చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
ఒక దేశం, ఒకే ఎన్నిక
Posted On:
17 DEC 2024 10:42AM by PIB Hyderabad
పరిచయం
ఎప్పటికప్పుడు జరిగే ఎన్నికల ప్రక్రియే భారత ప్రజాస్వామిక నిర్మాణాన్ని చెక్కుచెదరనీయలేదు. ప్రతీ స్థాయిలో పాలనను రూపుదిద్దే అవకాశాన్ని ఇది పౌరులకు కల్పిస్తుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి.. లోకసభ, రాష్ట్ర శాసనసభలకు జరిగిన 400కు పైగా ఎన్నికలు నిష్పాక్షికత, పారదర్శకతల పట్ల భారత ఎన్నికల సంఘానికి ఉన్న నిబద్ధతను చాటిచెప్పాయి. అయినప్పటికీ.. ఎన్నికలు ఒక్కోసారి ఒక్కోచోటా, తరచుగా జరుగుతుండడం వంటి పరిణామాల వల్ల మరింత సమర్థవంతమైన వ్యవస్థ ఆవశ్యకతపై చర్చలు మొదలయ్యాయి. ఇది ‘ఒక దేశం - ఒకే ఎన్నిక’ భావన మళ్లీ బలపడడానికి కారణమైంది.
ఈ భావనను ఏకకాల/జమిలి ఎన్నికలు అనికూడా పిలుస్తున్నారు. లోకసభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నిక ప్రక్రియలను ఒకేసారి నిర్వహించాలని ఇది ప్రతిపాదిస్తుంది. దీనిద్వారా దేశవ్యాప్తంగా దశలవారీగా పోలింగ్ జరిగే అవకాశం ఉన్నప్పటికీ.. ఓటర్లు తమ నియోజకవర్గాల్లో ప్రభుత్వంలోని రెండు స్థాయులకూ ఒకే రోజు ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నికల కాలక్రమాన్ని ఏకీకృతం చేయడం ద్వారా.. రవాణా/తరలింపు సవాళ్లను పరిష్కరించడం, వ్యయాన్ని తగ్గించడం, పదేపదే ఎన్నికలు జరగడం వల్ల కలిగే అంతరాయాలను తగ్గించడం ఈ విధానం లక్ష్యం.
భారత్ లో జమిలి ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ విడుదల చేసిన నివేదిక ఇందుకోసం సమగ్ర ప్రణాళికను అందించింది. దీని సిఫార్సులను సెప్టెంబర్ 18న కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇది ఎన్నికల సంస్కరణల దిశగా ముఖ్యమైన ముందడుగు. ఈ వ్యవస్థ పరిపాలన సామర్థ్యాన్ని పెంచుతుందని, ఎన్నికల వ్యయాలను తగ్గిస్తుందని, విధానాల కొనసాగింపును ప్రోత్సహిస్తుందని దీని సమర్థకుల వాదన. పాలనను క్రమబద్ధీకరించాలని, ప్రజాస్వామిక ప్రక్రియలను ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని భారత్ భావిస్తున్న నేపథ్యంలో, ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ భావన కీలక సంస్కరణగా మారింది. దీనిపై ఆలోచనాత్మకమైన చర్చలు, ఏకాభిప్రాయం అవసరం.
చారిత్రక నేపథ్యం
భారత్ లో జమిలి ఎన్నికలు కొత్త భావనేమీ కాదు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన అనంతరం 1951 నుంచి 1967 వరకు లోకసభ, అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు ఏకకాలంలో జరిగాయి. 1951-52లో మొదటి సార్వత్రిక ఎన్నికలు లోకసభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి జరిగాయి. తర్వాత 1957, 1962, 1967 సంవత్సరాల్లో జరిగిన వరుస సార్వత్రిక ఎన్నికల్లో అదే పద్ధతి కొనసాగింది.
అయితే, 1968, 1969 సంవత్సరాల్లో కొన్ని రాష్ట్ర శాసనసభల ముందస్తు రద్దు వల్ల ఈ ఏకీకృత ఎన్నికల ప్రస్థానానికి అంతరాయం కలిగింది. నాలుగో లోకసభ కూడా 1970లో ముందస్తుగా రద్దవగా.. 1971లో కొత్తగా ఎన్నికలు జరిగాయి. మొదటి మూడు లోకసభలూ అయిదేళ్ల కాలాన్ని పూర్తి చేయగా.. అందుకు భిన్నంగా, అత్యవసర పరిస్థితి ప్రకటన వల్ల అధికరణ 352 ద్వారా అయిదో లోకసభ కాలపరిమితిని 1977 వరకు పొడిగించారు. అప్పటి నుంచి ఎనిమిదో, పదో, పద్నాలుగో, పదిహేనో లోకసభల వంటి కొన్ని మాత్రమే పూర్తి అయిదేళ్ల పదవీకాలం పాటు కొనసాగాయి. ఆరో, ఏడో, తొమ్మిదో, పదకొండో, పన్నెండో, పదమూడో లోకసభలు సహా మిగతా సభలు ముందస్తుగానే రద్దయ్యాయి.
కొన్నేళ్లుగా రాష్ట్రాల అసెంబ్లీలు ఇలాంటి అంతరాయాలను ఎదుర్కొన్నాయి. ముందస్తు రద్దు, కాల పరిమితి పొడిగింపులు పదేపదే ఉత్పన్నమవుతూ సవాళ్లుగా మారాయి. ఈ పరిణామాలు ఏకకాల ఎన్నికల ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగించాయి. ఇది దేశవ్యాప్తంగా దశలవారీగా ఎన్నికల షెడ్యూళ్లుండే ప్రస్తుత సరళికి దారితీసింది.
వివిధ లోకసభల్లో కీలక పరిణామాల కాలక్రమం:
* మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు ముందే రద్దయింది.
** అత్యవసర పరిస్థితి ప్రకటన కారణంగా పొడిగింపు.
జమిలి ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో 2023 సెప్టెంబర్ 2న జమిలి ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లోకసభ, రాష్ట్ర శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే సాధ్యాసాధ్యాలను పరిశీలించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ కమిటీ విస్తృతమైన ప్రజా, రాజకీయ అభిప్రాయాన్ని కోరింది. ప్రతిపాదిత ఈ ఎన్నికల సంస్కరణ వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో, ఎలాంటి సవాళ్లు ఎదురయ్యే అవకాశముందో నిపుణులతో సంప్రదించి విశ్లేషించింది. కమిటీ పరిశీలనలు, రాజ్యాంగ సవరణల కోసం దాని సిఫార్సులతోపాటు పాలన, వనరులు, ప్రజల మనోగతాలపై జమిలి ఎన్నికల ప్రభావ అంచనాలపై ఈ నివేదిక వివరణాత్మక సమీక్షను అందిస్తుంది.
కీలక అంశాలు:
-
ప్రజల స్పందన: కమిటీకి 21,500కు పైగా సూచనలు రాగా.. వాటిలో 80 శాతం జమిలి ఎన్నికలకు అనుకూలంగా ఉన్నాయి. లక్షద్వీప్, అండమాన్ నికోబార్, నాగాలాండ్, దాద్రా, నాగర్ హవేలీ సహా దేశం నలుమూలల నుంచి సూచనలు వచ్చాయి. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధిక సూచనలు వచ్చాయి.
-
రాజకీయ పార్టీల స్పందన: 47 రాజకీయ పార్టీలు అభిప్రాయాలను తెలిపాయి. వీటిలో 32 పార్టీలు ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలిపాయి. వనరులను తగిన విధంగా వినియోగించుకోగలగడం, సామాజిక సామరస్యం వంటి ప్రయోజనాలను ఇవి పేర్కొన్నాయి. ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభావాలు, ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టడంపై 15 పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి.
-
నిపుణులతో సంప్రదింపులు: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, మాజీ ఎన్నికల కమిషనర్లు, న్యాయనిపుణులతో కమిటీ సంప్రదింపులు జరిపింది. ఏకకాల ఎన్నికల భావనను వారిలో ఎక్కువ మంది సమర్థించారు. వనరుల వృథా, తరచూ ఎన్నికల వల్ల కలిగే సామాజిక-ఆర్థిక అంతరాయాలను వారు ప్రధానంగా పేర్కొన్నారు.
-
ఆర్థిక ప్రభావం: సీఐఐ, ఫిక్కీ, అసోచామ్ వంటి వ్యాపార సంస్థలు ఈ ప్రతిపాదనను సమర్థించాయి. తరచూ ఎన్నికల వల్ల కలిగే అంతరాయాలు, ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వంపై సానుకూల ప్రభావాన్ని అవి ప్రముఖంగా పేర్కొన్నాయి.
-
న్యాయపరమైన, రాజ్యాంగపరమైన విశ్లేషణ: లోక్ సభ, రాష్ట్రాల శాసన సభలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా భారత రాజ్యాంగంలోని అధికరణలు 82ఎ, 324ఎ లకు సవరణలు చేయాలని కమిటీ ప్రతిపాదించింది.
-
అమలు కోసం దశలవారీ విధానం: ఏకకాల ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది:
-
దశ 1: లోకసభ, శాసనసభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం.
-
దశ 2: లోకసభ, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోగా.. పురపాలక సంఘాలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం.
-
ఓటర్ల జాబితా, ఈపీఐసీ సమన్వయం: ఓటర్ల జాబితా తయారీలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ల అసమర్థతను ఎత్తిచూపిన కమిటీ.. ప్రభుత్వంలోని మూడు అంచెలకూ ఒకే ఓటరు జాబితా, ఒకే ఈపీఐసీని రూపొందించాలని సిఫార్సు చేసింది. ఇది ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓట్లుండడాన్నీ, తప్పులనూ తగ్గించడం ద్వారా ఓటరు హక్కులను పరిరక్షిస్తుంది.
-
తరచూ ఎన్నికలపై ప్రజల మనోగతం: తరచూ ఎన్నికలు జరగడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలపై ఆందోళన ప్రజల సూచనల్లో వ్యక్తమైంది. ఓటరు అలసట, పాలన పరమైన అంతరాయాల వంటి ఆందోళనలను ప్రజలు వెలిబుచ్చారు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా వీటిని తగ్గించవచ్చని భావిస్తున్నారు.
ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో.. హేతుబద్ధత
ఈ కింది అంశాలు ఏకకాలంలో ఎన్నికల అశంపై మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ నాయకత్వంలో ఏర్పాటుచేసిన ఒక ఉన్నతస్థాయి సంఘం విడుదల చేసిన నివేదికలో పేర్కొన్న విషయాలపై ఆధారపడి ఉన్నాయి:
V. పాలనలో నిరంతరాయత్వాన్ని ప్రోత్సహిస్తుంది: దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ నిరంతరాయంగా కొనసాగించవలసివస్తున్న కారణంగా రాజకీయ పక్షాలూ, వాటి నాయకులూ, చట్టసభల సభ్యులూ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలూ పాలనకు ప్రాధాన్యాన్ని ఇచ్చే బదులు త్వరలో రాబోయే ఎన్నికలకు సన్నద్ధం కావడంపైనే ధ్యాసను తరచూ కేంద్రీకరిస్తున్నాయి. ఒకేసారి ఎన్నికల నిర్వహణ పద్ధతిని అనుసరించడంవల్ల ప్రభుత్వ దృష్టిని అభివృద్ధి కార్యాకలాపాల వైపునకు మళ్ళించి, సామాన్య ప్రజల సంక్షేమానికి ఉద్దేశించిన విధానాల అమలుపై తిరిగి కేంద్రీకరించేందుకు అవకాశం ఉంటుంది.
V. విధాన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యాన్ని నివారిస్తుంది: ఎన్నికల కాలంలో ఆదర్శ ప్రవర్తనా నియమావళి (ఎమ్‌సీసీ)ని అమలు చేయవలసి వస్తున్నందువల్ల రోజువారీ పాలన కార్యకలాపాలకు, అభివృద్ధి ప్రధాన కార్యక్రమాలకు అంతరాయం కలుగుతున్నది. ఈ అంతరాయం కీలక సంక్షేమ పథకాల పురోగతిని అడ్డుకోవడం ఒక్కటే కాకుండా, పాలనలో అనిశ్చితికి కూడా దారితీస్తున్నది. ఒకే కాలంలో ఎన్నికలను నిర్వహించడంవల్ల ఎమ్‌సీసీని దీర్ఘకాలంపాటు అమల్లో ఉంచే అవసరాన్ని తగ్గించి, తద్వారా విధానపరమైన జడత్వాన్ని పారదోలి ఎలాంటి అంతరాయాలకు తావులేకుండా పాలనను కొనసాగించేందుకు వీలుంటుంది.
V. వనరులను వేరే చోట్లలో ఉపయోగించనీయదు: ఎన్నికల విధులను నిర్వర్తించడానికి పోలింగ్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల వంటి సిబ్బందిని గణనీయ సంఖ్యలో రంగంలోకి దించితే అది వారి కీలక బాధ్యతలను నెరవేర్చకుండా పెద్దఎత్తున వనరులను మళ్ళించడానికి దారితీయవచ్చు. ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే ఇలా వనరులను పదే పదే రంగంలోకి దించాల్సిన అవసరం తగ్గిపోయి, ప్రభుత్వాధికారులకు, సార్వజనిక సంస్థలకు ఎన్నికల సంబంధిత విధులకు బదులు వాటి వాటి ప్రాథమిక కర్తవ్యాలను నెరవేర్చడం పైన మరింతగా దృష్టిని సారించే అవకాశం లభిస్తుంది.
V. ప్రాంతీయ పక్షాల ప్రాముఖ్యాన్ని పరిరక్షిస్తుంది: ఎన్నికల ఏకకాల నిర్వహణతో ప్రాంతీయ పార్టీల పాత్ర కుదించుకుపోదు. నిజానికి ఈ ప్రక్రియ, ఎన్నికల కాలంలో మరింత స్థానిక ప్రాముఖ్యతపై దృష్టి పెట్టడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ప్రాంతీయ పార్టీలు వాటి ముఖ్య ఆందోళనలను, ఆకాంక్షలను ప్రముఖంగా చాటిచెప్పుకోవడానికి తోడ్పడుతుంది. ఈ వ్యవస్థ జాతీయ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, ప్రాంతీయ అంశాలపై వాటి ప్రభావాన్ని అధికస్థాయిలో ప్రసరించనీయని రాజకీయ వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. దీంతో ప్రాంతీయ సమస్యలను ప్రచారం చేయడానికి ఉన్న ప్రాముఖ్యాన్ని అలాగే నిలబెడుతుంది.
V. రాజకీయ అవకాశాలను పెంపొందిస్తుంది: ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం రాజకీయ పక్షాల్లో రాజకీయపరమైన అవకాశాలను, బాధ్యతలను మరింత సమానంగా పంచుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక పార్టీలోని కొంత మంది నేతలు అనేక స్థాయిలలో ఎన్నికలలో పోటీపడుతూ, కీలక పదవులను వారి గుప్పిట్లో పెట్టుకొనే ఆధిపత్య ధోరణిని కనబరుస్తూ ఉండడం అసాధారణమైందేమీ కాదు. ఏకకాల ఎన్నికల నిర్వహణ విషయానికి వస్తే, వేరు వేరు పార్టీలకు చెందిన రాజకీయ కార్యకర్తల మధ్య వైవిధ్యానికి, సమగ్రతకు ఎక్కువ అవకాశాలు ఏర్పడుతూ, చాలా మంది నాయకులు వారు ఎదుగుతూ, ప్రజాస్వామ్య ప్రక్రియకు వారి వంతు సేవలను అందించవచ్చు.
V. పరిపాలనపై దృష్టిని కేంద్రీకరించవచ్చు: ఇప్పుడు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ సుపరిపాలనను అందించడంపై శ్రద్ధ తీసుకోకుండా చేస్తున్నది. రాజకీయ పక్షాలు గెలుపు కోసం ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాల పైనే శ్రద్ధవహిస్తూ, పాలనలో అతి ముఖ్య అంశాలకు, అభివృద్ధికి తక్కువ కాలాన్నే మిగుల్చుతున్నాయి. ఎన్నికలు ఒక్కసారే జరిగేటట్లయితే పార్టీలు వాటి ప్రయత్నాలను ఓటర్ల అవసరాలను తీర్చడానికి ప్రత్యేకించి సంఘర్షణలతోపాటు ఉధృత ప్రచారం చేపట్టే సందర్భాల్ని కూడా తగ్గించేస్తుంది.
V. ఆర్థిక భారం తగ్గుతుంది: చాలాసార్లు ఎన్నికలను నిర్వహించవలసి రావడంతో ముడిపడ్డ ఆర్థిక వ్యయాల్ని ఏకకాలిక ఎన్నికల నిర్వహణ చాలావరకు తగ్గించి వేస్తుంది. ఈ నమూనా ప్రతి ఒక్క ఎన్నికకు సిబ్బందిని, సామగ్రిని, భద్రత ఏర్పాట్లను, ఇతరత్రా వనరుల మోహరింపునకు అయ్యే ఖర్చులను కుదిస్తుంది. దీనిలో ఇమిడి ఉన్న ఆర్థిక ప్రయోజనాలలో.. వనరులను మరింత పక్కాగా కేటాయించడం, మెరుగైన ఆర్థిక నిర్వహణ, ఆర్థిక వృద్ధి, పెట్టుబడిదారు సంస్థలలో విశ్వాసాన్ని పెంచడానికి అనువైన స్థితిగతులను ఏర్పరచడం వంటివి.. భాగంగా ఉంటాయి.
ముగింపు
‘ఏక కాలంలో ఎన్నికలను నిర్వహించడం’ అన్న అంశంపై ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీకి పూర్వ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ నాయకత్వ బాధ్యతలను నిర్వహించారు. ఈ కమిటీ భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ రూపురేఖలలో పెనుమార్పును తీసుకురావడానికి రంగాన్ని సిద్ధం చేసింది. లోక్సభ, రాష్ట్రాల విధాన సభల ఎన్నికల దశలను ఒకేసారి నిర్వహించాలని చెప్పి ఈ కమిటీ చేసిన సిఫార్సులు తరచుగా ఎన్నికల నిర్వహణతో ముడిపడ్డ ‘పాలనకు అంతరాయాలు ఏర్పడుతూ ఉండడం, వనరులు వృథా అవుతూ ఉండడం’ వంటి దీర్ఘకాలం పాటు ఎదురవుతూ వస్తున్న సవాళ్ళను పరిష్కరించడానికి ఒక ఆశను రేకెత్తించాయి. రాజ్యంగ సవరణలతో ఏకకాల ఎన్నికల పద్ధతిని దశల వారీగా అమలుచేయాలన్న ప్రతిపాదన భారతదేశంలో మరింత సమర్థమైన, నిలకడతనంతో కూడిన ఎన్నికల వాతావరణానికి బాట వేయగలుగుతుంది. విస్తృతస్థాయిలో ప్రజల, రాజకీయ వర్గాల అండదండలతో, ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన భారతదేశంలో ప్రజాస్వామిక ప్రక్రియలను సువ్యవస్థీకృతం చేసి, పాలనలో దక్షతను పెంచడానికి సన్నద్ధంగా ఉంది.
ప్రస్తావనలు:
5. https://onoe.gov.in/HLC-Report-en
5. https://legalaffairs.gov.in/sites/default/files/simultaneous_elections/79th_Report.pdf
5. https://legalaffairs.gov.in/sites/default/files/simultaneous_elections/NITI_AYOG_REPORT_2017.pdf
***
(Release ID: 2085490)
Visitor Counter : 480