పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉడాన్ ఎనిమిదేళ్ల వేడుకలో పాల్గొన్న శ్రీ రామ్మోహన్ నాయుడు

Posted On: 21 OCT 2024 6:38PM by PIB Hyderabad

#ఉడాన్ - ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ పథకం విజయవంతంగా ఎనిమిదో యేట అడుగుపెడుతున్న సందర్భంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు ఈరోజు ఎమ్ఓసీఏ కార్యదర్శి, సీనియర్ అధికారులతో కలిసి హాజరయ్యారు. మూరుమూల, ప్రాంతీయ అనుసంధాన పురగోతిలో ఈ పథకం గణనీయమైన విజయాలను సాధించింది.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశంలోని మారుమూల ప్రాంతాలను ప్రపంచ గమ్యస్థానాలతో అనుసంధానిస్తూ ఉడాన్ విమాన ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చిందన్నారు. ఈ పథకం కింద, 601 మార్గాలు, 86 విమానాశ్రయాలు పనిచేస్తున్నాయనీ, ఇప్పటివరకు ఒక కోటీ నలబై నాలుగు లక్షల మంది ప్రయాణికులు ఈ పథకం ద్వారా లబ్ది పొందారని తెలిపారు.

సిమ్లా నుంచి ఢిల్లీని అనుసంధానిస్తూ మొదటి ఆర్‌సీఎస్- ఉడాన్ విమానాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2017, ఏప్రిల్ 27న ప్రారంభించారు. దేశంలో విమాన సేవలు అందుబాటులో లేని, పరిమిత సేవలు మాత్రమే అందుబాటులో ఉన్న విమాన మార్గాలను మెరుగుపరచడం, సాధారణ పౌరుల ఆకాంక్షలను నెరవేర్చడంపై ఈ పథకం దృష్టి సారిస్తుంది.

ఇప్పటివరకు, ఆర్‌సీఎస్- ఉడాన్ ఒక కోటీ నలబై నాలుగు లక్షలకు పైగా ప్రయాణికుల కోసం విమాన ప్రయాణాన్ని సులభతరం చేసింది. దేశంలో విమాన ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందించడంలో విజయం సాధించింది.

గత ఏడేళ్లుగా అనేక కొత్త, విజయవంతమైన విమానయాన సంస్థల చేరికతో ఆర్‌సీఎస్- ఉడాన్ పౌర విమానయాన రంగ వృద్ధికి దోహదపడుతోంది. ఎయిర్‌లైన్ ఆపరేటర్‌లు సుస్థిరమైన వ్యాపార నమూనాను ప్రారంభించి, అభివృద్ధి చేసుకోవడంలో ఈ పథకం వారికి సహాయపడింది. అదనంగా, ఇది ఫ్లైబిగ్, స్టార్ ఎయిర్, ఇండియావన్ ఎయిర్, ఫ్లై91ల వంటి చిన్న ప్రాంతీయ విమానయాన సంస్థలు వారి వ్యాపారాన్ని మెరుగుపర్చుకునే అవకాశాలను అందిస్తోంది. ఈ పథకం విమానయాన వ్యాపారానికి అనుకూల పరిస్థితులను కల్పించిందనడానికి ఆయా సంస్థల విజయాలే నిదర్శనం.

పథకం నానాటికీ విస్తరిస్తూ కొత్త విమానాల కోసం డిమాండ్‌ పెరిగేలా చేస్తున్నది. అదే సమయంలో ఇప్పటికే ఉన్న విమానాల పరిధిని విస్తరించింది. ఈ పెంపుదలతో ప్రస్తుతం హెలికాప్టర్లు, సీప్లేన్లు, 3-సీట్ ప్రొపెల్లర్ విమానాలు, జెట్ విమానాలతో సమగ్ర విమానాల శ్రేణిని ఇది కలిగి ఉంది. ప్రస్తుతం, ఎయిర్‌బస్ 320/321, బోయింగ్ 737, ఏటీఆర్ 42, 72, డీహెచ్‌సీ క్యూ400, ట్విన్ ఓటర్, ఎంబ్రేయర్ 145, 175, టెక్నామ్ పీ2006టీ, సెస్నా 208బీ గ్రాండ్ కారవాన్ ఈఎక్స్, డార్నియెర్ 228, ఎయిర్ బస్ హెచ్130, బెల్ 407 వంటి విమానాలు ఆర్‌సీఎస్ మార్గాల్లో చురుగ్గా సేవలందిస్తున్నాయి. భారత విమాన సంస్థల ఆర్డర్‌లు పెరగడమే, పెరిగిన ఎయిర్‌క్రాఫ్ట్‌ల డిమాండ్‌కు నిదర్శనం. ఇది రాబోయే 10-15 సంవత్సరాల్లో 1,000కి పైగా విమానాలను డెలివరీ చేయు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం వివిధ విమానయాన సంస్థల నిర్వహణలో గల సుమారు 800 విమానాలతో భారత ఫ్లీట్ గణనీయమైన వృద్ధిని సూచిస్తుంది.

ఆర్‌సీఎస్ – ఉడాన్ కేవలం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల అనుసంధానం కోసం మాత్రమే కాకుండా, అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగానికి తోడ్పాటునందిస్తోంది. ఉడాన్ 3.0 ఈశాన్య ప్రాంతంలోని అనేక గమ్యస్థానాలను కలుపుతూ పర్యాటక మార్గాలను ప్రవేశపెట్టింది. ఉడాన్ 5.1 పర్యాటకం, ఆతిథ్యం, స్థానిక ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం కోసం కొండ ప్రాంతాలలో హెలికాప్టర్ సేవలను విస్తరించేందుకు కృషి చేస్తుంది.

మతపరమైన పర్యాటక రంగంలో గణనీయమైన ఔచిత్యాన్ని కలిగి ఉన్న ఖజురహో, దేవగఢ్, అమృత్‌సర్, కిషన్‌గఢ్ (అజ్మీర్) వంటి గమ్యస్థానాలను ఈ కార్యక్రమం విజయవంతంగా అనుసంధానించింది. పాసిఘాట్, జిరో, హోలోంగి, తేజు విమానాశ్రయాలను ప్రారంభించడం ద్వారా మొత్తం ఈశాన్య ప్రాంత పర్యాటక రంగంలో గణనీయమైన పురోగతి సాధ్యమైంది. దీంతో అనేక మందికి ఈ ప్రాంతాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పథకం అగట్టి ద్వీపాన్ని భారతీయ విమానయాన పటంలో చేర్చి మరో ఘనతను సాధించింది, లక్షద్వీప్‌లో పర్యాటకానికి ఊతమిచ్చింది.


ముంద్రా (గుజరాత్) నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లోని తేజు వరకు అలాగే హిమాచల్ ప్రదేశ్‌లోని కులు నుంచి తమిళనాడులోని సేలం వరకు, దేశం నలువైపులా 34 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను ఆర్‌సీఎస్-ఉడాన్ అనుసంధానించింది. ఉడాన్ ఆధ్వర్యంలో మొత్తం 86 విమానాశ్రయాలు పనిచేస్తున్నాయి. ఈశాన్య ప్రాంతంలో రెండు హెలిపోర్ట్‌లతో పాటు పది విమానాశ్రయాలు ప్రారంభమైనాయి. ఉడాన్ నిర్వహణలోని దర్భంగా, ప్రయాగ్‌రాజ్, హుబ్లీ, బెల్గాం, కన్నూర్ వంటి అనేక విమానాశ్రయాల నుంచి నాన్-ఆర్‌సీఎస్ వాణిజ్య విమానాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి అలాగే మరికొన్నింటి నుంచి త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

 

***


(Release ID: 2066899) Visitor Counter : 64


Read this release in: English , Urdu , Hindi , Tamil