మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మత్స్య పరిశ్రమలో ఆధునిక మార్పులను తీసుకు రావడం: మత్స్య పరిశ్రమలో, చేపలు/రొయ్యల పెంపకంలో డ్రోన్ సాంకేతికత వినియోగం పై రేపు బీహార్ లోని పాట్నాలో జ్ఞాన్ భవన్ లో వర్క్‌షాపు


ఈ కార్యక్రమంలో కేంద్ర మత్స్య, పశు సంవర్థక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ తో పాటు బిహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్ పాల్గొంటారు

Posted On: 18 OCT 2024 1:17PM by PIB Hyderabad

డ్రోన్ సాంకేతికతను మత్స్య పరిశ్రమ, చేపలు/రొయ్యల పెంపకంలో వినియోగించడం అనే అంశంపై ఒక కార్యశాలను మత్స్య, పశు సంవర్థక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖలో భాగంగా ఉన్న మత్స్య పరిశ్రమ విభాగం (డీఓఎఫ్) రేపటి రోజు, అంటే 2024 అక్టోబరు 19న, బిహార్  పాట్నాలో గల జ్ఞాన్ భవన్ లో నిర్వహించనుంది.  ఈ కార్యక్రమంలో  కేంద్ర మత్స్య పాలన, పశు సంవర్థక, పాడి పరిశ్రమ శాఖ (ఎమ్ఓఎఫ్ఏహెచ్ & డీ), పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ ఎలియస్ లలన్ సింగ్ తో పాటు బిహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్, బిహార్ ప్రభుత్వ పశు, మత్స్య పరిశ్రమ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి రేణు దేవి, బిహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ కుమార్ సింహా, బిహార్ మరో ఉప ముఖ్యమంత్రి  శ్రీ సామ్రాట్  చౌధరి తదితర ఉన్నతాధికారులు పాలుపంచుకోనున్నారు.  మత్య్స పరిశ్రమతో పాటు చేపల, రొయ్యల పెంపకంలో అనుసరిస్తున్న పద్ధతులను మరింత వృద్ధి లోకి తీసుకు పోవడానికి  సరికొత్త డ్రోన్ సాంకేతిక విజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చో  వివరించేందుకు శాస్త్రవేత్తలను, రాష్ట్ర మత్స్య పరిశ్రమ అధికారులను, మత్స్యకారులను ఈ కార్యశాలకు ఆహ్వానించారు.

ఈ కార్యక్రమం ప్రారంభ సదస్సులో సభికులను ఉద్దేశించి బిహార్ ముఖ్యమంత్రి, కేంద్ర పాలన, పశు సంవర్థక, పాడి పరిశ్రమ మంత్రి లతో పాటు ఇతర ఉన్నతాధికారులు ప్రసంగించనున్నారు.  ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎమ్ఎమ్ఎస్‌వై) లబ్ధిదారులకు,  రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ పథకాల లబ్ధిదారులకు చెక్కులను ఇవ్వనున్నారు.  ఇదే కార్యక్రమంలో  చేపల మేతను, చేప విత్తనాలను చేపల రైతులకు అందించనున్నారు.

డ్రోన్ సాంకేతికత మత్స్య పరిశ్రమ రంగంలో  ఎంతటి విస్తృత మార్పులను తీసుకు రాగలుగుతుందో  చాటి చెప్పే సాంకేతిక సదస్సులు కూడా ఈ వర్క్ షాప్ లో భాగం కాను న్నాయి.  ఐసీఏఆర్-సీఐఎఫ్ఆర్ఐ డైరెక్టరు తో పాటు కొన్ని అంకుర సంస్థ లు (స్టార్ట్- అప్స్) కూడా వాటి కృషిని, కార్యక్షేత్ర అనుభవాలను, డ్రోన్‌ల వినియోగం వల్ల జరిగిన మేలును, భావి కార్యాచరణను ఈ కార్యక్రమంలో వివరించనున్నాయి.

ఈ వర్క్ షాప్ పాట్నాలో గంగా నది తీరంలో దీఘా ఘాట్ వద్ద మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ నాయకత్వంలో నిర్వహించే చేప పిల్లల పెంపకం కార్యక్రమంతో ముగియనుంది.  నదిలో చేపల సంతతి వృద్ధి చెందేటట్టు తోడ్పడంతో పాటు దీర్ఘకాలం పాటు మత్స్య పరిశ్రమ నిర్వహణకు అనువుగా పర్యావరణ సమతుల్యతను ప్రోత్సహించాలన్నది ఈ కార్యక్రమం ధ్యేయం.

మత్స్య పరిశ్రమలో విప్లవాత్మకమైన ఫలితాలను సాధించడంలో, మత్స్య పరిశ్రమ పూర్తి సత్తాను వెలికితీయడంలో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞ‌ానం ఎంతటి పరివర్తనపూర్వక భూమికను పోషించగలదో తెలియజేయడానికి ఈ వర్క్ షాప్ ఒక అద్వితీయ వేదికను అందించనుంది. ఈ రంగం పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేసేటట్లు చూడడం ఈ వర్క్ షాప్ ఉద్దేశం. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ, దాని ఫలితాలను అందిపుచ్చుకోవడం ద్వారాను, నూతన ఆవిష్కరణలకు తావు ఇవ్వడం ద్వారాను దీర్ఘకాల ప్రాతిపదికన యావత్తు మత్స్య పరిశ్రమ ఉత్పాదనల శ్రేణిని విస్తరించుకోవడానికి  మత్స్య పరిశ్రమ విభాగం కంకణం కట్టుకొంది.

మారుమూల స్థలాలకు చేపలను, చేపల మాంసంతో తయారైన ఉత్పాదనలను త్వరిత గతిన రవాణా చేరవేయడానికి డ్రోన్ సాంకేతికత తోడ్పడుతూ, రవాణా పరంగా ఎదురయ్యే ఇక్కట్లను అధిగమించడంలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తుందని ఆశిస్తున్నారు.  మత్స్య పరిశ్రమలో డ్రోన్ సాంకేతికత వినియోగానికి ఉన్న అవకాశాలను లోతుగా పరిశీలించడానికి, చేపలను సజీవంగా రవాణా చేయడానికి తగ్గ డ్రోన్ సాంకేతికతను అభివృద్ధిపరచడానికి ఒక ప్రయోగాత్మక పథకాన్ని ఐసీఏఆర్-సీఐఎఫఫ్ఆర్ఐ చేపట్టడానికి  రూ. 1.16 కోట్ల పెట్టుబడిని మత్స్యపరిశ్రమ విభాగం (డీఓఎఫ్) కేటాయించింది.

నేపథ్యం :

చేపలు, రొయ్యల పెంపకం రంగాన్ని ‘వృద్ధికి బోలెడు అవకాశాలు ఉన్న రంగం’ అని తరచూ చెబుతూ వస్తున్నారు.  ఎందుకంటే ఈ రంగం ప్రాథమిక స్థాయిలో దేశంలో సుమారు మూడు కోట్ల మంది మత్స్యకారులకు, చేపల రైతులకు బతుకుతెరువును చూపిస్తూ,  మరిన్ని మత్స్య పరిశ్రమ ఉత్పాదనల శ్రేణి పరంగా చూస్తే మరింత మందికి సైతం జీవనోపాధిని కల్పిస్తూ ఒక కీలక పాత్రను పోషిస్తున్నది.  ఈ రంగంలో మరింతగా ముందంజ వేసేందుకు అవకాశం ఉందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దీనికంటూ ఒక ప్రత్యేక విభాగాన్ని- మత్స్యపరిశ్రమ విభాగం (డీఓఎఫ్) పేరుతో- 2019 ఫిబ్రవరిలో ఏర్పాటు చేసింది.  ఆ తరువాత ఏకంగా ఒక మంత్రిత్వ శాఖను కూడా- మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమ శాఖ (ఎమ్ఓఎఫ్ఎహెచ్&డీ) పేరుతో - 2019 జూన్‌లో ఈ శాఖను ఏర్పాటు చేశారు.

నీలి విప్లవ పథకం, ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్  ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎఫ్ఐడీఎఫ్), ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎమ్ఎమ్ఎస్‌వై) లతో పాటు ప్రధాన మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ – యోజన (పీఎమ్-ఎమ్‌కేఎస్ఎస్‌వై) వంటి కార్యక్రమాలకు 2015 మొదలుకొని పెట్టుబడులను మొత్తం రూ.38,572 కోట్ల స్థాయికి పెంచుకొంటూ వచ్చారు.  పీఎమ్-ఎమ్‌కేఎస్ఎస్‌వై అనేది పీఎమ్ఎమ్ఎస్ వై పరిధిలోనే అమలు చేస్తున్న ఒక కేంద్రీయ రంగ ఉప పథకంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లోని ఈ కార్యక్రమాలు ఈ రంగాన్ని చెప్పుకోదగిన స్థాయిలో ముందుకు తీసుకుపోవడంతో పాటు చేపల రైతుల సంక్షేమాన్ని, చేపల పెంపకంలో నిమగ్నమైన ఆదివాసీ సముదాయాల వారి, సమాజంలో అంతగా ఆదరణకు నోచకోకుండా అంచులలో నిలిచిపోయిన వర్గాల వారి  స్థితిగతులను కూడా మెరుగు పరుస్తున్నాయి.

డ్రోన్ సాంకేతికత శరవేగంగా పురోగమిస్తూ వ్యవసాయం, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తు కాలాల్లో సహాయ చర్యల వంటి వివిధ రంగాలలో అనేక వినూత్న సేవలకు ఉపయోగపడుతోంది.  ఈ సాంకేతికతకు ఉన్న పరివర్తన పూర్వక శక్తియుక్తులను గమనించిన మత్స్య విభాగం దీనిని చేపలు, రొయ్యల పెంపకం కార్యకలాపాలను విప్లవీకరించడంలో సద్వినియోగపరచుకోవాలని ప్రతిపాదించింది.  పర్యవేక్షణ, నిఘా విధులకే కాకుండా వనరుల నిర్వహణ, చేపల, రొయ్యల చెరువుల నిర్వహణ, చేపల రవాణా, ఇంకా మరెన్నో అంశాలలో మెరుగుదల కోసం సైతం ఈ సాంకేతికతను వాడుకోవాలని సంకల్పించారు.

నిఘా, నిల్వ లను అంచనా వేయడం, పర్యావరణ పర్యవేక్షణ, వ్యాధుల గుర్తింపు, చేపలు/రొయ్యల చెరువులలో దాణాను వెదజల్లడం, నీటి నమూనాల సేకరణ, ఎంపిక చేసిన ప్రాంతాలలో చేపలు పట్టడం వంటి కీలక కార్యకలాపాలలో సాంకేతిక ప్రగతిని వినియోగించుకొనేందుకు అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.  చేపలు, రొయ్యల చెరువులలో నీటి నాణ్యతను పరిశీలించడం, కాలుష్య కారకాలను గుర్తించడం, నీటి అడుగున హానికర మొక్కలు పెరుగుతూ ఉండడాన్ని పసిగట్టడం ద్వారా డ్రోన్‌లు రక్షణ చర్యలలో ముఖ్య పాత్రను పోషించగలుగుతాయి. అత్యవసర స్థితులలో డ్రోన్‌లు చేసే మేళ్లు ఇన్నీ అన్నీ కావు.  ప్రాకృతిక విపత్తులు విరుచుకుపడినప్పడు చేపల పెంపకం క్షేత్రాలలో మౌలిక సదుపాయాలకు వాటిల్లే నష్టాన్ని అంచనా వేయడం, వెతుకులాట, రక్షణ, కార్యకలాపాలలో సాయపడడం, ఆచూకీ తెలియకుండా పోయిన వ్యక్తుల, వాహనాల జాడలను త్వరితంగా, సమర్థంగా అందించడం.. ఈ విధులకు డ్రోన్ ల సాయాన్ని తీసుకోవచ్చు.  నీటి లోపల ఉంటూ విధులను నిర్వర్తించే డ్రోన్‌లు చేపలు వివిధ పరిస్థితులలో ఎలా ప్రతిస్పందిస్తాయనేది కనిపెడుతూ, చేపలు ఏవైనా రోగాల బారిన పడ్డాయంటే ముందుగా ఆ విషయాన్ని తెలుసుకోవడంలో తోడ్పడగలవు.  అధిక స్పష్టత కలిగిన ఛాయాచిత్రాలను డ్రోన్‌లు సమకూర్చి చేపలకు పుండ్లు పడడం గాని, ఇతరత్రా జబ్బులు గాని సోకే పక్షంలో సదరు వ్యాధి లక్షణాలను కూడా గుర్తించడానికి మార్గాన్ని సుగమం చేయగలుగుతాయి.  దీనితో సకాలంలో ప్రతిస్పందించి తగిన నివారక చర్యలను తీసుకొనేందుకు ఇంతకు ముందు కన్నా ఎక్కువగా అవకాశాలు లభిస్తాయి.

 

***


(Release ID: 2066258) Visitor Counter : 45