రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అవసరమైన ప్రయాణికులకు అవకాశమిచ్చేందుకూ... అనవసర రిజర్వేషన్లను తగ్గించేందుకూ రిజర్వేషన్ వ్యవధిని ప్రస్తుతం ఉన్న 120 రోజుల నుండి 60 రోజులకు తగ్గించిన భారతీయ రైల్వే: 01.11.2024 నుంచి అమలు..

డిమాండుకు తగినట్లు ముందుగానే ప్రత్యేక రైళ్ల ఏర్పాటుకు మార్గం సుగమం

Posted On: 17 OCT 2024 6:25PM by PIB Hyderabad

భారతీయ రైల్వే అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధిని 120 రోజుల నుండి 60 రోజులకు తగ్గించింది. ఇది ప్రయాణ తేదీతో సంబంధం లేకుండా, నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ కొత్త పద్ధతి అమల్లోకి వస్తుంది. ముందు రిజర్వేషన్ చేసి తరువాత రద్దు చేయడం, రద్దు చేయక పోవడం, ప్రయాణం చేయక పోవడం వంటి ఆషామాషీ ధోరణిని అరికట్టి నిజమైన ప్రయాణికులను ప్రోత్సహించడానికి అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ఎ ఆర్ పి) లో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ మార్పును తెస్తోంది. ఈ నిర్ణయం భారతదేశంలో రైలు ప్రయాణానికి నిజమైన డిమాండ్ ను గుర్తించడానికి రైల్వే బోర్డుకు సహాయపడుతుంది. 61 నుంచి 120 రోజుల కాలానికి చేసిన రిజర్వేషన్లలో 21 శాతం రద్దవుతున్నట్లు గుర్తించారు. అలాగే 5 శాతం మంది ప్రయాణికులు తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకోవడం లేదు, అలాగని ప్రయాణమూ చేయడం లేదు. ఈ ధోరణి (నో షో ట్రెండ్) ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం. ఈ నిర్ణయం రద్దీ సీజన్లలో ప్రత్యేక రైళ్లను మెరుగ్గా ప్లాన్ చేయడంలో భారతీయ రైల్వేలకు సహాయపడుతుంది.

 

ఈ నిర్ణయం నిజమైన ప్రయాణికులకు టికెట్ లభ్యతను మెరుగుపరచడం, రిజర్వ్డ్ బెర్తులు వృథా కావడానికి దారితీసే రద్దులు, ప్రయాణం చేయక పోవడం (నో-షో) సందర్భాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. రిజర్వేషన్ కోసం పెరుగుతున్న డిమాండ్, ప్రయాణికుల ప్రయాణ అనిశ్చితి ఆధారంగా భారతీయ రైల్వే తన ఎ ఆర్ పి విధానాన్ని మారుస్తూ ఉంటుంది. తాజ్ ఎక్స్ ప్రెస్, గోమతి ఎక్స్ ప్రెస్ వంటి కొన్ని పగటి పూట ప్రయణించే ఎక్స్ ప్రెస్ రైళ్లు అడ్వాన్స్ రిజర్వేషన్ల కోసం తక్కువ సమయ పరిమితులను అనుసరిస్తాయి. విదేశీ పర్యాటకులకు 365 రోజుల ఎ ఆర్ పి పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. అక్టోబర్ 31, 2024కు ముందు 120 రోజుల ఎ ఆర్ పి కింద చేసిన అన్ని రిజర్వేషన్లూ చెల్లుబాటు అవుతాయి. 60 రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధికి మించి చేసిన రిజర్వేషన్లు రద్దుకు అర్హతను కలిగి ఉంటాయి. 

 

అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధి తగ్గడంతో ప్రయాణికులకు ఇప్పుడు తమ ప్రయాణ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. ఇది ప్రస్తుత 21% రద్దు చార్జిని తగ్గిస్తుంది. ఈ వ్యవధిని చివరిసారిగా 1/1/2015 నుండి 60 రోజుల నుండి 120 రోజులకు సవరించారు. మొదట్లో 1/9/1995 నుంచి 31/1/1998 వరకు ఈ వ్యవధి 30 రోజులుగా మాత్రమే ఉండేది.

 

టికెట్లను క్యాన్సిల్ చేయకుండా ప్రయాణం చేయకపోవడం, ఒకరి బదులు ఇంకొకరు ప్రయాణించే మోసాలకు దారితీసే సమస్యను పరిష్కరించడమే ఈ కొత్త విధానం లక్ష్యం. ఈ మార్పు గురించి తెలుసుకుని, తగ్గించిన ముందస్తు రిజర్వేషన్ వ్యవధికి అనువుగా ప్రయాణ ప్రణాళికను రూపొందించుకుని టికెట్లను రిజర్వు చేసుకోవాలని భారతీయ రైల్వే ప్రయాణికులను కోరుతోంది. 60 రోజుల బుకింగ్ తో టికెట్లను ముందే కొనేసి అవసరమైన వారికి దొరకని పరిస్థితి కల్పించే హోర్డింగ్ అవకాశాలను తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. నిజమైన ప్రయాణికులకు ఎక్కువ టిక్కెట్లను అందుబాటులో ఉంచుతుంది. 

 

***


(Release ID: 2065954) Visitor Counter : 88