రైల్వే మంత్రిత్వ శాఖ
సుదూర రైలు ప్రయాణికులకు ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించబోతున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు
హైస్పీడు విప్లవానికి నూతన సంవత్సరం నాంది పలికింది:
కోటా డివిజన్లో గంటకు 180 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకున్న వందే భారత్ (స్లీపర్) రైళ్లు
Posted On:
03 JAN 2025 2:28PM by PIB Hyderabad
భారత్‌లోని ప్రయాణీకులకు వేగవంతమైన, సురక్షితమైన రైలు ప్రయాణాన్ని అందించేందుకు కొత్త సంవత్సరం సిద్ధమైంది. చెయిర్ కార్ రైళ్లలో స్వల్ప, మధ్యస్థ దూరాలకు వేగవంతమైన, సురక్షితమైన, ప్రపంచస్థాయి ప్రయాణ అనుభవాన్ని విజయవంతంగా అందించిన తర్వాత భారతీయ రైల్వేలు సుదీర్ఘ దూరాలకు సైతం ఈ తరహా రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతోంది.
గంటకు 180 కి.మీ. వేగంతో సౌకర్యవంతమైన ప్రయాణం
గత మూడు రోజుల్లో పలుమార్లు చేసిన పరీక్షల్లో వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకొంది. ఈ నెల చివరి వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న రైలు ప్రయాణికులకు సుదీర్ఘ దూరాలకు అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
కోటా డివిజన్లో విజయవంతంగా పూర్తి చేసిన ప్రయోగాల వీడియోను ఎక్స్‌లో పంచుకున్న కేంద్ర రైల్వే మంతి అశ్వనీ వైష్ణవ్ రైలు వేగాన్ని తెలియజేశారు.
ఈ వీడియోలో వందేభారత్ స్లీపర్ రైలులో మొబైల్, దాని పక్కనే అంచుల వరకు నీటిని నింపిన గ్లాసు కనిపిస్తాయి. రైలు గంటకు 180 కి.మీ. వేగానికి చేరుకొంటున్నప్పుడు సైతం నీరు స్థిరంగా ఉండటం గమనించవచ్చు. ఇది సౌకర్యవంతమైన హైస్పీడు రైలు ప్రయాణాన్ని సూచిస్తుంది. జనవరి 2 వరకు మూడు రోజుల పాటు సాగిన ప్రయోగాలు విజయవంతమైన తర్వాత ఈ పోస్టు చేశారు. లోడ్ చేసిన స్థితిలో వందే భారత్ స్లీపర్ రైలు గరిష్ట వేగాన్ని చేరుకుంది.
గురువారం, రాజస్థాన్లోని బుండి జిల్లాలో ఉన్న కోట, లబన్ మధ్య 30 కి.మీ. లాంగ్ రన్ సమయంలో రైలు గంటకు 180 కి.మీ గరిష్ఠ వేగం అందుకొంది. ఒక రోజు ముందు అంటే 2025 ఏడాదిలో మొదటి రోజు రోహల్ ఖుర్డ్ నుంచి కోట వరకు 40 కి.మీ. దూరం ట్రయల్ రన్ చేసినప్పుడు వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 180 కి.మీ గరిష్ట వేగాన్ని చేరుకుంది. అదే రోజు కోటా-నగ్డా, రోహల్ ఖుర్డ్ - చౌ మహ్ల సెక్షన్ల మధ్య గంటకు 170 కి.మీ, 160 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకొంది. లక్నో ఆర్డీఎస్‌వో పర్యవేక్షణలో జనవరి చివరి వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
ఈ పరీక్షలు పూర్తయిన అనంతరం, రైల్వే సేఫ్టీ కమిషనర్ రైలు గరిష్ట వేగం వద్ద అంచనాలు వేస్తారు. తుది దశను కూడా దాటిన తర్వాత మాత్రమే వందే భారత్ రైళ్ళను అధికారికంగా ధ్రువీకరించి సాధారణ సేవల నిమిత్తం భారతీయ రైల్వేలకు అప్పగిస్తారు.
వందేభారత్: సుదీర్ఘ రైలు ప్రయాణాలను వేగంగా, సౌకర్యంవంతంగా మారుస్తుంది
ఆటోమేటిక్ డోర్లు, సౌకర్యవంతమైన బెర్తులు, ఆన్ బోర్డు వైఫై, ఎయిర్ క్రాఫ్ట్ తరహా నమూనా తదితర ఫీచర్లతో వందేభారత్ స్లీపర్ రైళ్లను రూపొందించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న 136 వందే భారత్ రైళ్లలో రిక్లైనింగ్ సీట్లు, అంతర్జాతీయ స్థాయి ప్రయాణ అనుభవాన్ని ఆస్వాదిస్తూ స్వల్ప, మధ్యస్థ దూరాలకు ప్రయాణిస్తున్నారు.
బెర్తులను అమర్చి, పూర్తిస్థాయి ప్రయాణికులు, లగేజీ లోడు పరిస్థితులను జోడించి గంటకు 180 కి.మీ. గరిష్ట వేగం అందుకొనేలా, వందే భారత్ స్లీపర్ కోచులుగా రైళ్లను మార్చడం రైల్వేలకు నిజమైన సవాలు. విజయవంతమైన ఈ పరీక్షలతో, కాశ్మీరు నుంచి కన్యాకుమారి, ఢిల్లీ నుంచి ముంబయి, హౌరా నుంచి చెన్నై, తదితర సుదీర్ఘ మార్గాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రయాణ అనుభవాన్ని రైలు ప్రయాణికులు ఆశించవచ్చు. ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో వారికి లాభం చేకూరుతుంది. ముంబయి నుంచి ఢిల్లీ వరకు నడుపుతున్న తేజస్ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు సగటు వేగం ప్రస్తుతం గంటకు 90 కి.మీగా ఉంది. ఈ రైలుకు గంటకు 140 కి.మీల వేగంతో నడిపేందుకు అనుమతి ఉంది. ప్రస్తుతం నడుస్తున్న రాజధాని సర్వీసుల్లో ఈ రైలే అత్యంత వేగవంతమైనది.
వివిధ శతాబ్ధి రైళ్ల రూట్లలో వందే భారత్ రైళ్లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణించగల సామర్థ్యం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఉంది. ప్రస్తుతానికి ఢిల్లీ - వారణాసి తరహాలో స్వల్ప, మధ్యస్థ దూరాల్లో ఉన్న ప్రధాన నగరాలను కలుపుతూ సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. వేగం, సౌకర్యాల సమ్మేళనాన్ని వందే భారత్ రైళ్లు అందిస్తాయి. ఇది కేవలం రవాణా సాధనం మాత్రమే కాదు ఆధునిక భారత ఇంజనీరింగ్ అనుభవం.
***
(Release ID: 2089908)
Visitor Counter : 35