గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల కోసం 'అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ ప్రోగ్రామ్'ను ప్రారంభించిన ఎన్ఈఎస్‌టీఎస్(నెస్ట్స్)

Posted On: 22 OCT 2024 7:00PM by PIB Hyderabad

నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెస్ట్స్) ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, త్రిపుర రాష్ట్రాల్లోని 50 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో మూడో విడత 'అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ కార్యక్రమం' ప్రారంభించింది. ఇందులో బ్లాక్ చెయిన్, కృత్రిమ మేధ, కోడింగ్, బ్లాక్ ప్రోగ్రామింగ్, ఏఐ సెషన్లపై నేపథ్య బోధన (ఓరియంటేషన్) ఉంటుంది.

నెస్ట్స్ కమిషనర్ శ్రీ అజీత్ కుమార్ శ్రీవాస్తవ న్యూఢిల్లీలో నాలుగు రోజుల ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాలతో పాటు, ఈఎంఆర్ఎస్ కోడర్స్ ఎక్స్‌పో, గత విద్యా సంవత్సరంలో ఏకలవ్య మోడల్ పాఠశాలల అత్యుత్తమ 20 కోడింగ్ ప్రాజెక్టుల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.

అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞాన బోధనకు అవసరమైన నైపుణ్యాలతో గిరిజన విద్యార్థులకు సాధికారత కల్పించాల్సిన ఆవశ్యకతను నెస్ట్స్ కమిషనర్ అజిత్ కుమార్ శ్రీవాస్తవ వివరించారు. ఈ సమావేశంలో ఆయన సృజనాత్మకత, ఆవిష్కరణల్లో అత్యుత్తమంగా నిలిచిన మూడు విద్యార్థుల కోడింగ్ ప్రాజెక్టులను, ఏడాది కాలంగా అంకితభావం, మార్గదర్శకత్వం అందించిన అత్యుత్తమ ముగ్గురు ఐటీ టీచర్లను సన్మానించారు.

అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ కార్యక్రమ మూడవ విడత దేశంలోని 410 ప్రతిపాదిత ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అమలు చేస్తారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 6, 7, 8 తరగతులలో 7 వేల మందికి పైగా విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్, బ్లాక్ ప్రోగ్రామింగ్ ప్రాథమిక అంశాలను నేర్చుకున్నారు. ఇదివరకు నిర్వహించిన కార్యక్రమాల్లో 50 మందికి పైగా ఉపాధ్యాయులు విద్యార్థులకు శిక్షణ అందించారు. ప్రస్తుత మూడో దశలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు బ్లాక్ చెయిన్, కృత్రిమ మేధ, కోడింగ్ పై అవగాహన కల్పించనున్నారు. సీబీఎస్ఈ ఏఐ స్కిల్స్ కరిక్యులమ్ కు అనుగుణంగా పదో తరగతి విద్యార్థులకు ప్రాజెక్టు ఆధారిత వర్చువల్ సెషన్లను నిర్వహిస్తారు.

సాంకేతిక అక్షరాస్యతను పెంపొందించడానికి, దేశవ్యాప్తంగా గిరిజన విద్యార్థుల విద్యను ఆధునీకరించడానికి నెస్ట్స్ కట్టుబడి ఉంది. ఈ సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాల ద్వారా, గిరిజన విద్యార్థులు స్టెమ్(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మాథ్స్) రంగాలలో రేపటి బంగారు భవిష్యత్తు కోసం బాగా సన్నద్ధమయ్యేలా, దేశ సాంకేతిక పురోగతికి దోహదపడాలని నెస్ట్స్ లక్ష్యంగా పెట్టుకుంది.


 

****


(Release ID: 2067217) Visitor Counter : 63


Read this release in: English , Urdu , Hindi