రక్షణ మంత్రిత్వ శాఖ
అద్భుతంగా సాగిన ఫైనల్ తో... ముగిసిన భారత నౌకా దళ క్విజ్ - థింక్ 2024
విజేతగా నిలిచిన జైపూర్ జయశ్రీ పెరివాల్ హైస్కూల్
Posted On:
09 NOV 2024 11:03AM by PIB Hyderabad
దేశ పురోగతి, వికసిత భారత దార్శనికతను చాటేలా భారత నౌకా దళ ఆధ్వర్యంలో థింక్ 2024 క్విజ్ ను నిర్వహించారు. భారత సముద్ర వారసత్వ సంపదకు, అభ్యున్నతి కాంక్షకు ప్రతీకగా నిలిచే ఎళిమల నావికదళ అకాడమీలోని మనోహరమైన నలంద బ్లాక్ ప్రతిష్ఠాత్మకంగా జరిగిన తుదిపోటీలకు వేదికైంది. ఉత్సాహంగా సాగిన ఈ పోటీని బడి పిల్లలు, నౌకాదళ సిబ్బంది, కుటుంబాలు, మాజీ సైనికోద్యోగులు, ఐఎన్ఏకు చెందిన విశిష్ట అతిథులు, ట్రైనీలు వీక్షించారు. అన్ని జట్లు హోరాహోరీ తలపడి మేధో మథనాన్ని తలపించిన ఈ పోటీలు ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగించాయి.
థింక్ 2024 ట్రోఫీలో తీవ్రమైన పోటీని ఎదుర్కొని జైపూర్ లోని జయశ్రీ పెరివాల్ హైస్కూల్ విజేతగా నిలవగా, చెన్నైకి చెందిన బీవీ భవన్ విద్యాశ్రమం రన్నరప్ గా నిలిచింది. నౌకా దళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేశ్ కె. త్రిపాఠి, నేవీ వెల్ఫేర్ అండ్ వెల్ నెస్ అసోసియేషన్ (ఎన్ డబ్ల్యూడబ్ల్యూఏ) అధ్యక్షురాలు శ్రీమతి శశి త్రిపాఠి విజేతలను, కార్యక్రమంలో పాల్గొన్న వారిని, ఈ అద్భుతమైన కార్య్రక్రమం విజయవంతం కావడానికి దోహదం చేసిన పాఠశాలల సిబ్బందినీ సత్కరించారు.
మేధో వినిమయంతోపాటు పోటీ పడి అసాధారణ ప్రతిభా పాటవాలను ప్రదర్శించడానికి యువ భారత్ కు థింక్2024 జాతీయస్థాయి వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమం కేవలం క్విజ్ మాత్రమే కాదు.. ఇది పోటీ తత్వానికి, యువతకు, వికసిత భారత్ కోసం భారత నౌకా దళ కృషికి నిదర్శనం. అభివృద్ధి పథంలో ప్రయాణాన్ని కొనసాగిస్తున్న భారత్ లో పోటీ తత్వంతోపాటు నౌకాదళ స్ఫూర్తిమంతమైన సేవలను పరిచయం చేస్తూ భావి నాయకులను తీర్చిదిద్దడంలో థింక్ వంటి కార్యక్రమాలు కీలకమైనవి.
***
(Release ID: 2072415)
Visitor Counter : 26