ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లోని కేవడియాలో ఐక్యతా మూర్తి వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించి.. జాతీయ ఐక్యతా దినోత్సవ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి
దేశాన్ని ఏకీకృతం చేయడంలో సర్దార్ పటేల్ చేసిన అమూల్య కృషికి గౌరవంగా జాతీయ ఐక్యతా దినోత్సవం... ఫలితంగా సమాజంలోని ఐక్యతా బంధాలు మరింత
బలోపేతం
దేశాన్ని చైతన్యపూరితం చేసింది.. ఆయనలోని దార్శనికత, అచంచలమైన నిబద్ధత
మరింత బలమైన దేశ నిర్మాణానికి ఆయన చేసిన కృషే... మనకు స్ఫూర్తి: పీఎం
నేటి నుంచి ప్రారంభమయ్యే సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకలు రాబోయే 2 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా ఒక పండుగలా జరుపుకొందాం...
ఇక మరింత బలంగా మన సంకల్పం... ‘ఏక్ భారత్ శ్రేష్ట భారత్’
కేవడియాలోని ఏక్తా నగర్ నుంచి మహారాష్ట్రలోని చారిత్రక రాయ్‌గఢ్ కోట ప్రతిష్ఠను చూడొచ్చు, అది సామాజిక న్యాయం, దేశభక్తి, దేశానికి తొలి ప్రాధాన్యం.. వంటి విలువలతో కూడిన పుణ్యభూమి: ప్రధానమంత్రి
దేశ ఐక్యత కోసం చేసే ప్రతి ప్రయత్నంలో ఉత్సాహంతో, ఉత్తేజంతో పనిచేయడం నిజమైన భారతీయులుగా మనందరి కర్తవ్యం
గడిచిన పదేళ్ల కాలంలో నూతన సుపరిపాలనా
విధానం ద్వారా దేశంలో వివక్షను పూర్తిగా నిర్మూలించాం
గత కొన్నేళ్లుగా... భిన్నత్వంలో ఏకత్వం అన్న భావనే భారత్ ను నడిపిస్తోంది....
స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల తర్వాత ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అనే సంకల్పం నెరవేరినందుకు దేశ పౌరులంతా సంతోషిస్తున్నారు...
దేశ ఐక్యతకు ముప్పుగా ఉన్న అనేక సమస్యలను గడిచిన పదేళ్లలో మేం పరిష్కరించాం
అలుపెరగని మా కృషి వల్ల...మన గిరిజన సోదరీ సోదరీమణులు అభివృద్ధితో పాటు మంచి భవిష్యత్తుపట్ల నమ్మకంతో ఉన్నారు...
దూరదృష్టి, దిశ, దృఢ సంకల్పం గల భారత్ నేడు మన ముందు ఉన్నది....
పెరుగుతున్న భారత్ బలాన్ని, ఐక్యతా భావాన్ని ఓర్వలేని కొందరు నేడు దేశాన్ని విచ్ఛిన్నం చేసి, సమాజాన్ని విభజించాలని చూస్తున్నారు.. అటువంటి వారి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి
ఐక్యతా దినోత్సవ సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
31 OCT 2024 1:10PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని కేవడియాలో ఐక్యతా మూర్తి (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) వద్ద నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రధాని పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి ఐక్యతా ప్రమాణం చేశారు. ప్రతి యేటా వల్లభాయ్ పటేల్ జయంతి రోజున జరుపుకొనే జాతీయ ఐక్యతా దినోత్సవంలో భాగంగా నిర్వహించిన, ఐక్యతా దినోత్సవ పరేడ్‌ను ప్రధానమంత్రి ప్రత్యక్షంగా వీక్షించారు.
“సర్దార్ సాహెబ్ చెప్పిన శక్తిమంతమైన మాటలు... ఐక్యతా మూర్తి వద్ద జరుగుతున్న ఈ కార్యక్రమం... ఏక్తా నగర్ విశాల దృశ్యం... ఇక్కడ నిర్వహించిన అద్భుతమైన ప్రదర్శనలు... మినీ ఇండియా గురించిన అవలోకనం... ప్రతీదీ చాలా అద్భుతంగా ఉంది... ఇది స్ఫూర్తిదాయకంగా ఉంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన... ఆగస్టు 15, జనవరి 26 తేదీల మాదిరిగానే... ఈనాటి ఈ కార్యక్రమం యావద్దేశానికి నూతన శక్తిని అందిస్తుందన్నారు.
దీపావళి సందర్భంగా మన దేశంలో, ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి జాతీయ ఐక్యతా దినోత్సవం దీపావళి పండుగతో పాటు ఐక్యతా పండుగను జరుపుకొనే అద్భుతమైన యాదృచ్చికతను తీసుకువచ్చిందన్నారు. “దీపావళి, దీపాల మాధ్యమం ద్వారా మొత్తం దేశాన్ని కలుపుతుంది. మొత్తం దేశానికి వెలుగునిస్తుంది. ఇప్పుడు ఈ దీపావళి పండుగ భారతదేశాన్ని ప్రపంచంతో కలుపుతోంది” అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
నేటి నుంచి సర్దార్ పటేల్ 150వ జయంతి సంవత్సరం ప్రారంభమవుతున్నందున ఈ ఏడాది ఏక్తా దివస్ మరింత విశిష్టమైనదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. రాబోయే రెండేళ్ల పాటు, దేశం సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకొంటుదన్నారు. దేశ ఐక్యత కోసం ఆయన చేసిన అపూర్వ కృషికి ఇది దేశం ఆయనకు అందించే నివాళి అవుతుందని పేర్కొన్నారు. ఈ రెండేళ్ల వేడుకలు ఒకే భారతదేశం, గొప్ప భారతదేశం (వన్ ఇండియా, గ్రేట్ ఇండియా) కోసం మన సంకల్పాన్ని మరింత బలపరుస్తాయని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయవచ్చని ఈ సందర్భం మనకు నేర్పుతుందన్నారు.
దురాక్రమణదారులను తరిమికొట్టేందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అందరినీ ఎలా ఏకం చేశారో శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ కోట ఇప్పటికీ ఆ కథను చెబుతోందన్నారు. రాయ్‌గడ్ కోట సామాజిక న్యాయం, దేశభక్తి, దేశానికి తొలి ప్రాధాన్యం వంటి విలువలతో కూడిన పుణ్యభూమిగా ప్రధానమంత్రి అభివర్ణించారు. “ఛత్రపతి శివాజీ మహారాజ్ రాయ్‌గఢ్ కోటలో ఒక ప్రయోజనం కోసం దేశంలోని విభిన్న ఆలోచనలనూ ఏకం చేశారన్నారు. ఈ రోజు ఇక్కడ ఏక్తా నగర్‌లో, రాయగఢ్‌లోని ఆ చారిత్రాత్మక కోట ప్రతిష్ఠను మనం చూస్తున్నాం.... ఈ నేపథ్యంలో, అభివృద్ధి చెందిన భారత్ సంకల్ప సాధన కోసం మనం ఇక్కడ ఏకమయ్యాం” అని ప్రధానమంత్రి అన్నారు.
గత దశాబ్ద కాలంలో ఐక్యత, సమగ్రతను బలోపేతం చేయడంలో భారత్ అద్భుతమైన విజయాలను సాధించిన తీరును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఏక్తా నగర్, ఐక్యతా మూర్తి స్ఫూర్తితో నేడు ప్రభుత్వం చేసే ప్రతీ పనిలో దేశ సమైక్యత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల నుంచి సేకరించిన ఇనుము, మట్టితో నిర్మితమైన ఈ స్మారక చిహ్నం పేరులోనే కాకుండా దాని నిర్మాణంలో కూడా ఐక్యతను సూచిస్తుందని తెలిపారు. ఏక్తా నగర్‌లో గల ఏక్తా నర్సరీలో ప్రపంచంలోని చాలా అడవుల నుంచి తెచ్చిన మొక్కలు ఉన్నాయనీ, అందుకే ఇది విశ్వవనంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రోత్సహించే పిల్లల పోషకాల పార్కు, వివిధ ప్రాంతాల ఆయుర్వేద వైద్య విధానాలను గురించి అవగాహన కలిగించే ఆరోగ్య వనం, దేశవ్యాప్తంగా తయారైన హస్త కళలను ప్రదర్శించే ఏక్తా మాల్ ఇక్కడ ఉన్నాయని ప్రధానమంత్రి వివరించారు.
దేశ ఐక్యత కోసం చేసే ప్రతీ ప్రయత్నాన్నీ వేడుకలా జరుపుకోవడం నిజమైన భారతీయులుగా మనందరి కర్తవ్యమని ప్రధానమంత్రి ఉద్బోధించారు. మరాఠీ, బెంగాలీ, అస్సామీ, పాళీ, ప్రాకృత భాషలకు శాస్త్రీయ హోదా కల్పించడంతోపాటు, నూతన జాతీయ విద్యా విధానంలో భారతీయ భాషలకు ప్రాధాన్యమివ్వడం హృదయపూర్వకంగా స్వాగతించదగినదనీ, ఇది జాతీయ ఐక్యతను బలోపేతం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. భాషతో పాటు, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలకు రైల్వేలను విస్తరించడం, లక్షద్వీప్, అండమాన్-నికోబార్‌లకు హై-స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం, పర్వత ప్రాంతాల్లో మొబైల్ వ్యవస్థ అనుసంధాన ప్రాజెక్టులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వారధులుగా మారుతున్నాయని పేర్కొన్నారు. వెనకబడిన ప్రాంతాల్లేని దేశాన్ని నిర్మిస్తున్న ఈ ఆధునిక మౌలిక వసతులు, బలమైన ఐక్యతా భావాన్ని పెంపొందిస్తున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.
“భిన్నత్వంలో ఏకత్వంతో జీవించే మన సామర్థ్యానికి నిరంతరం సవాళ్లు ఎదురవుతుంటాయనీ.. మనం ఈ సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించాలని బాపూజీ చెప్పేవారు” అని ప్రధానమంత్రి గుర్తు చేశారు. గత పదేళ్లలో భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంతో జీవించే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధించిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రభుత్వం తన విధానాలు, నిర్ణయాల్లో ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని నిరంతరం బలోపేతం చేస్తోందని తెలిపారు. ఆధార్ ద్వారా “ఒక దేశం, ఒకే గుర్తింపు” అలాగే జీఎస్టీ, జాతీయ రేషన్ కార్డ్ వంటి కార్యక్రమాలతో “ఒక దేశం” నమూనాల కోసం చేస్తున్న కృషిని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రధాని ప్రశంసించారు. అన్ని రాష్ట్రాలను ఒకే కార్యాచరణ ప్రణాళికతో అనుసంధానిస్తూ మరింత సమగ్ర వ్యవస్థను ఇది రూపొందిస్తుందన్నారు. ఐక్యత కోసం మా ప్రయత్నాల్లో భాగంగా, మేం ఇప్పుడు ఒక దేశం, ఒకే ఎన్నికలు, ఒక దేశం, ఒకే పౌర స్మృతి, అంటే లౌకిక పౌర స్మృతి కోసం పని చేస్తున్నాం” అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
పదేళ్ల పాలనను ప్రధాని ప్రస్తావిస్తూ... "మొదటిసారిగా జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేశారు" అని చెబుతూ, భారతదేశపు ఐక్యత కారణంగా జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుతో గొప్ప విజయాన్ని సాధించామన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు దేశభక్తి స్ఫూర్తితో, వేర్పాటువాదాన్నీ, ఉగ్రవాదాన్నీ ఎదిరిస్తూ, భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి అండగా నిలుస్తున్నారని కొనియాడారు.
జాతీయ భద్రత, సామాజిక సామరస్య పరిరక్షణ కోసం తీసుకున్న ఇతర చర్యలను, అలాగే ఈశాన్య ప్రాంతంలో దీర్ఘకాలిక ఘర్షణలను పరిష్కరించడంలో పురోగతిని ప్రధానమంత్రి వివరించారు. బోడో ఒప్పందం అస్సాంలో 50 ఏళ్ల ఘర్షణలను రూపుమాపడం అలాగే బ్రూ-రియాంగ్ ఒప్పందం వేలాది మంది వలసదారులను స్వదేశానికి తిరిగి వచ్చేలా చేయడం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. నక్సలిజం ప్రభావాన్ని తగ్గించడంలో సాధించిన విజయాన్నీ ప్రస్తావించిన ప్రధానమంత్రి... భారతదేశ ఐక్యత, సమగ్రతకు ప్రధాన సవాలుగా దానిని అభివర్ణించారు. నిరంతర ప్రయత్నాల కారణంగా.. నక్సలిజం ఇప్పుడు అంతిమదశకు చేరిందన్నారు.
నేడు దూరదృష్టి, దిశ, దృఢ సంకల్పం గల భారతదేశాన్ని మనం చూస్తున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ నేడు బలమైన, సమగ్రత గల దేశంగా ఉందనీ, ఇది సున్నితమైనదే అయినా అప్రమత్తంగా ఉంటుందనీ అలాగే మర్యాదగా ఉంటూనే అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదన్నారు. ఇది బలం, శాంతి రెండింటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటుందన్నారు. ప్రపంచ అశాంతి మధ్య భారతదేశం వేగవంతమైన అభివృద్ధిని, బలాన్ని కొనసాగిస్తూ శాంతికి దీపస్తంభంగా నిలుస్తున్నదని ప్రధానమంత్రి ప్రశంసించారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వివాదాల మధ్య, "భారత్ ప్రపంచానికే మిత్రదేశంగా మారింది" అని ఆయన పేర్కొన్నారు. భారత్ సాధించిన పురోగతిని చూసి కొన్ని శక్తులు ఇబ్బంది పడుతున్నాయనీ, దేశ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీయడం, దేశాన్ని విభజించడం లక్ష్యంగా పనిచేస్తున్నాయని పేర్కొంటూ... ఐక్యత, అప్రమత్తతో అలాంటి వారిని ఎదుర్కోవాలని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి విభజనవాదుల కుట్రలను గమనిస్తూ జాతీయ ఐక్యతను కాపాడాలని ఆయన భారతీయులకు విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ... సర్దార్ పటేల్‌ను ఉటంకిస్తూ, దేశం ఐక్యతకు కట్టుబడి ఉండాలని కోరారు. “భారతదేశం వైవిధ్యంతో నిండిన భూమి అని మనం గుర్తుంచుకోవాలి. భిన్నత్వాన్ని ఐకమత్యంతో వేడుకలా జరుపుకోవడం ద్వారానే ఏకత్వం బలపడుతుంది.” ‘‘రాబోయే 25 ఏళ్లు ఐక్యత విషయంలో చాలా ముఖ్యమైనవి. మనం ఈ ఐక్యతా మంత్రాన్ని బలహీనపరచకూడదు. వేగవంతమైన ఆర్థికాభివృద్ధికి, సామాజిక సామరస్యానికి ఇది అవసరం. నిజమైన సామాజిక న్యాయం కోసం, ఉద్యోగాల కోసం, పెట్టుబడుల కోసం ఇది అవసరం” అని తెలిపారు. భారతదేశ సామాజిక సామరస్యం, ఆర్థికాభివృద్ధి, ఐక్యత పట్ల నిబద్ధతను బలోపేతం చేయడం కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
***
MJPS/SS/VJ
(Release ID: 2069923)
Visitor Counter : 39
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam