బొగ్గు మంత్రిత్వ శాఖ
అదనపు విద్యుత్తు ఉత్పాదన సామర్థ్యం సాధనకు ఎన్ఎల్‌సీ ఇండియా ముందడుగు;
రెండు సంయుక్త సంస్థ (జేవీ)ల ఏర్పాటుకు రాజస్థాన్‌తో ఒప్పందం
Posted On:
24 OCT 2024 3:08PM by PIB Hyderabad
రెండు సంయుక్త సంస్థలను ఏర్పాటు చేయడానికి రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఆర్‌వీయూఎన్ఎల్)తో ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్‌సీఐఎల్) ఒప్పందాలు కుదుర్చుకొంది. రాజస్థాన్ లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఒక ఒప్పంద పత్రంపై ఎన్ఎల్‌సీ ఇండియా రెన్యూవబుల్ లిమిటెడ్ (ఎన్ఐఆర్ఎల్), ఆర్ఆర్‌వీయూఎన్ఎల్ లు సంతకాలు చేశాయి. లిగ్నైట్ ఆధారిత తాప విద్యుత్తు కేంద్రాన్ని అభివృద్ధి పరచడానికి సంబంధించిన ఒప్పంద పత్రంపై ఎన్ఎల్‌సీఐఎల్, ఆర్ఆర్‌వీయూఎన్ఎల్ లు సంతకాలు చేశాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అధిక ఇంధన ఉత్పాదన సామర్థ్యాన్ని సాధించాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత నుంచి ప్రేరణను పొంది, కేంద్ర బొగ్గు - గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు - గనుల శాఖ సహాయ మంత్రి శ్రీ సతీశ్ చంద్ర దుబే ల మార్గదర్శకత్వంలో, కార్పొరేట్ ప్రణాళికకు అనుగుణంగా ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ ఈ బాటలో ముందడుగు వేసింది.
రాజస్థాన్ ప్రభుత్వంలో ఇంధన శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి (ఏసీఎస్) శ్రీ అలోక్, ఐఏఎస్, ఎన్ఎల్‌సీఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎమ్ డీ) శ్రీ ప్రసన్న కుమార్ మోటుపల్లి ల సమక్షంలో ఎన్ఎల్‌సీఐఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) డాక్టర్ ప్రసన్న కుమార్ ఆచార్య, ఆర్ఆర్‌వీయూఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎమ్ డీ) శ్రీ దేవేంద్ర శృంగి లు సంబంధిత ఒప్పంద పత్రాలపైన సంతకాలు చేశారు. ఈ రెండు సంయుక్త సంస్థల (జేవీ)లో ఎన్ఎల్‌సీఐఎల్ కి 74 శాతం మూలధన వాటా, ఆర్ఆర్‌వీయూఎన్ఎల్ కు 26 శాతం మూలధన వాటా ఉంటాయి.
దీర్ఘకాలిక ఇంధన, విద్యుత్తు ఉత్పాదనల మార్గంలో ఓ ముఖ్యమైన మైలురాయిగా ఈ సంయుక్త సంస్థలు నిలవనున్నాయి.
***
(Release ID: 2067950)
Visitor Counter : 78