ఉప రాష్ట్రపతి సచివాలయం
కొందరికే గుత్తాధిపత్యం కట్టబెట్టేలా చరిత్రను తప్పుదోవ పట్టించారు...మార్పులూ చేర్పులూ చేశారు... :ఉపరాష్ట్రపతి
విలువైన, అత్యున్నత త్యాగాలు చేసిన వారిని మనం చాలా కాలం విస్మరించాం: ఉపరాష్ట్రపతి
వ్యక్తిపూజకు పాల్పడుతూ, అనుగ్రహాన్ని కురిపిస్తూ, కొద్ది మందికి ఖ్యాతిని కట్టబెట్టడం ద్వారా చరిత్రను నిర్మించలేం: ఉపరాష్ట్రపతి
చర్చలతో, అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవాల్సిందింగా రైతులకు ఉపరాష్ట్రపతి పిలుపు
సరిదిద్దడానికి అవకాశంలేని, ఘర్షణ వైఖరి సరైన రాజనీతి కాదు: ఉపరాష్ట్రపతి
రైతులు నన్ను ఎప్పుడైనా కలవొచ్చు: ఉపరాష్ట్రపతి
రైతులు సంతృప్తిగా ఉంటేనే… వికసిత భారతం సాధ్యం: ఉపరాష్ట్రపతి
Posted On:
01 DEC 2024 2:51PM by PIB Hyderabad
మన చరిత్ర పుస్తకాలు… మన వీరులకు అన్యాయం చేశాయని ఉపరాష్ట్రపతి శ్రీ జగ్‌దీప్ ధన్కడ్ ఈ రోజు అన్నారు. ‘‘మన చరిత్రను తప్పుదోవ పట్టించారు. తారుమారు చేశారు. కేవలం కొద్ది మంది వల్లనే మనకు స్వాతంత్ర్యం వచ్చినట్లు ఒక గుత్తాధిపత్యాన్ని సృష్టించారు. మన మనస్సాక్షి భరించలేని తీరని బాధ ఇది. మన హృదయాలు, మనస్సులకు ఇది భారమే. అనేక గొప్ప మార్పులను మనం తీసుకురాగలమని నేను విశ్వసిస్తున్నాను. 1915లో తొలి భారత ప్రభుత్వం ఏర్పాటైన సందర్భాన్ని మించింది మరొకటి లేదు’’ అని ఉపరాష్ట్రపతి తెలిపారు.
రాజా మహేంద్ర ప్రతాప్ 138వ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజా మహేంద్ర ప్రతాప్- గొప్ప వ్యవహారదక్షుడనీ, రాజనీతిజ్ఞుడనీ, దూరదర్శి అనీ, జాతీయవాది అనీ చెప్పారు. రాజా మహేంద్ర ప్రతాప్ జాతీయవాదానికీ, దేశభక్తికీ, దూరదృష్టికీ ప్రతీకగా నిలిచారనీ, ఆచరణలో వాటిని పాటించి చూపారనీ శ్రీ జగ్‌దీప్ ధన్కడ్ అన్నారు.
స్వాతంత్ర్య పోరాటంలో పోరాడిన అనేక మంది వీరులకు సరైన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, ‘‘ఎంత అన్యాయం! ఎంతటి విషాదం! స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచాయి. ఈ గొప్ప వ్యక్తి చేసిన పనులను గుర్తించడంలో మనం పూర్తిగా విఫలమయ్యాం. ఆయనకు ఇవ్వాల్సిన స్థానాన్ని చరిత్ర ఇవ్వలేదు. స్వాతంత్ర్య పునాదులవైపు చూస్తే... మనకు బోధించింది ఇది కాదని తెలుస్తుంది. స్వాతంత్ర్యానికి పునాదులు వేసింది రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ లేదా అలాంటి చరిత్ర గుర్తించని వీరులనీ, లేదా కొద్దిపాటి గుర్తింపు మాత్రమే ఉన్న వారనీ అర్థం అవుతుంది’’ అని ఉప రాష్ట్రపతి తెలిపారు.
‘‘1932 లో మానవత్వం పరిమళించిన గొప్ప ఆత్మ, ఈ మహా దూరదర్శి, సామాన్య విషయాలను దాటి ఈ వ్యక్తి ఎదిగారు. ఎందుకంటే సమస్త మానవాళి ప్రేమించేది స్వంతంత్రాన్నే. నోబెల్ శాంతి బహుమతి కోసం ఈయన పేరును శ్రీ ఎన్.ఎ. నీల్సెన్ ప్రతిపాదించారు. దానికి ఆధారం ఏంటి? గాంధీకి ఖ్యాతిని అందించడంలో, దక్షిణాఫ్రికాలో గాంధీ ప్రచార ఉద్యమ సమయంలో ఈయన పోషించిన పాత్రే. నేను ఆ నామినేషన్ పత్రాన్ని పరిశీలించాను, అది పెద్దగా సమయాన్ని తీసుకోదు. దయచేసి దానిని చదవండి, ఈ మహానుభావుడి వ్యక్తిత్వాన్ని గురించి అందులోని ప్రతి పదమూ మీకు చెబుతుంది.’’ అని శ్రీ జగ్‌దీప్ ధన్‌ఖడ్ అన్నారు.
కొంతమంది జాతీయ వీరులను విస్మరించే ధోరణితో సాగిన చరిత్ర రచన పట్ల ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేస్తూ, ‘‘నచ్చిన వారికి తృప్తి కలిగించడం, వ్యక్తిపూజ చేయడం, ఇతరుల ఖ్యాతిని ఒకరికే కట్టబెట్టడం.. ఇలా చేసి మనం చరిత్రను నిర్మించుకోలేం. మనం మన వీరులను తక్కువచేసి చూపడాన్ని అనుమతించకూడదు. అలాంటి వారిలో ఒకరిని గురించి మనం ఈ రోజు చర్చించుకొంటున్నాం. ఈ తరంలో, భావితరాల వారిలో దేశభక్తిని రగిలించాలంటే వాస్తవ చరిత్ర గాథలను చెప్పుకోక తప్పద’’న్నారు.
‘‘అభివృద్ధి చెందిన దేశమనే హోదాను సాధించడానికి రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఉపరాష్ట్రపతి శ్రీ జగ్‌దీప్ ధన్కడ్ అన్నారు. ‘‘నాకు ఎప్పుడూ ఓ ఆలోచన వస్తుంటుంది. ఈ స్వతంత్ర భారతంలో మన దేశ ప్రజలు సాధించిన గొప్ప పనులకు తగిన గౌరవాన్ని గుర్తింపును ఇవ్వడానికి మనం ఏమి చేయాలి? ఇప్పుడున్న వ్యవస్థ బాగుంది, ఆర్థికంగా ఎంతో ప్రగతి నమోదవుతోంది. ఆర్థిక రంగంలో, మౌలిక సదుపాయాల కల్పనలోను మనం గొప్ప వృద్ధిని సాధించుకొన్నాం. మన గ్లోబల్ ఇమేజ్ చాలా ఉన్నతంగా ఉంది. కానీ నేను చెప్పినట్టు... 2047కల్లా ఒక అభివృద్ధి చెందిన దేశం హోదాను సాధించాలంటే దాని కోసం ముందుగా మనం మన రైతులను సంతోషపెట్టాల’’ని ఉపరాష్ట్రపతి అన్నారు.
చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని రైతు సోదరులకు శ్రీ జగ్‌దీప్ ధన్కడ్ సూచించారు. ‘‘మనం మన సొంత ప్రజలతో పోరాడం, మనవారిని మోసం చేయం, శత్రువును మాత్రమే మోసం చేస్తామనే విషయాన్ని మరచిపోకూడదు. మన సొంత ప్రజలను దగ్గరకు తీసుకోవాలి. రైతుల సమస్యల్ని వెనువెంటనే పరిష్కరించకుండా ఎవరైనా ఎలా నిద్రపోగలుగుతారు? చర్చలు, అవగాహన.. ఈ పద్ధతిలోనే ఈ దేశంలో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నేను నా రైతు సోదరులకు తెలియజేస్తున్నాను. ఈ విధానాన్నే అవలంబించారనే పేరు రాజు మహేంద్ర ప్రతాపునికి ఉంది. ఘర్షణ వైఖరి పేలవమైన రాజనీతి అవుతుంది’’ని ఉపరాష్ట్రపతి అన్నారు.
ఉపరాష్ట్రపతి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ‘‘మనం పరిష్కారాల కోసం వేచి ఉండాలి, చర్చలకు సంసిద్ధంగా ఉండాలి, ఎందుకంటే ఈ దేశం మనందరిదీ. ఇది గ్రామీణ నేపథ్యాలతో ప్రభావితమవుతోంది. నారైతు సోదరులు, వారు ఎక్కడ ఉన్నా, ఏ ఉద్యమంలో ఉన్నా, నేనిస్తున్న సందేశం వారిని చేరుకుంటుందని, వారు దీనిపై శ్రద్ధ వహిస్తారని నేను నమ్ముతున్నాను. మీ అందరూ నాకంటే ఎక్కువ జ్ఞానం, అనుభవం ఉన్నవారు. రైతుల సమస్యకు త్వరితగతిన పరిష్కారాన్ని కనుగొనడానికి సానుకూల శక్తులన్నీ కలసి ముందుకు వస్తాయన్న నమ్మకం నాకుంది’’ అని అన్నారు.
రైతులు మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్న ఉప రాష్ట్రపతి.. వారికి అన్ని విధాలుగా చేతనైన సాయాన్ని అందిస్తానని హామీనిచ్చారు. ‘‘మనం ఒకసారి వెనక్కు తిరిగి చూసుకోవాలి. గతంలో ఏమి జరిగినా గానీ మన ముందున్న మార్గం సరైనదిగా ఉండాలి. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడమనే పని రైతు పొలం నుంచే ఆరంభం అవుతుంది. వికసిత్ భారత్ కు బాట వ్యవసాయ క్షేత్రం మీదుగానే వెళ్తుంది. రైతుల సమస్యలను శరవేగంగా పరిష్కరించాలి. రైతు కష్టాల్లో ఉంటే దేశ ప్రజల గౌరవం, గర్వం తీవ్రంగా దెబ్బతింటాయి. మన అంతరంగంలోని మాటల్ని ఎవరితోనూ పంచుకోకుండా మన వద్దే ఉంచుకోవడం వల్లే ఇలా ఎక్కువసార్లు జరుగుతోంది. ఈ శుభ దినాన, రైతుల సమస్యల్ని తీరుస్తానని నేను శపథం చేస్తున్నాను, నా ఇంటి తలుపులు 24 గంటలూ తెరిచే ఉంటాయి. ఈ పనిని చేయడం ద్వారా నేను స్వాతంత్య్రానికి ఒక కొత్త కోణాన్నీ అందించేందుకు నా వంతు తోడ్పాటు అందిస్తాను. అలాగే రాజా మహేంద్ర ప్రతాప్ ఆత్మకు శాంతి చేకూరుతుంది’’ అని శ్రీ జగ్‌దీప్ ధన్కడ్ అన్నారు.
కొన్ని ముఖ్యమైన చరిత్రాత్మక ఘట్టాలకు పెద్దగా ప్రాముఖ్యాన్ని ఇవ్వకపోవడాన్ని శ్రీ జగ్‌దీప్ ధన్కడ్ ప్రశ్నించారు. ‘‘బిర్సా ముండా 150వ జయంతిని స్మరించుకొంటూ... ఇటీవల నేను ఉదయ్‌పూర్‌లోని కోట్రాకు వెళ్ళాను. కొంతమంది స్నేహితులతో భేటీ అయ్యాను. 1913 మంగర్ హిల్ ఉదంతం గుండెను పిండేస్తుంది. ఆ ఏడాదిలోనే జరిగిన జలియన్ వాలాబాగ్ కన్నా చాలా ముందే, 1507 మంది గిరిజనులు బ్రిటిషు వారి తుపాకీ గుండ్లకు బలయ్యారు. ఎంత ఘోరం? ఎంత పిరికి చర్య అది! దీనికి చరిత్రలో ఏమంత ప్రాముఖ్యాన్ని ఇవ్వనేలేదు. బ్రిటీషు వారు ఒడిగట్టిన అంతటి దారుణకాండకు, మహారాజా సూరజ్ మల్, రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్‌ల దేశభక్తి పూరిత గాథల్ని అరకొరగానే ప్రస్తావించారెందుకు? చరిత్రలో వాటికి ఎందుకని స్థానం దక్కలేదు? అని నేను అడుగుతున్నాను. ఈ ముఖ్యమైన సందర్భం ఆ మార్పును తీసుకువచ్చేదిగా, ఒక కీలకమైన మైలురాయిగా మారుతుంది’’ అని అన్నారు.
భారత్‌లో కొంత మంది అర్హులకు భారతరత్న పురస్కారాన్ని అందించడంలో జాప్యం జరగడాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ, ‘‘డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు ఈ పురస్కారం దక్కింది 1990వ సంవత్సరంలో. ఈ జాప్యం ఎందుకు జరిగింది? ఈ తరహా మనస్తత్వాన్ని గురించి ఒక్కసారి ఆలోచించండి. పార్లమెంటులో ఒక సభ్యుడిగా, ఒక మంత్రిగా పనిచేసే అదృష్టాన్ని నేను పొందాను. రాజకీయాల పరంగా మార్పు చోటుచేసుకొంది. చౌధరి చరణ్ సింగ్, కర్పూరీ ఠాకుర్ మన హృదయాల్లో సజీవులుగా ఉంటున్నారు. మన మెదళ్లలో చైతన్యాన్ని నింపుతున్నారు. వారు రైతుని, గ్రామీణ భారతాన్ని విశ్వసించారు. మరో సారి, ఉప రాష్ట్రపతిగా, రాజ్య సభ అధ్యక్షునిగా పాలనతో సాన్నిహిత్యాన్ని కలిగి ఉండే గొప్ప అదృష్టం నాకు లభించింది. ఈ ఇద్దరు భారతీయ మహనీయులను ఇటీవలే భారతరత్నతో గౌరవించారు.’’
‘‘మనం మనకు మార్గదర్శులుగా నిలిచిన వారిని చాలా కాలం పాటు విస్మరించాం. నిజానికి వారు దేశం కోసం గొప్ప త్యాగం చేశారు. గిరిజన దినోత్సవాన్ని జరుపుకోవడం ఇటీవలే మొదలైంది. బిర్సా ముండా ఎప్పటి వారు? అసలు చేయకపోవడం కంటే ఆలస్యంగానైనా చేయడం మంచిదే. పరాక్రమ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం.. రాజా మహేంద్ర ప్రతాప్ నిజానికి సుభాష్ చంద్ర బోస్ కన్నా ముందే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే, నేతాజీ ఆరంభించిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి అంకురాన్ని వేసింది రాజా మహేంద్ర ప్రతాప్. 1945లో అండమాన్, నికోబార్‌లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జెండాను ఎగరేసిన ప్రదేశాన్ని సందర్శించడం నాకు ఇప్పటికీ గుర్తుంది. దానికి 30 ఏళ్ళ కిందటే, ఈ పవిత్రమైన పనిని రాజా మహేంద్ర ప్రతాప్ చేశారని తెలిసినప్పుడు నేనెంతో సంతోషించాను’’ అని శ్రీ జగ్‌దీప్ ధన్కడ్ వివరించారు.
పార్లమెంటు సభ్యునిగా రాజా మహేంద్ర ప్రతాప్ అందించిన సేవలను శ్రీ జగ్‌దీప్ ధన్కడ్ గుర్తుచేస్తూ, ‘‘ఆయన పార్లమెంటు సభ్యుడుగా ఉన్న సమయంలో సభలో ఆయన ఎలా నడుచుకొన్నారో నేను ఆసాంతం చదివాను. ఆయనకు ఎంత దూరదృష్టి ఉందో, ఆయన ఎన్ని అంశాలపై ఆలోచనలు చేశారో నేను గమనించాను. చాలా ప్రత్యేకమైన విషయమొకటి నాకు తెలిసింది. 1957 నవంబరు 22న ఆయన లోక్ సభలో ఒక ప్రతిపాదనను తీసుకువచ్చారు. ఏమిటా ప్రతిపాదన? మనం కొంత మందిని సత్కరించుకోవాలి అన్నదే ఆ ప్రతిపాదన. ఎందుకని ఆ పనిని మనం చేయాలి? ఎందుకు అంటే, వారు దేశ వ్యవహారాలలో, అది స్వాతంత్య్ర సమరం లేదా ఇతర అంశాలకు చెందినది కావచ్చు.. గొప్ప తోడ్పాటును అందించారు. అందుకే ఆయన ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులను మనం గౌరవించుకోవాలని ఆయన కోరుకున్నారు. వారే వీర్ సావర్కర్, వీరేంద్ర కుమార్ ఘోష్.. ఈయన అరబిందో సోదరుడు, ఇక మూడో వ్యక్తి డాక్టర్ భూపేంద్రనాథ్ దత్త.. ఈయన వివేకానందుని సోదరుడు. ఎంత గొప్పగా ఎంపిక చేశారు?’’
‘‘మళ్ళీ, మనతో కూడా ఇలాగే జరిగేలా ఉంది, కానీ మేం ఇక ఇలా జరగనివ్వం. ఆ ప్రతిపాదనను అప్పటి ప్రభుత్వం కాదంది. రాజా మహేంద్ర ప్రతాప్ ఎంతగా బాధ పడ్డారంటే, ‘‘ఈ నిర్ణయానికి నిరసనగా, నేను సభ నుంచి వెళ్లిపోవాల్సిందే. ప్రతి బెంగాలీ, ప్రతి మరాఠా సభ్యుడు సభ నుంచి నిష్క్రమిస్తారని నేను ఆశిస్తున్నాను.’’ అని ఆయన తన దుఃఖాన్ని ఇలా వ్యక్తం చేశారు, విశిష్ట సభ్యులు, గౌరవ సభ్యులారా, ప్రాంతీయ, సైద్ధాంతిక సరిహద్దులకు అతీతంగా స్వాతంత్య్ర యోధుల్ని గౌరవించుకోవాలన్నదే రాజా సాహెబ్ దృఢనిశ్చయానికి ఈ క్షణం ఉదాహరణగా నిలుస్తోంది. అలాంటి మహానుభావుడి కోసం మనం ఏమీ చేయలేమా? మనం నిస్సహాయులమేం కాదు. మనమంతా కలిసికట్టుగా భరత మాత ముద్దుబిడ్డకు దక్కాల్సిన గౌరవాన్ని దక్కేటట్టుగా చూద్దాం’’ అని శ్రీ జగ్‌దీప్ ధన్కడ్ అన్నారు.
పూర్తి పాఠాన్ని ఈ కింది లింకులో చదవగలరు:
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2079506
****
(Release ID: 2079757)
Visitor Counter : 9