శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటులో ప్రశ్న: భారత్ జెన్ ప్రారంభం

Posted On: 18 DEC 2024 1:20PM by PIB Hyderabad

భారత్ జెన్ అన్నది బృహత్తరమైన బహుభాషా విస్తృత నమూనా కార్యక్రమం. భారతదేశ భాషా, సాంస్కృతిక, సామాజిక-ఆర్థిక వైవిధ్యానికి తగినట్టుగా ఇది అధునాతన ఉత్పాదక కృత్రిమ మేధ నమూనాలను రూపొందిస్తుంది. ప్రధానంగా సమాచార సేకరణపై దృష్టిసారించి ‘భారత్ డేటా సాగర్’ అనే కార్యక్రమాన్ని భారత్ జెన్ ప్రారంభించింది. తద్వారా కృత్రిమ మేధ నమూనాలు భారత భాషా వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా చూస్తోంది. సమాచార నమూనాల్లో తక్కువ ప్రాతినిధ్యం ఉన్న భారతీయ భాషల్లో.. శిక్షణ కోసం అవసరమైన సమాచారాన్ని అందుబాటులోకి తేవడానికి ఈ సేకరణ ద్వారా కృషి చేస్తోంది.

భారత్ జెన్ దేశవ్యాప్తంగా పరిశోధన బృందాలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుని.. రూపొందుతున్న ఈ ఉత్పాదక కృత్రిమ మేధ నమూనాల పరిధిని వారి ద్వారా విస్తరింపజేసేలా చూస్తోంది. దానితోపాటు వాటిని మరింత అభివృద్ధి చేసి, వినియోగాన్ని పెంచడం కోసం పరిశోధక బృందాలతోపాటు విద్యేతర సమూహాలకు విస్తృతంగా అందుబాటులో ఉంచుతోంది.

సమర్థవంతమైన నిర్వహణ సన్నద్ధతతోపాటు దేశంలోని అట్టడుగు- అల్ప ప్రాతినిధ్య సమూహాలు సహా విస్తృత ప్రజానీకానికి వినియోగానికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం, పారిశ్రామిక సమూహాలు, అంకుర సంస్థలతో కూడా భారత్ జెన్ భాగస్వామ్యాలను ఏర్పరచుకుంటోంది.

సాంస్కృతిక గుర్తింపు, ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడం కోసం.. స్థానిక భాషలు, మాండలికాలలో నిరంతరాయంగా అనువదించడం ద్వారా ప్రాంతాలకు తగిన విషయాంశాల అభివృద్ధికి తోడ్పడే సాంకేతికతలు, సాధనాలను భారత్ జెన్ అందుబాటులోకి తెస్తోంది.

బాంబే ఐఐటీ, హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, మండి ఐఐటీ, కాన్పూర్ ఐఐటీ, హైదరాబాద్ ఐఐటీ, ఇండోర్ ఐఐఎం, మద్రాస్ ఐఐటీ సహా దేశంలోని ప్రధాన విద్యా సంస్థల్లోని అగ్రశ్రేణి కృత్రిమ మేధ పరిశోధకులతో కూడిన కన్సార్టియం భారత్ జెన్ లో ఉంటుంది. దేశంలోని భాషా, సాంస్కృతిక వైవిధ్యంతోపాటు పౌర సమ్మిళితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ పరిశోధక బృందాలు ప్రభుత్వం, పారిశ్రామిక సమూహాలు, అంకుర సంస్థల భాగస్వామ్యంతో వివిధ నమూనాలను అభివృద్ధి చేస్తున్నాయి. తద్వారా దేశంలోని వివిధ సామాజిక-ఆర్థిక సమూహాలకు సాంకేతికతను సమానంగా అందుబాటులోకి తెచ్చేలా చూస్తోంది.

కేంద్ర శాస్త్ర – సాంకేతికత సహాయ (స్వతంత్ర హోదా), భూ విజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ లోకసభలో ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.  

 

****


(Release ID: 2085700) Visitor Counter : 60


Read this release in: English , Urdu , Hindi , Tamil