మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
తొలిసారి అంగన్వాడీ లేదా శిశు సంరక్షణ కేంద్రాలుగా
శిశుసంరక్షణ సేవలను విస్తరించిన మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఇప్పటి వరకు ఇంటి పనిలో భాగంగా భావించిన శిశు సంరక్షణ సేవలను అధికారికం చేయనున్న శిశు సంరక్షణ కేంద్రాలు
ఉద్యోగ హోదాతో సంబంధం లేకుండా తల్లులందరికీ పాల్నా విభాగం ద్వారా శిశు రక్షణ సదుపాయాలు
Posted On:
29 NOV 2024 4:22PM by PIB Hyderabad
మహిళల విద్య, నైపుణ్యం, ఉపాధిపై ప్రభుత్వ నిరంతర కార్యక్రమాల ఫలితంగా వారికి ఉపాధి అవకాశాలు పెరిగాయి. చాలా మంది మహిళలు ఇప్పుడు తమ ఇళ్ల నుంచే, లేదా ఇంటి నుంచే బయటికొచ్చి పనిచేస్తూ లాభదాయకమైన ఉపాధిని పొందుతున్నారు. పెరుగుతున్న పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల కూడా నగరాల్లోకి వలసలు పెరగడానికి కారణమయ్యాయి. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలను ఇంట్లోవారు చూసుకునే అవకాశముండేది. కొన్ని దశాబ్దాలుగా చిన్న కుటుంబాలు వేగంగా పెరిగాయి. దాంతో, ఉద్యోగులైన మహిళల పిల్లలకు రక్షణ, భద్రత అందించే శిశు సంరక్షణ కేంద్రాలు (క్రష్) ఆవశ్యకమయ్యాయి. సరైన సంరక్షణ సేవలు లేకపోవడం మహిళలు బయటకు వెళ్లి పని చేసుకోవడానికి ప్రతిబంధకంగా మారింది. కాబట్టి, వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలు రెండింటిలోనూ పనిచేసే మహిళల కోసం అత్యున్నతమైన నాణ్యతతో కూడిన శిశు సంరక్షణ కేంద్రాలు అత్యావశ్యకం.
పిల్లలకు సరైన భద్రత, రక్షణ విషయంలో పనిచేసే తల్లులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులను పరిష్కరించడం కోసం పాల్నా విభాగం శిశు సంరక్షణ కేంద్రాలను అందిస్తోంది. ఇప్పటి వరకు ఇంటి పనిలో భాగంగా భావించిన శిశు సంరక్షణ సేవలను శిశు రక్షణ కేంద్రాలు అధికారికం చేస్తాయి. ‘గౌరవప్రదమైన పనిని ప్రోత్సహించడం’ ద్వారా సంరక్షణ చర్యల అధికారికీకరణ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లోని 8వ లక్ష్యాన్ని సాధించడంలో దోహదపడుతుంది. గౌరవప్రదమైన పని, ఆర్థిక వృద్ధిని ఆ లక్ష్యం సూచిస్తుంది. ఎలాంటి చెల్లింపు ప్రతిఫలమూ లేకుండా పిల్లల సంరక్షణ బాధ్యతల్లో ఉన్న చాలా మంది తల్లులకు కూడా లాభదాయకమైన ఉపాధిని పొందడానికి ఇది అవకాశం కల్పిస్తుంది.
అంగన్‌వాడీ కేంద్రాలు ప్రపంచంలో అతిపెద్ద శిశుసంరక్షణ సంస్థలు. ఇవి క్షేత్రస్థాయి వరకు పిల్లలకు అవసరమైన సంరక్షణ సౌకర్యాలను అందిస్తాయి. మొదటిసారిగా అంగన్వాడీ - శిశు సంరక్షణ కేంద్రాల (ఏడబ్ల్యూసీసీ) ద్వారా పిల్లల సంరక్షణ సేవలను మంత్రిత్వ శాఖ విస్తరించింది. భద్రమైన, సురక్షితమైన వాతావరణంలో రోజంతా శిశు సంరక్షణ సేవలను అందించేలా ఇది అవకాశం కల్పిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ‘మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యాన్ని’ పెంచడం అంగన్వాడీ- శిశు సంరక్షణ కేంద్రాల లక్ష్యం. పిల్లలకు (6 నెలల నుంచి 6 సంవత్సరాల వయస్సు వరకు) సురక్షితమైన సంరక్షణ సేవలను అందించడం, పోషకాహార సదుపాయం, ఆరోగ్య సేవలు, పిల్లల మేధో వికాసం, పిల్లల ఎదుగుదలనూ - వ్యాధినిరోధకతనూ పర్యవేక్షించడం పాల్నా విభాగం లక్ష్యం. ఉద్యోగ హోదాతో నిమిత్తం లేకుండా తల్లులందరికీ శిశు సంరక్షణ కేంద్ర సదుపాయాన్ని కల్పిస్తారు.
వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల నుంచి ఏడబ్ల్యూసీసీల ఏర్పాటు, నిర్వహణ కోసం ప్రతిపాదనలు స్వీకరిస్తారు. పథకం అమలు కోసం తమ వాటాను కూడా వారు అందించాల్స ఉంటుంది. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి స్వీకరించిన ప్రతిపాదనల ప్రకారం మొత్తం 10,609 ఏడబ్ల్యూసీసీలు ఆమోదం పొందాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏడబ్ల్యూసీసీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది. వాటన్నింటినీ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. వీటిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రారంభించాల్సి ఉంది.
లోకసభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీమతి సావిత్రి ఠాకూర్ ఈ సమాచారాన్ని అందించారు.
(Release ID: 2079368)
Visitor Counter : 76