iffi banner
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అక్కినేని నాగేశ్వరరావు (ఎఎన్నార్) కు 55వ ఇఫీలో ఘన నివాళులు


“తెలుగు సినిమా బలమైన శక్తిగా ఎదగడంలో ఏఎన్నార్ దార్శనికత ఎంతో కీలకమైంది” అన్న అక్కినేని నాగార్జున

భారతీయ చలనచిత్ర రంగానికి మార్గదర్శిగా నిలిచిన సుప్రసిద్ధ నటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావుకి 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ), “సెంటినరీ స్పెషల్ ఎఎన్నార్: సెలబ్రేటింగ్ ది లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ అక్కినేని నాగేశ్వరరావు” పేరిట ఏర్పాటైన ప్రత్యేక సమావేశంలో నివాళులర్పించింది. పణజీలోని కళా అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు శ్రీ నాగార్జున అక్కినేని, ప్రఖ్యాత నటి శ్రీమతి ఖుష్బూ సుందర్‌ ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.



అక్కినేని నట జీవితంలోని మైలురాళ్ళు, తెలుగు సినిమా రంగ అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషిని తెలిపే వీడియో ప్రదర్శనతో సమావేశం ప్రారంభమయ్యింది. తన తండ్రితో గల అపురూపమైన జ్ఞాపకాలనూ అనుభూతులనూ అక్కినేని నాగార్జున నెమరువేసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఎదుగుదల కోసం అక్కినేని నాగేశ్వరరావు చూపిన దార్శనికతను నాగార్జున ప్రస్తావించారు.  

 “తెలుగు సినిమా రంగాన్ని బలమైన శక్తిగా తీర్చిదిద్దాలన్న స్పష్టమైన లక్ష్యంతో నాన్నగారు పనిచేసేవారు” అన్న నాగార్జున, “తెలుగు చిత్రపరిశ్రమకు మూలస్తంభం వంటి అన్నపూర్ణ స్టూడియో స్థాపన ఆయన చలవే” అని అన్నారు. తెలుగు చిత్రాలను భారతదేశమంతటా ప్రదర్శించగలిగే స్థాయికి తీర్చిదిద్దాలన్న ఆయన తపన ఎంతో ముందుచూపు కలదని శ్రీ నాగార్జున వ్యాఖ్యానించారు. “భాష కళకు అవరోధం కారాదన్న ఆయన ఆలోచన ఎంతో అధునాతనమైనది”  అని నాగార్జున అభివర్ణించారు.  

 



ఎఎన్నార్ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యతను గురించి శ్రీమతి ఖుష్బూ నాగార్జునతో చర్చించారు. అన్నపూర్ణా ఫిలిమ్ కళాశాల నిర్వహణ వంటి అనేక కార్యక్రమాల ద్వారా తన కుటుంబం తండ్రి ఘన వారసత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోందని నాగార్జున వెల్లడించారు. “చిత్ర పరిశ్రమ పట్ల ఆసక్తిగల రాబోయే తరానికి ప్రయోజనం చేకూర్చాలన్న లక్ష్యంతో కళాశాలను స్థాపించాం” అని అన్నారు.

అనంతరం జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు జీవితం ఆధారంగా సినిమా రానుందా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ... “ఆయన జీవితం లోని ఘట్టాలూ, లక్ష్యాలను ప్రతిబింబించేందుకు డాక్యుమెంటరీ చిత్రమే సరైన మాధ్యమం కాగలదు” అని నాగార్జున వివరించారు.

సినీరంగానికి అక్కినేని నాగేశ్వరరావు అందించిన సేవలు చిరస్మరణీయమైనవని నాగార్జున, ఖుష్బూ అందించిన నివాళితో కార్యక్రమం ముగిసింది. భారతీయ చిత్రరంగ దిగ్గజం శ్రీ అక్కినేని నాగేశ్వరరావు చెరగని ముద్రను తలుచుకున్న ప్రేక్షకులు కూడా ఆయనకు నివాళులు అందించారు.  

 

మరింత సమాచారం: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=207082

iffi reel

(రిలీజ్ ఐడి: 2076920) సందర్శకుల సూచీ సంఖ్య : : 65
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , English , हिन्दी , Konkani , Tamil , Assamese , Urdu , Kannada