పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
అక్టోబర్ 24న న్యూఢిల్లీలో ‘గ్రామ స్థాయి వాతావరణ సమాచార’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న కేంద్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్
ముందస్తు వాతావరణ సమాచారంతో గ్రామాలకు మేలు
5 రోజుల ముందస్తు సమాచారం సహా గంట గంటకూ తాజా సమాచారం
Posted On:
23 OCT 2024 9:53AM by PIB Hyderabad
గ్రామస్థాయిలో వాతావరణ సమాచారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గ్రామ పంచాయితీలకు అయిదు రోజుల ముందస్తు సమాచారాన్ని ఇవ్వడంతోపాటు గంట గంటకూ తాజా వాతావరణ సమాచారాన్ని కూడా అందిస్తారు. కేంద్ర పంచాయితీరాజ్ శాఖ ప్రారంభించబోయే ఆ వినూత్న పథకానికి భారత వాతావరణ సంస్థ (ఐఎండీ), భూవిజ్ఞాన మంత్రిత్వశాఖలు సంయుక్తంగా సహకరిస్తున్నాయి. ‘గ్రామ స్థాయిలో వాతావరణ సమాచారం’ అనే ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 24న న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో కేంద్రమంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ ప్రారంభిస్తారు. ముందస్తు వాతావరణ సమాచారాన్ని అందించడం వల్ల ప్రకృతు విపత్తులను ఎదుర్కొనేందుకు గ్రామస్థులకు వీలు కలుగుతుంది. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రజల్ని బలోపేతం చేసే ఈ పథకం.. దేశవ్యాప్తంగా అనేక గ్రామాలకు మేలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వ 100 రోజుల కార్యక్రమంలో భాగమైన ఈ పథకం, గ్రామస్థాయి పాలనను బలోపేతం చేయడం, సాగు విధానాలను మరింత సులభతరం చేయడం, పరోక్షంగా రైతులకు తగిన ప్రోత్సాహాన్ని అందించడం వంటి లక్ష్యాలను నెరవేరుస్తుంది.
తొలిసారిగా స్థానిక వాతావరణ పరిస్థితుల గురించిన తాజా సమాచారాన్ని మూడు డిజిటల్ వేదికల ద్వారా మంత్రిత్వశాఖ గ్రామ పంచాయితీలకు అందిస్తుంది. విస్తృతమైన ఐఎండీ సాంకేతికత ఇందుకు అవకాశం కల్పిస్తోంది. ‘ఇ-గ్రామస్వరాజ్’, ‘మేరి పంచాయత్ యాప్, ‘గ్రామ్ మన్ చిత్ర’ వేదికల ద్వారా ఈ సమాచారాన్ని నేరుగా గ్రామస్థాయికి అందిస్తారు. ఇ-గ్రామస్వరాజ్- మెరుగైన పాలన, ప్రాజెక్టుల సమీక్ష, వనరుల నిర్వహణను సులభతరం చేస్తోంది. మేరి పంచాయత్ యాప్’ ద్వారా స్థానికులు నేరుగా సమస్యల గురించి చెప్పుకోవడానికి ఉన్న ఒక వేదిక. ‘గ్రామ్ మన్ చిత్ర’ యాప్ ను అభివృద్ధి ప్రణాళికా రచనల కోసం ఉద్దేశించారు.
పంచాయితీరాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ (లాలన్ సింగ్), ఆ శాఖ సహాయమంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్, కార్యదర్శి వివేక్ భరద్వాజ్, సంయుక్త కార్యదర్శి అలోక్ ప్రేమ్ నగర్, శాస్త్ర, సాంకేతికశాఖ, భూవిజ్ఞాన శాఖల సహాయమంత్రి శ్రీ జితేంద్ర సింగ్, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది, ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర, భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ ఎం. రవిచంద్రన్ సహా పంచాయితీరాజ్ శాఖ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ-ఎన్ఎండీఏ, శాస్త్ర సాంకేతిక విభాగం-డీఎస్టీ అధికారులు సహా ఇతర కీలక భాగస్వాములు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
‘గ్రామస్థాయిలో వాతావరణ సమాచారం’ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. పంచాయితీరాజ్ సంస్థల అధికారులూ, ప్రజా ప్రతినిధులూ సహా 200 మంది ఈ కార్యశాలలో పాల్గొంటారు. వాతావరణ పరిస్థితుల ముందస్తు సమాచారాన్ని అందుకున్న వీరు, క్షేత్రస్థాయిలో అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల, గ్రామీణ సమాజాలకు మేలు చేసే వీలు కలుగుతుంది. ప్రభుత్వ 100 రోజుల కార్యక్రమంలో కీలక భాగమైన ఈ పథకం, స్థానిక పాలనను మెరుగుపరిచి, ప్రకృతి విపత్తులను సమర్ధంగా ఎదుర్కొనేందుకు గ్రామాలను సన్నద్ధం చేస్తుంది. అంచనాలకు అందని వాతావరణ పరిస్థితులు నెలకొన్న తరుణంలో, గ్రామ స్థాయిలో తాజా సమాచారాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఆధారిత ఉపాధికి రక్షణను అందించడం, విపత్తు సన్నద్ధతను మెరుగు పరచడం సాధ్యమవుతుంది. ఉష్ణోగ్రత, వర్షం, గాలుల వేగం, మేఘాల కదలిక సమాచారాన్ని గ్రామ పంచాయితీలకు అందిస్తారు. దాంతో, నాట్లు, పొలాలకు సాగునీరు అందించడం, నూర్పిళ్ళు వంటి వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడం సులభమవుతుంది. వాతావరణ సమాచార లభ్యత వల్ల ప్రకృతిపరమైన ఉపద్రవాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధత పెరిగి, తగిన ఏర్పాట్లను ముందుగానే చేసుకునే వీలు కలుగుతుంది. తుఫాన్లు, భారీ వర్షాల వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, పంచాయితీ ప్రతినిధులకు ఎస్ఎంఎస్ సందేశాలు అందుతాయి. దాంతో, ప్రాణ, ఆస్తి, పంట నష్టాన్ని నివారించవచ్చు. క్షేత్రస్థాయిలో వాతావరణ మార్పులను తట్టుకునే శక్తిని గ్రామాలకు అందించడమే ఈ పథకం లక్ష్యంగా ఉంది.
****
(Release ID: 2067315)
Visitor Counter : 78