రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇక ప్రయాణికులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం: భారత రైల్వే చర్యలు

Posted On: 27 NOV 2024 7:38PM by PIB Hyderabad

ప్రయాణికులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి భారతీయ రైల్వే నిరంతరం మెరుగైన చర్యలు తీసుకుంటోంది. ఈ దిశగా కింది చర్యలు తీసుకుంది:

  • నిర్దేశిత బేస్ కిచెన్ల నుంచి ఆహారం సరఫరా.

  • కొన్ని ప్రాంతాలను గుర్తించి ఆధునిక బేస్ కిచెన్లు ఏర్పాటు చేయడం.

  • ఆహారాన్ని సిద్ధం చేసే విధానాన్ని మెరుగ్గా పర్యవేక్షించడం కోసం సీసీటీవీ కెమెరాల ఏర్పాటు.

  • ఆహారం కోసం వంటనూనె, పిండి, బియ్యం, పప్పులు, మసాలా, పనీర్, పాల ఉత్పత్తుల వంటి పదార్థాల్లో మంచిపేరున్న వాటిని, మన్నికైన వాటిని ఎంపిక చేయడం.

  • ఆహార భద్రత, పరిశుభ్రమైన పద్ధతులను పర్యవేక్షించడానికి బేస్ కిచెన్లలో ఆహార భద్రతా పర్యవేక్షకులను నియమించడం.

  • రైళ్లలో ఆన్ బోర్డ్ ఐఆర్ సీటీసీ పర్యవేక్షకులను నియమించడం.

  • ఆహార ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్ లను ప్రవేశపెట్టడం. వాటి ద్వారా వంటశాల పేరు, ప్యాక్ చేసిన తేదీ వంటి వివరాలు తెలుసుకునేందుకు అవకాశం కల్పించడం.

  • బేస్ కిచెన్లు, వంట ప్రదేశాలను (పాంట్రీ కార్) రోజూ బాగా శుభ్రం చేయడం, ఎప్పటికప్పుడు (ప్రతీ 15 రోజులకు ఒకసారి) వంటశాలల్లో క్రిమి నియంత్రణ చర్యలు చేపట్టడం.

  • ఆహార భద్రతా నిబంధనలకు అనుగుణంగా.. ప్రతీ కేటరింగ్ యూనిట్ నిర్దేశిత ఆహార భద్రతా అధికారుల నుంచి భారత ఆహార భద్రత, ప్రమాణాల అధీకృత సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ధ్రువీకణ పొందడం తప్పనిసరి.

  • పర్యవేక్షణ, నియంత్రణ యంత్రాంగంలో భాగంగా ఎప్పటికప్పుడు ఆహార నమూనాలను సేకరించి రైళ్లలో ఆహార నాణ్యతను మెరుగుపరచడం.

  • వంట ప్రదేశాలు (పాంట్రీ కార్), బేస్ కిచెన్లలో పరిశుభ్రత, నాణ్యతను పరీక్షించడానికి థర్డ్ పార్టీ అడిట్ నిర్వహిస్తారు. వినియోగదారుల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నారు.

  • ఆహారభద్రత అధికారులతోపాటు రైల్వే/ఐఆర్ సీటీసీ అధికారుల రోజువారీ, ఆకస్మిక తనిఖీలు.

  • రైళ్లలో ఆహార పదార్థాల జాబితాను హేతుబద్ధంగా వ్యవస్థీకరించడం.. తద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులు, పిల్లల వంటి వివిధ వర్గాల వ్యక్తుల కోసం చిరుధాన్యాల ఆధారిత స్థానిక ఉత్పత్తులు సహా తగిన ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలను రూపొందించడానికి అవకాశం ఉంటుంది. ప్రాధాన్యం ప్రకారం ప్రాంతీయ వంటకాలు, కాలానుగుణమైన పదార్థాలను పరిచయం చేయవచ్చు.

కేటరింగ్ సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరిచి.. వినియోదారులకు అందించే సంభాషణ, మర్యాదగా ప్రవర్తించడం, సేవా ప్రమాణాలు, వస్త్రధారణ, పరిశుభ్రత వంటి సేవలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టేలా ఐఆర్ సీటీసీ ఎప్పటికప్పుడు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

రైల్లో ఆహార పదార్థాలను ముందుగా నిర్ణయించిన ధరలకే విక్రయిస్తారు. భారతీయ రైల్వేల్లో కేటరింగ్ వస్తువుల ధరలపై సమాచారం అందించడానికి- సంక్షిప్త సందేశాలు/మెయిల్ లు, జాబితాతోపాటు ధరలను వెయిటర్లు ప్రదర్శించడం వంటి చర్యల ద్వారా ప్రయాణికులకు వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక పర్యవేక్షణ కార్యక్రమాలు సహా రోజువారీ, ఆకస్మిక తనిఖీలను రైల్వే/ఐఆర్ సీటీసీ అధికారులు చేపడుతున్నారు.

లోకసభలో ఓ లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర రైల్వే, సమాచార-ప్రసార, ఎలక్ట్రానిక్స్- సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ సమాచారం అందించారు.  

 

***


(Release ID: 2078592) Visitor Counter : 52
Read this release in: English , Urdu , Hindi , Punjabi