రక్షణ మంత్రిత్వ శాఖ
2025 గణతంత్ర దినోత్సవ క్యాంపులో పాల్గొననున్న 2,361 క్యాడెట్లు.. వారిలో 917 మంది బాలికలు
Posted On:
30 DEC 2024 1:22PM by PIB Hyderabad
ఎన్సీసీ 2025 గణతంత్ర దినోత్సవ క్యాంపు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్ లో సోమవారం సర్వ ధర్మ పూజతో ప్రారంభమైంది. 917 మంది బాలికా క్యాడెట్లు ఈ క్యాంపులో పాల్గొంటున్నారు. అతిపెద్ద సంఖ్యలో బాలికా క్యాడెట్లు పాల్గొంటున్న క్యాంపుగా ఇది నిలవనుంది. నెల రోజుల పాటు జరిగే ఈ క్యాంపులో దేశంలోని మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 2,361 మంది క్యాడెట్లు పాల్గొంటున్నారు.
జమ్మూ-కాశ్మీర్, లద్దాఖ్ నుంచి 114 మంది క్యాడెట్లు... ఈశాన్య ప్రాంతం నుంచి 178 మంది క్యాడెట్లు పాల్గొంటున్న ఈ కార్యక్రమం చిన్నపాటి మినీ ఇండియాను తలపిస్తోంది. అంతేకాకుండా.. యువ వినిమయ కార్యక్రమం (యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్)లో భాగంగా 14 మిత్ర దేశాల నుంచి కూడా క్యాడెట్లు, అధికారులు పాల్గొంటారు.
ఈ సందర్భంగా డీజీఎన్సీసీ లెఫ్టినెంట్ జనరల్ గుర్ బీర్పాల్ సింగ్ మాట్లాడుతూ, అత్యంత ప్రతిష్ఠాత్మక ఈ ఎన్సీసీ శిబిరానికి ఎంపికైన క్యాడెట్లను అభినందించారు. మతం, భాష, కులం వంటి అవరోధాలను అధిగమిస్తూ.. దేశమే ప్రథమమన్న స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ఉత్తమమైన వ్యక్తిత్వం, సమగ్రత, నిస్వార్థ సేవ, సహజీవనం, సంఘటిత కృషి వంటి అత్యున్నత లక్షణాలను ప్రదర్శించాలని క్యాడెట్లకు ఆయన సూచించారు.
క్యాడెట్లలో దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను బలంగా పెంపొందించడం ఈ గణతంత్ర దినోత్సవ శిబిరం ప్రధాన లక్ష్యం. శిక్షణ, సాంస్కృతిక కార్యకలాపాలలో భాగస్వామ్యం, సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం కోసం క్యాడెట్లకు ఈ వార్షిక కార్యక్రమం విలువైన అవకాశాలను అందించే వేదికగా నిలుస్తుంది. తద్వారా ఐక్యతనూ, స్ఫూర్తినీ పెంపొందిస్తుంది.
***
(Release ID: 2088936)
Visitor Counter : 37