వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
నాణ్యతే ప్రధానం.. పరిశ్రమలు తమ ఉత్పత్తుల తయారీలో నాణ్యతపైనే దృష్టి పెట్టాలి : శ్రీ పీయూష్ గోయల్
ఉత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటించేందుకు పారిశ్రామికవేత్తలు ఏకం కావాలని కోరిన శ్రీ గోయల్
వికసిత భారతానికి ఆవిష్కరణలు, నాణ్యతను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది: శ్రీ గోయల్
తయారీ రంగంలో నాణ్యతను ప్రోత్సహించేందుకు గత దశాబ్దంలో 732 ఉత్పత్తులకు 174 క్యూసీవోలు ప్రవేశపెట్టాం: శ్రీ గోయల్
Posted On:
16 OCT 2024 3:29PM by PIB Hyderabad
న్యూడిల్లీలో జరుగుతున్న ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్(ఐఎఫ్‌క్యూఎం) సింపోజియం ముగింపు కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈ రోజు ప్రసంగించారు. పారిశ్రామికవేత్తలు, నిపుణులు తమ ఉత్పత్తుల తయారీలో నాణ్యతపై ప్రధానంగా దృష్టి సారించాలని కోరారు. వస్తు తయారీలో నాణ్యతను భాగం చేయాలని సూచించారు. నాణ్యత వినియోగదారులకు ఒక ఐచ్ఛికం కాకూడదని అన్నారు.
నాణ్యత దిశగా పరిశ్రమలను నడిపించే బాధ్యత తీసుకున్న ఐఎఫ్‌క్యూఎంను శ్రీ గోయల్ ప్రశంసించారు. ఈ విషయంలో దృక్పథాన్ని మార్చడమే పెద్ద అవరోధమని అభిప్రాయపడ్డారు. జాతి నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో నాణ్యతకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రాధాన్యమిస్తారని శ్రీ గోయల్ తెలిపారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మలిచేందుకు గడచిన రెండు పర్యాయాల్లోనూ ‘సున్నా లోపాలు, సున్నా ప్రభావం’ అన్న ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పాలన సాగిందని తెలిపారు. స్థిరమైన ఉత్పాదక పద్ధతులు దేశాన్ని హరిత ఆర్థిక వ్యవస్థ వైపు నడిపిస్తాయని, వికసిత్ భారత్ సాధించే దిశగా అవి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయని అన్నారు. రూ.లక్ష కోట్లతో ఏర్పాటు చేసిన అనుసంధాన్ నేషనల్ రీసెర్చి ఫౌండేషన్(ఏఎన్ఆర్‌ఎఫ్) ద్వారా వికసిత్ భారత్ సాధించడానికి అనుగుణంగా పరిశ్రమలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు నాణ్యతకు ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడించారు.
2014 నాటికి 106 ఉత్పత్తులకు 14 నాణ్యతా ప్రమాణాల ఉత్తర్వులు (క్యూసీవోలు) మాత్రమే ఉండేవని శ్రీ గోయల్ అన్నారు. గడచిన దశాబ్దంలో ప్రభుత్వం వీటిని పెంచిందని తెలిపారు. 732 ఉత్పత్తులకు 174 క్యూసీవోలకు వాటిని విస్తరించిందని తెలిపారు. బొమ్మల తయారీలో నాణ్యత ప్రభావాన్ని ప్రధానంగా ప్రస్తావించిన మంత్రి, నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరిచిన తర్వాతే ఎగుమతులు పెరిగాయని తెలిపారు. అంతర్జాతీయంగా భారత్ ఉత్పత్తులకు గుర్తింపు రావాలంటే నాణ్యతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని అన్నారు. భారత్‌లో తయారైన ఉత్పత్తి అంటే అది నాణ్యతకు ప్రతిరూపం అనే భావన తీసుకురావడమే తమ లక్ష్యమని శ్రీ గోయల్ తెలిపారు.
క్యూసీవో వ్యవస్థ ద్వారా ఎంఎస్ఎంఈ రంగంలో నాణ్యత మెరుగుపరిచేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పారిశ్రామికవేత్తలను కేంద్ర మంత్రి కోరారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యతను మెరుగుపరిచేందుకు పారిశ్రామికవేత్తలు తాము పాటిస్తున్న ఉత్తమ విధానాలను ప్రభుత్వ సాంకేతిక ప్రమాణాల కమిటీలతో పంచుకోవాలని, సాంకేతిక సహాయాన్ని అందించాలని కోరారు. అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో తయారీదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు నాణ్యతా ప్రమాణాల వ్యవస్థలతో కలసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వికసిత్ భారత్ దిశగా దేశాన్ని నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కర్తవ్య భావన పెంపొందించుకోవాలని సభలో పాల్గొన్నవారిని శ్రీ గోయల్ కోరారు. ఎగుమతుల్లో పోటీతత్వం సబ్సిడీలతో రాదని అభిప్రాయపడ్డారు. స్వావలంబన సాధించిన భారత్ ద్వారా మాత్రమే ఆత్మనిర్భర భారత్ సాధించవచ్చని అన్నారు. నాణ్యతను పాటించడం పనిగా భావించరాదని, బాధ్యతగా తీసుకోవాలని కోరారు.
***
(Release ID: 2065732)
Visitor Counter : 38