నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పరిశోధన, అభివృద్ధి అంశాలపై ఎక్స్‌లెన్స్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను ఆహ్వానించిన భారత ప్రభుత్వం
గ్రీన్ హైడ్రోజన్‌కు చెందిన అనేక అంశాలలో సమగ్ర పరిశోధనకు తోడ్పడనున్న ఎక్స్‌లెన్స్ సెంటర్లు
Posted On:
07 NOV 2024 9:04AM by PIB Hyderabad
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో భాగంగా పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) పథకం పరిధిలో ఎక్స్‌లెన్స్ సెంటర్ల (సీఓఈ)ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా భారత ప్రభుత్వం కోరింది. నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎమ్ఎన్ఆర్ఈ) ఈ నెల 4న ప్రతిపాదనలను సమర్పించాల్సిందిగా కోరింది.
ప్రతిపాదనల ఆహ్వానాన్ని ఇక్కడ చూడొచ్చు... here.
భారత్ లో దీర్ఘ కాలం పాటు గ్రీన్ హైడ్రోజన్ సంబంధిత నూతన ఆవిష్కరణలను కొనసాగించడానికీ, గ్రీన్ హైడ్రోజన్ వినియోగాన్ని ప్రోత్సహించడానికీ, ఇంధన వాడకం పరంగా మన దేశం స్వతంత్ర వైఖరిని అవలంబించడానికీ ఈ ప్రపంచ శ్రేణి ఎక్స్ లెన్స్ సెంటర్లను (సీఓఈస్) ను స్థాపించ తలపెట్టారు. గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయడాన్ని, గ్రీన్ హైడ్రోజన్ ను నిల్వ చేయడాన్ని, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని ప్రోత్సహించే వాతావరణంలో కార్బన్- డై- ఆక్సైడ్ పాళ్ల స్థాయిని తగ్గించడానికి ప్రాధాన్యాన్ని కట్టబెట్టే ఆర్థిక వ్యవస్థ ను ఆవిష్కరించే ప్రక్రియను ఈ సీఓఈస్ లు వేగవంతం చేయనున్నాయి.
అత్యాధునిక పరిశోధనలను, నైపుణ్యాభివృద్ధిని, సమాచార వ్యాప్తినీ ఈ సీఓఈ స్ లు ముఖ్య లక్ష్యాలుగా పెట్టుకొంటాయి. గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీలలో నూతన ఆవిష్కరణలను ముందుకు తీసుకు పోవడానికి పరిశ్రమ రంగ ప్రముఖులు, విద్యారంగ ప్రముఖులు, ప్రభుత్వం సహా ఆయా ఆసక్తిదారుల మధ్య ఈ సీఈఓస్ లు సమన్వయం చేస్తాయి. దీనితో కొత్త కొత్త ఉత్పాదనల ఆవిష్కరణకు, సమర్థ ప్రక్రియల రూపకల్పనకు మార్గం ఏర్పడుతుంది. గ్రీన్ హైడ్రోజన్ అనుకూల వాతావరణాన్ని దేశం అంతటా విస్తరించడానికి ఈ కేంద్రాలు అందుబాటులో ఉన్న వనరులను, ఒక చోటుకు చేర్చి, తత్సంబంధిత నైపుణ్యాన్ని ఉపయోగించుకోనున్నాయి.
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో భాగంగా పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) పథకాన్ని అమలులోకి తీసుకు రావడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను నూతన పునరుత్పాదక ఇంధన శాఖ (ఎమ్ఎన్ఆర్ఈ) ఇంతకు ముందే, అంటే గత మార్చి నెలలో 15వ తేదీన విడుదల చేసింది.
మార్గదర్శకాల కోసం..క్లిక్ చేయండి..here.
ప్రతిపాదనల ఆహ్వానాన్ని (CfP)ని పరిశీలించి ప్రతిపాదనలను దాఖలు చేయడానికి వివిధ పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు భాగస్వామ్యాలను ఏర్పరచుకొనేందుకు అవకాశం ఉంది. ఆ తరహా కేంద్రాలను గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో భాగంగా నెలకొల్పడానికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది.
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను కిందటి సంవత్సరంలో జనవరి 4న ప్రారంభించారు. ఈ మిషన్ కు ఆర్థిక సంవత్సరం (ఎఫ్ వై) 2029-30 వరకూ రూ.19,744 కోట్లు ఖర్చు పెట్టనున్నారు. స్వచ్ఛ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు స్వచ్ఛ ఇంధనం దిశగా మరలడానికి ప్రేరణను అందించి భారతదేశం స్వయం సమృద్ధ దేశం (ఆత్మ నిర్భర్)గా నిలిచే లక్ష్య సాధనకు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ తన వంతు సహకారాన్ని అందించనుంది. ఈ మిషన్ శిలాజ జనిత ఇంధనాల దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తూ... వాతావరణంలోని కర్బన ఉద్గారాలను చెప్పుకోదగిన స్థాయికి తగ్గిస్తూ, గ్రీన్ హైడ్రోజన్ విపణిలో నాయకత్వ స్థానాన్ని సంపాదించడానికి అవసరమైన టెక్నాలజీని భారతదేశం అందిపుచ్చుకోవడానికి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ తోడ్పడనుంది.
***
(Release ID: 2071536)
Visitor Counter : 109