విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సంయుక్త సంస్థను ఏర్పాటు చేసిన మహారత్న ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్టీపీసీ, ఓఎన్జీసీ

Posted On: 04 NOV 2024 5:53PM by PIB Hyderabad

మహారత్న ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్టీపీసీ, ఓఎన్జీసీ ఉమ్మడి భాగస్వామ్యంతో తమ హరిత ఇంధన అనుబంధ సంస్థల (ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, ఓఎన్జీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్) ద్వారా ఓ సంయుక్త సంస్థను  ఏర్పాటు చేశాయి. పునరుత్పాదక, నవీన ఇంధన రంగంలో వాటి ప్రయోజనాలను ప్రోత్సహించే దిశగా ఇది ముందడుగు.

భారత ఇంధన వారోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 7న జాయింట్ వెంచర్ ఒప్పందం కుదిరింది. దీపం (డీఐపీఏఎం), నీతి ఆయోగ్ ల నుంచి చట్టబద్ధమైన అనుమతులు పొందిన అనంతరం ఓజీఎల్ తో 50:50 జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఎన్జీఈఎల్ దరఖాస్తు సమర్పించింది.

సౌర, పవన (సముద్ర/తీరప్రాంత), ఇంధన నిల్వ (పంప్/బ్యాటరీ), హరిత అణు (హరిత హైడ్రోజన్, హరిత అమ్మోనియా, పర్యావరణ హిత వైమానిక ఇంధనం, హరిత మిథనాల్), చాలక పద్ధతుల్లో విద్యుదీకరణ (ఇ-మొబిలిటీ), కర్బన పరిమితి (కార్బన్ క్రెడిట్), హరిత ప్రోత్సాహకాలు (గ్రీన్ క్రెడిట్స్) సహా వివిధ పునరుత్పాదక, నవీన ఇంధన రంగాల్లోకి ఈ జాయింట్ వెంచర్ కంపెనీ ప్రవేశించనుంది.

పునరుత్పాదక ఇంధన వనరులను సమకూర్చుకోవాలని కూడా కంపెనీ భావిస్తోంది. తమిళనాడు, గుజరాత్‌లలో తీరప్రాంత పవన టెండర్లలో పాల్గొనే అంశాన్నీ పరిశీలిస్తోంది.

హరిత భవిత కోసం దేశ ప్రతిష్ఠాత్మక లక్ష్యాలకు అనుగుణంగా, సుస్థిర ఇంధన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే దిశగా సమష్టి కృషిని ఎన్జీఈఎల్ – ఓజీఎల్ మధ్య ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం సూచిస్తుంది. ఆయా రంగాల్లో వాటి నైపుణ్యం, వనరుల దృష్యా రెండు సంస్థలూ భారత పునరుత్పాదక ఇంధన రంగంలో విశేష సేవలందించడానికి సిద్ధంగా ఉన్నాయి. అది ఆవిష్కరణలను ప్రోత్సహించడంతోపాటు పర్యావరణ పర్యవేక్షణను పెంపొందిస్తుంది. 

 

***


(Release ID: 2070737) Visitor Counter : 69