రైల్వే మంత్రిత్వ శాఖ
బాలల రక్షణకు సవరించిన ఎస్‌వోపీ; అమలులోకి తెచ్చిన భారతీయ రైల్వేలు, మహిళల, బాలల వికాస మంత్రిత్వ శాఖ
మహిళలకు, బాలలకు రైలు ప్రయాణాన్ని సురక్షితంగా, చోర భయం లేనిదిగా తీర్చిదిద్దే లక్ష్యంతో భారతీయ రైల్వేలు చేపట్టే అన్ని కార్యక్రమాలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి సిద్ధం: డబ్ల్యూసీడీ శాఖ
మొత్తం 2,300 మంది బాలలను కాపాడటంలో, 674 మంది చోరులను పట్టుకోవడంలో 2022 నుంచి రైల్వే పరిరక్షణ దళానికి (ఆర్‌పీఎఫ్) చెందిన ‘‘ఆపరేషన్ ఏఏహెచ్‌టీ’’ ది తనదైన పాత్ర
Posted On:
27 OCT 2024 7:04PM by PIB Hyderabad
మహిళల, బాలల భద్రతకు ప్రభుత్వం అగ్ర ప్రాథమ్యాన్ని ఇస్తూ వస్తోంది. రైళ్ళలో మహిళలు, బాలలు సురక్షితంగా ప్రయాణించడంలో భారతీయ రైల్వేలు పోషిస్తున్న కీలక పాత్రను మహిళల, బాలల వికాస మంత్రిత్వ శాఖ (ఎమ్ఓడబ్ల్యూసీడీ) ప్రశంసిస్తూ, వారు రైళ్ళలో ప్రయాణించడాన్ని పదిలమైందిగా చూసేందుకు రైల్వే శాఖ చేపడుతున్న చర్యలలో నిధుల లోటు ఓ అడ్డంకిగా నిలవకుండా చూస్తామని హామీని ఇచ్చింది. రైల్వే పరిసరాలలో చిన్న పిల్లల రక్షణకు సంబంధించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగంగా డబ్ల్యూసీడీ శాఖతో సమన్వయాన్ని రైల్వే పరిరక్షక దళం (ఆర్‌పీఎఫ్) ఏర్పరచుకొని, ఒక తాజా ప్రామాణిక కార్యనిర్వాహక విధానం (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్.. ‘ఎస్‌వోపీ’)ని న్యూ ఢిల్లీ లోని రైల్ భవన్ లో ఈ నెల 25న అమలులోకి తీసుకువచ్చింది. భారతీయ రైల్వేల దృష్టికి వచ్చే, దాడికి గురయ్యే ప్రమాదం పొంచి ఉన్న బలహీన బాలలను కాపాడేందుకు ఒక బలమైన నిబంధనావళితో ఈ సమగ్రమైన ఎస్‌వోపీని రూపొందించారు.
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్‌వోపీ)ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన కార్యక్రమంలో డబ్ల్యూసీడీ శాఖ కార్యదర్శి శ్రీ అనిల్ మలిక్ పాల్గొని మాట్లాడారు. వసతి సదుపాయాలను మునుపటి కన్నా మెరుగుపరచిన రైల్వే స్టేషన్‌లలో క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ సెట్ (సీసీటీవీ)లతో పాటు మనిషి ముఖాన్ని గుర్తుపట్టేందుకు తోడ్పడే సాంకేతిక పరిజ్ఞానాన్ని అమర్చడం వంటి చర్యలతో బాలల భద్రతను, సురక్షను పెంపొందించడానికి భారతీయ రైల్వేలు తీసుకొన్న చర్యలను ఆయన ప్రశంసించారు. రైళ్ళలో ప్రతి రోజు 2 కోట్ల 30 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. వారిలో నూటికి 30 మంది మహిళలు ఉంటున్నారు. ఈ మహిళలలో చాలా మంది ఒంటరిగా రాక పోకలను జరుపుతున్నారు. దాడికి అనువైన వ్యక్తుల, మరీ ముఖ్యంగా చిన్న పిల్లల సంరక్షణకు తగిన చర్యలను తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రయాణాలలో పిల్లలను అపహరించడాన్ని అడ్డుకోవడానికి యాంటి-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ (ఏహెచ్‌టీయూ) ను పకడ్బందీగా తీర్చిదిద్దడానికి పెద్దపీటను వేయవలసిన అవసరం ఉంది; ఈ రకమైన ఏహెచ్‌టీయూ లను అసోమ్, గుజరాత్, హరియాణా, పంజాబ్, ఛత్తీస్ గడ్, ఇంకా మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలలోని రైల్వే స్టేషన్ లలో ఏర్పాటు చేయవలసిందిగా డబ్ల్యూసీడీ శాఖ అధికారులకు ఆర్‌పీఎఫ్ సూచించింది.
బాలలను లొంగదీసుకొని, వారిని ఇతర ప్రాంతాలకు తరలించడాన్ని ప్రోత్సహించడానికి రైళ్ళను వాడుకోకుండా చూడడంలో ఆర్‌పీఎఫ్ అప్రమత్తంగా ఉంటోంది. గత అయిదేళ్ళలో 57,564 మంది బాలలను పిల్లల దొంగల ముఠా గుప్పిట్లో నుంచి ఆర్‌పీఎఫ్ బయటకు తీసుకు వచ్చింది. వీరిలో 18,172 మంది బాలికలు కూడా ఉన్నారు. తాము కాపాడిన పిల్లల్లో నూటికి 80 మంది వరకు వారి కుటుంబాల వద్దకు వెళ్ళేటట్లుగా జాగ్రత చర్యలను ఆర్‌పీఎఫ్ తీసుకొంది. రైలు స్టేషన్‌లు అన్నింటి వద్ద చిన్న పిల్లల భద్రతకు అనేక చర్యలను ‘‘ఆపరేషన్ నన్హే ఫరిశ్తే’’లో భాగంగా ఆర్‌పీఎఫ్ అమలు చేస్తోంది. ఆర్‌పీఎఫ్ తాను మొదలుపెట్టిన ‘‘ఆపరేషన్ ఏఏహెచ్‌టీ’’లో సైతం 2022 నుంచి 2,300 మందికి పైగా బాలలను రక్షించడమే కాకుండా పిల్లల దొంగల ముఠాలకు చెందిన 674 మందిని కూడా అదుపు లోకి తీసుకుంది. దొంగల ముఠాల చేతికి బాలలు చిక్కకుండా చూడడం, బాలలను దొంగతనంగా తీసుకు పోయి వారి చేత చాకిరీ చేయించడం వంటి అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవడంలో ఆర్‌పీఎఫ్ పట్టు విడువక దీక్షగా విధులను నిర్వర్తిస్తోందని ఈ వివరాలు చాటిచెబుతున్నాయి.
దేశం నలుమూలల బాలల రక్షణే పరమావధిగా యాంటి-హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్‌లను దాదాపు 262 స్టేషన్‌లలో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అయితే, కొన్ని రాష్ట్రాల నుంచి సహకారం అందని కారణంగా, ఆయా రాష్ట్రాలలో ఈ యూనిట్‌లను ఏర్పాటు చేయడం కుదరలేదు. ఈ విషయంలో వీలైనంత త్వరగా చొరవ తీసుకోవాలని కోరుతూ ఆ రాష్ట్రాలకు లేఖ రాయడానికి ఎమ్ ఓడబ్ల్యూసీడీ కార్యదర్శి అంగీకరించారు. ఆయా రాష్ట్రాలలోని రైల్వే స్టేషన్ లలో ఏహెచ్‌టీ యూనిట్‌లను ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు, జిల్లా మేజిస్ట్రేట్ లకు ఎమ్ ఓడబ్ల్యూసీడీ లేఖలను రాయనుంది. దీనితో ఆర్‌పీఎఫ్ ఇప్పటికే చేస్తున్న ప్రయత్నాలు మరింత ఫలప్రదం అవుతాయని ఆశిస్తున్నారు.
రైళ్ళలో తోడు లేకుండా ఒక్కరుగా ప్రయాణించే మహిళలకు రక్షణను కల్పించడానికి ‘ఆపరేషన్ మేరీ సహేలీ’ పేరుతో ఒక కార్యక్రమాన్ని రైల్వే శాఖ అమలు చేస్తోంది. ఆర్‌పీఎఫ్ భూమిక ప్రశంసనీయమైందిగా ఉందని ఎమ్ ఓడబ్ల్యూసీడీ కార్యదర్శి మెచ్చుకొంటూ, మహిళల రక్షణ లక్ష్యంగా అమలవుతున్న పథకాలకు డబ్బు పరంగా ఎలాంటి లోటు ఎదురవకుండా చూడడానికి మా మంత్రిత్వ శాఖ తయారుగా ఉందని తెలిపారు. దేశంలో మహిళల భద్రతకు, వారి సురక్షకు మరిన్ని కార్యక్రమాలను అమలు చేయడానికి ‘నిర్భయ నిధి’ పేరుతో ఒక ప్రత్యేక నిధిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. మహిళలకు వ్యతిరేకంగా ఎలాంటి నేరాలు జరగకుండా అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ లలో సీసీటీవీ కెమెరాలను, ముఖాన్ని గుర్తించగలిగే వ్యవస్థను అమర్చడానికి అయ్యే డబ్బును ‘నిర్భయ నిధి’ నుంచి అందించేందుకు అవకాశం ఉంది.
ఆపన్న బాలలకు అండదండలను అందించే చైల్డ్ హెల్ప్ డెస్క్ (సీహెచ్‌డీ)ల వ్యవస్థను మరిన్ని ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ఏర్పాటు చేయడానికి భారతీయ రైల్వేలు, ఎమ్ఓడబ్ల్యూసీడీ లు ముందుకు వచ్చాయి. రైల్వే స్టేషన్ ఆవరణలలో బాలల, మహిళలకు అభయం కల్పించడానికి అవసరమైన మరిన్ని కొత్త కార్యకలాపాలను ప్రవేశపెట్టాలనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా చర్చించారు.
రైళ్ళలో అందరూ క్షేమంగా ప్రయాణించి వారి వారి గమ్యస్థానాలకు చేరుకొనేటట్లు చూస్తామన్న భారతీయ రైల్వేల ప్రతిజ్ఞను ఆర్ పీఎఫ్ పునరుద్ఘాటిస్తూ, ‘‘మా ధ్యేయం రైళ్ళలో బాలల తస్కరణ, అక్రమ తరలింపు లు జరగకుండా చూడడం’’ అనే ఓ సరికొత్త నినాదాన్ని ప్రకటించింది. చిన్నపిల్లలను ఎత్తుకుపోయి ఇతరులకు అప్పగించే నేరానికి ఒడిగడుతున్న వ్యక్తులను నిరోధించడంలో గత పదేళ్ళుగా పాటించిన మెలకువలను అన్నింటినీ కూడగట్టి, సరికొత్త ఎస్‌వోపీ నిబంధనలను రూపొందించారు. రైళ్ళలో మంచి వాతావరణాన్ని ఏర్పరచడం కోసం ఎనలేని చిత్తశుద్ధిని ఈ ముందడుగు నిరూపిస్తోంది అని ఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అన్నారు. భారతదేశంలో బాలల సంక్షేమాన్ని మా పరమోద్దేశంగా పెట్టుకొంటూ సరికొత్త ఎస్‌వోపీ ని సిద్ధం చేశామని ఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అన్నారు.
కుటుంబాలకు దూరం అయిన చిన్నపిల్లలకు అభయాన్ని ప్రసాదించేందుకు, వారిని ఇతరుల కబంధహస్తాలలో చిక్కుకోకుండా కంటికి రెప్పలా కాపాడేందుకు భారతీయ రైల్వేలు చాటుకొంటున్న నిబద్ధతను సరికొత్త ఎస్‌వోపీ బలోపేతం చేస్తున్నది. తొలుత జూవెనైల్ జస్టిస్ (జేజే) యాక్ట్ లో భాగంగా 2015 లో అమలులోకి తీసుకువచ్చిన ఎస్‌వోపీ ని 2021లో మరింత పరిపుష్టం చేశారు. దీనిని ప్రస్తుతం మరిన్ని నిబంధనలతో సవరించారు. దీనికిగాను డబ్ల్యూసీడీ శాఖ 2022లో చేపట్టిన ‘‘మిషన్ వాత్సల్య’’ను ఆదర్శంగా తీసుకొన్నారు. బాలల సంక్షేమ కమిటీ (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ.. సీడబ్ల్యూసీ) రక్షణలోకి బాలలను తీసుకు పోయే వరకు తప్పిపోయిన పిల్లల ఆచూకీని ఆరా తీసి, వారికి చేయూతను అందించి, వాస్తవ గమ్యస్థానానికి చేర్చేటంత వరకు రైల్వే సిబ్బంది పోషించవలసిన పాత్రను, వారు నెరవేర్చవలసిన బాధ్యతలను ఈ తాజా ఎస్‌వోపీ లో పొందుపరిచారు.
రైల్వే స్టేషన్‌ల చుట్టుపక్కల ప్రాంతాలలో చిన్నపిల్లల రక్షణకు పూచీపడవలసిన అవసరాన్ని ఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ శ్రీ మనోజ్ యాదవ్ తన ప్రసంగంలో స్పష్టం చేస్తూ, మేం జూవెనైల్ జస్టిస్ యాక్ట్ (జేజే) తో చేతులు కలిపి ముందుకు పోతున్నాం అన్నారు. ఎస్‌వోపీ ప్రారంభ కార్యక్రమంలో రైల్వే బోర్డు చైర్మన్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ సతీశ్ కుమార్, ఎమ్ ఓడబ్ల్యూసీడీ శాఖ కార్యదర్శి శ్రీ అనిల్ మలిక్, రైల్వే బోర్డు సభ్యుడు (ఆపరేషన్స్ & బిజినెస్ డెవలప్‌మెంట్ ) శ్రీ రవీందర్ గోయల్ లతో పాటు రెండు మంత్రిత్వ శాఖలకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
****
(Release ID: 2069260)
Visitor Counter : 10