ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ బ్యాంకుల‌లో చీఫ్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ఉద్యోగాల క‌ల్ప‌న‌కు, పెంపుద‌ల‌కు కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి ఆమోదం


బ్యాంకుల‌లో మెరుగైన నియంత్ర‌ణ‌, ప‌ర్య‌వేక్ష‌ణ ఉండేలా, ఆస్తుల నిర్వ‌హ‌ణ‌, కార్య‌క‌లాపాల స‌మ‌ర్థ‌త బ‌లోపేత‌మ‌య్యాలా కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణ‌యం

Posted On: 21 OCT 2024 8:57PM by PIB Hyderabad

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, యూకో బ్యాంకులలో  చీఫ్ జనరల్ మేనేజర్ ఉద్యోగ(సీజీఎం) నియామకానికి  కేంద్ర ఆర్థిక మంత్రి ఆమోదం తెలిపారు. ఇంతకు ముందు 11 జాతీయ బ్యాంకులకు ఆరు బ్యాంకుల్లో సీజీఎం పోస్టులు ఉండేవి. పైన‌పేర్కొన్నఉద్యోగ క‌ల్ప‌న చేస్తూనే   ఇప్పటికే సీజీఎం స్థాయి పోస్టులను కలిగి ఉన్న బ్యాంకులలో, ఇప్పటికే ఉన్న సీజీఎంల‌ సంఖ్యను పెంచడానికి కూడా ఆర్థిక మంత్రి ఆమోదం తెలిపారు. ఈ నిర్ణ‌యం బ్యాంకుల పరిపాలనా నిర్మాణాన్ని, సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది.

జాతీయ బ్యాంకులలో సీజీఎం పోస్ట్ అనేది  జనరల్ మేనేజరుకు (జీఎం) ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుకు (బోర్డు స్థాయి పోస్ట్) మధ్యన ఉంటూ పాల‌న,  కార్య‌నిర్వాహ‌క ప‌ర‌మైన విధుల‌ను నిర్వ‌హిస్తుంది. సీజీఎం పోస్టుల పెంపుదలతో ఆయా బ్యాంకుల‌లో డిజిటలీక‌ర‌ణ‌, సైబర్ భ‌ద్ర‌త‌, ఆర్థిక సాంకేతిక‌త‌, త‌ప్పుల‌ను ప‌సిగ‌ట్ట‌డం, ఫిర్యాదుల ప‌రిష్కారం, గ్రామీణ  బ్యాంకుల సేవ‌లు, సార్వ‌త్రిక ఆర్థిక సేవ‌లు మొద‌లైన కీల‌క‌ ప‌నులను మెరుగ్గా ప‌ర్య‌వేక్షిస్తారు. అంతే కాకుండా  రిటైల్ రుణాలు, వ్య‌వ‌సాయ రుణాలు, ఎంఎస్ ఎంఈ రుణాలు మొద‌లైన ఉప అంశాల ప‌ర్య‌వేక్ష‌ణ కూడా స‌రిగ్గా జ‌రుగుతుంది. త‌ద్వారా నిర్దేశిత వ్యూహాల‌ను అమ‌లు చేయ‌డమే కాకుండా, అన్ని అంశాల్లో సామ‌ర్థ్యం పెరుగుతుంది. సీజీఎంల‌ సంఖ్య పెరగడం వల్ల ఆయా బ్యాంకులు మెరుగైన నియంత్రణ,  పర్యవేక్షణను కలిగి ఉంటాయి. తద్వారా వాటికి మెరుగైన ఆస్తుల నిర్వహణ శ‌క్తి,  కార్యాచరణ సామర్థ్యం ఏర్పడతాయి.

వ్యాపార‌ప‌రంగా చూసిన‌ప్పుడు 31.03.2023 నాటికి  బ్యాంకుల‌లో ఉన్న ప‌రిస్థితుల‌ను  ఆధారం చేసుకొని ప్రతి నలుగురు జీఎంలకు ఒక సీజీఎం ఉండేలా పోస్టుల సంఖ్యను స‌వ‌రించారు. సీజీఎం పోస్టుల ఏర్పాటు, పెరుగుద‌ల‌వల్ల‌ జీఎంలు,  సీజీఎం స్థాయికి ఎదుగుతారు. అంతే కాకుండా జీఎం స్థాయి కంటే తక్కువ స్థాయి ఎగ్జిక్యూటివ్‌లకు అంటే డిప్యూటీ జనరల్ మేనేజర్లు (డీజీఎంలు) , అసిస్టెంట్ జనరల్ మేనేజర్ల‌(ఏజీఎం)కు  కూడా ప్రయోజనం చేకూరుతుంది. ఒక‌ సీజీఎం స్థాయి పోస్టు పెరిగితే దానికి అనుగుణంగా 4 జీఎం పోస్టులు, 12 డీజీఎం పోస్టులు, 36 ఏజీఎం పోస్టులు పెరుగుతాయి.

తాజా స‌వ‌ర‌ణతో మొత్తం 11 జాతీయ బ్యాంకుల్లో సీజీఎం పోస్టుల సంఖ్య 80 నుంచి 144కి పెరిగింది. దీని ప్రకారం జీఎం పోస్టుల సంఖ్య 440 నుంచి 576కు, డీజీఎం పోస్టుల సంఖ్య 1320 నుంచి 1728కు,   ఏజీఎం పోస్టుల‌ సంఖ్య 3960 నుండి 5184కు పెరిగింది . సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఉద్యోగాల పెరుగుద‌లవ‌ల్ల  పర్యవేక్షణ పెరుగుతుంది.  సంక్లిష్ట ఆర్థిక వాతావరణంలో తప్పుల‌ను గుర్తించడం, వాటిని తగ్గించడం జరుగుతుంది.

వివిధ బ్యాంకుల నుంచి అందుతున్న డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ఈ కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. వ్యాపారంలో, నిర్దిష్ట మార్కెట్ల‌లో, ఆయా విభాగాల‌లో వ‌చ్చిన గ‌ణ‌నీయ‌మైన వృద్ధికూడా దీనికి కార‌ణం. బ్యాంకు బ్రాంచీల విస్త‌ర‌ణ‌ కూడా మరో కార‌ణం. ఎందుకంటే ఆయా బ్రాంచీల‌లో సామర్ధ్యంతో ప‌ని చేయ‌డానికి ఆయా స్థాయిల్లో సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ అధికారుల అవ‌స‌రం ఉంటుంది.


 

****


(Release ID: 2066908) Visitor Counter : 75


Read this release in: English , Urdu , Hindi , Punjabi