మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా శ్రీమతి విజయ కిషోర్ రహత్కర్ నియామకం కమిషన్ సభ్యురాలుగా డాక్టర్ అర్చన మజుందార్ నియామకం
Posted On:
19 OCT 2024 3:48PM by PIB Hyderabad
జాతీయ మహిళ కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) 9వ చైర్‌పర్సన్‌గా శ్రీమతి విజయ కిషోర్ రహత్కర్ నియమితులయ్యారు.
శ్రీమతి రహత్కర్ వివిధ రాజకీయ, సామాజిక బాధ్యతల నిర్వహణలో నాయకత్వ పటిమను చాటుకున్నారు. ఇంతకుముందు మహారాష్ట్ర ‘స్టేట్ కమిషన్ ఫర్ విమెన్’ (2016-2021) చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ‘‘సక్షమా’’ (యాసిడ్ దాడి బాధితులకు మద్దతు), ‘‘ప్రజ్వల’’ (కేంద్ర ప్రభుత్వ పథకాలతో స్వయం సహాయ బృందాల సంధానం), ‘‘సుహిత’’ (మహిళలకు 24x7 సహాయ కేంద్రం) వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశారు. పోక్సో, ముమ్మారు తలాఖ్ నిరోధం, మానవ అక్రమ రవాణా నిరోధం వంటి అంశాలపై దృష్టి సారించే చట్టపరమైన సంస్కరణలపైనా కృషి చేశారు. డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలను ప్రవేశపెట్టడంతోపాటు మహిళా సమస్యల పరిష్కారం దిశగా ‘‘సాద్’ పేరిట పత్రిక ప్రచురణ చేపట్టారు.
ఛత్రపతి శంభాజీనగర్ మేయరుగా 2007 నుంచి 2010 వరకు శ్రీమతి రహత్కర్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ప్రజారోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల సంబంధిత కీలక ప్రాజెక్టులను ఆమె విజయవంతంగా అమలు చేశారు.
పుణె విశ్వవిద్యాలయం నుంచి భౌతికశాస్త్రంలో పట్టాతోపాటు చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ చేసిన శ్రీమతి రహత్కర్- (మహిళల సమస్యలపై) ‘విధిలిఖిత్’, ‘‘ఔరంగాబాద్: లీడింగ్ టు వైడ్ రోడ్స్’’ సహా అనేక పుస్తకాలు రచించారు. మహిళా సాధికారతపై కృషికి గుర్తింపుగా జాతీయ న్యాయ పురస్కారం, జాతీయ అక్షరాస్యత మండలి నుంచి సావిత్రీబాయి ఫూలే పురస్కారం పొందారు. ఆమెతోపాటు ‘ఎన్‌సిడబ్ల్యు’ సభ్యురాలుగా డాక్టర్ అర్చన మజుందార్ నియమితులయ్యారు.
(Release ID: 2066420)
Visitor Counter : 125