నీతి ఆయోగ్
మీరా భాయిందర్ నగరపాలక సంస్థతో చేయి కలిపిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వేదిక... ఫరాల్ సఖి పథకం ద్వారా మహిళా సాధికారత దిశగా అడుగులు సంప్రదాయ చిరుతిళ్ళ తయారీ పరిశ్రమలో మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూత
ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు అవసరమైన సామగ్రి, నైపుణ్యాలు, అవకాశాల అందజేత
దేశవ్యాప్తంగా అమలవుతున్న ఇదే తరహా పథకాలకు దిక్సూచిగా నిలువనున్న ఫరాల్ సఖి
Posted On:
03 JAN 2025 11:27AM by PIB Hyderabad
మహారాష్ట్ర మీరా భాయిందర్ నగరంలోని మహిళా పారిశ్రామికవేత్తలను సాధికారులను చేసేందుకు స్థానిక నగరపాలక సంస్థ – ఎంబీఎంసీ, ఫరాల్ సఖి పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది. సంప్రదాయ చిరుతిళ్ళ తయారీ పరిశ్రమలో పని చేసే మహిళా పారిశ్రామికవేత్తలకు సమగ్ర శిక్షణ, మద్దతులనందించడం, తద్వారా వారి వ్యాపారాలను అనుకూల పద్ధతుల్లో అభివృద్ధి పరచడం పథకం లక్ష్యంగా ఉంది. ఇందుకోసం ఎంబీఎంసీ నీతి ఆయోగ్ కు చెందిన మహిళా విభాగం – డబ్ల్యూఈపీ ‘అవార్డ్ టు రివార్డ్’ కార్యక్రమం కింద ఫరాల్ సఖిని ప్రారంభించింది.
2018లో నీతి ఆయోగ్ కూడలి వేదికగా ప్రారంభమయిన డబ్ల్యూఈపీ, 2022 లో పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్య వేదికగా రూపాంతరం చెందింది. అసమగ్ర సమాచార సమస్యను అధిగమించి, వివిధ విభాగాల్లో మద్దతునందించడం ద్వారా మహిళలకు బాసటగా నిలవాలన్న లక్ష్యంతో డబ్ల్యూఈపీ పని చేస్తోంది. నిధుల కల్పన, మార్కెట్లతో అనుసంధానం, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, మెంటారింగ్(దిశా నిర్దేశం), నెట్వర్కింగ్ (భాగస్వామ్య పక్షాలతో మెరుగైన సంబంధ బాంధవ్యాలు, కంప్లయన్స్(నిబంధనలు పాటించడం), న్యాయ సహాయం, వ్యాపారాభివృద్ధి తదితర అంశాల్లో డబ్ల్యూఈపీ సహాయాన్ని అందిస్తుంది.
సాంప్రదాయక పండుగ పిండివంటల (ఫరాల్) తయారీ, అమ్మకాల్లో అండగా నిలవడం ద్వారా మహిళలకు శాశ్వత ఉపాధి అవకాశాలను కల్పించాలన్న లక్ష్యంతో ఫరాల్ సఖి పనిచేస్తోంది. ఎంబీఎంసీ సహాయంతో ఏర్పాటయ్యే కేంద్రీయ వంటశాల ద్వారా స్వయం సహాయక బృందాల మహిళలు ఈ చిరుతిళ్లను మార్కెట్లో అమ్మకానికి అనువైన ప్రమాణాలతో తయారు చేయగలుగుతారు. వివిధ ప్రచార కార్యక్రమాలు సహా తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఎంబీఎంసీ వీరికి స్థానాలను కూడా సమకూరుస్తుంది. ఫరాల్ సఖి ఉత్పత్తుల రుచి నాణ్యతల వల్ల, గత దీపావళి సమయంలో 3 టన్నుల ఆహార ఉత్పత్తులను విక్రయించి, ఈ పథకం గొప్ప విజయాన్ని చవిచూసింది.
వ్యాపార లావాదేవీల్లో మెళకువలను తెలుసుకునేందుకు మీరా భాయిందర్ కు చెందిన 25 మంది మహిళలకు శిక్షణను అందిస్తారు. సీజీఈపీ (సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ) ఫౌండేషన్ అందించే శిక్షణ, వ్యాపారాలను లాభసాటిగా నడుపుకుంటూ, స్థానిక ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి అవసరమైన నైపుణ్యాలను మహిళలకు అందిస్తుంది.
ప్రభుత్వ, వ్యాపార, దాతృత్వ, పౌర సమాజ భాగస్వాములు ఒక చోటికి చేరి, పరస్పర సహకారంతో పనిచేసే వేదికను డబ్ల్యూఈపీ కల్పిస్తుంది. మహిళా వ్యాపారవేత్తలకు లాభాన్ని కలిగించే ఆచరణీయ, అనుకూల, ప్రభావవంతమైన కార్యక్రమాల వైపు వారికి మార్గదర్శనం చేస్తుంది. 2023లో ‘అవార్డ్ టు రివార్డ్’ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా భాగస్వామ్యాన్ని సంస్థాగతం చేసే దిశగా నిర్ణయాత్మక అడుగు వేసిన డబ్ల్యూఈపీ, మహిళా వ్యాపారవేత్తల నిర్దిష్ట అవసరాలను తీర్చేందుకు, వారు సాధించిన విజయాలను వేడుక చేసుకునేందుకు భాగస్వాములకు ఒక గొడుగు కిందకి చేరుస్తుంది. 'అవార్డ్ టు రివార్డ్' ద్వారా వాటాదారులు ప్లగ్-అండ్-ప్లే (వెన్వెంటనే వాడుకోదగ్గ) విధానంలో ప్రభావవంతమైన ప్రోగ్రామ్‌లను అభివృద్ధి పరిచే వీలు కల్పిస్తుంది. సహకార స్ఫూర్తితో మహిళా పారిశ్రామికవేత్తలు దేశీయ మార్కెట్‌లలో విజయం సాధించేందుకు, అంతర్జాతీయంగా వారి వ్యాపారాలను అభివృద్ధి పరుచుకునే వీలు కలుగుతుంది. ఇప్పటికే 30,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు డబ్ల్యూఈపీతో అనుసంధానమై ఉండగా, ఎంబీఎంసీతో భాగస్వామ్యం మీరా భాయిందర్ లో మహిళల నేతృత్వంలోని వ్యాపారాలు పుంజుకునేందుకు దోహదపడగలదని భావిస్తున్నారు. డబ్ల్యూఈపీ ‘పార్ట్నర్ అప్రిషియేట్’ కార్యక్రమం కూడా ఈ ఏటీఆర్ కోసం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
"మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని సాధించడానికి మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతునివ్వడం చాలా అవసరం. మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ, నైపుణ్యం, వనరులు, మెంటార్‌లు, నెట్‌వర్క్‌లను అందుబాటులో ఉంచడంలో డబ్ల్యూఈపీ కీలక మద్దతును అందిస్తుంది. మహిళల స్వావలంబన సాధన, వారిని శక్తిమంతులుగా తీర్చిదిద్దడంలో డబ్ల్యూఈపీ మూడు మార్గదర్శక సూత్రాలను అనుసరిస్తుంది.... అవే - ఇచ్ఛాశక్తి (వ్యాపారాలని ప్రారంభించడానికి, వాటిని అభివృద్ధి పరుచుకోవడానికి అవసరమైన ప్రేరణ శక్తి), జ్ఞానశక్తి (సమాచార అసమగ్రతను అధిగమించడానికి అవసరమైన జ్ఞానం), కర్మశక్తి ( సలహాలు, సూచనలు, మద్దతు ద్వారా అందించే శక్తి). 'అవార్డ్ టు రివార్డ్' కార్యక్రమంలో ఫరాల్ సఖిను చేర్చడం ద్వారా, మహిళల నేతృత్వంలోని గృహ పరిశ్రమల కార్యకలాపాలు విస్తృతమయ్యే విధంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం. ఈ కార్యక్రమం కేవలం వ్యాపారాలను సృష్టించడమే కాక, సామాజిక పరివర్తనను కూడా ప్రేరేపిస్తోంది..” అని నీతి ఆయోగ్ ప్రధాన ఆర్థిక సలహాదారు, డబ్ల్యూఈపీ మిషన్ డైరెక్టర్, శ్రీమతి అన్నా రాయ్ అన్నారు.
"మహిళా పారిశ్రామికవేత్తల సమగ్ర అభివృద్ధి దిశగా ‘ఫరల్ సఖి' పథకం ఒక ముఖ్యమైన అడుగు. డబ్ల్యూఈపీతో భాగస్వామ్యం ద్వారా పరిశ్రమలకు నాయకత్వం వహించేందుకు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాతలుగా నిలిచేందుకు మీరా భాయిందర్ లోని మహిళలను సిద్ధం చేస్తున్నాం” అని మీరా భాయిందర్ నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ సంజయ్ కట్కర్ అన్నారు.
***
(Release ID: 2090060)
Visitor Counter : 37