కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కిత్తూర్ విజయోత్సవం జరిగి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్మారక స్టాంపును విడుదల చేసిన తపాలా శాఖ

Posted On: 24 OCT 2024 3:05PM by PIB Hyderabad

కిత్తూర్ విజయోత్సవాల 200 వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ 23న కిత్తూర్ కోటలోని రాణీ చెన్నమ్మ వేదికపై స్మారక తపాలాబిళ్ళను విడుదల చేశారు. 1824, అక్టోబర్ 24న  బ్రిటీష్ పాలకులపై రాణీ చెన్నమ్మ సాధించిన అపూర్వ విజయానికి గుర్తుగా తపలాశాఖ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.  

దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన వీరుల పాత్రను తలచుకునే ఇటువంటి కార్యక్రమాలను తపాలాశాఖ అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. దేశభక్తుల స్మృతికి నీరాజనంగా తపాలాశాఖ పలు స్మారక తపాలా బిళ్ళలను విడుదల చేసింది. ఈ కార్యక్రమాల ద్వారా స్వాతంత్ర్య సమర యోధులను గుర్తు చేసుకోవడమే కాక, వారి త్యాగాలను యువతరానికి స్పూర్తి నింపే అవకాశం కలుగుతోంది. బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి విజయాన్ని సాధించిన కిత్తూర్ రాణి సాహసానికి నివాళిగా తపాలాశాఖ సగర్వంగా స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.

కర్ణాటక సర్కిల్, బెంగళూరు నగర చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ రాజేంద్ర కుమార్ స్టాంపుని విడుదల చేశారు. కార్యక్రమానికి ఆధ్యాత్మిక గురువులు పూజ్యశ్రీ శ్రీ మడివాల్ రాజయోగీంద్ర స్వామి, పూజ్యశ్రీ శ్రీ పంచాక్షరి మహాస్వామి, శ్రీ బసవ జయ మృత్యుంజయ స్వామి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.  

కిట్టూర్ విజయోత్సవ 200వ వార్షికోత్సవం సందర్భంగా స్మారక స్టాంపు విడుదల

బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసి...చేతిలో దూసిన కరవాలంతో...అశ్వాన్ని అధిరోహించినట్లున్న రాణీ చెన్నమ్మ ఉన్న స్టాంపుని శ్రీ బ్రహ్మ ప్రకాష్ రూపొందించారు. రాణి ధైర్యసాహసాలనూ, కిత్తూర్ వైభవాన్నీ, యుద్ధభూమిగా కోట చారిత్రిక ప్రాముఖ్యాన్ని ఈ స్టాంపు ప్రతిబింబిస్తోంది. రాణీ నిబ్బరానికి ప్రతీకగా అన్నట్లు.. బలమైన రంగుల్లో ఈ స్టాంపు వెలువడింది. చారిత్రిక సందర్భాన్ని ప్రస్ఫుటంగా తెలిపేలా “కిత్తూర్ విజయోత్సవం – 200 సంవత్సరాలు” అన్న వాక్యాన్ని స్టాంపుపై ముద్రించారు. భారత స్వాతంత్ర పోరాటంలో మరువలేని అధ్యాయాన్ని లిఖించిన రాణీ చెన్నమ్మ స్మృతికి తపాలా బిళ్ళ విడుదల ఘన నివాళిగా నిలిచింది.     

పోస్టల్ స్టాంపు

స్వాతంత్ర్యం కోసం దేశం నిర్వహించిన పోరులో కీలక ఘట్టమైన కిత్తూర్ పోరు, రాణీ పరాక్రమానికీ, అసమాన నాయకత్వ ప్రతిభకూ నిదర్శనంగా నిలిచి దేశ చరిత్రపై చెరగని ముద్ర వేసింది. కిత్తూర్ చారిత్రిక యుద్ధాన్ని ముందుండి నడిపిన రాణీ చెన్నమ్మ సాహసానికి స్టాంపు విడుదల కార్యక్రమం ఘనమైన నివాళులు అర్పించింది. హింసకు వ్యతిరేకంగా గొంతు విప్పి, త్యాగాలు చేసిన వీరులను స్మరించుకునే ఇటువంటి కార్యక్రమాల్లో భాగమై, నేటికీ మనలో స్ఫూర్తి నింపే దేశనాయకులను  తలుచుకుందాం.

సామాజిక మాధ్యమాలు:

https://x.com/JM_Scindia/status/1849144772189126943?t=PmO-NA3aVCAXCxy2PLAnAQ&s=08

 

****


(Release ID: 2067802) Visitor Counter : 82


Read this release in: Urdu , English , Hindi , Tamil