ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
వయో వృద్ధులకు ఆరోగ్య బీమాపై తాజా సమాచారం
27 వైద్యపరమైన అంశాల్లో 1961 విధానాలకు సంబంధించి నగదు రహిత సేవలందిస్తున్న ఏబీ పీఎం-జేఏవై
వివిధ వయసుల వ్యక్తులకు అందుబాటులో సాధారణ ఔషధాలు, సాధారణ శస్త్ర చికిత్స, ఎముకలు-కీళ్ల చికిత్స, హృదయ సంబంధ చికిత్స, ఆంకాలజీ
70 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న వృద్ధుల కోసం దాదాపు 14 లక్షల ఆయుష్మాన్ వయో వందన కార్డులు
Posted On:
29 NOV 2024 3:56PM by PIB Hyderabad
ఏడాదికి కుటుంబానికి రూ. 5 లక్షల వరకూ ఉచిత చికిత్స ప్రయోజనాలను అందించే ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై)ను కేంద్ర ప్రభుత్వం మరింత విస్తరించింది. వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 70 ఏళ్లు నిండిన వయో వృద్ధులందరినీ దీని పరిధిలోకి తెస్తూ అక్టోబర్ 29 న నిర్ణయం తీసుకుంది.
తాజా జాతీయ ప్రత్యేక ఆరోగ్య ప్రయోజన ప్యాకేజీ (హెచ్ బీపీ)లో.. 27 ప్రత్యేక వైద్యపరమైన అంశాల్లో 1961 విధానాలకు సంబంధించి నగదు రహిత ఆరోగ్య రక్షణ సేవలను ఈ పథకం అందిస్తుంది. సాధారణ ఔషధాలు, సాధారణ శస్త్రచికిత్స, ఎముకలు-కీళ్ల చికిత్స, హృద్రోగ విభాగం, ఆంకాలజీ సహా వివిధ అంశాలు దీని పరిధిలోకి వస్తాయి. వివిధ వయస్సుల వారు దీనిని పొందవచ్చు. వీటిలో హీమో డయాలసిస్/ పెరిటోనియల్ డయాలసిస్, తీవ్రమైన రక్త ప్రసరణ లోపాలు (ఇస్కిమిక్ స్ట్రోక్), రక్తపోటు పెరగడం, మొత్తంగా తుంటి ఎముక మార్పిడి, మొత్తం మోకాలి మార్పిడి, పీటీసీఏ, డయాగ్నొస్టిక్ యాంజియోగ్రామ్, గుండెలో ఒక గదిలో శాశ్వత గతి ప్రేరకాన్ని అమర్చడం (సింగిల్ చాంబర్ పర్మినెంట్ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్), రెండు గదుల శాశ్వత గతి ప్రేరకాన్ని అమర్చడం వంటి చికిత్సాపరమైన సేవలు అర్హులైన వయోవృద్ధులకు కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్య ప్రయోజన ప్యాకేజీలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మరింత అనుకూలంగా మలచుకునేందుకు రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించారు.
దేశవ్యాప్తంగా 70 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసున్న లబ్ధిదారులుండే కుటుంబాల సంఖ్య 4.5 కోట్లు ఉంటుందని అంచనా. అలాంటి 6 కోట్ల మంది వ్యక్తులు ఈ పథకం పరిధిలోకి వస్తారు.
నవంబరు 25 నాటికి 70 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువ వయస్సున్న వృద్ధుల కోసం దాదాపు 14 లక్షల ఆయుష్మాన్ వయో వందన కార్డులను ఈ పథకం ద్వారా సృష్టించారు.
ఈ పథకం కోసం మొత్తం రూ.3,437 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇందులో 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు కేంద్ర వాటా వ్యయంలో రూ.2,165 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అక్టోబరు 31 నాటికి మొత్తం 29,870 హాస్పిటళ్లు దీని పరిధిలో ఉండగా.. వాటిలో 13,173 ప్రైవేటు హాస్పిటళ్లు.
లోకసభలో ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాపరావ్ జాదవ్ ఈ అంశాలను పేర్కొన్నారు.
(Release ID: 2079295)
Visitor Counter : 90