అంతరిక్ష విభాగం
పార్లమెంటులో ప్రశ్న: అంతరిక్ష వ్యర్థాల నిర్వహణ
Posted On:
04 DEC 2024 4:19PM by PIB Hyderabad
అంతరిక్ష సుస్థిరత కోసం అంతరిక్ష పరిస్థితులపై అవగాహన (ఎస్ఎస్ఏ)కు పెరుగుతున్న ప్రాధాన్యం దృష్ట్యా.. అంతరిక్షయాన భద్రత, వ్యర్థాలను తగ్గించడం, కిక్కిరిసి ఉన్న అంతరిక్ష వాతావరణం నిర్వహణలో సవాళ్లను ఎదుర్కోవడం కోసం చేపట్టిన అన్ని చర్యలపై ప్రధానంగా దృష్టి సారించడానికి ఇస్రో సురక్షిత, సుస్థిర అంతరిక్ష కార్యకలాపాల నిర్వహణ వ్యవస్థ (ఐఎస్4ఓఎం)ను నెలకొల్పారు.
ఎస్ఎస్ఏ సామర్ధ్య అభివృద్ధి కోసం అంతరిక్ష వస్తువుల గుర్తింపు, విశ్లేషణ యంత్రాంగం (నేత్ర)ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
అంతర్జాతీయంగా ఆమోదం పొందిన - ఐక్యరాజ్యసమితి అంతరిక్ష శాంతియుత వినియోగ కమిటీ (యూఎన్-కోపస్), అంతరిక్ష వ్యర్థాల్లో వివిధ సంస్థల మధ్య సమన్వయ కమిటీ (ఐఏడీసీ) సిఫార్సు చేసిన అంతరిక్ష వ్యర్థాల తక్కువ స్థాయిలో పరిమితం చేయడానికి సంబంధించిన మార్గదర్శకాలకు ఇస్రో సాధ్యమైనంత వరకు కట్టుబడి ఉంది.
అన్ని భారతీయ వాహక నౌకలకు ప్రమాద నివారణ విశ్లేషణ (సీవోఎల్ఏ)ను నిర్వహించి గమన సమయంలో ఢీకొనే ముప్పును నివారిస్తారు. ప్రస్తుత ఇస్రో ఉపగ్రహాలకు సమీపంగా వెళ్లే ముప్పును నిరంతరం అంచనా వేయడంతోపాటు ఢీకొనకుండా నివారించే ప్రక్రియలను (సీఏఎం) అవసరానికి తగినట్టుగా నిర్వహిస్తారు. ఒకవేళ దగ్గరగా వస్తున్న వస్తువు మరో క్రియాశీల ఉపగ్రహమైతే దాని యజమాని/నిర్వాహకులతో సమన్వయపరుస్తారు. తద్వారా వాటిలో ఒక ఉపగ్రహం మాత్రమే సీఏఎం నిర్వహిస్తుంది. కక్ష్య విచ్ఛిన్న సంఘటనలను చిత్రించడం, అంతరిక్ష వస్తువులు తిరిగి వాతావరణంలో ప్రవేశించడాన్ని పరిశీలించడం వంటి అంశాలతోపాటు పెరుగుతున్న అంతరిక్ష ట్రాఫిక్ వల్ల ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా.. సామీప్యతను అంచనా వేయడం కోసం నిర్వహణ పద్ధతులను మెరుగుపరిచేలా నిరంతర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఐఏడీసీ, ఐఏఏ (అంతర్జాతీయ అంతరిక్ష యాన సంస్థ), ఐఎస్ వో (అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ), ఐఏఎఫ్ (అంతర్జాతీయ వ్యోమగాముల సమాఖ్య), ఐక్యరాజ్య సమితి దీర్ఘకాలిక సుస్థిరతా బృందం వంటి అంతర్జాతీయ సంస్థల్లో క్రియాశీల సభ్యత్వం గల సంస్థగా.. అంతరిక్ష సుస్థిర వినియోగం కోసం సంబంధిత మార్గదర్శకాలు, సిఫార్సులను రూపొందించడంలో ఇస్రో ప్రధాన పాత్ర పోషించింది.
అంతరిక్ష వ్యర్థాలను తక్కువ స్థాయికి పరిమితం చేయాల్సిన ఆవశ్యకత, ఎస్ఎస్ఏ సామర్థ్యాభివృద్ధిలో భారత అంతరిక్ష విధానానికి అత్యంత ప్రాధాన్యం ఉంది.
ఇటీవల ప్రారంభించిన వ్యర్థ రహిత అంతరిక్ష కార్యక్రమానికి (డీఎఫ్ఎస్ఎం) కూడా ఇస్రో నేతృత్వం వహిస్తుంది. 2030 నాటికి భారతీయ ప్రభుత్వ, ప్రభుత్వేతర అంతరిక్ష భాగస్వాములందరూ వ్యర్థాలు లేకుండా అంతరిక్ష కార్యక్రమాలను చేపట్టేలా చూడడం దీని లక్ష్యం. అంతరిక్ష సుస్థిరత కోసం అంతర్జాతీయ ప్రయత్నాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఉంటుంది. అంతరిక్ష కార్యకలాపాల్లో రక్షణ, భద్రత, సుస్థిరతకు ప్రాధాన్యమిచ్చే దేశంగా భారత్ ను నిలుపుతుంది.
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ (స్వతంత్ర హోదా), భౌగోళిక శాస్త్రాల సహాయ (స్వతంత్ర హోదా), పీఎంవో సహాయ, అణుశక్తి, అంతరిక్ష శాఖ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ లోకసభలో ఓ లిఖితపూర్వక సమాచారంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2080944)
Visitor Counter : 83