ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జనజాతీయ గౌరవ్ దివస్ పురస్కరించుకొని ఈ నెల 15న ప్రధాని బీహార్ పర్యటన

ఇది ఏడాది పాటు సాగే భగవాన్ బీర్సా ముండా 150వ జయంత్యుత్సవాల ప్రారంభానికి సూచన
రూ.6640 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్న ప్రధాని

ప్రధాని చేతుల మీదుగా రెండు గిరిజన స్వాతంత్ర్య పోరాట యోధుల మ్యూజియంలు,

గిరిజన తెగల సంస్కృతి పరిరక్షణకు రెండు గిరిజన పరిశోధనా సంస్థల ప్రారంభం


గిరిజనుల జీవన సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా బహుళ ప్రాజెక్టుల ప్రారంభం
పీఎం జన్మన్ పథకం ద్వారా నిర్మించిన 11,000 ఇళ్ల గృహ ప్రవేశాలకు ప్రధాని

Posted On: 13 NOV 2024 6:39PM by PIB Hyderabad

జనజాతీయ గౌరవ్ దివస్ పురస్కరించుకుని ఈ నెల 15న బీహార్‌లోని జముయి పట్టణాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సందర్శిస్తారు. ఇది ఏడాది పాటు సాగే ధార్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంత్యుత్సవాల ప్రారంభాన్ని సూచిస్తుంది. ఉదయం 11 గంటల సమయంలో భగవాన్ బిర్సా ముండా గౌరవార్థం స్మారక నాణేన్ని, తపాలా బిళ్లను ప్రధాని విడుదల చేస్తారు. ఈ ప్రాంతంలోని గ్రామాలు, మారుమూల ప్రదేశాల్లో గిరిజన తెగల అభ్యున్నతికి, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో రూ. 6,640 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.

 

ప్రధానమంత్రి జనజాతి ఆదీవాసి న్యాయ మహా అభియాన్ (పీఎం-జన్మన్) పథకం ద్వారా నిర్మించిన 11,000 ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు పీఎం జన్మన్ పథకం ద్వారా నిర్మించిన 23 మొబైల్ మెడికల్ యూనిట్ల (ఎంఎంయూలు)తో పాటు ధార్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (డీఏజేజీయూఏ) ద్వారా నిర్మించిన 30 ఎంఎంయూలను ప్రారంభిస్తారు.

 

ఔత్సాహిక గిరిజన వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు, జీవనోపాధి కల్పనకు తోడ్పడేందుకు 30 వన్ ధన్ వికాస్ కేంద్రాలు (వీడీవీకే), గిరిజన విద్యార్థుల కోసం సుమారు రూ.450 కోట్లతో నిర్మించిన 10 ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా, జబల్‌పూర్‌లలో నిర్మించిన రెండు గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియలను ప్రారంభిస్తారు. అలాగే గిరిజన తెగల సుసంపన్నమైన చరిత్ర, సంస్కృతిని లిఖిత రూపంలో నిక్షిప్తం చేసి, సంరక్షించేందుకు జమ్మూలోని శ్రీనగర్‌లో, సిక్కింలోని గాంగ్‌టక్‌లో నిర్మించిన రెండు గిరిజన పరిశోధనా సంస్థలను కూడా ఆయన ప్రారంభిస్తారు.

 

గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు 500 కి.మీ. నూతన రహదారులతో పాటు పీఎం జన్మన్ ఆధ్వర్యంలో సామాజిక కేంద్రాలుగా పనిచేసేందుకు 100 మల్టీ పర్పస్ సెంటర్ల (ఎంపీసీ) నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. అలాగే గిరిజన చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించే దృఢసంకల్పంతో రూ 1,110 కోట్లతో అదనంగా నిర్మించ తలపెట్టిన 25 ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలకు కూడా శంకుస్థాపన చేస్తారు.

 

వివిధ అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి నిధులు మంజూరు చేశారు. వాటిలో పీఎం జన్మన్ ద్వారా రూ.500 కోట్లతో 25,000 గృహాల నిర్మాణం, ధార్తి ఆబా జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ (డీఏజేజీయూఏ) ద్వారా రూ 1960 కోట్ల వ్యయంతో 1.16 లక్షల ఇళ్ల నిర్మాణం, రూ. 1,100 కోట్లతో పీఎం జన్మన్ ద్వారా 66 వసతి గృహాలు, డీఏజేజీయూఏ ద్వారా 304 వసతి గృహాల నిర్మాణం, పీఎం జన్మన్ ద్వారా 50 మల్టీ పర్పస్ కేంద్రాలు, 55 మొబైల్ మెడికల్ యూనిట్లు, 65 అంగన్వాడి కేంద్రాలు, సికెల్ సెల్ అనీమియాను నిర్మూలించేందుకు 6 సహాయ కేంద్రాలు, రూ. 500 కోట్లతో డీఏజేజీయూఏ ద్వారా ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల పునరుద్ధరణతో సహా 300 ప్రాజెక్టులు ఉన్నాయి.

 

***

 


(Release ID: 2073181) Visitor Counter : 45