ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉత్తరాఖండ్ లో నీటి సరఫరా, పారిశుధ్యం, పట్టణ ప్రాంతాలలో ప్రజారవాణా, ఇంకా ఇతర పట్టణ ప్రధాన సేవల కోసం ఏడీబీతో 200 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం

Posted On: 06 NOV 2024 3:44PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) 200 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందాన్ని  ఈ రోజు కుదుర్చుకొన్నాయి. ఈ రుణం ద్వారా సమకూరిన నిధుల్ని ఉత్తరాఖండ్ లో నీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, పట్టణ ప్రాంతాలలో రవాణా సదుపాయాలు తదితర సేవల మెరుగుదలకు ఉపయోగిస్తారు.

రుణ ఒప్పంద పత్రాలపై కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగ సంయుక్త కార్యదర్శి జూహీ ముఖర్జీ, ఏడీబీ తరఫున ఇండియా రెసిడెంట్ మిషన్ కంట్రీ డైరెక్టర్ మియో ఒకా సంతకాలు చేశారు.

 

కేంద్ర ప్రభుత్వ పట్టణ ప్రాంతాల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక, పట్టణ ప్రాంతాలలో సేవలను మెరుగుపరచాలన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వ కార్యక్రమాల స్ఫూర్తికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉందని జూహీ ముఖర్జీ తెలిపారు. నగరాల్లో నివాస యోగ్యతను పెంచడం, పర్యావరణానికి తక్కువ నష్టం కలిగేటట్టు చూస్తూ ఎక్కువ కాలం పాటు జీవన సౌలభ్యాన్ని సమకూర్చడం ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ఉందని ఆయన వెల్లడించారు.

‘‘ఉత్తరాఖండ్‌లో ప్రజల రక్షణకు, ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తూనే, వరదలు, కొండ చరియలు విరిగి పడడం వంటి వాతావరణ పరమైన, పర్యావరణ పరమైన ప్రతికూలతలకు తట్టుకొని నిలిచే సదుపాయాలను పట్టణ ప్రాంతాలలో నెలకొల్పడానికి ఉద్దేశించింది ఈ ప్రాజెక్టు’’ అని మియో ఒకా చెప్పారు. ‘‘ఇది ప్రాజెక్టు నిర్వహణలో రాష్ట్ర ఏజెన్సీల సామర్థ్యాన్ని పెంచుతుంది. వాతావరణ మార్పులకు, విపత్తులకు తట్టుకొనే ప్రణాళికలకు, స్వీయ వనరుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి, స్త్రీపరుషుల మధ్య అసమానత్వాన్ని తగ్గించేందుకు ప్రాధాన్యాన్ని ఇస్తుంది’’ అని కూడా ఆమె అన్నారు.

 

రాష్ట్రంలో ఆర్థిక కూడలిగా ఉన్న హల్ ద్వానీలో రవాణా, పట్టణ ప్రాంతాలలో సార్వజనిక రవాణా, మురుగునీటి పారుదల, వరద జలాల నిర్వహణలతో సహా ప్రజలకు మొత్తం మీద చక్కని సేవలను ఈ ప్రాజెక్టు అందించనుంది.  దీనికి తోడు, ఈ ప్రాజెక్టు ప్రతికూల వాతావరణ పరిస్థితులలో సైతం అడ్డంకుల్లేకుండా పని చేయగలిగే నీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి పరిచి చంపావత్, కిచ్చా, కోట్‌ద్వార్, వికాస్ నగర్.. ఈ నాలుగు నగరాలలోను నీటి సరఫరా వ్యవస్థను ఇప్పటి కన్నా ఎంతో మెరుగు పరచనున్నది.

 

హల్ ద్వానీలో 16 కిలోమీటర్ల మేర వాతావరణ ప్రతికూలతల ప్రభావానికి లోనుకాని రహదారులను నిర్మించడం, వాహనాల రాకపోకలకు పటిష్ట నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయడం, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్  (సీఎన్‌జీ) బస్సులను, ప్రయోగాత్మక ప్రాతిపదికన విద్యుత్తు బస్సులను ప్రవేశపెట్టడం వంటివి ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి.  నగరం ప్రకృతి విపత్తుల బారిన పడకుండా చూడటానికి వరద జలాల పారుదలకు అనువుగా 36 కి.మీ. పొడవైన కాల్వలను, రహదారుల పక్కన కాల్వలను నిర్మించడంతో పాటు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను సమకూర్చనున్నారు. ప్రజలకు అందించే సేవలలో మెరుగుదల కోసం గ్రీన్ సర్టిఫికెట్ స్థాయి ప్రమాణాలతో పరిపాలన భవన సముదాయాన్ని, బస్సు టర్మినల్‌ను నిర్మిస్తారు. 

 

మిగతా నాలుగు నగరాలలో- అన్ని కాలాల్లో పకడ్బందీగా పనిచేసే గొట్టపు మార్గాలను స్మార్ట్ వాటర్ మీటర్లతో సహా 1,024 కి.మీ. మేర ఏర్పాటు చేయడం, 26 బోర్లతోపాటు కొత్త జలాశయాల ఏర్పాటు, రోజుకు 35 లక్షల లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసి, అందరికీ నీటి సరఫరాను అందించాలన్నది ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం. వికాస్‌నగర్ లో మురుగునీటి శుద్ధి సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో దాదాపు  2,000 కుటుంబాలకు పారిశుధ్య సేవల ప్రయోజనం లభిస్తుంది.

బస్సులను నడపడం, బస్సుల్లో ప్రయాణికులకు టికెట్లను ఇవ్వడం, ఎలక్ట్రానిక్ చార్జింగ్ స్టేషన్లను నిర్వహించడం వంటి జీవనోపాధి పనుల్లో మహిళలకు శిక్షణను ఇవ్వడానికి కొన్ని కార్యక్రమాలను ఈ ప్రాజెక్టులో భాగంగా అమలు చేస్తారు. నీటి సరఫరా పథకాల పర్యవేక్షణలో మహిళల పాత్రను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు జల సరఫరా, స్వచ్ఛతా సేవల నిర్వహణలో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన మహిళలు ఎక్కువ మంది పాలుపంచుకొనేటట్లు ఈ ప్రాజెక్టు తగిన శ్రద్ధ తీసుకుంటారు.  

ఈ ప్రాజెక్టుకు 191 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు అందిస్తోంది.

 

***




(Release ID: 2071231) Visitor Counter : 8


Read this release in: English , Urdu , Hindi , Tamil