిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారతీయ నగరాల్లో ప్రజారవాణాను సూచించే నమో భారత్ రైల్లో ఈ రోజు సాహిబాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు తాను చేసిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ ప్రయాణంలో ఉత్సాహం, ఆశలతో నిండిన యువతతో సంభాషించానని శ్రీ మోదీ తెలిపారు. ఒకసారి నమో భారత్ ప్రాజెక్టు పూర్తయితే, ఢిల్లీ-మీరట్ మార్గంలో ట్రాఫిక్‌లో గణనీయమైన మార్పు వస్తుందని ప్రధానమంత్రి వెల్లడించారు. అలాగే ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రజలకు ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

‘‘భారత ఆధునిక మౌలిక సదుపాయాల ప్రయాణంలో ఈ రోజు ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది’’ అని శ్రీ మోదీ అన్నారు. భారతీయ మెట్రో వ్యవస్థ ఇప్పుడు 1,000 కి.మీ.లకు చేరుకుందని, ఇది గొప్ప విజయమని ఆయన ప్రముఖంగా తెలియజేశారు. 2014లో ఈ దేశం తమకు అవకాశం ఇచ్చినప్పుడు, మెట్రో అనుసంధానంలో భారత్ ప్రపంచంలో మొదటి పది స్థానాల్లో కూడా లేదని ప్రధాని అన్నారు. కానీ గడచిన పదేళ్లలో విస్తృతమైన మెట్రో వ్యవస్థ ఉన్న మూడో దేశంగా మారిందని తెలియజేశారు. ప్రస్తుత తమ ప్రభుత్వ హయాంలో భారత్ రెండో అతిపెద్ద మెట్రో వ్యవస్థగా మారబోతోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

2014కు ముందు భారతదేశంలో మెట్రో వ్యవస్థ కేవలం 248కి.మీ.లు మాత్రమే ఉండి, ఐదు నగరాలకే పరిమితం అయిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గత పదేళ్లలో దేశంలో 752 కి.మీ.ల మేర కొత్త మెట్రో లైన్లను ప్రారంభించామని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 నగరాల్లో మెట్రో సేవలు నిర్వహిస్తున్నామని, 1,000 కి.మీ.లకు పైగా కొత్త మెట్రో మార్గాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.

ఢిల్లీ మెట్రో విస్తరణ గురించి ప్రస్తావిస్తూ, రెండు కొత్త మార్గాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనతో గుర్గావ్ తర్వాత హర్యానాలో మరో భాగం మెట్రో వ్యవస్థకు అనుసంధానమైందని శ్రీ మోదీ వివరించారు. ఢిల్లీ, హర్యానా మధ్య ఉన్న ముఖ్యమైన పారిశ్రామిక కేంద్రాలను కలిపే రితాల-నరేలా-కుండ్లీ కారిడార్ ఢిల్లీ మెట్రో వ్యవస్థలో పెద్ద విభాగాల్లో ఒకటని, ఇది రాకపోకలను సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం చేస్తున్న కృషితో ఢిల్లీలో మెట్రో మార్గాలు క్రమంగా విస్తరిస్తున్నాయని ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 2014లో ఢిల్లీ-ఎన్‌సీఆర్ మెట్రో వ్యవస్థ 200కి.మీ.ల కంటే తక్కువ దూరం ఉండేదని, ఇప్పుడు అది రెట్టింపు కంటే ఎక్కువ అయిందని వెల్లడించారు.

‘‘గత దశాబ్ద కాలంగా మౌలిక వసతులను అభివృద్ధిపై మా ప్రభుత్వం దృష్టి పెడుతూ వస్తోంది' అని శ్రీ మోదీ వివరించారు. పదేళ్ల క్రితం బడ్జెట్లో మౌలిక వసతులకు రూ. 2 లక్షల కోట్ల కేటాయింపులు ఉంటే, ప్రస్తుతం అవి  రూ.11 లక్షల కోట్లకు పెరిగాయని అన్నారు. ఆధునిక రవాణా వ్యవస్థపై, ముఖ్యంగా నగరాల మధ్య అనుసంధానంపై ప్రధాన దృష్టి సారించామని ఆయన అన్నారు.ఢిల్లీ నుంచి వివిధ నగరాలకు ఎక్స్ ప్రెస్ మార్గాల నిర్మాణం జరుగుతోందని, పారిశ్రామిక కారిడార్లకు ఢిల్లీని అనుసంధానం చేస్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వివిధ రకాల సరుకులను రవాణా చేసే అతిపెద్ద కేంద్రాన్ని ఎన్‌సీఆర్‌లో అభివృద్ధి చేస్తున్నామని, అలాగే ఢిల్లీ, ఎన్ సి ఆర్ ల మధ్య రెండు సరకు రవాణా కారిడార్లను కలిపే పనులు జరుగుతున్నాయని వివరించారు. ఈ ప్రాజెక్టులు దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని శ్రీ మోదీ వెల్లడించారు. ‘‘ఈ మౌలిక వసతులు పేద, మధ్య తరగతి ప్రజలతో సహా అందరికీ గౌరవప్రదమైన, నాణ్యమైన జీవితాన్ని అందిస్తాయి’’ అని అన్నారు.

నిరుపేదలకు సైతం ఆరోగ్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తూ, ఆయుష్, ఆయుర్వేద లాంటి భారతీయ సంప్రదాయ వైద్య విధానాలను తాము ప్రోత్సహిస్తున్నామని ప్రధానమంత్రి తెలియజేశారు. గత పదేళ్లలో 100కు పైగా దేశాలకు ఆయుష్ సేవలు విస్తరించాయని వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సంప్రదాయ ఔషధాలకు సంబంధించిన మొదటి సంస్థను భారత్‌లో స్థాపించబోతోందని శ్రీ మోదీ వివరించారు. కొన్ని వారాల క్రితమే అఖిల భారత ఆయుర్వేద సంస్థ రెండో దశను తాను ప్రారంభించానని ఆయన అన్నారు. అదే రోజు కేంద్రీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థకు శంకుస్థాపన చేశానని చెబుతూ, ఢిల్లీ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

‘‘వైద్యం, ఆరోగ్యరక్షణ విషయంలో ప్రపంచ కేంద్రంగా మారే సత్తా భారత్‌కు ఉంది’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ‘మేక్ ఇన్ ఇండియా’తో పాటు ‘హీల్ ఇన్ ఇండియా’ను కూడా ప్రపంచం మంత్రంగా వల్లించే రోజు ఎంతో దూరంలో లేదని ఆయన అన్నారు. విదేశీ పౌరులు భారత్‌లో ఆయుష్ చికిత్సను పొందేందుకుగాను, ప్రత్యేక ఆయుష్ వీసాను ప్రవేశపెట్టామని, తక్కువ వ్యవధిలోనే వందలాది మంది విదేశీయులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని ఆయన వివరించారు. భారత ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలు ఢిల్లీని నూతన శిఖరాలకు చేర్చుతాయన్న విశ్వాసాన్ని వ్యవక్తం చేస్తూ ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.

కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ మనోహర్ లాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమారే సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం:

ప్రాంతీయ రవాణా అనుసంధానతలో కీలకమైన మైలు రాయిని సూచిస్తూ, రూ. 4,600 కోట్ల వ్యయంతో చేపట్టిన 13కి.మీ.ల పొడవైన ఢిల్లీ - ఘజియాబాద్- మీరట్ నమో భారత్ కారిడార్‌ను సాహిబాబాద్, న్యూ అశోక్ నగర్ మధ్య ప్రధానమంత్రి ప్రారంభిచారు. దీనితో నమో భారత్‌తో అనుసంధానమైన మొదటి నగరంగా ఢిల్లీ నిలిచింది. తద్వారా ఢిల్లీ, మీరట్ మధ్య రాకపోకలు సులభతరమై మిలియన్ల మంది ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది.

జనక్ పురి, కృష్ణా పార్క్ మధ్య రూ.1,200 కోట్లతో నిర్మించిన 2.8 కి.మీ పొడవైన ఢిల్లీ మెట్రో ఫేజ్-IV ను కూడా ప్రధాని ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో ఫేజ్-IVలో ప్రారంభించిన మొదటి మార్గం ఇదే. దీని ద్వారా పశ్చిమ ఢిల్లీలోని కృష్ణా పార్క్‌తో పాటు వికాస్‌పురి, జనక్‌పురిలోని కొన్ని ప్రాంతాలు ప్రయోజనం పొందుతాయి.

ఢిల్లీ మెట్రో ఫేజ్-IV లో రూ.6,230 కోట్లతో 26.5 కి.మీ మేర విస్తరించనున్న రితాల-కుండ్లీ సెక్షన్‌ నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ మార్గం ఢిల్లీలోని రితాల, హర్యానాలోని నాథుపూర్ (కుండ్లీ)ను అనుసంధానిస్తుంది. ఫలితంగా వాయువ్య ఢిల్లీ, హర్యానాకు రవాణా వ్యవస్థ విస్తరిస్తుంది. ఈ మార్గం ద్వారా ప్రయోజనం పొందేవాటిలో రోహిణి, బవానా, నరేలా, కుండ్లీ ప్రాంతాల్లోని నివాస, వ్యాపార, పారిశ్రామిక జోన్లు ప్రయోజనం పొందుతాయి. ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభమైతే విస్తరించిన రెడ్ లైన్ ద్వారా ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు సులభంగా ప్రయాణించవచ్చు.

సుమారు రూ.185 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో నిర్మించే కేంద్రీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ (సీఏఆర్ఐ)కు న్యూఢిల్లీలోని రోహిణిలో శంకుస్థాపన చేశారు. ఇది ఆధునిక వైద్యసేవలను, ఔషధ మౌలిక సదుపాయాలను అందిస్తుంది. ఈ కొత్త భవనంలో పరిపాలన, ఓపీడీ, ఐపీడీ, రోగులకు చికిత్స అందించే బ్లాకులు ఉన్నాయి. వీటి ద్వారా పరిశోధకులకు, రోగులకు సమీకృత, అవరోధాలు లేని వైద్య సేవలు అందుతాయి.


 

***


(Release ID: 2090653) Visitor Counter : 11