ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ చేతుల మీదుగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో రూ.5500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం
మహా కుంభమేళా 2025 నిమిత్తం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన పీఎం
కుంభ్ సహాయక్ ఏఐ చాట్‌బాట్ ప్రారంభించిన ప్రధానమంత్రి
నమ్మకం, ఆధ్యాత్మికత, సంస్కృతికి సంబంధించిన ఉత్సవమే మహాకుంభ మేళా: పీఎం
అడుగడుగునా పుణ్య క్షేత్రాలు, ధార్మిక ప్రదేశాలున్న ప్రాంతమే ప్రయాగ్: పీఎం
మనిషి అంతర్గత చైతన్యానికి మారుపేరే కుంభమేళా: పీఎం
ఏకత్వానికి మహాయజ్ఞమే మహాకుంభ మేళా: పీఎం
Posted On:
13 DEC 2024 4:06PM by PIB Hyderabad
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ రాజ్‌లో రూ.5500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యే వారిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, పవిత్ర సంగమ ప్రాంతమైన ప్రయాగరాజ్‌కు, మహాకుంభమేళాకు వచ్చే సాధువులు, సన్యాసులకు భక్తితో నమస్కరించారు. కృషి, అంకితభావంతో మహా కుంభమేళాను విజయవంతం చేస్తున్న ఉద్యోగులు, శ్రామికులు, పారిశుద్ధ్య కార్మికులకు శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మహా కుంభమేళా జరిగే పరిమాణాన్ని, స్థాయి గురించి వివరిస్తూ, 45 రోజుల పాటు సుదీర్ఘంగా సాగే మహాయజ్ఞంగా, ప్రతి రోజూ లక్షల మంది భక్తుల పాల్గొనే, ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమంగా దీన్ని అభివర్ణించారు. ‘‘ప్రయాగరాజ్ నేలపై సరికొత్త చరిత్ర లిఖితమవుతోంది’’ అని ప్రధానమంత్రి అన్నారు. వచ్చే ఏడాది జరగబోతున్న మహా కుంభమేళా దేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక గుర్తింపును నూతన శిఖరాలకు తీసుకెళుతుందతని, ఈ ఐక్యత ‘మహాయజ్ఞం’ గురించి ప్రపంచమంతా చర్చిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. మహా కుంభమేళాని విజయవంతంగా నిర్వహించాలన్నారు.
‘‘పవిత్ర స్థలాలు, పుణ్య క్షేత్రాల భూమి ఈ భారతదేశం’’ అని శ్రీ మోదీ వర్ణించారు. గంగా, యమున, సరస్వతి, కావేరీ, నర్మద లాంటి ఎన్నోపవిత్ర నదులకు ఈ దేశం నిలయమని ఆయన అన్నారు. సంగమం, సమీకరణ, సభ, సమ్మేళనం, ప్రభావం, ఈ నదులు ప్రవహించే పవిత్ర శక్తితో కూడిన ప్రదేశంగా ప్రయాగరాజ్‌ను వర్ణించారు. ప్రయాగ మూడు నదుల పవిత్ర సంగమ ప్రదేశం మాత్రమే కాదని, ఎన్నో ప్రముఖ పుణ్యక్షేత్రాలతో, వాటి గొప్పతనంతో నిండిన ప్రాంతమని పేర్కొన్నారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే పుణ్యకాలంలో అన్ని దేవతా శక్తులు, అమృతం, రుషులు, మునులు ప్రయాగలో ప్రవేశిస్తారని చెబుతూ ఉంటారని ఆయన వివరించారు. ప్రయాగ ప్రస్తావన లేకపోతే పురాణాలు అసంపూర్ణంగా మిగిలిపోతాయని అభిప్రాయపడ్డారు. వేద శ్లోకాల్లో కీర్తించిన ప్రదేశాల్లో ప్రయాగ ఒకటని అన్నారు.
‘‘అడుగడుగునా పవిత్ర ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతం ప్రయాగ’’ అని శ్రీ మోదీ వర్ణించారు. ప్రయాగరాజ్ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని సంస్కృత శ్లోకం ద్వారా వివరించారు. ‘‘త్రివేణి ప్రభావం, వేణుమాధవుని వైభవం, సోమేశ్వరుని ఆశీస్సులు, రుషి భరద్వాజుని తపోభూమి, నాగరాజు వాసుకి చెందిన ప్రాంతం, అక్షయవతునికి మోక్షం లభించిన ప్రదేశం, భగవంతుని కృప అన్నీ కలసి ప్రయాగను తీర్థయాత్రా ప్రదేశంగా మార్చాయి’’ అని అన్నారు. ధర్మార్థకామమోక్షాలు అనే నాలుగు అంశాలు లభించే ప్రదేశం ప్రయాగ అని అన్నారు. ‘‘ప్రయాగరాజ్ కేవలం భౌగోళిక ప్రాంతం మాత్రమే కాదు. ఆధ్యాత్మికతను అనుభూతి చెందే ప్రదేశం’’ అని ప్రధానమంత్రి అన్నారు. ప్రయాగరాజ్‌ను సందర్శించే భక్తులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. గత కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ.. ఈ రోజు మరోసారి ఆ అవకాశం లభించిందని తెలిపారు. ఈ రోజు ముందుగా హనుమాన్ మందిర్, అక్షయవత్‌ల్లో చేసుకున్న దర్శనం, పూజ గురించి వివరిస్తూ ఈ క్షేత్రాలను భక్తులు సులభంగా దర్శించుకొనేలా హనుమాన్ కారిడార్, అక్షయవత్ కారిడార్‌లను అభివృద్ధి చేశామని ప్రధానమంత్రి తెలిపారు. అలాగే సరస్వతీ కుండం పునరాభివృద్ధి ప్రాజెక్టు గురించి అడిగి తెలుసుకున్నానని అన్నారు. వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
‘‘మహా కుంభమేళా మన నమ్మకం, ఆధ్యాత్మికత, సంస్కృతులకు సంబంధించిన పవిత్రమైన ఉత్సవాల వారసత్వానికి సజీవ గుర్తింపు’’ అని శ్రీ మోదీ వర్ణించారు. ప్రతిసారీ ఈ బృహత్ కార్యక్రమం మతం, జ్ఞానం, భక్తి, కళలకు చెందిన పవిత్ర సమూహానికి ప్రతీకగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. సంస్కృత శ్లోకాన్ని పఠిస్తూ.. ఈ సంగమంలో చేసే పవిత్ర స్నానం కోట్లాది పుణ్యక్షేత్రాల సందర్శనతో సమానమని వివరించారు. ఇక్కడ పవిత్ర స్నానమాచరించే వారి పాపాలు తొలగిపోతాయని అన్నారు. రాజులు, రాజ్యాలు మారినా లేదా బ్రిటిషు వారి నిరంకుశ పాలనా సమయంలోనూ ఈ పవిత్ర భావన కొనసాగిందని, బాహ్య శక్తులేవీ ఈ కార్యాన్ని నిర్వహించకపోవడమే దానికి ప్రధాన కారణం అని వ్యాఖ్యానించారు. కుంభమేళా మనిషిలోని అంతరాత్మ చైతన్యానికి ప్రతిరూపమని, లోపలి నుంచి వచ్చే ఆ చైతన్యం భారత్‌లోని ప్రతి మూల నుంచి సంగమ ప్రదేశానికి ప్రజలను ఆకర్షిస్తుందని అన్నారు. పల్లెలు, పట్టణాలు, నగరాల నుంచి ప్రయాగరాజ్‌కు ప్రజలు తరలి వస్తారని, ఇలా పెద్ద సంఖ్యలో జనం పాల్గొనే సమ్మేళనం మరెక్కడా కనిపించదని అన్నారు. సాధువులు, రుషులు, జ్ఞానులు లేదా సామాన్య ప్రజలు ఎవరైనా సరే మహాకుంభమేళాకు వస్తే అందరూ ఒకటవుతారని, కుల, వర్గ బేధాలు అంతమవుతాయని అన్నారు. ఒకే లక్ష్యం, ఒకటే ఆలోచనతో కోట్లాది మంది ప్రజలు ఏకమవుతారని ఆయన అన్నారు. వివిధ రాష్ట్రాలు, భాషలు, కులాలు, విశ్వాసాలకు చెందిన కోట్ల సంఖ్యలో ప్రజలు పవిత్ర సంగమానికి వచ్చి, ఒకే స్వరాన్ని వినిపిస్తారని అన్నారు. ఇదే మహా కుంభమేళాను ఏకత్వ మహాయజ్ఞంగా తాను భావించడానికి కారణమని తెలిపారు. ఇక్కడ వివక్ష ఏ రూపంలో ఉన్నా వదిలేస్తారని, పవిత్ర స్నానమాచరించే ప్రతి భారతీయుడు ఏక భారత్, శ్రేష్ట భారత్ అనే భావనకు ప్రతీకగా నిలుస్తారని అన్నారు.
భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంప్రదాయంలో కుంభమేళా ప్రాముఖ్యాన్ని శ్రీ మోదీ వివరిస్తూ, క్లిష్టమైన జాతీయ సమస్యలు, సవాళ్లపై సాధువుల మధ్య లోతైన చర్చలకు ఎల్లప్పుడూ వేదికగా ఎలా ఉండేదో వివరించారు. ఆధునిక సమాచార వ్యవస్థలు ఏమీ లేని గత కాలంలో సాధువులు, పండితులు మన దేశం ఎదుర్కొంటున్న, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై విస్తృతంగా చర్చించి దేశ ఆలోచనా విధానానికి నూతన దిశను, శక్తిని అందించే వేదికగా, ముఖ్యమైన సామాజిక మార్పులకు పునాదిగా కుంభమేళా నిలిచింది. ఈరోజుకీ ఇదే తరహా చర్చలను కొనసాగిస్తూ, దేశవ్యాప్తంగా సానుకూల సందేశాలను విస్తరింపచేస్తూ, జాతీయ సంక్షేమానికై సమష్టి ఆలోచనలను ప్రేరేపించే వేదికగా తన ప్రాముఖ్యాన్ని కుంభమేళా నిలబెట్టుకుంటోందని ప్రధానమంత్రి అన్నారు. ఈ సమావేశాల పేర్లు, లక్ష్యాలు, మార్గాలు వేరైనప్పటికీ, వాటి ఉద్దేశం, ప్రయాణం ఒకే విధంగా ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు. జాతీయ స్థాయి చర్చలకు చిహ్నంగా కొనసాగడంతో పాటు భవిష్యత్తులో అభివృద్ధికి వెలుగు బాటగా కుంభమేళా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కుంభమేళాతో పాటు ఆధ్యాత్మిక క్షేత్రాలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ప్రధానమంత్రి అన్నారు. ఈ తరహా ఉత్సవాలు ప్రాధాన్యమైనవే అయినప్పటికీ సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. భారతీయ సంస్కృతి, విశ్వాసాలపై నమ్మకం లేకపోవడమే దీనికి కారణమన్న ఆయన, కేంద్ర, రాష్ట్రాల్లోని ప్రస్తుత ప్రభుత్వం భారతీయ సంప్రదాయాలు, నమ్మకాల పట్ల గాఢమైన విశ్వాసంతో ఉన్నాయని ప్రజలకు భరోసా ఇచ్చారు. కుంభమేళాకు హాజరయ్యే భక్తుల కోసం అవసరమైన సదుపాయాలను కల్పించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని ప్రధాని అన్నారు. ఏర్పాట్లు సజావుగా పూర్తయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తున్నాయని, దీనికోసం వేల కోట్ల రూపాయలు కేటాయించామని ప్రధానమంత్రి తెలిపారు. అయోధ్య, వారణాసి, రాయ్ బరేలీ, లక్నో నగరాల నుంచి ప్రయాగరాజ్‌కు యాత్రికులు వచ్చేలా రవాణా సదుపాయాలు మెరుగుపరిచేలా ప్రత్యేక దృష్టి సారించామని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ ఉత్సవానికి ఏర్పాట్లను సిద్ధం చేస్తున్న వివిధ ప్రభుత్వ విభాగాలు చేస్తున్న సమష్టి కృషిని ప్రధానమంత్రి అభినందించారు. ఇది ‘మొత్తం ప్రభుత్వం’ అనే భావనను వాస్తవరూపంలో ప్రదర్శిస్తోందని అన్నారు.
అభివృద్ధితో పాటు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధాని అన్నారు. రామాయణ సర్క్యూట్, కృష్ణా సర్క్యూట్, బౌద్ధ సర్క్యూట్, తీర్థంకర సర్క్యూట్ లాంటి పర్యాటక క్షేత్రాల ప్రాజెక్టులను అభివృద్ధి చేశామని తెలిపారు. స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల గురించి ప్రస్తావిస్తూ, యాత్రా స్థలాల్లో సౌకర్యాలను విస్తరిస్తున్నామని వివరించారు. భవ్య రామ మందిర నిర్మాణంతో అయోధ్య రూపురేఖలు మారిపోయాయని అన్నారు. విశ్వనాథ ధామ్, మహాకాల్ మహాలోక్ లాంటి ప్రాజెక్టులు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాయని అన్నారు. ప్రయాగరాజ్‌లోనూ అక్షయ్‌వత్ కారిడార్, హనుమాన్ మందిర్ కారిడార్, భరద్వాజ్ రిషి ఆశ్రమ కారిడార్ ఇదే ఆలోచనను ప్రతిబింబిస్తున్నాయి. అదే సమయంలో సరస్వతీ కుండం, పాతాళపురి, నాగవాసుకి, ద్వాదశ మాధవ మందిరాలు యాత్రికుల కోసం పునరుద్ధరించామని ప్రధాని వెల్లడించారు.
భగవాన్ శ్రీరాముడు మర్యాద పురుషోత్తమునిగా మారే క్రమంలో నిషాదరాజు భూమి అయిన ప్రయాగరాజ్ ప్రముఖ స్థానాన్ని పొందిందని ప్రధానమంత్రి తెలిపారు. శ్రీరాముడు, కేవతుని గాథ మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్న ఆయన, రాముని పాదాలు కడిగి ఆయన పడవలో నదిని దాటేందుకు కేవతుడు సాయం చేశాడని, ఇది భక్తి, స్నేహానికి ప్రతీక అని వివరించారు. భగవంతుడు కూడా అవసరమైతే భక్తుడి సాయం తీసుకుంటాడని ఈ కథ తెలియజేస్తుందన్నారు. శృంగవేర్పూర్ ధామం అభివృద్ధి ఈ స్నేహానికి ప్రతీకగా నిలుస్తుందని, శ్రీరాముడు, నిషాదరాజుల విగ్రహాలు సామరస్య సందేశాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తూనే ఉంటాయని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు.
కుంభమేళాను విజయవంతం చేయడంలో పారిశుద్ధ్యం ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రయాగరాజ్‌లో సరైన పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణకు నమామి గంగే ప్రాజెక్టును వేగవంతం చేశామని, ఈ విషయంలో అవగాహన పెంచడానికి గంగా దూత్, గంగా ప్రహారీ, గంగా మిత్రాలను నియమించినట్లు వెల్లడించారు. ఈ సారి నిర్వహించే కుంభమేళాలో పరిశుభ్రత కోసం 15,000 మందికి పైగా పారిశుద్ద్య కార్మికులను నియమించినట్టు ప్రధాని తెలిపారు. వీరందరికీ ప్రధానమంత్రి ముందుగానే ధన్యవాదాలు తెలియజేశారు. కోట్లాది మంది భక్తులకు ఆధ్యాత్మిక, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించే దిశగా వారు చూపించే అంకితభావాన్ని ప్రశంసించారు. ఎంగిలి పళ్లాలను తీసిన భగవాన్ శ్రీకృష్ణుడు ప్రతి పని ముఖ్యమేననే సందేశాన్నిచ్చారని, పారిశుద్ధ్య కార్మికులు తమ పనితో ఈ కార్యక్రమానికి గొప్పతనాన్ని తీసుకువస్తారని ఆకాంక్షించారు. 2019 కుంభమేళాలో పాటించిన శుభ్రతకు వచ్చిన ప్రశంసలను గుర్తు చేసుకుంటూ.. పారిశుద్ధ్య కార్మికుల కాళ్లను కడిగి తన కృతజ్ఞతను తెలిపానని, అది తనకు మరచిపోలేని అనుభూతిగా మిగిలిందని అన్నారు.
కుంభమేళా ఆర్థిక కార్యకలాపాల్లో గణనీయమైన విస్తరణ తీసుకువస్తుందని, అయితే ఆ ప్రభావాన్ని ఎవరూ గుర్తించరని శ్రీమోదీ అన్నారు. కుంభమేళా ప్రారంభమవడానికి ముందే ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నాయి. సంగమ ప్రాంతంలో నది ఒడ్డున తాత్కాలికంగా నగరాన్ని నిర్మించామని, సుమారుగా నెలన్నర రోజుల పాటు మిలియన్ల సంఖ్యలో ప్రజలు ప్రతి రోజూ ఇక్కడికి వస్తారని ప్రధాని తెలిపారు. ఈ సమయంలో ప్రయాగరాజ్‌లో వ్యవస్థలను సరిగ్గా నిర్వహించడానికి పెద్ద సంఖ్యలో జనం అవసరమవుతారని అన్నారు. ఆరువేల కంటే ఎక్కువమంది పడవలు నడిపేవారు, వేల మంది దుకాణదారులు, పూజా కార్యక్రమాలకు, పవిత్ర స్నానాలకు సహాయపడేవారికి పని పెరుగుతుంది. ఇది అనేక ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించడానికి, ఇతర నగరాలనుంచి వ్యాపారులు ఇక్కడికి సరకులు తీసుకువస్తారని ప్రధాని అన్నారు. కుంభమేళా ప్రభావం పొరుగున ఉన్న జిల్లాలపైన కూడా ఉంటుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రీకులు రైలు లేదా విమానం ద్వారా వస్తారని ఇది ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని అన్నారు. కుంభమేళా సమాజాన్ని బలలోపేతం చేయడమే కాకుండా ప్రజల ఆర్థిక సాధికారతకు తోడ్పడుతుందన్నారు.
సాంకేంతికతలో వస్తున్న పురోగతులు 2025లో జరిగే మహాకుంభమేళాను సరికొత్తగా తీర్చిదిద్దుతాయని శ్రీ మోదీ అన్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పెరిగారు. 2013 నాటి కంటే ఇప్పుడు డేటా చవకగా వస్తోంది. వినియోగదారులు ఉపయోగించడానికి అనువుగా ఉండే యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. పరిమిత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు సైతం వాటిని సులువుగా ఉపయోగించవచ్చని అన్నారు. ‘కుంభ సహాయక్’ చాట్ బాట్ ప్రారభించిన సందర్భంగా, కుంభమేళా కోసం 11 భారతీయ భాషల్లో సమాచారాన్ని అందించే ఏఐ, చాట్‌బాట్ సాంకేతికతలను మొదటిసారి ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఎక్కువ మందిని ఈ కార్యక్రమంలో భాగం చేయడానికి డేటా, సాంకేతికతలను వినియోగించాలని, కుంభమేళాను ఐక్యతా చిహ్నంగా సూచించే ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించాలని సూచించారు. సోషల్ మీడియాలో పంచుకున్న ఈ ఫొటోలు అంతులేని భావోద్వేగాలు, రంగులను మిశ్రమంగా చేసి గొప్ప దృశ్యాన్ని సృష్టిస్తాయి. వీటికి అదనంగా ఆధ్యాత్మికత, ప్రకృతి ఇతివృత్తాలుగా కుంభమేళా పరిధిని పెంచే, ముఖ్యంగా యువతలో దీని పట్ల ఆసక్తి పెరిగేలా పోటీలు నిర్వహించాలని సూచించారు.
మహాకుంభమేళా నుంచి ఉద్భవించే సామూహిక, ఆధ్యాత్మిక శక్తి అభివృద్ధి చెందిన భారతదేశం సాధించాలనే జాతీయ సంకల్పాన్ని బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. కుంభ స్నానం చారిత్రాత్మక, మరపురాని సందర్భంగా మిగిలిపోవాలని కాంక్షిస్తూ, గంగా, యమున, సరస్వతీ నదుల పవిత్ర సంగమం ద్వారా మానవాళి సంక్షేమం కోసం ప్రార్థించారు. పవిత్రమైన ప్రయాగరాజ్ నగరాన్ని సందర్శించాల్సిందిగా యాత్రీకులను కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య, శ్రీ బ్రజేష్ పాటక్, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు ప్రయాగరాజ్ చేరుకున్నారు. పవిత్ర నదీ సంగమ ప్రాంతాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం అక్షయ వట వృక్షానికి పూజలు చేశారు. తర్వాత హనుమాన్ మందిర్, సరస్వతీ కుండాలను సందర్శించి పూజలు చేశారు. మహా కుంభమేళా జరిగే ప్రదేశాన్ని సందర్శించారు.
మహా కుంభమేళా 2025 సందర్భంగా ప్రధానమంత్రి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రయాగరాజ్‌కు రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు వివిధ రైలు, రోడ్డు ప్రాజెక్టులు అభివృద్ధి చేశారు. వాటిలో 10 కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) లేదా ఫ్లైఓవర్లు, శాశ్వతంగా నిర్మించిన ఘాట్లు, రోడ్లు తదితరమైనవి ఉన్నాయి.
స్వచ్ఛమైన, నిర్మలమైన గంగానదిని తీర్చిదిద్దే దిశగా తన కృతనిశ్చయాన్ని తెలియజేస్తూ, చిన్న చిన్న మురుగు కాల్వల ద్వారా వచ్చే ప్రవాహాలను అడ్డుకోవడం, నియంత్రించడం, దారి మళ్లించే వ్యవస్థల ద్వారా మురుగు నీరు నదిలోకి చేరకుండా చేసే ప్రాజెక్టులను ప్రారంభించారు. నీటి సరఫరా, విద్యుత్ తదితర మౌలికవసతులకు సంబంధించిన కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభించారు.
భరద్వాజ ఆశ్రమ కారిడార్, శృంగవేర్పూర్ ధామ్ కారిడార్, అక్షయవత్ కారిడార్, హనుమాన్ మందిర్ కారిడార్ తదితర ప్రధాన ఆలయాల కారిడార్లను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇవి భక్తులు సులభంగా ఆలయాలను చేరుకొనేలా చేసి ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంపొందిస్తాయి. మహా కుంభమేళా 2025లో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను అందించడంతో పాటు, భక్తులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు వీలుగా రూపొందించిన కుంభ సహాయక్ చాట్ బాట్ ను ప్రధామంత్రి లాంఛనంగా ప్రారంభించారు.
***
MJPS/SR/TS
(Release ID: 2084680)
Visitor Counter : 13
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam