రక్షణ మంత్రిత్వ శాఖ
60 శాతం దేశీయ పరిజ్ఞానంతో గోవా షిప్ యార్డ్ నిర్మించిన వేగంగా ప్రయాణించగల రెండు గస్తీ నౌకలను ప్రారంభించిన తీర రక్షక దళం
Posted On:
28 OCT 2024 4:41PM by PIB Hyderabad
60 శాతం దేశీయ పరిజ్ఞానంతో, గోవా షిప్ యార్డ్ (జీఎస్ఎల్) నిర్మించిన, వేగంగా ప్రయాణించగల రెండు (ఎఫ్పీవీ) గస్తీ నౌకలు – ‘అదమ్య’, ‘అక్షర్’ లను భారత తీర రక్షక దళం (ఐసీజీ) నేడు ప్రారంభించింది. రూ. 473 కోట్ల ఖర్చుతో ఎనిమిది ఎఫ్పీవీల నిర్మాణానికి గోవా షిప్ యార్డ్, తీరరక్షక దళాల మధ్య ఒప్పందం కుదిరింది. తీరరక్షక దళ రక్షణ, పర్యవేక్షణ, నిఘా అవసరాల్లో ఉపయోగపడే ఈ నౌకలు.. దేశానికి చెందిన సముద్ర ఆస్తులనూ, ద్వీపాలనూ కాపాడేందుకు సహాయపడతాయి.
ఒక్కో ఎఫ్పీవీ రకం నౌక 52 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు, 320 టన్నుల బరువుతో, గంటకు 27 మైళ్ళ వేగాన్ని కలిగి, నౌకాయాన పరిస్థితులకు అనువుగా వేగాన్ని మార్చుకోగలిగే చోదన వ్యవస్థను కలిగి ఉంటాయి. ఐసీజీ ప్రత్యేక అవసరాల దృష్ట్యా తయారైన ఈ నౌకలు... అమెరికా షిప్పింగ్ బ్యూరో, భారత నౌకాయాన రిజిస్టర్ అనే రెండు రకాల అత్యున్నత ప్రమాణాలకు లోబడి వీటిని నిర్మించారు.
‘షిప్ లిఫ్ట్ సిస్టమ్’ అనే అత్యాధునిక సాంకేతికత సాయంతో, తొలిసారిగా రెండు నౌకల్నీ ఏకకాలంలో జలప్రవేశం చేయించారు. ఐసీజీ డైరెక్టర్ జనరల్ పరమేష్ శివమణి సమక్షంలో వేడుకగా జరిగిన ప్రారంభోత్సవంలో ఎఫ్పీవీలకు నామకరణం చేసిన శ్రీమతి ప్రియా పరమేష్ వాటిని లాంఛనంగా ప్రారంభించారు. వేడుకకు మరింత సంబరాన్ని జోడిస్తూ సీనియర్ నావికాదళ సిబ్బంది అధర్వణ వేదంలోని శ్లోకాలను పఠించారు.
నౌకా నిర్మాణానికి అవసరమైన సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేసుకున్నందుకు జీఎస్ఎల్ సంస్థనూ, ఇతర భాగస్వామ్య పరిశ్రమలనూ తీరరక్షక దళ డీజీ అభినందించారు. కీలక విజయాన్ని సాధించిన జీఎస్ఎల్ సిబ్బందిని ప్రశంసిస్తూ నిబద్ధతతో ‘ఆత్మ నిర్భరత’ వైపు ప్రయాణాన్ని కొనసాగించాలని సూచించారు.
కార్యక్రమంలో గోవా షిప్పింగ్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బ్రజేష్ కుమార్ ఉపాధ్యాయ, భారత నావికా దళం, తీర రక్షక దళం, జీఎస్ఎల్ సంస్థల సీనియర్ అధికారులూ, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించే క్లాసిఫికేషన్ సొసైటీల ప్రతినిధులు పాల్గొన్నారు.
***
(Release ID: 2069058)