రక్షణ మంత్రిత్వ శాఖ
భారత నావికాదళంలోకి ‘ఐఎన్ఎస్ తుషిల్’ ప్రవేశానికి సంబంధించి సన్నాహక విశేషాలు
Posted On:
06 DEC 2024 2:26PM by PIB Hyderabad
బహుళ ప్రయోజనాల స్టెల్త్ గైడెడ్ క్షిపణి వాహకనౌక ‘ఐఎన్ఎస్ తుషిల్’ ను తన అమ్ములపొదిలో చేర్చుకునేందుకు భారత నావికాదళం సంసిద్ధమవుతోంది. రష్యా కలినిన్ గ్రాడ్ లో డిసెంబర్ 9న జరిగే కార్యక్రమానికి దేశ రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. రష్యా, భారత ప్రభుత్వాల ఉన్నతాధికారులు పాల్గొనే ఈ కార్యక్రమానికి శ్రీ రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తారు.
‘ప్రాజెక్ట్ 1135.6’లో భాగమైన ఐఎన్ఎస్ తుషిల్, క్రివాక్-3 యుద్ధనౌకల్లో అత్యాధునిక రకం నౌక. ప్రాజెక్ట్ 1135.6లో భాగమైన మూడు ‘తల్వార్’ రకం నౌకలు (ఇవి రష్యా దేశం సెంట్ పీటర్స్ బర్గ్ లోని బాల్టిస్కీ ఓడరేవులో నిర్మించారు), మూడు ‘టేగ్’ రకం నౌకలు (ఇవి రష్యా దేశం కలినిన్ గ్రాడ్ లోని యాంతార్ ఓడరేవులో నిర్మించారు), ఇప్పటికే క్రియాశీలంగా ఉంటూ సేవలందిస్తున్నాయి. ఇక ఏడో యుద్ధనౌక అయిన ఐఎన్ఎస్ తుషిల్, రష్యా దేశపు రక్షణ సామగ్రి విక్రయ సంస్థ ‘జేఎస్సీ రోసోబోరాన్ఎక్స్పోర్ట్’, భారత నావికాదళం, భారత ప్రభుత్వాల మధ్య 2016 అక్టోబర్ లో కుదిరిన ఒప్పందంలో భాగంగా నిర్మించే రెండు ‘అత్యాధునిక అదనపు’ యుద్ధనౌకల్లో మొదటిది. తాజా యుద్ధనౌక నిర్మాణాన్ని కలినిన్ గ్రాడ్ లోని భారత నిపుణుల ‘వార్ షిప్ ఓవర్ సీయింగ్’ బృందం పర్యవేక్షించింది. పర్యవేక్షణ కార్యక్రమానికి మాస్కోలోని భారత రాయబార కార్యాలయం నేతృత్వం వహించింది.
వివిధ రష్యా-భారత్ పరిశ్రమలకు (ఓఈఎంలు) చెందిన వందలాది కార్మికుల అలుపెరుగని కృషి వల్ల ఐఎన్ఎస్ తుషిల్ నిర్మాణం సాకారమయ్యింది. ఈ సంవత్సరం జనవరితో మొదలై... తుషిల్ యుద్ధనౌక ఫ్యాక్టరీ సీ ట్రయల్స్, స్టేట్ కమిటీ ట్రయల్స్, చివరగా భారత నిపుణుల బృందం నిర్వహించిన డెలివరీ యాక్సెప్టెన్స్ ట్రయల్స్ పేరిట దశలవారీగా అనేక పరీక్షలను ఎదుర్కొంది. ఈ పరీక్షల్లో... యుద్ధనౌకలో బిగించిన రష్యన్ పరికరాల సమగ్ర పరిశీలన, కాల్పుల సామర్థ్య పరీక్షలు భాగమయ్యాయి. పరీక్షణ కాలంలో యుద్ధనౌక 30 నాట్ ల చురుకైన వేగాన్ని నమోదు చేసింది. అనేక కఠినతర పరీక్షల్లో తన సామర్థ్యాన్ని రుజువు చేసుకున్న ఐఎన్ఎస్ తుషిల్, యుద్ధానికి సర్వసన్నద్ధ స్థితిలో భారత నావికాదళంలో చేరనుంది.
‘రక్షణ కవచం’ అన్న అర్ధం కల ‘తుషిల్’ యుద్ధనౌకపై ‘అభేద్య కవచ్’ అని చాటే చిత్రాన్ని అమర్చారు. ‘నిర్భయ్, అభేద్య ఔర్ బల్ శీల్’ (వెరపులేని, అజేయమైన, నిశ్చలమైన) అనేవి తన లక్షణాలని సగర్వంగా ప్రకటించుకునే తుషిల్ యుద్ధనౌక, దేశ తీరప్రాంత పరిరక్షణలో, నౌకా వాణిజ్య పరిరక్షణలో తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉంది.
125 మీటర్ల వైశాల్యం, 3900 టన్నుల బరువు గల తుషిల్ యుద్ధనౌక, రష్యా భారత దేశాల అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని యుద్ధనౌకాల నిర్మాణానికి ఉత్తమ ఉదాహరణగా నిలుస్తోంది. సరికొత్త డిజైన్ తో రూపొందిన ఈ నౌక మెరుగైన రహస్య వ్యవస్థలని, స్థిరత్వాన్ని కలిగి ఉంది. భారత నౌకాదళ నిపుణులు, ‘సెవర్ నాయ్ డిజైన్ బ్యూరో’ల పరస్పర సహకారం ద్వారా నౌకలో దేశీయ ఉపకరణాలు 26 శాతం, మేడిన్ ఇండియా వ్యవస్థలు దాదాపు రెట్టింపై 33 శాతానికి చేరుకున్నాయి. బ్రహ్మోస్ ఏరో స్పేస్, భారత్ ఎలక్ట్రానిక్స్, కెల్ట్రాన్, నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్, ఎల్కోమ్ మెరైన్, జాన్సన్ కంట్రోల్స్, వంటి అనేక భారతీయ సంస్థలు తుషిల్ యుద్ధనౌక నిర్మాణంలో పాలుపంచుకున్నాయి.
భారత నావికా దళ వెస్టర్న్ కమాండ్, వెస్టర్న్ ఫ్లీట్ కి చెందిన ‘స్వోర్డ్ ఆర్మ్’ విభాగంలోకి ప్రవేశించే ఐఎన్ఎస్ తుషిల్ యుద్ధనౌక, ప్రపంచంలోని అత్యాధునిక యుద్ధనౌకల సరసన చేరనుంది. పెరుగుతున్న మన నౌకాదళ సామర్థ్యానికి ఉత్తమ ఉదాహరణగా నిలిచే తుషిల్, బలోపేతం అవుతున్న భారత్-రష్యా దృఢమైన బంధానికి కూడా ప్రతీకగా నిలుస్తుంది.
****
(Release ID: 2081535)
Visitor Counter : 103