విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్‌టీపీసీ లో 50వ ఆవిర్భావ దినోత్సవం దేశాభివృద్ధికి అయిదు దశాబ్దాలుగా అండదండలు

Posted On: 08 NOV 2024 11:59AM by PIB Hyderabad

 భారతదేశంలో అతి పెద్ద విద్యుదుత్పాదక సంస్థ ఎన్‌టీపీసీ లిమిటెడ్ 50వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహించుకొంది. ఈ సంస్థ ఇన్నేళ్లుగా మన దేశ విద్యుత్తు రంగానికి దన్నుగా నిలుస్తూనే వృద్ధిలోను, నూతన ఆవిష్కరణలలోను అసాధారణ పురోగతిని సాధిస్తూ వస్తోంది. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎమ్‌డీ) శ్రీ గుర్‌దీప్ సింగ్ ఎన్‌టీపీసీ జెండాను నోయెడా లోని ఇంజినీరింగ్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఈఓసీ)లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ బోర్డు డైరెక్టర్లతోపాటు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ వేడుకలలో ఎన్‌టీపీసీ దేశవ్యాప్త కార్యాలయాలకు చెందిన ఉద్యోగులు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా పాలుపంచుకొన్నారు.

ఇదే కార్యక్రమంలో ఎన్‌టీపీసీ సీఎమ్‌డీ లే ప్రాంతంలో త్వరలో సేవలను అందించనున్న హైడ్రోజన్ బస్సులను దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ హైడ్రోజన్ బస్సులు స్వచ్ఛ సాంకేతికతను, కాలుష్యానికి తావివ్వని టెక్నాలజీని మునుముందుకు తీసుకుపోవాలని ఎన్‌టీపీసీ చెప్పుకున్న సంకల్పాన్ని నెరవేర్చే దిశలో ఒక ముందడుగు అని చెప్పాలి.

 

ఎన్ టీపీసీ సీఎమ్ డీ ఒక ప్రధాన కార్యసాధనను గురించి కూడా ప్రకటించారు. అది ఏమిటంటే- పీఈఎమ్ ఎలక్ట్రోలైజర్ నుంచి ఉత్పత్తి చేసిన హైడ్రోజన్‌కు ఫ్లూ గ్యాస్ నుంచి వేరు పరచిన కార్బన్‌ డైయాక్సైడ్ (సీఓ2) ను కలిపి, ఆ తరువాత ఆ మిశ్రమాన్ని ఎన్‌టీపీసీ వింధ్యాచల్ కర్మాగారంలో మిథనాల్ గా మార్చే ప్రక్రియే.

కార్బన్ డై ఆక్సైడ్ ను ఒడిసిపట్టేందుకు ఏర్పాటు చేసిన ప్లాంటు, కార్బన్ డై ఆక్సైడ్ నుంచి మెథనాల్ తయారీ ప్లాంటు.. ఈ రెండూ కూడా ప్రపంచంలో ఈ కోవకు చెందిన మొట్టమొదటి ప్లాంట్లు కావడం విశేషం. కర్బనః నియంత్రణతో పాటు, పర్యావరణానికి తక్కువ నష్టంతో ఇంధనాన్ని ఉత్పత్తి చేసే దిశలో వేసిన ఒక చరిత్రాత్మక ముందడుగుకు గుర్తుగా ఈ ప్లాంట్లు ఉన్నాయని శ్రీ గుర్‌దీప్ సింగ్ అన్నారు.

తదుపరి తరానికి చెందిన (జెన్-4) ఇథనాల్, పర్యావరణ హిత యూరియా ఉత్పత్తి (గ్రీన్ యూరియా), ఇంకా దీర్ఘకాలం పాటు వినియోగించ గలిగే విమానయాన ఇంధన ఆవిష్కరణ.. వీటిపై ఎన్‌టీపీసీ కసరత్తు చేస్తోందని కూడా సంస్థ సీఎమ్‌డీ శ్రీ గుర్ దీప్ సింగ్ తెలిపారు. మిథనాల్ తయారీ కోసం ఉద్దేశించిన తొలి దేశీయ ఉత్ప్రేరకాన్ని కూడా ఎన్‌టీపీసీ అభివృద్ధిపరచడమే కాక పరీక్షించింది. ఈ సంస్థ హైడ్రోజన్, కార్బన్ కాప్చర్ తదితర సరికొత్త టెక్నాలజీల రూపకల్పనలో చెప్పుకోదగిన ప్రగతిని సాధించింది. ఈ అంశాలన్నీ పర్యావరణానికి తక్కువ నష్టంతో లేదా పర్యావరణానికి ఎంతమాత్రం హాని కలగకుండా చూస్తూ.. ఎక్కువ కాలం మనుగడను కొనసాగించగలిగే విధంగా మానవ జాతి భవిష్యత్తును తీర్చిదిద్దాలన్న సంస్థ తపనను తేటతెల్లం చేసేవేనని ఆయన అన్నారు.

ఎన్‌టీపీసీ కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన దేశ ప్రగతికి సంస్థ అందించిన సేవలకు అద్దం పట్టే విధంగా ఒక అధికార చిహ్నాన్ని (లోగో) ఆవిష్కరించారు. ఈ కొత్త లోగోలోని మెలిక వృద్ధికి, శ్రేష్ఠత్వానికి సదా పరిశ్రమిస్తూనే ఉంటామన్న భావనను ప్రతిబింబిస్తూ... సంస్థ 50 ఏళ్ళుగా అపార అవకాశాలను కల్పించిందని సూచిస్తున్నది.

సంస్థ సిబ్బంది పిల్లల అసాధారణ విజయాలను కూడా శ్రీ గుర్‌దీప్ సింగ్ ఈ సందర్భంగా తెలుసుకొన్నారు. దీనికి తోడు, అనేక నూతన ఐటీ సేవలను, ఎన్‌టీపీసీ లో బాలికలకు సాధికారత కల్పన కోసం అమలు చేస్తున్న గర్ల్ ఎంపవర్ మెంట్ మిషన్ (జిఇఎమ్) కార్యక్రమాన్ని గురించి తెలియజెప్పే ఒక ప్రత్యేక కామిక్ బుక్‌ ను కూడా సంస్థ సీఎమ్ డీ ఆవిష్కరించారు. ఎన్‌టీపీసీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ ఆర్) కార్యక్రమాలలో జీఈఎమ్ యే ప్రధాన కార్యక్రమం.  గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న 10,000 మందికి పైగా బాలికలకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ది చేకూరింది.

ఎన్‌టీపీసీ యాత్ర సాటిలేనిదిగా ఉందని శ్రీ గుర్‌దీప్ సింగ్ చెబుతూ.. ఈ వ్యాపార సంస్థకు పునాదిని వేసిన వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ డీవీ కపూర్, ఇతర మార్గదర్శుల దార్శనిక భరిత నాయకత్వ ప్రతిభ పాటవాలను ప్రశంసించారు.

 ‘‘గత 50 సంవత్సరాల్లో వృద్ధికి ఎన్‌టీపీసీ ఊతాన్ని ఇస్తూ వస్తోంది. మరి మా దృఢ దీక్ష మా సంస్థ ఒక మేలైన పనితీరు కలిగిన వ్యాపార సంస్థగా ఎదిగేటట్టు చేసింది. మన దేశ భవిష్యత్తుకు చోదక శక్తిగా ఉండాలన్న తాపత్రయం ఇక మీదటా కొనసాగుతుంది. ఒక హద్దంటూ ఉండని రీతిలో అవకాశాలను కల్పిస్తూ మన పునరుత్పాదక ఇంధన విస్తృతికి నిరంతర తోడ్పాటును అందిస్తూనే ఉంటాం’’ అని సీఎమ్‌డీ అన్నారు.

 

 

ఎన్‌టీపీసీ లిమిటెడ్ భారత్ లో అతి పెద్ద ఏకీకృత విద్యుదుత్పాదక సంస్థ. దేశానికి అవసరమైన విద్యుత్తులో నాలుగింట ఒక వంతు విద్యుత్తును ఈ సంస్థే సమకూర్చుతున్నది. ధర్మల్ విద్యుత్తు, జల విద్యుత్తు, సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు యంత్రాంగాల వంటి వివిధ ఉత్పాదక విభాగాలతో వర్ధిల్లుతున్న ఎన్‌టీపీసీ ఆధారపడదగిన, తక్కువగా ఖర్చు అయ్యే, దీర్ఘకాలం పాటు విద్యుత్తు సదుపాయాలను ప్రజలకు సమకూర్చడానికి కంకణం కట్టుకొంది. ఈ కంపెనీ అత్యుత్తమ విధానాలను, పర్యావరణ పూర్వకమైన అనుసరిస్తూ, నూతన ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తూ.. స్వచ్ఛ ఇంధన సాంకేతికతలను అవలంబిస్తూ హరిత భవిత మార్గంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

 

****


(Release ID: 2071771) Visitor Counter : 62


Read this release in: English , Urdu , Hindi , Tamil