ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
సామాజిక మాధ్యమాల ద్వారా బూటకపు బాంబు బెదిరింపులను అరికట్టేందుకు హెచ్చరిక జారీ చేసిన ప్రభుత్వం
బూటకపు బెదిరింపులను సకాలంలో తొలగించాలంటూ కంపెనీలకు సూచన. ఫిర్యాదు చేయడం ద్వారా అధికారులకు సహకరించాలంటూ ఆదేశించిన ప్రభుత్వం
సమాచార సాంకేతికత చట్టం 2000, ఐటీ నిబంధనలు 2021 ప్రకారం కంపెనీలు అప్రమత్తంగా వ్యవహరించాలి...
నిబంధనలు పాటించని పక్షంలో సెక్షన్ 79
కల్పిస్తున్న రక్షణ రద్దు, చట్టపరమైన చర్యలు
ఐటీ నిబంధనలు, 2021 ప్రకారం ప్రభుత్వ సంస్థల విచారణలు, సైబర్ భద్రత విషయాల్లో... సకాలంలో అంటే 72 గంటల్లోగా సామాజిక మాధ్యమాలు సమాచారం అందించాలి
Posted On:
26 OCT 2024 7:58PM by PIB Hyderabad
భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ విమానయాన సంస్థలకు వస్తున్న బూటకపు బాంబు బెదిరింపులను అరికట్టడానికి సోషల్ మీడియా వేదికలు, ఇతర అనుసంధాన వేదికల (ఇంటర్మీడియరీ సంస్థలు) బాధ్యతను స్పష్టం చేస్తూ ఎలక్ట్రానిక్స్, సమచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (ఎమ్ఈఐటీవై) హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియా వేదికలు తప్పనిసరిగా ఐటీ చట్టం, 2000, ఐటీ (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) నిబంధనలు, 2021 అలాగే భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), 2023కి కట్టుబడి ఉండాలని ఎమ్ఈఐటీవై స్పష్టం చేసింది. ప్రజా భద్రత, రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ వేదికలు అలాంటి చట్టవిరుద్ధమైన సమాచారాన్ని వెంటనే తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
విమానాలకు బూటకపు బాంబు బెదిరింపుల వంటి ఘటనలు దేశ ప్రజల భద్రత, రక్షణకు పెను ముప్పుగా మారవచ్చు. ఇటువంటి బూటకపు బాంబు బెదిరింపులు పెద్ద సంఖ్యలో పౌరులను ప్రభావితం చేస్తూ దేశ ఆర్థిక భద్రతను కూడా అస్థిరపరుస్తాయి. అలాగే, సోషల్ మీడియా వేదికలపై "ఫార్వార్డింగ్/రీ-షేరింగ్/రీ-పోస్టింగ్/రీ-ట్వీటింగ్" వంటి ఎంపికలు అందుబాటులో ఉన్నందున, అటువంటి బూటకపు బాంబు బెదిరింపుల వ్యాప్తి నియంత్రణ కష్టంగా మారింది. ఇటువంటి బూటకపు బాంబు బెదిరింపులు చాలా వరకు తప్పుడు సమాచారం కలిగి ఉండి, ప్రజా భద్రతకు, విమానాల కార్యకలాపాలకు, ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగిస్తున్నాయి.
ఐటీ చట్టం, నిబంధనల ప్రకారం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన బాధ్యత
ఈ విషయంలో, సోషల్ మీడియా సహా మధ్యవర్తులంతా సమాచార సాంకేతికత చట్టం, 2000 (“ఐటీ చట్టం”), సమాచార సాంకేతికత (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) నిబంధనలు, 2021 (“ఐటీ నిబంధనలు-2021”) ప్రకారం ప్రజా భద్రతను, దేశ భద్రతను ప్రభావితం చేసే ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వెంటనే తొలగించాల్సిన బాధ్యతను కలిగి ఉంటారు.
ఐటీ నిబంధనలు-2021 ప్రకారం ఏ వినియోగదారుడు కూడా అలాంటి ఏవైనా చట్టవ్యతిరేకమైన, తప్పుడు సమాచారాన్ని హోస్ట్ చేయడానికి, ప్రదర్శించడానికి, అప్‌లోడ్ చేయడానికి, సవరించడానికి, ప్రచురించడానికి, ప్రసారం చేయడానికి, నిల్వ చేయడానికి, నవీకరించడానికి లేదా షేర్ చేయడానికి వీలు లేకుండా సోషల్ మీడియా సహా సంబంధిత మధ్యవర్తులు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టేందుకు అప్రమత్తంగా వ్యవహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, మధ్యవర్తులు వారికి నిర్దేశించిన బాధ్యతల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించని సందర్భంలో లేదా చట్టవిరుద్ధమైన చర్యకు సహకరించిన లేదా సహాయం చేసినపుడు.. ఐటీ చట్టం-2021, అలాగే ఐటీ నిబంధనల మేరకు, సోషల్ మీడియా మధ్యవర్తులకు అందుబాటులో ఉండే లేదా వారు హోస్ట్ చేసే ఏదైనా తృతీయ పక్ష సమాచారం, డేటా లేదా కమ్యూనికేషన్ లింక్‌కు ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం అందించే బాధ్యత నుంచి మినహాయింపు వర్తించదు.
ఐటీ నిబంధనలు, 2021లో అందించిన బాధ్యతల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించడంలో మధ్యవర్తులు విఫలమైతే, ఐటీ చట్టంలోని సెక్షన్ 79 నిబంధన అటువంటి మధ్యవర్తికి వర్తించదు. అలాగే వారు ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత-2023 ("బీఎన్ఎస్") సహా ఏదైనా చట్టం ప్రకారం పర్యవసాన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
సోషల్ మీడియా సహా మధ్యవర్తుల కోసం కింది కీలక బాధ్యతలను మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది:
1. తప్పుడు సమాచారాన్ని సత్వరం తొలగించడం: సోషల్ మీడియా సహా మధ్యవర్తులు తమ విధినిర్వహణ బాధ్యతలను తప్పనిసరిగా పాటించాలి. అలాగే కచ్చితమైన సమయపాలనతో బూటకపు బాంబు బెదిరింపుల సమాచారం సహా చట్టవిరుద్ధమైన సమాచారాన్ని నిలిపివేయాలి లేదా తొలగించాలి.
2. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-2023 ప్రకారం నేరాలను గురించి ఫిర్యాదు చేయడం: భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రత లేదా ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించే లేదా ముప్పు కలిగించే అవకాశం ఉన్న కార్యకలాపాలు లేదా చర్యలను గురించి మధ్యవర్తులు తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలి.
3. ప్రభుత్వ సంస్థలకు సహకరించడం: విచారణలు లేదా సైబర్ భద్రత వ్యవహారాల్లో సోషల్ మీడియా మధ్యవర్తులు అధికారిక ప్రభుత్వ సంస్థలకు సంబంధిత సమాచారాన్ని, సహకారాన్ని నిర్ణీత గడువులోగా అందించాలి (వీలైనంత త్వరగా..అదీ 72 గంటల్లోపు).
సూచనల పూర్తి పాఠాన్ని చూడడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
***
(Release ID: 2068581)
Visitor Counter : 70