బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశంలో భాషా వారసత్వాన్ని అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ నిబద్ధత: ఈ విషయంలో ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది: కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి


అయిదు భాషలకు శాస్త్రీయ భాషా హోదాను ఇవ్వడం

ఈ నిబద్ధతను చాటిచెబుతోంది: శ్రీ జి. కిషన్ రెడ్డి


‘భారతీయ భాషలను ప్రోత్సహించడంలో

ఎన్ఈపీ 2020 ఒక పరివర్తన పూర్వక చర్య’: కేంద్ర మంత్రి

Posted On: 18 DEC 2024 12:56PM by PIB Hyderabad

 కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో సుసంపన్న భాషా వారసత్వాన్ని పరిరక్షించాలన్న, ప్రోత్సహించాలన్న, అభివృద్ధి చేయాలన్న నిబద్ధత విషయంలో దృఢనిశ్చయంతో ఉందని కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఈరోజు పత్రికా విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, 2047 కల్లా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఆవిష్కరించాలన్నదే ప్రభుత్వ దృష్టికోణమని తెలిపారు. దేశ సాంస్కృతిక అభివృద్ధికి, జాతీయ ఏకత పరిరక్షణలో భాషల పాత్ర కీలకమని ఆయన అన్నారు. భాషల పరంగా చూసినప్పుడు ఎంతో వైవిధ్యంతో కూడిన ఒక విశిష్ట నమూనా మనదని, మన దేశంలో భాషలు ఒక్క సందేశ ప్రసార సాధనాలే కాకుండా, జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాల అమూల్య భాండాగారాలుగా కూడా ఉన్నాయని ఆయన అన్నారు.

చరిత్రను పరిశీలిస్తే రాజకీయ ప్రయోజనాలను సాధించడానికి భాషలకు కీలక స్థానాన్ని కట్టబెట్టారని, ప్రాంతీయ భాషలను అణగదొక్కేందుకు ప్రయత్నాలు చేసి, ప్రజల వాక్‌ స్వాతంత్ర్యానికి పరిమితులు విధించాలని చూశారని ఆయన అన్నారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే 1835లో మెకాలే విధానాలు భారత శాస్త్రీయ భాషలను పక్కదారి పట్టించి, విద్యా బోధన మాధ్యమంగా ఇంగ్లిషును ప్రోత్సహించడంతోపాటు ఐరోపాకు చెందిన జ్ఞాన వ్యవస్థలకు పెద్దపీట వేశాయన్నారు. చరిత్రలో ఎదురైన సవాళ్ళను ప్రభుత్వం గుర్తించి, ప్రాంతీయ భాషలను పరిరక్షించడానికి నిరంతరం కృషి చేస్తోందని, సాధికారత కల్పనకు, స్వీయ భావవ్యక్తీకరణకు ప్రాంతీయ భాషలను శక్తిమంతమైన సాధనాలుగా చూసిందని మంత్రి అన్నారు.  శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ చెప్పినట్లు, ‘‘భాష కేవలం భావవ్యక్తీకరణ కు ఒక సాధనం అనే కాక అది మన సంస్కృతికి ఆత్మ కూడా’’నని మంత్రి గుర్తు చేశారు.

రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూలులో భాషలను చేర్చడం ఈ దిశలో చేపట్టిన ఒక ముఖ్య చర్యని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు.  మొదట్లో ఎనిమిదో షెడ్యూలులో 14 భాషలను చేర్చగా, ప్రస్తుతం వాటిని 22 వరకు విస్తరించడం భారతదేశ వైవిధ్యానికి అద్దంపడుతోందన్నారు. 1967లో సింధీని ఎనిమిదో షెడ్యూలులో చేర్చారని, ఆ సందర్భంగా శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ, ‘నేను మాట్లాడే భాష హిందీ, అయితే సింధి నా ‘మౌసీ’ (అమ్మమ్మ)’ ’అని వ్యాఖ్యానించారని మంత్రి చెప్పారు. 1992లో కొంకణి, మణిపుర, నేపాలీ భాషలను రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూలులో చేర్చారని వివరించారు. ఆ తరువాత 2003 శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం భారతదేశంలో ప్రాంతీయ భాషల వికాసానికి తన దృఢతరమైన మద్దతును పునరుద్ఘాటించిందన్నారు. బోడో, డోగ్రీ, మైథిలీ, సంతాలీ భాషలను కూడా చేర్చుతూ అప్పటి ఉప ప్రధాని శ్రీ లాల్ కృష్ణ అద్వానీ ఒక సవరణను ప్రవేశపెట్టడం గమనిస్తే, గిరిజన సంస్కృతితోపాటు, గిరిజన విలువల పట్ల ప్రభుత్వానికి ఉన్న గౌరవం, నిబద్ధత దీని ద్వారా వ్యక్తమైందన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ భాషల అభివృద్ధి అంశానికి మరింత ప్రాధాన్యం లభించిందని మంత్రి చెప్పారు. రాజ్యాంగ 370వ అధికరణాన్ని రద్దు చేసిన తరువాత కాశ్మీరీ, డోగ్రీ, ఉర్దూ, హిందీ, ఇంగ్లిషులకు జమ్మూ- కాశ్మీర్‌లో అధికార భాషలుగా గుర్తింపును ఇవ్వడంతో భారీ మద్దతు లభించిందన్నారు. ఈ నిర్ణయం స్థానిక ప్రజలకు సాధికారితను కల్పించడంతోపాటు వారిని ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే ఒక ముఖ్య నిర్ణయంగా నిలిచిందని మంత్రి చెప్పారు.

భారతదేశ ప్రాచీన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ వస్తున్న శాస్త్రీయ భాషలపై కూడా తదేకంగా దృష్టి సారించారని మంత్రి ప్రధానంగా చెప్పారు. ప్రాచీన భాషలకు చారిత్రకంగా, సాంస్కృతికంగా ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తూ వాటికి ప్రాచీన భాష హోదాను ఇవ్వడానికి ప్రభుత్వం నిరంతర కృషి చేస్తూ వచ్చిందని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం 2024 అక్టోబరులో మరాఠీ, పాలీ, ప్రాకృత్, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన భాషల హోదాను ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదాన్ని తెలియజేయడంతో ప్రాచీన భాషలు మొత్తం 11కు పెరిగాయన్నారు. 11 ప్రాచీన భాషలున్న దేశం ప్రపంచంలో ఒక్క భారతదేశమేనని ఆయన తెలిపారు. ఈ భాషలను ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకొన్నారు. వాటిలో 2020లో సంస్కృతం కోసం మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడం, పరిశోధనలు, అనువాదాల కోసం సెంట్రల్ క్లాసికల్ తమిళ్ ఇనిస్టిట్యూట్‌ను స్థాపించడం, మైసూరులోని భారతీయ భాషల కేంద్రీయ సంస్థ ఆధ్వర్యంలో కన్నడ, తెలుగు, మలయాళం, ఒడియా భాషల ప్రాచుర్యం కోసం ప్రత్యేక అధ్యయన కేంద్రాలను ఏర్పాటుచేయడం వంటి అనేక కార్యక్రమాలను అమలుచేశారని మంత్రి చెప్పారు.  ఈ రంగంలో విజయాలను ప్రోత్సహించడానికి జాతీయస్థాయి, అంతర్జాతీయస్థాయి పురస్కారాలనూ, విశ్వవిద్యాలయ పీఠాలనూ, ప్రత్యేక కేంద్రాలనూ ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.

ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) భారతీయ భాషలను ప్రోత్సహించే దిశలో ఒక పెద్ద పరివర్తనాత్మక నిర్ణయంగా మారిందని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. ఈ విధానంలో భాగంగా అయిదో తరగతి వరకు మాతృభాషలో లేదా స్థానిక భాషలో పాఠాలను బోధించాలి.  అవసరమైనచోటల్లా ఎనిమిదో తరగతి వరకు ఇదే విధానాన్ని అవలంబించాలని స్పష్టంచేశారు. విద్యార్థినీ విద్యార్థుల్లో అవగాహనను పెంచడానికి, మేధోవికాసానికి, అధిక నాణ్యత కలిగిన పాఠ్య పుస్తకాలు, రెండు భాషలలో విద్యను నేర్పే పద్ధతులు అనుసరించాలని సిఫార్సు చేశారు.  ఎస్‌టీఈఎమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం) రంగాలకు సంబంధించిన విద్యా బోధనలో, కెరియర్ కౌన్సిలింగ్‌లో ప్రాంతీయ భాషలను ఉపయోగించడాన్ని ప్రోత్సహించాలని, ఉన్నత విద్య సంస్థలలో సైతం స్థానిక భాషల్లో కోర్సులను అందించాలని ఎన్ఈపీ 2020 చెబుతున్నది. ఒక విద్యార్థి తన మాతృభాషలో చదువును నేర్చుకొన్నప్పుడు మరింత మెరుగైన అవగాహన, పరిశీలన శక్తి వికాసం, ఆత్మవిశ్వాసం పెంచుకోవడం అలవడతాయని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. భారతదేశంలో దేశవాళీ సంస్కృతులను కాపాడుకోవడానికి, గిరిజన భాషలను పరిరక్షించుకొంటూ గిరిజన ప్రజల సంతానానికి మేలు కలిగేటట్లు చూడాలని కూడా ఈ విధానం సూచిస్తున్నది.

పాఠశాల విద్య స్థాయిలో భాషాభివృద్ధికి మద్దతివ్వడానికి 22 రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో 104 ప్రైమరీ బుక్స్ అందించారు.  ఇవి బాలలు వారి మాతృభాషలోగానీ, స్థానిక భాషలోగాని విద్యను నేర్చుకొనేందుకు వీలు కల్పిస్తాయి.  భారతీయ సంజ్ఞల భాష (ఐఎస్ఎల్)ను అభివృద్ధి పరిచారు.  ఒకటో తరగతి మొదలు 12వ తరగతి వరకు బోధన కోర్సులను, పుస్తకాలను భారతీయ సంజ్ఞా భాషలలోకి అనువాదం చేశారు. 200లకు పైగా టీవీ చానళ్ళు, 29 భాషలలో విద్యా సంబంధమైన కార్యక్రమాలను అందిస్తున్నాయి. దీక్షా ప్లాట్‌ఫార్మ్ (DIKSHA platform) 133 భాషలలో, 3,66,370 ఈ-కంటెంట్ భాగాలను అందిస్తున్నది. ఈ భాషలలో 126 భారతీయ భాషలు, ఏడు విదేశీ భాషలు కూడా ఉన్నాయి.  పుస్తకాలు చదివే అలవాటును ప్రోత్సహించడానికి జాతీయ డిజిటల్ గ్రంథాలయం, ‘ఉల్లాస్ యాప్’ (ULLAS App) వంటి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం ప్రారంభించింది.  అంతేకాకుండా, విద్యా విషయక వనరులను బహుళ భాషల్లో అందుబాటులో ఉండేటట్లు చూస్తోందని మంత్రి అన్నారు.

 

ఉన్నత విద్య రంగంలో కూడా చెప్పుకోదగ్గ పురోగతి ఉందని మంత్రి వివరించారు.  51 ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ సెంటర్లను ఏర్పాటుచేయడం, 1,500 అండర్‌గ్రాడ్యుయేట్ కోర్స్ పాఠ్య పుస్తకాలను 12 భారతీయ భాషలలోకి అనువాదం చేయడం, 8,000కు పైగా ఉన్నత విద్యాసంస్థల పాఠ్య ప్రణాళికలో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్‌ను కలపడం వంటివి ఈ చర్యలలో కొన్ని అని ఆయన తెలిపారు.  జేఈఈ (JEE), ఎన్ఈఈటీ (NEET), సీయూఇటీ (CUET) వంటి పోటీ పరీక్షలను ప్రస్తుతం ప్రాంతీయ భాషలలో నిర్వహిస్తున్నారు.  ఇంజినీరింగ్ కోర్సులు ఎనిమిది భారతీయ భాషల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.  దీనికి అదనంగా అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల విద్యార్థులు 19 కేంద్రీయ సంస్థలలో వారికి చెబుతున్న 428 ప్రోగ్రాములను 12 భారతీయ భాషలలో నేర్చుకొనే సౌలభ్యానికి నోచుకొన్నారు. అధ్యయన సామగ్రి ‘ఈ-కుంభ్’ (e-KUMBH), ‘అనువాదిని’ (Anuvadini) ప్లాట్‌ఫాంల ద్వారా లభ్యమవుతోంది.

 

అధికార భాషలలో ఒకటిగా ఉన్న హిందీ కూడా చెప్పుకోదగ్గ శ్రద్ధను దక్కించుకొంది. హిందీని ఒక అధికారిక భాషగా గుర్తించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ భాషను ఇతర భారతీయ భాషలతోపాటే ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంది. వైవిధ్యాన్ని ఆదరిస్తూనే, భాషాపరమైన ఏకతకు పూచీ పడాలనేదే ఈ చర్యలోని ముఖ్యాంశం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికలలో హిందీకి పట్టం కట్టారు. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ భాషకు ఉన్న గుర్తింపును పెంచడంతోపాటు భారతీయ భాషలకు వన్నె తెస్తున్నారు. మంత్రిత్వ శాఖలలో హిందీ సలహా సంఘాలు ఏర్పాటు చేయడం, దేశ విదేశాలలో టౌన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ (టీఓఎల్ఐసీ) లను ఏర్పాటు చేయడం, సమగ్ర ‘‘హిందీ శబ్ద్ సింధు’’ నిఘంటుకు రూపకల్పన చేయడం... ఈ చర్యలన్నీ పాలనలో, భావ ప్రసారంలో హిందీ పాత్రను పటిష్టం చేశాయి.

 

భారతీయ భాషలను మరింతగా వ్యాప్తిలోకి తీసుకురావడానికి సాంకేతిక మార్పులను వినియోగించుకుంటున్నారు. భాషాపరమైన అంతరాలను భర్తీ చేయడానికి డిజిటల్ టెక్నాలజీని నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ మిషన్ తోపాటు ‘భాషిణి’ ప్రాజెక్టు కూడా ఉపయోగించుకొంటున్నాయి. ఫలితంగా వేరు వేరు భాషలలో మాట్లాడే వ్యక్తుల మధ్య భావ ప్రసారం ఎలాంటి అంతరాయం లేకుండా చోటుచేసుకొంటోంది. ప్రాంతీయ భాషలలో డిజిటల్ మాధ్యమం ద్వారా జ్ఞాన బోధక సామగ్రిని రూపొందించవలసిందిగా విద్యా సంస్థలను, ఎడ్యు-టెక్ కంపెనీలను ప్రోత్సహించారు. దీనితో విద్య మరింత మంది చెంతకు చేరుకోవడం సులభమవుతుంది.

 

‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ కార్యక్రమంలో భాగంగా ‘సౌరాష్ట్ర తమిళ్ సంగమం’, ‘కాశీ తమిళ్ సంగమం’ వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం భారతదేశానికున్న భాషాపరమైన, సంస్కృతిపరమైన ఐకమత్యాన్ని పండుగల జరుపుకోవడం వంటిదే. ఈ కార్యక్రమాలు ప్రాంతాల మధ్య చారిత్రకంగా ఉన్న సంబంధాలను ప్రముఖంగా చాటి చెప్పడంతోపాటు సాంస్కృతిక ఆదాన- ప్రదానాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాయి.  ప్రపంచంలో అత్యంత ప్రాచీన భాషలలో ఒకటైన తమిళ భాషను పరిరక్షించుకోవడంపై ప్రధానమంత్రి చూపుతున్న శ్రద్ధ భారతీయులు వారి భాషా వారసత్వాన్ని పదిలపరచుకొంటూ, సుసంపన్నం చేయడం వారి సమష్టి బాధ్యత అనే అంశాన్ని స్పష్టం చేస్తోంది.

 

భారతీయ భాషలన్నీ ప్రపంచవ్యాప్తంగా పోటీ పడగలిగేటట్లుగాను, ఆధునిక విద్య ప్రాంతీయ భాషలన్నింటిలో అందుబాటులో ఉండేటట్లుగాను జాగ్రత్త చర్యలు చేపట్టడం ప్రభుత్వ దార్శనికతలో భాగాలే. భాషాధారిత పర్యటన అవకాశాలు, సాహితీ ఉత్సవాలు, భాషాపరమైన పరిశోధనల వంటి కార్యక్రమాలు ప్రపంచ రంగస్థలంపై భారత భిన్నత్వాన్ని ప్రదర్శించాలన్న ధ్యేయంతో చేపడుతున్న కార్యక్రమాలు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో ‘‘మనం మన తల్లిని ఎలాగైతే విడచిపెట్టలేమో, అదే విధంగా మన మాతృభాషను కూడా వదిలిపెట్టలేం’’ అని చెప్పిన మాటలు ఎంతో సరైనవి.

 

భాషలు కొన్ని మాటల కూర్పు మాత్రమే కాదు, అవి తరాలనూ, సముదాయాలనూ కలిపే వంతెనలు అని మంత్రి అన్నారు. భాషకు ఉన్న గౌరవాన్ని పెంచుకోవడం ద్వారా, టెక్నాలజీకున్న శక్తిని భాషా పరిరక్షణకు, భాషా ప్రచారానికి ఉపయోగించుకోవడం ద్వారా ఒక చైతన్యభరిత సమైక్య భవిష్యత్తుకు భారత్ బాట వేస్తోంది. భారతీయ భాషలను అభివృద్ధి పరచడానికి, సాంస్కృతిక భాషా సంపదను అక్కున చేర్చుకొని దేశ ప్రజలను ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) మార్గంలో ముందుకు నడిపించాలన్న ఆశయ సాధనకు ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని మంత్రి అన్నారు.

 

****


(Release ID: 2085697) Visitor Counter : 36