ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజస్థాన్‌లోని జైపూర్‌లో రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ 2024 ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

Posted On: 09 DEC 2024 2:06PM by PIB Hyderabad

రాజస్థాన్ గవర్నరు శ్రీ హరిభావు బగాడే గారు, రాష్ట్ర జనప్రియ ముఖ్యమంత్రి శ్రీ భజన్‌లాల్ జీ శర్మ, రాజస్థాన్ ప్రభుత్వ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, విధాన సభ సభ్యులు, పరిశ్రమ రంగానికి చెందిన సహచరులు, వివిధ రాయబారులు, దౌత్యకార్యాలయ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు, మహిళలు, ప్రముఖులారా.

 

ఈ రోజు రాజస్థాన్ అభివృద్ధి ప్రయాణంలో చెప్పుకోదగ్గ మరో రోజును సూచిస్తోంది.  దేశం నలుమూలల నుంచీ, ప్రపంచంలో వివిధ దేశాలనుంచీ పెద్ద సంఖ్యలో ప్రతినిధులు, పెట్టుబడిదారులు పింక్ సిటీలో ఈ చోటులో సమావేశమయ్యారు.  పారిశ్రామిక రంగం నుంచి కూడా చాలా మంది సహచరులు ఇక్కడికి వచ్చారు.  మీ అందరికీ ‘రైజింగ్ రాజస్థాన్ సమ్మిట్‌’కు నేను స్వాగతం పలుకుతున్నాను.  ఇంతటి బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు రాజస్థాన్‌లో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి నేను అభినందనలు తెలియజేయదలచుకొన్నాను.

 

మిత్రులారా,

ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క నిపుణుడు, ప్రతి ఒక్క నిపుణురాలు, ప్రతి ఒక్క పెట్టుబడిదారు భారత్ అంటే ఎంతో ఆశాభావంతో ఉన్నారు. ‘రిఫార్మ్-పర్‌ఫార్మ్-ట్రాన్స్‌ఫార్మ్’ (సంస్కరణలను ప్రవేశపెట్టడం, అమలుచేయడం, మార్పును తీసుకురావడం) అనే మంత్రాన్ని అనుసరిస్తూ భారత్ సాధించిన అసాధారణ ప్రగతి అన్ని రంగాల్లోనూ కనిపిస్తోంది.  స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏడు దశాబ్దాల్లో భారత్ ప్రపంచంలో పదకొండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదడానికి అవకాశం ఉంది.  దీనికి భిన్నంగా, గత పది సంవత్సరాల్లో భారత్ పదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్నది కాస్తా అయిదో అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా మారింది.  ఈ పదేళ్ళ కాలంలోనే భారత్ తన ఆర్థికవ్యవస్థను దాదాపు రెట్టింపు స్థాయికి పెంచుకొంది.  ఎగుమతులు గత దశాబ్దంలో సుమారు రెండింతలయ్యాయి.  2014 కన్నా వెనుకటి పది సంవత్సరాల కాలంతో పోల్చి చూసినప్పుడు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) గడిచిన పదేళ్లలో రెండింతలకు పైబడింది.  దీనికి అదనంగా, భారత్ ఇదే కాలంలో తన మౌలిక సదుపాయాల కల్పనరంగంలో వ్యయాన్ని దాదాపుగా రూ.2 ట్రిలియన్ల స్థాయి నుంచి దాదాపుగా రూ.11 ట్రిలియన్ల  స్థాయికి పెంచుకొంది.

 

మిత్రులారా,  

ప్రజాస్వామ్యానికి, జనాభాలో కష్టపడి పనిచేసే వర్గానికి, డిజిటల్ సమాచారానికి, డెలివరీకి ఎంత శక్తి ఉందో భారత్ సాధించిన విజయాన్ని బట్టి చూస్తే స్పష్టంగా తెలుస్తున్నది.  భారత్ వంటి వైవిధ్యభరిత దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లడం ఒక్కటే కాకుండా అంతకంతకూ బలాన్ని కూడా పుంజుకొంటోంది .  ఇదీ ఒక గొప్ప విజయమే సుమా.  ఒక ప్రజాస్వామ్య దేశంగా  ఉంటూనే మానవజాతి సంక్షేమానికి ప్రాధాన్యాన్నిస్తూ రావడం భారత్ తత్వం. ఇది భారత్ స్వభావంలో స్వతహాగా ఇమిడిపోయి ఉంది.  ప్రస్తుతం, భారత్ ప్రజలు, వారి ప్రజాస్వామిక హక్కులను వినియోగించుకొంటూ, ఒక స్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకొంటున్నారు.

 

మిత్రులారా,  

భారత్‌కున్న ఈ ప్రాచీన విలువలను ఆ దేశానికున్న జనశక్తి- ముఖ్యంగా ‘యువ శక్తి’- ముందుకు తీసుకుపోతోంది.  రాబోయే చాలా సంవత్సరాలపాటు భారత్ ప్రపంచంలో అత్యంత యవ్వనభరిత దేశాల్లో ఒక దేశంగా ఉండబోతోంది.  యువజనులు అతిపెద్ద సంఖ్యలో ఉండడతోపాటు అత్యంత నైపుణ్యం కలిగిన యువత కూడా భారత్‌కు అండగా నిలవనున్నారు.  ఈ శక్తియుక్తులను వినియోగించుకోవడానికి, ప్రభుత్వం అనేక వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకొంటోంది.

 

మిత్రులారా,  

గత పదేళ్ళలో, భారత్‌లో యువతీయువకులు వారి సామర్థ్యానికో కొత్త కోణాన్ని జోడించుకొన్నారు.  ఈ కొత్త కోణం ఏమిటంటే అది భారత్‌కున్న సాంకేతిక శక్తి, డేటా శక్తి.  ప్రస్తుతం ప్రతి రంగంలో టెక్నాలజీ, డేటా ఎంత కీలకంగా ఉన్నాయో  మీకందరికీ తెలుసు.  ఈ శతాబ్దం టెక్నాలజీపైన, డేటాపైన ఆధారపడి పరుగులు పెడుతున్న శతాబ్దం.  గత పది సంవత్సరాల్లో భారత్‌లో ఇంటర్‌నెట్‌ను ఉపయోగిస్తున్నవారి సంఖ్య దాదాపుగా నాలుగింతలైంది.  డిజిటల్ లావాదేవీలు కొత్త కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి.  ఇది ఆరంభం మాత్రమే.  ప్రజాస్వామ్యానికి, జనాభాలో యువ వర్గానికి, డేటాకు ఉన్న నిజమైన శక్తిని ప్రపంచానికి భారత్ చాటిచెబుతున్నది.  డిజిటల్ టెక్నాలజీని అందరి అందుబాటులోకి తీసుకువస్తే, దాని ప్రయోజనాలు ప్రతి రంగానికీ, ప్రతి సముదాయానికీ ఎంత మేలు చేస్తాయో భారత్ నిరూపించింది.  యూపీఐ, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) పథకాలు, జిఇఎమ్ (గవర్నమెంట్ ఇ- మార్కెట్ ప్లేస్), ఇంకా ఓఎన్‌డీస్ (ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్) వంటి వేదికలు భారత్‌లో డిజిటల్ అనుకూల వాతావరణానికున్న బలాన్ని కళ్ళకు కడుతున్నాయి.  ఈ డిజిటల్ మాధ్యమ అభివృద్ధి రాజస్థాన్‌లో కూడా చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపనుంది.  రాష్ట్రాలు అభివృద్ధి చెందితే, అది దేశాభివృద్ధికి బాట పరుస్తుందని నేను గట్టిగా నమ్ముతాను.  రాజస్థాన్ వృద్ధిలో నూతన శిఖరాలను చేరుకొనే కొద్దీ, పూర్తి దేశాన్ని సైతం ఉన్నతస్థాయికి తీసుకుపోవడంలో తన వంతు తోడ్పాటును అందించనుంది.

 

మిత్రులారా,  

విస్తీర్ణం పరంగా రాజస్థాన్ భారత్‌లో అతిపెద్ద రాష్ట్రం.  ఇక్కడి ప్రజల హృదయాలు కూడా అంత విశాలమైనవే.  కష్టపడి పనిచేయడం, నిజాయతీగా నడచుకోవడం, అత్యంత కఠిన లక్ష్యాలనైనా సాధించాలన్న దృఢ నిశ్చయం, అన్నింటికన్నా మిన్నగా దేశాన్ని ఎంచాలన్న భావన, దేశం కోసం ఏమైనా చేయాలనే ప్రేరణ.. ఈ గుణాలు రాజస్థాన్ మట్టిలో ప్రతి రేణువులో నిండి ఉన్నాయి.  ఏమైనప్పటికీ, స్వాతంత్య్రం వచ్చాక ఏర్పాటైన ప్రభుత్వాల ప్రాధాన్యాల్ని గమనిస్తే అవి దేశాభివృద్ధిని గురించి గానీ లేదా దేశ వారసత్వాన్ని పరిరక్షించాలనిగానీ అనుకున్నట్టు తోచవు.  ఈ నిర్లక్ష్యానికి రాజస్థాన్ పెద్ద మూల్యాన్నే చెల్లించింది.  అయితే, ఈ రోజు మా ప్రభుత్వం ఇటు ‘వికాస్’ (అభివృద్ధి), అటు ‘విరాస్’ (వారసత్వం).. ఈ రెండు మంత్రాలతో పనిచేస్తోంది. ఈ వైఖరి నుంచి ఎన్నో ప్రయోజనాలను రాజస్థాన్ అందుకొంటోంది.

 

మిత్రులారా,  

రాజస్థాన్ ఎదుగుతూ ఉండడమే కాక నమ్మదగ్గదిగా కూడా ఉంది.  ఈ రాష్ట్రానికి కొత్త ఆలోచనల్ని స్వీకరించే గుణముంది.  కాలంతోపాటు తాను ఏ విధంగా మెరుగులు దిద్దుకోవాలో ఈ రాష్ట్రానికి తెలుసు.  సవాళ్ళకు ఎదురొడ్డి నిలిచి కొత్త కొత్త అవకాశాలను సృష్టించుకొనే తత్వానికి రాజస్థాన్ ప్రతీక.  రాజస్థాన్‌కు ఉన్న ఈ ఆర్-కారణాంకం (R-Factor)లో ఒక కొత్త పార్శ్వాన్ని జతపరిచారు.  రాజస్థాన్ ప్రజలు ఇక్కడి ప్రతిస్పందనపూర్వక, సంస్కరణ ప్రధాన బీజేపీ ప్రభుత్వానికి తిరుగులేని ప్రజాతీర్పునిచ్చారు.  అతి తక్కువ కాలంలో భజన్‌లాల్ గారు, ఆయన జట్టు సభ్యులందరూ ప్రశంసనీయ ఫలితాల్ని అందించారు.  రాష్ట్ర ప్రభుత్వం కూడా తన మొదటి సంవత్సరాన్ని త్వరలో పూర్తి చేసుకోనుంది.  రాజస్థాన్‌ను శరవేగంగా అభివృద్ధి చేసేందుకు భజన్‌లాల్ గారు దక్షతతో, నిబద్ధతతో పనిచేస్తున్న విధానం నిజంగా ప్రశంసనీయం.  అది పేదల సంక్షేమం కావచ్చు, రైతుల శ్రేయం కావచ్చు, యువతకు కొత్త అవకాశాలు అందించడం కావచ్చు లేదా రహదారులు, విద్యుత్తు, నీరు.. ఈ సౌకర్యాల పట్ల జాగ్రత్త తీసుకోవడం కావచ్చు అభివృద్ధి సూచికలన్నీ రాజస్థాన్‌లో పైకే పాకుతూ ఉన్నాయి.  నేరాలను, అవినీతిని ప్రభుత్వం శీఘ్రంగా అదుపు చేస్తున్న వైఖరి పౌరుల్లో, పెట్టుబడిదారుల్లో ఓ కొత్త ఉత్సాహాన్ని నింపింది.

 

మిత్రులారా,  

రాజస్థాన్ ఎదుగుదలను నిజంగా గుర్తెరగాలంటే, ఈ రాష్ట్రానికున్న వాస్తవిక శక్తియుక్తులను వినియోగించుకోవడం ఎంతైనా అవసరం. రాజస్థాన్‌లో సహజ వనరులు సమృద్ధంగా ఉన్నాయి. ఆధునిక సంధాన (కనెక్టివిటీ) నెట్‌వర్క్ ఉంది, సంపన్న వారసత్వం కూడా ఉంది, ఇక్కడి భూభాగం విశాల భూభాగం, యువశక్తి.. చాలా చురుకైంది.  రహదారులు, మొదలు రైలు మార్గాల వరకు, ఆతిథ్యం నుంచి హస్తకళల వరకు, పొలాల నుంచి కోటల వరకు చూస్తే రాజస్థాన్‌లో అవకాశాల ఖజానాయే అని చెప్పాలి.  ఈ సంపదంతా రాజస్థాన్‌ను పెట్టుబడికి ఒక అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా చేసేస్తోంది.  రాజస్థాన్‌కు ఒక అద్వితీయ గుణముంది. అదే.. నేర్చుకొంటూ, బలాలను పెంచుకొనే తత్వం. ఈ కారణంగా ఇక్కడ ఉన్న ఇసుక దిబ్బలు కూడా ఇప్పుడు ఫలాలను ఇస్తున్నాయి.  ఆలివ్‌లు, జత్రోఫా వంటి పంటల సాగు ఇక్కడ విస్తరిస్తోంది.  జైపూర్‌లో బ్లూ పాటరీ, ప్రతాప్‌గఢ్‌లో థేవా ఆభరణాలు, భీల్‌వాడాలో వస్త్రరంగంలో నవకల్పన.. వీటికి పెద్ద పేరుంది.  మక్రానా చలవరాయి, కోటా డోరియాలు ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందాయి.  నాగౌర్‌లో మెంతులకు ఉన్న సుగంధం మరెక్కడా కానరాదు.  ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రతి జిల్లాలో అద్వితీయ బలాలు ఏమేమిటో చురుకుగా గుర్తించి, వాటిని సద్వినియోగపరుస్తోంది.

మిత్రులారా,  

భారత్‌లో ఖనిజ సంపదలో ఎక్కువ భాగం రాజస్థానే అందిస్తోంది. ఈ సంగతి మీకూ తెలుసు.  ఈ రాష్ట్రంలో జింకు, సీసం, రాగి, చలవరాయి, సున్నపురాయి, గ్రానైట్, పొటాష్‌ల నిక్షేపాలు అనేకం ఉన్నాయి.  అంటే ఇవన్నీ ‘ఆత్మనిర్భర్ భారత్‌’‌కు(స్వయం సమృద్ధ భారతదేశం) ఒక దృఢమైన పునాది అన్నమాట.  భారత్ ఇంధన భద్రతలో ప్రధాన పాత్రధారి కూడా రాజస్థానే.  భారత్ ఈ దశాబ్దం చివరికల్లా 500 గిగావాట్ (జీడబ్ల్యూ) పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకొంది.  ఈ ఆశయ సాధనలో రాజస్థాన్ ముఖ్య పాత్రను పోషిస్తోంది.  దేశంలో అతిపెద్దవైన సోలార్ పార్కుల్లో కొన్నింటిని ఇక్కడే ఏర్పాటుచేస్తున్నారు.

మిత్రులారా,  

ఢిల్లీ, ముంబయి.. ఈ రెండు ప్రధాన ఆర్థిక కూడళ్ళ (ఎకనామిక్ హబ్స్) మధ్య ఒక కీలక లంకెగా రాజస్థాన్ ఉంది.  ఇది మహారాష్ట్ర, గుజరాత్‌ల ఓడరేవులను ఉత్తర భారతదేశంతో కలుపుతోంది.  ఈ మాటలను శ్రద్ధగా వినండి..  ఢిల్లీ, ముంబయి పారిశ్రామిక కారిడార్‌లో 250 కిలో మీటర్ల భాగం రాజస్థాన్ మీదుగా సాగుతోంది.  దీనితో అల్వర్, భరత్‌పూర్, దౌసా, సవాయీ మాధోపూర్, టోంక్, బూందీ, ఇంకా కోటా వంటి జిల్లాలకు ప్రయోజనం కలుగుతున్నది. ఇదే విధంగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లో 300 కి.మీ. మేర రాజస్థాన్‌లోని జైపూర్, అజ్మీర్, సీకర్, నాగౌర్, ఇంకా అల్వర్ జిల్లాల మీదుగా వెళ్తుంది.  ఈ విస్తృతమైన సంధాన ప్రాజెక్టులు రాజస్థాన్‌ను పెట్టుబడికి ముఖ్యమైన గమ్యస్థానంగా, అది కూడా డ్రై పోర్టును, లాజిస్టిక్స్ రంగాలలో.. మార్చివేస్తున్నది.  మేం ఇక్కడ సుమారు రెండు డజన్ల రంగాలవారీ పారిశ్రామిక పార్కులకు తోడు మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధిపరుస్తున్నాం.  అంతేకాకుండా రెండు ఎయిర్ కార్గో  భవన సముదాయాలను కూడా నెలకొల్పారు.  దీనితో రాజస్థాన్‌లో పరిశ్రమలను ఏర్పాటుచేయడం సులభంగా మారింది.  పరిశ్రమలకు సంధాన సదుపాయమూ పెరిగింది.

 

మిత్రులారా,  

భారత్ సమృద్ధ భవితవ్యానికి ఎంతగానో తోడ్పడే శక్తి పర్యాటక రంగానికుంది.  ప్రకృతి, సంస్కృతి, సాహసాలు, సమావేశాలు, ఏరికోరి మరీ ఎంపిక చేసుకొనే గొప్ప పరిణయోత్సవ స్థల రాజాలు (డెస్టినేషన్ వెడింగ్స్), వారసత్వ పర్యాటకం.. ఈ అంశాల్లో భారత్ కల్పిస్తున్న అవకాశాలకు అంతు లేదు.  భారత పర్యాటక చిత్రపటంలో రాజస్థాన్ ఓ కీలక బిందువు.  ఇక్కడ సంపన్న చరిత్ర, గొప్ప వారసత్వం, విశాలమైన ఎడారులు, సుందరమైన సరస్సులు ఉన్నాయి.  ఇక్కడి సంగీతానికి, వంటకాలకు, సంప్రదాయాలకు తులతూగే పోలికల్ని చెప్పనేలేం.  పర్యాటకం, ప్రయాణం, ఆతిథ్యం.. ఈ రంగాలకు అవసరమైన సంబారాలన్నీ రాజస్థాన్‌లో కొలువుదీరి ఉన్నాయి.  వివాహ మహోత్సవాల వంటి జీవనంలో అతిముఖ్యమైన ఘడియల్ని నిజంగానే మరపురాని మధుర స్మృతులుగా తీర్చిదిద్దగల, ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయ స్థలాల నిలయంగా రాజస్థాన్ ఉంది.  వన్యప్రాణి ప్రధాన పర్యాటకం పరంగానూ ఈ రాష్ట్రంలో ఎన్నో విశేషాలు అమరి ఉన్నాయి.  రణథంబోర్, సరిస్కా, ముకుంద్రా హిల్స్, కియోలాదేవ్ నేషనల్ పార్క్ వంటి ప్రదేశాలు వన్యప్రాణుల సంచారాన్ని చూసి తన్మయులయ్యేవారికి కనువిందు చేస్తున్నాయి.  పర్యాటక ప్రధాన స్థానాలకు, వారసత్వ పరిరక్షణ కేంద్రాలకు సంధానాన్ని పెంచుతున్న రాజస్థాన్ ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే నాకు సంతోషం కలుగుతోంది.  వివిధ ఇతివృత్త ప్రధాన ప్రదేశాలకు (థీమ్డ్ సర్క్యూట్స్) వెళ్ళడానికి భారత ప్రభుత్వం కూడా అనేక పథకాలను తీసుకువచ్చింది.  2004 మొదలు 2014 మధ్య కాలంలో, దాదాపుగా అయిదు కోట్ల మంది విదేశీ పర్యాటకులు భారత్‌ను సందర్శించారు.  2014 నుంచి 2024 మధ్య కాలంలో సుమారు మూడు, నాలుగేళ్ళపాటు కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఏడు కోట్ల మంది విదేశీ పర్యాటకులు మన దేశాన్ని చూడవచ్చారు.  కరోనా మహమ్మారి కాలంలో పర్యాటకం నిలిచిపోయింది.  అయినా సరే, భారత్‌ను సందర్శించిన పర్యాటకుల సంఖ్యలో చెప్పుకోదగ్గ వృద్ధి ఉంది. అనేక దేశాల నుంచి వచ్చిన యాత్రికులకు ఈ-వీసాలను భారత్ అందిస్తూ ఉండడం వారికి మరింత సౌకర్యవంతమైన యాత్రానుభవాన్ని అందించి, వారికి ఎంతో మేలు చేసింది.  భారత్‌లో దేశవాళీ పర్యాటకం కూడా కొత్త శిఖరస్థాయిలను అందుకొంటోంది.  ‘ఉడాన్’ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్.. UDAAN), వందే భారత్ రైళ్ళు, ‘పీఆర్ఏఎస్ఏడీ’ (పిలిగ్రిమేజ్ రిజువెనేషన్ అండ్ స్పిరిచ్యువల్ ఆగ్‌మెంటేషన్ డ్రైవ్.. PRASAD) కార్యక్రమం వంటి పథకాలు రాజస్థాన్‌కు ఎంతో ప్రయోజనకరంగా ఉంటున్నాయి.  వైబ్రంట్ విలేజస్ వంటి కార్యక్రమాలు రాష్ట్రాభివృద్ధికి మరింతగా తోడ్పడుతున్నాయి.  ‘‘వెడ్ ఇన్ ఇండియా’’ (భారత్‌లో వివాహం చేసుకోండి) కార్యక్రమంవైపు మగ్గు చూపాల్సిందిగా పౌరులకు నేను పిలుపునిచ్చాను.  ఈ కార్యక్రమం రాజస్థాన్‌కు చెప్పుకోదగిన స్థాయిలో లాభాన్నివ్వనుంది.  వారసత్వ పర్యాటకం, చలనచిత్ర పర్యాటకం, పర్యావరణ ప్రధాన పర్యాటకం, గ్రామీణ పర్యాటకం, సరిహద్దు ప్రాంత ప్రధాన పర్యాటకం.. వీటిని రాజస్థాన్‌లో ఇప్పటికన్నా ఎక్కువగా విస్తరించడానికి ఎన్నో అవకాశాలున్నాయి.  ఈ రంగాల్లో మీరు పెట్టే పెట్టుబడి రాజస్థాన్ పర్యాటక పరిశ్రమను బలపరచడం ఒక్కటే కాకుండా, మీ వ్యాపారం చకచకా పెరగడానికి కూడా వీలు కల్పిస్తుంది.

 

మిత్రులారా,  

ప్రపంచంలో వస్తు సరఫరా వ్యవస్థకు ఎదురైన సవాళ్ళు ఎలాంటివన్నది మీకందరికీ తెలుసు.  ప్రధాన సంకట స్థితులు ఎదురైనప్పటికీ, వాటికి తట్టుకొని నిలబడుతూ ఎలాంటి అంతరాయాలూ లేకుండా కార్యకలాపాలను కొనసాగించగలిగే ఆర్థికవ్యవస్థలు నేటి ప్రపంచానికి అవసరం.  ఇది జరగాలంటే, భారత్‌లో ఒక విస్తృత తయారీ వ్యవస్థను ఏర్పాటుచేయడం అత్యవసరం.  ఇది ఒక్క భారత్‌కే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ముఖ్యమైందే.  ఈ బాధ్యతను గుర్తించిన భారత్ తయారీలో పెద్దఎత్తున స్వయంసమృద్ధిని సాధించాలని కంకణం కట్టుకొంది.  ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా తక్కువ ఖర్చులో తయారీ ప్రక్రియకు భారత్ ప్రాధాన్యాన్నిస్తోంది.  ఈ క్రమంలో భారత్‌లో పెద్దస్థాయిలో తయారవుతున్న పెట్రోలియం ఉత్పత్తులు, ఔషధాలు, టీకా మందులు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తూ, ప్రపంచానికి మేలు చేస్తున్నాయి.  ఈ ప్రయత్నంలో రాజస్థాన్ చెప్పుకోదగ్గ స్థాయిలో తోడ్పాటును అందిస్తూ, కిందటి సంవత్సరంలో దాదాపుగా రూ. 84,000 కోట్ల విలువైన ఎగుమతులను సాధించింది.  ఏకంగా 84,000 కోట్లు!  దీనిలో ఇంజినీరింగ్ వస్తువులు, రత్నాభరణాలు, వస్త్రాలు, హస్తకళలు, వ్యవసాయ ఆహారోత్పత్తులు కలిసి ఉన్నాయి.

 

మిత్రులారా,  

భారత్‌లో తయారీని ప్రోత్సహించడంలో ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకం (ప్రొడక్టివిటీ లింక్‌డ్ ఇన్‌సెంటివ్.. పీఎల్ఐ) పథకం రానురానూ ముఖ్య పాత్రను పోషిస్తోంది.  ఎలక్ట్రానిక్స్, స్పెషాలిటీ స్టీల్, ఆటోమొబైల్స్, వాహన విడిభాగాలు, సోలార్ ఫోటోవోల్టాయిక్స్, ఔషధాలు వంటి రంగాలంటే చాలా సంస్థలు ఆసక్తిని కనబరచాయి.  పీఎల్ఐ పథకాన్ని ప్రవేశపెట్టడంతో రూ.1.25 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. దాదాపుగా రూ.11 లక్షల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను తయారుచేశారు.  ఎగుమతులు రూ.4 లక్షల కోట్లకు పెరిగాయి.  పైపెచ్చు లక్షలాది యువతీయువకులు ఉద్యోగావకాశాలను దక్కించుకొన్నారు.  రాజస్థాన్‌లో ఇప్పటికే ఆటోమోటివ్, ఆటో-కాంపోనంట్ పరిశ్రమలతో కూడిన ఒక బలమైన పునాది ఏర్పడింది.  విద్యుత్తు వాహనాల తయారీకి ఈ రాష్ట్రంలో ఎన్నో అవకాశాలున్నాయి.  ఎలక్ట్రానిక్స్ తయారీకి కావలసిన మౌలిక సదుపాయాలు కూడా ఇక్కడ తక్షణం అందుబాటులో ఉన్నాయి.  రాజస్థాన్‌లో తయారీకి ఉన్న అవకాశాలను గుర్తించి, వాటిని సద్వినియోగ పరచుకోవాల్సిందిగా పెట్టుబడిదారు సంస్థలన్నింటినీ నేను కోరుతున్నాను.

 

మిత్రులారా,  

‘రైజింగ్ రాజస్థాన్‌’కు ఉన్న కీలక బలాల్లో స్థూల, సూక్ష్మ, మధ్యతరహా వాణిజ్య వ్యవస్థ (ఎమ్ఎస్ఎమ్ఈ) ఒకటి. ఎమ్ఎస్ఎమ్ఈ పరంగా చూసినప్పుడు, రాజస్థాన్ భారత్‌లో అగ్రగామి అయిదు రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ఎమ్ఎస్ఎమ్ఈలకంటూ ఒక ప్రత్యేక కాన్‌క్లేవ్‌ను కూడా నిర్వహించనున్నారు.    50 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న, 27 లక్షల కన్నా ఎక్కువ సంఖ్యలో పనిచేస్తున్న చిన్న, సూక్ష్మ వాణిజ్య వ్యవస్థతో రాజస్థాన్‌లో ఎమ్ఎస్ఎమ్ఈ రంగానికి ఈ రాష్ట్రం భవిష్యత్తు రూపురేఖలను మార్చివేసే శక్తి ఉంది.  రాజస్థాన్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సరికొత్త ఎమ్ఎస్ఎమ్ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిసి నాకు సంతోషం కలిగింది. భారత ప్రభుత్వం తన విధానాల ద్వారా, కార్యక్రమాల ద్వారా ఎమ్ఎస్ఎమ్ఈలకు నిరంతరంగా సాధికారితను కల్పిస్తున్నది.  భారత్‌లో ఎమ్ఎస్ఎమ్ఈలు స్వదేశీ ఆర్థిక వ్యవస్థను బలపరచడం ఒక్కటే కాకుండా ప్రపంచ సరఫరా వ్యవస్థలో ఒక కీలక పాత్రను కూడా పోషిస్తున్నాయి.  కరోనా మహమ్మారి కాలంలో ప్రపంచ ఔషధ సరఫరా వ్యవస్థకు ఇబ్బందులు ఎదురైనప్పుడు, భారత్‌లో  పటిష్టంగా ఉన్న ఔషధరంగం ప్రపంచానికి సాయపడడానికి ముందంజ వేయడాన్ని మనమంతా గమనించాం.  భారత్ ఔషధ నిర్మాణ రంగంలో ఒక బలమైన పునాదిని వేసిన కారణంగా ఇది సాధ్యపడింది.  అదే మాదిరిగా, వేరు వేరు ఇతర ఉత్పత్తుల తయారీకి కూడా ఒక బలమైన పునాది వేయాలని మేం లక్ష్యంగా పెట్టుకొన్నాం.  దీనిలో ఎమ్ఎస్ఎమ్ఈలు ఒక ప్రధాన పాత్రను పోషించనున్నాయి.

 

మిత్రులారా,  

ఎమ్ఎస్ఎమ్ఈలకు గొప్ప వృద్ధి అవకాశాలను కల్పించడానికి వాటి పరిధిని మా ప్రభుత్వం పునర్‌నిర్వచించింది.  రమారమి 5 కోట్ల ఎమ్ఎస్ఎమ్ఈలను సంఘటిత ఆర్థిక వ్యవస్థలో కలిపారు.  దీంతో వాటికి పరపతి లభ్యత సులభతరంగా మారింది.  మేం ఒక పరపతి హామీతో ముడిపెట్టిన పథకాన్ని కూడా ప్రారంభించాం.  ఇది చిన్న పరిశ్రమలకు దన్నుగా దాదాపు రూ.7 లక్షల కోట్లను సమకూర్చింది.  గత పదేళ్ళలో ఎమ్ఎస్ఎమ్ఈలకు పరపతి అందజేత రెట్టింపుకన్నా ఎక్కువగా ఉంది.  2014లో ఇది దాదాపు రూ.10 లక్షల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం రూ. 22 లక్షల కోట్లను మించింది.  ఈ వృద్ధివల్ల రాజస్థాన్ చాలావరకు లాభపడింది.  ఎమ్ఎస్ఎమ్ఈల సంఖ్య పెరుగుతూ ఉండడం రాజస్థాన్ అభివృద్ధిని నూతన శిఖరాలకు చేర్చనుంది.

 

మిత్రులారా,  

మేం ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వయం-సమృద్ధ భారతదేశం) వైపు సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాం.  ఈ ‘ఆత్మనిర్భర్ భారత్’ మిషన్‌కు ప్రపంచ స్థాయి ఆకాంక్షలు, ప్రపంచ స్థాయి ప్రభావమూ ఉన్నాయి.  ప్రభుత్వస్థాయిలో మేం పూర్తి ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తూ ముందుకు కదులుతూ ఉన్నాం.  పారిశ్రామిక వృద్ధిని దృష్టిలో పెట్టుకొని మేం ప్రతి రంగాన్ని, ప్రతి ఫేక్టర్‌ను ఏకకాలంలో ప్రోత్సహిస్తున్నాం.  ‘సబ్ కా ప్రయాస్’ (సమష్టి ప్రయత్నం) స్ఫూర్తి ‘వికసిత్ రాజస్థాన్’ (అభివృద్ధి చెందిన రాజస్థాన్)తోపాటు వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం) నిర్మాణానికి తోడ్పడుతుందని నేను దృఢంగా నమ్ముతున్నాను.

 

మిత్రులారా,  

ఈ శిఖరాగ్ర సమావేశం దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచమంతటి నుంచీ వచ్చిన ప్రతినిధులకు స్వాగతం పలికింది.  మీలో చాలా మందికి భారత్‌కు లేదా రాజస్థాన్‌కు రావడం ఇదే మొట్టమొదటిసారి కావచ్చు.  మీరు స్వదేశానికి తిరిగి వెళ్ళేలోపల రాజస్థాన్‌ను, భారత్‌ను చుట్టి రావాల్సిందిగా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.  ఈ అంగళ్ళ శోభను చూడండి, ఇక్కడి ప్రజలలో వ్యక్తమయ్యే హుషారైన ఉత్సాహాన్ని గమనించండి.  ఈ గడ్డకు ఉన్న సాటిలేని ఆకర్షణను ఆస్వాదించండి..  మీరు ఎప్పటికీ మదిలో అట్టిపెట్టుకొనే అనుభూతులను అందుకోండి.  పెట్టుబడిదారులు అందరికీ నేను మరోసారి నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.  అంతేకాకుండా, ‘రైజింగ్ రాజస్థాన్’ దార్శనికతను సాకారం చేయడానికి నిబద్ధతతో నడుచుకొంటున్న ప్రతి ఒక్కరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.

 

మీకందరికీ ధన్యవాదాలు.

 

***


(Release ID: 2086689) Visitor Counter : 8