పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వినియోగదారులకు పెట్రోలును, డీజిల్‌ను న్యాయమైన, సముచితమైన ధరలలో అందించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు

Posted On: 28 NOV 2024 4:59PM by PIB Hyderabad

వినియోగదారులకు వివిధ వస్తువులను, సరకులను న్యాయమైన, సముచితమైన ధరలకు అందించేటట్లు చూడడానికి ప్రభుత్వం అనేక చర్యలను తీసుకొంటోంది. దేశంలో 2021 నవంబరులో, లీటరు పెట్రోలు ధర రూ.110.04 గాను, లీటరు డీజిలు ధర రూ.98.42 గాను ఉన్నది కాస్తా, ఈ సంవత్సరం నవంబరు 18 నాటికి ఢిల్లీలో అమలులో ఉన్న ధరల ప్రకారం చూస్తే పెట్రోలు ఒక్కో లీటరు ధర రూ. 94.77 కు, డీజిలు ఒక్కో లీటరు ధర రూ. 87.67కు తగ్గాయి. 2021 నవంబరులోనూ, మళ్లీ 2022 మే నెలలోనూ రెండు విడతలుగా సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోలుపై లీటరు ఒక్కింటికి మొత్తం రూ. 13, డీజిల్ పై లీటరున ఒక్కింటికి రూ. 16 మేర కేంద్ర ప్రభుత్వం తగ్గించి, ఆ తగ్గింపునకు సంబంధించిన ప్రయోజనాలను వినియోగదారులకు అందించింది. పౌరులకు ఊరటనివ్వడానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్ర వీఏటీ (వేల్యూ యాడెడ్ ట్యాక్స్.. విలువ ఆధారిత పన్ను) రేట్లను తగ్గించాయి. గత మార్చి నెలలో, చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎమ్‌సీస్) దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ల చిల్లర ధరల్లో ఒక్కో లీటరుకు చెరో రూ. 2 వంతున తగ్గించాయి.

 

అంతర్జాతీయ స్థాయిలో అధికంగా ఉన్న ధరల భారం సామాన్య పౌరులపై పడకుండా చూడడానికి కేంద్ర ప్రభుత్వం సైతం అనేక ఇతర చర్యలను చేపట్టింది. ఈ చర్యల్లో, ముడి చమురును దిగుమతి చేసుకొంటున్న దేశాలు కొన్నింటిలో మార్పుచేర్పులను చేయడం, పెట్రోలియం ఉత్పాదనల ఎగుమతిపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను విధించడం, దేశయ విపణిలో పెట్రోలు, డీజిల్ లభ్యతకు మార్గాన్ని సుగమం చేయడానికి యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ నిబంధనలను అమల్లో కి తీసుకురావడం, పెట్రోలులో ఇథనాల్‌ను కలిపే నిష్పత్తి పరిమితిని పెంచడం మొదలైనవి భాగంగా ఉన్నాయి.

 

ఇటీవల ప్రభుత్వ రంగంలోని ఓఎమ్‌సీలు అంతర్ రాష్ట్ర సరకు రవాణాను క్రమబద్ధీకరించే చర్యలను చేపట్టాయి. దీనితో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిన దానికి సంబంధించిన ప్రయోజనాలను రాష్ట్రాలలో గల పెట్రోలియం ఆయిల్ & లూబ్రికెంట్స్ (పీఓఎల్) డిపోల కు ఎంతో దూరంగా ఉన్న ప్రాంతాల్లోని వినియోగదారులు అందుకున్నారు. ఈ చర్య ఒక రాష్ట్రంలో వర్తించే పెట్రోలు లేదా డీజిల్.. ఈ రెండింటి గరిష్ఠ చిల్లర ధరల, కనీస చిల్లర ధరల మధ్య ఉన్న తేడాను కూడా తగ్గించివేసింది. ఈ సమాచారాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ సురేశ్ గోపి లోక్ సభకు నిన్న ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.

 

***


(Release ID: 2079289)