సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner
1 2

గోవా చలనచిత్రోత్సవానికి చలో చలో

భయపడవద్దు...55వ ఐఎఫ్ఎఫ్ఐ 2024 టికెట్ మీకోసం ఎదురు చూస్తోంది!

55వ ‘ఇఫీ’ ప్రతినిధుల నమోదు ప్రక్రియ ప్రారంభం

పండగ ఉత్సాహంతో నవంబర్ వచ్చేస్తోంది. నవంబరు 20 నుంచి 28 వరకు గోవాలోని పనాజీలో జరిగే భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ- ఇఫీ)లో పాల్గొనేందుకు మీకు ఇదే మా ఆహ్వానం. గోవాలోని అరేబియా సముద్ర తీర అందాల నడుమ సినిమా సంబరాన్ని ఉత్సాహంగా జరుపుకొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి చలనచిత్ర ప్రేమికులు ఒక చోట కలిసుకునే సందర్భమిది.
మీరు ప్రపంచంలో విభిన్న ప్రాంతాలకు, వివిధ సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన వారు కావచ్చు. కానీ సినిమాను ఇష్టపడేవారందరినీ ఒక్క చోటుకు చేర్చే అవకాశాన్ని ఇఫీ అందిస్తుంది. ఈ కళా బంధాన్ని ఉత్సవంలా జరుపుకోవడానికి, వెండితెర మీద చలనచిత్రాలు చెప్పే కథల అద్భుతాన్ని ఆస్వాదించేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నాం. https://my.iffigoa.org/ లో మీ పేరు, వివరాలు నమోదు చేసి ఈ ఏడాది జరగబోయే చలనచిత్రోత్సవానికి ఇఫీ ప్రతినిధిగా హాజరవ్వచ్చు.
ఇఫీలో ఎందుకు పాల్గొనాలి?
అంతర్జాతీయంగా 16 విభాగాల్లో ఎంపిక చేసిన సినిమాలను 55వ చలనిచత్రోత్సవాల్లో మీరు వీక్షించవచ్చు. మనసును తడి చేసే సినిమాలు, ఉద్విగ్నం కలిగించే డాక్యుమెంటరీలు, లేదా వినూత్న లఘు చిత్రాలు ఏదైనా కావచ్చు.. సినీ ప్రేమికులు ఆస్వాదించేందుకు ఈ చలనచిత్రోవంలో ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటుంది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సినిమాలను విడుదలకు ముందే ఇక్కడ, చలనచిత్రోత్సవంలో చూసే అపూర్వ అవకాశం ఇఫీ ప్రతినిధులుగా మీకు దక్కుతుంది.

ఈ ఉత్సవం చిత్రాలను చూడటానికి మాత్రమే కాదు.. కథ చెప్పే సినిమా కళను నేర్చుకోవడానికి ఉద్దేశించింది కూడా.

ఇఫీ నిర్వహించే శిక్షణా తరగతులు, కార్యశాలల్లో చలన చిత్ర రంగ ప్రముఖులు, నిపుణులు తమ ఆలోచనలను, అనుభవాలను పంచుకుంటారు. మీరు వర్థమాన చలనచిత్ర దర్శకుడైతే, మీరు చేపట్టే తదుపరి ప్రాజెక్టుకు స్ఫూర్తి పొందడానికి, మీ కలను సాకారం చేసుకొనే ప్రేరణ పొందడానికి ఇక్కడ జరిగే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనండి. మీ ఆలోచనలు పంచుకోండి. స్నేహితులను పెంచుకోండి.

చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విషయాలను స్వయంగా దగ్గర నుంచి గమనించే అవకాశాన్ని మీరు పొందవచ్చు. ఈ రంగంలో ప్రసిద్ధి పొందిన దర్శకులు, నటులు, ఇతర దిగ్గజాలును గౌరవించేందుకు ఉద్దేశించినదే ఇఫీ రెడ్ కార్పెట్‌. వారు తమ చిత్రాలను ప్రదర్శించడానికి, సినిమా పట్ల ప్రేమను చాటడానికి ఇక్కడకి వస్తారు. వారందరినీ కలుసుకునే అవకాశం ఇఫీ ప్రతినిధులకు దక్కుతుంది. మీరు మెచ్చే చిత్రాలను తీసిన వారితో నేరుగా మాట్లాడి, మీ ఆలోచనలు పంచుకొనే అనుభవం ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి.
వర్థమాన ప్రతిభ, సినిమాలకు సంబంధించిన అంశాలన్నీ ఒక్క చోట చేర్చే వేదికగా భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మీ ముందుకు రాబోతోంది. ఈ కార్యక్రమానికి హజరైన వారు ‘క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో’, ‘ఫిలిం బజార్’, ‘సినీ మేళా’ల తాజా సంచికలు అందుకోవచ్చు.
మరపురాని జీవితానుభూతిని పొందడానికి సిద్ధంగా ఉండండి. ఈ అద్భుతమైన సినీ ప్రయాణంలో పాల్గొనే అవకాశాన్ని వదులుకోవద్దు.

ఇఫీ’లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు

ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ ఈ చలన చిత్రోత్సవంలో పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేశారు. దివ్యాంగుల అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారికోసం చిత్రాలను ప్రదర్శించే ఈఎస్‌జీ, ఇతర వేదికల వద్ద ర్యాంపులు, హ్యాండ్ రెయిల్స్, అనువైన నడక దారులు, టాయిలెట్లు, బ్రెయిలీ లిపిలో ప్రత్యేక సూచికలు ఏర్పాటు చేశారు. వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక స్థలాలు కేటాయించారు. తద్వారా చలనచిత్రోత్సవ సంబరాల్లో ఎవరూ వెనకబడి ఉండిపోకుండా చర్యలు తీసుకున్నారు.

ఎలా నమోదు చేసుకోవాలి?
ప్రతినిధిగా నమోదు చేసుకోవడానికి https://my.iffigoa.org/ కు లాగిన్ అవ్వాలి.
55వ ఇఫీ వేడుకల పూర్తయ్యేంత వరకు ప్రతినిధిగా రిజిస్టర్ చేసుకోవచ్చు. నమోదు చేసుకోవాల్సిన విభాగాల వివరాలు:
చలనచిత్ర నిపుణులు
· రిజిస్ట్రేషన్ రుసుం: రూ.1180 (18 శాతం జీఎస్‌టీతో)
· ప్రయోజనాలు: ఆన్‌లైన్ గుర్తింపు కార్డు, అదనంగా మరో టికెట్, ప్యానెల్, స్క్రీనింగ్స్ లో ఉచితంగా పాల్గొనవచ్చు.

సినిమాల పట్ల ఆసక్తి ఉన్నవారు
· రిజిస్ట్రేషన్ రుసుం: రూ.1180 (18 శాతం జీఎస్‌టీతో)
· ప్రయోజనాలు: ఆన్‌లైన్ గుర్తింపు కార్డు, అదనంగా మరో టికెట్, ప్యానెల్, స్క్రీనింగ్స్ లో ఉచితంగా పాల్గొనవచ్చు.
ప్రతినిధి-విద్యార్థి

· రిజిస్ట్రేషన్ రుసుం - ఉచితం
· ప్రయోజనాలు: ఆన్‌లైన్ గుర్తింపు కార్డు, చలనచిత్రాలను ఎలాంటి రుసుం లేకుండా సినిమాలను చూసేందుకు ప్రతి రోజు నాలుగు టికెట్లు పొందవచ్చు.
ఈ కేటగిరీల ద్వారా సినీ రంగ నిపుణులు, సినిమా ప్రేమికులు, విద్యార్థులకు వేర్వేరు ప్రయోజనాలు అందుతాయి. విద్యార్థులు రోజుకి నాలుగు టికెట్లు ఉచితంగా పొందడం ద్వారా పినిమాలు, వాటికి సంబంధించిన కార్యక్రమాలపై విస్తృత అవగాహన పొందవచ్చు. సినిమా నిపుణులు రోజుకు అదనంగా మరో టికెట్ పొందవచ్చు.
చిత్రోత్సవాలు కొనసాగినన్ని రోజులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనేందుుకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆన్‌లైన్ గుర్తింపు కేటాయిస్తారు. https://my.iffigoa.org/ లో మీకంటూ ప్రత్యేకంగా My-IFFI ఖాతా తెరిచి డాష్‌బోర్డ్ ద్వారా సినిమాలకు టికెట్లు బుక్ చేసుకోవడం, చలనచిత్రోత్సవంలో కార్యక్రమాల షెడ్యూల్‌ను చూడొచ్చు.

ఏదైనా సందేహాలు ఎదురైతే registration@iffigoa.org లో సంప్రదించవచ్చు. ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి. అందరూ కలసికట్టుగా చలనచిత్ర కళను ఆస్వాదిద్దాం.
గోవాకు టికెట్ బుక్ చేసుకుని, ఈ చలనచిత్రోత్సవంలో పాల్గొనే ప్రయాణంలో మీకు అంతా శుభమే జరుగుకాక!
ఇఫీ’ గురించి
భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) 1952 లో ప్రారంభమైంది. ఆసియా ఖండంలోనే ప్రధాన చలనచిత్రోత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది ప్రారంభమైన నాటి నుంచి సినిమాలు, వాటి కథలు, వాటి వెనక ఉన్న ప్రతిభావంతులకు గుర్తింపు అందించడమే ఇఫీ ధ్యేయం. సినిమా పట్ల ప్రేమ, అభిమానాలను పెంచి, ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలను పెంచడం, వ్యక్తిగతంగా, సమష్టిగా సరికొత్త తీరాలను చేరుకునేలా ఈ ఉత్సవం ప్రోత్సహిస్తుంది.
భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ), గోవా ఎంటర్టైన్మెంట్ సొసైటీ, గోవా ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నాయి.
55వ ఇఫీ ఉత్సవాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని తెలుసుకునేందుకు www.iffigoa.org ని సందర్శించండి.

 

***




(Release ID: 2067722) Visitor Counter : 16