సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav
iffi banner

55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ తొలి దర్శకుడిగా పురస్కారం గెలుచుకున్న నవజ్యోత్ బందీవాడేకర్

కుటుంబ సంబంధాల మధ్య సంక్లిష్టతను బందీవాడేకర్ అద్భుతంగా తెరకెక్కించారు, లోతైన భావోద్వేగాలే ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి: జ్యూరీ

55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) 2024లో భారతీయ ఫీచర్ చిత్రం ఉత్తమ తొలి దర్శకుడు పురస్కారాన్ని మరాఠీ చిత్రం ‘ఘరాత్ గణపతి’ చిత్రానికి నవజ్యోత్ బందీవాడేకర్ గెలుచుకున్నారు. దర్శకుడిగా బందీవాడేకర్ తొలి ప్రయత్నాన్ని ఈ పురస్కారం తెలియజేస్తూనే చిత్ర రంగంలో సరికొత్త, ఉత్తేజకరమైన గొంతుకగా గుర్తించింది.

 

భారతీయ ఫీచర్ చిత్రం ఉత్తమ తొలి దర్శకుడు పురస్కార విభాగాన్ని ఈ ఏడాది ఇఫీ ఉత్సవాల్లోనే పరిచయం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న యువ దర్శకుల ప్రతిభతో పాటు భారతీయ చిత్ర రంగం అభివృద్ధికి వారు అందిస్తున్న తోడ్పాటుకు గుర్తింపుగా నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ పురస్కారాన్ని అందిస్తున్నాయి.

 

అసాధారణ రీతిలో మరాఠీ చిత్రం ‘ఘరాత్ గణపతి’ కథనాన్ని తెరకెక్కించిన నవజ్యోత్ బందీవాడేకర్ కు 55 వ ఇఫీ ముగింపు ఉత్సవాల్లో పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం, రూ. 5 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు.

దర్శకుడిగా తన ప్రతిభను ప్రదర్శిస్తూనే సంప్రదాయ, ఆధునిక భావాల మధ్య వారధిగా మనసుకు హత్తుకునే కథనాన్ని రూపొందించిన బందీవాడేకర్ సామర్థ్యాన్ని జ్యూరీ ప్రశంసించింది. ‘‘కుటుంబ సంబంధాల మధ్య ఉన్న సంక్లిష్టతను బందీవాడేకర్ అద్భుతంగా తెరకెక్కించారు. లోతైన భావోద్వేగాలను ప్రతిబింబిస్తూనే కుటుంబ జీవితంలోని సూక్ష్మమైన భేదాలను ప్రధానంగా చూపించిన ఆయన దర్శకత్వమే దీనిని తొలి చిత్రంగా ప్రత్యేకంగా నిలిపింది’’ అని జ్యూరీ ప్రశంసించింది.

 

ట్రైలర్ వీక్షించండి:

 

ప్రివ్యూ కమిటీ ప్రతిపాదించిన ఐదు చిత్రాలను సమీక్షించిన తర్వాత అసాధారణ ప్రతిభను కనబరిచిన బందీవాడేకర్ ను ఏకగ్రీవంగా జ్యూరీ ఎంపిక చేసింది. ‘ఘరాత్ గణపతి’లో చక్కగా మలచిన కథనాన్ని, ఉత్తమ ప్రదర్శనలను జ్యూరీ ప్రశంసించింది. ‘తరాల మధ్య అంతరాలున్నప్పటికీ కుటుంబ ఐక్యతను ఈ చిత్రం ప్రదర్శిస్తుంది’ అని జ్యూరీ తెలిపింది.

ఉత్తమ డెబ్యూ దర్శకుడ్ని ఎంపిక చేసిన జ్యూరీలో సినిమాటోగ్రాఫర్, దర్శకుడు శ్రీ సంతోష్ శివన్ (ఛైర్ పర్సన్), నటుడు, దర్శకుడు, చిత్ర నిర్మాత శ్రీ సునీల్ పురాణిక్, చిత్ర దర్శకుడు, కథా రచయిత శ్రీ శేఖర్ దాస్, సినిమాటోగ్రాఫర్, దర్శకుడు శ్రీ ఎంవీ రఘు, దర్శకుడు, రచయిత, ఎడిటర్ శ్రీ వినీత్ కనోజియా సభ్యులుగా ఉన్నారు.

 

దేశ వ్యాప్తంగా వివిధ చిత్ర, కళా సమాజాలకు చెందిన ప్రముఖ నిపుణులతో కూడిన ప్రివ్యూ కమిటీ అర్హత పొందిన 117 ఎంట్రీల నుంచి అయిదు చిత్రాలను ఎంపిక చేసింది. భారతీయ ఫీచర్ చిత్రం ఉత్తమ డెబ్యూ దర్శకుడు విభాగంలో పోటీ పడిన చిత్రాల వివరాలను ఇక్కడ చదవండి.

 

గోవాలో జరుగుతున్న ఇఫీలో భాగంగా కొన్ని రోజుల క్రితం పీఐబీ ఏర్పాటు చేసిన పత్రికాసమావేశంలో నవజ్యోత్ బందీవాడేకర్ మాట్లాడుతూ ‘‘కుటుంబ సభ్యులందరి మధ్య ఉండే పరస్పర సంబంధాలను వినోదభరితమైన. అస్తవ్యస్థ పరిస్థితుల ద్వారా ఘరత్ గణపతి అన్వేషిస్తుంది’’ అని తెలిపారు.

iffi reel

(Release ID: 2079287) Visitor Counter : 43