నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్కిల్ ఇండియా మిషన్ లో ఏఐ అసిస్టెంట్ తో పాటు ఎన్ఎస్‌టిఐ లలో 5 ఉన్నత నైపుణ్య కేంద్రాల ఏర్పాటుకు మెటా తో జట్టు కట్టిన ఎమ్ఎస్‌డీఈ


‘‘నేటి పోటీ ప్రపంచంలో ముందంజ వేయడానికి దేశంలోని యువతీ యువకులకు అవసరమైన నైపుణ్యాలను అందించాలన్నదే మా మిషన్ లక్ష్యం: శ్రీ జయంత్ చౌధరి

Posted On: 14 OCT 2024 2:20PM by PIB Hyderabad

రెండు ప్రధాన కార్యక్రమాలను నిర్వహించడానికి మెటా తో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ (ఎమ్ఎస్‌డీఈ)   ఢిల్లీలో ఈ రోజు ప్రకటించింది.  స్కిల్ ఇండియా మిషన్ కోసం ఉద్దేశించిన ఒక కృత్రిమ మేధ సహాయక వ్యవస్థ (ఏఐ అసిస్టెంట్)ను ఏర్పాటు చేయడం ఇందులో మొదటిది.  హైదరాబాద్, బెంగళూరు, జోధ్ పుర్, చెన్నై, కాన్పూర్ లలో ఉన్న నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ (ఎన్ఎస్‌టీఐ) లో వర్చువల్ రియాలిటీ (వీఆర్), మిక్స్‌డ్ రియాలిటీ (ఎమ్ఆర్) రంగాలకు సంబంధించిన 5 ఉన్నత నైపుణ్య కేంద్రాల (సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్..  సీఓఈలు)ను ఏర్పాటు చేయడం రెండోది.

ఈ భాగస్వామ్యం గురించి నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ జయంత్ చౌధరి మాట్లాడుతూ,   ‘‘మన దేశంలో యువతీ యువకులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ముందుకు సాగిపోవడానికి అవసరమైన నైపుణ్యాలను వారికి అందించాలన్నదే  మా మంత్రిత్వ శాఖ ధ్యేయం. కృత్రిమ మేధ (ఏఐ), వర్చువల్ రియాలిటీ (వీఆర్), మిక్స్‌డ్ రియాలిటీ (ఎమ్ఆర్)ల వంటి సాంకేతికతలను స్కిల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా చేయడం ద్వారా అత్యాధునిక సాంకేతికతలు అందరికి అందుబాటులోకి వచ్చేటట్లుగా చూస్తూ, దేశంలో యువత అన్ని నూతన పద్ధతులను వ్యక్తిగతంగా వారే అంది పుచ్చుకొనేటట్లుగా మేం కృషి చేస్తున్నాం.  మెటా తో ఈ రోజున మేం కుదుర్చుకొన్న భాగస్వామ్యం ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఒక ముఖ్యమైన ముందంజ అని చెప్పాలి’’ అన్నారు.

 



ఈ భాగస్వామ్యం ద్వారా, మెటాకు ఉన్న ఓపెనె-సోర్స్ లామా (Llama)  నమూనా అండతో ఒక సరికొత్త ఏఐ-చాట్ బాట్ (AI-chatbot) ను అభివృద్ధి చేస్తారు.  ఇది స్కిల్ ఇండియా డిజిటల్ (ఎస్ఐడీ) పోర్టల్ లో అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తుంది.  ఎస్ఐడీ పోర్టల్ లో ఒక భాగంగా కలిపివేసే చాట్ బాట్ వినియోగదారులకు ప్రతి రోజూ 24 గంటలూ సహాయాన్ని అందిస్తుంది.  ఫలితంగా వారు ఈ పాఠ్యక్రమం (కోర్స్) సమాచారాన్ని ఇట్టే అవగాహన చేసుకోవచ్చు.  కోర్సు కు సంబంధించిన ప్రశ్నలను అడగడం- జవాబులను రాబట్టుకోవడం, లెక్చర్ సారాంశాలు అందుబాటులో ఉండడం, రివిజన్ కోసం తత్సంబంధిత వీడియోలను ఉపయోగించుకోవడం చేయవచ్చు.  వాట్సాప్ (WhatsApp)లో లభించే చాట్ బాట్ ఇంగ్లిషులో, హిందీలో, ఈ రెండు భాషల మిశ్రమం  (Hinglish) లో కూడా లభ్యం అవుతుంది.  దీనికి స్వర ఆధారిత శక్తి సామర్థ్యాలను కూడా జతపరచనున్నారు. దీనివల్ల దేశం అంతటా వేరు వేరు అవసరాలతో పోర్టల్ ను సందర్శించే వారికి ఇది మరింత చేరువ కాగలుగుతుంది.  దీనికి అదనంగా, యూజర్ లు తమకు కావాల్సిన ఫలానా కోర్సు అంశాలను మాత్రమే కూడా అన్వేషించ వచ్చు.  నైపుణ్యాలను అందించే కేంద్రాలు ఎక్కడ ఉన్నదీ కనుక్కోవచ్చు.  వారికి వీలైన ప్రాంతంలో, వారి అభిరుచుల మేరకు సరిపడే ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉన్నాయో  తెలుసుకోవచ్చు.  అంతేకాకుండా, నిరంతరం మెరుగుదల కోసం వారి వారి అవసరాలకు అనుగుణంగా ఉండే ఫీడ్ బ్యాక్ ను కూడా వారు అందుకొనేందుకు అవకాశం ఉంటుంది.  ఈ ప్లాట్ ఫామ్  సేవల పరిధిని మరింత పెంచడానికి వీలుగా విలువైన విశ్లేషణ పూర్వక అంశాలను సైతం మంత్రిత్వ శాఖకు చాట్ బాట్ సమకూరుస్తుంది.  ఏఐ అసిస్టెంట్ ప్రాజెక్టుకు సాంకేతిక భాగస్వామిగా వ్యవహరించే ‘సర్వమ్ ఏఐ’ ఆరు నెలల కాలం లోపు  ప్రయోగాత్మక ప్రాతిపదికన చాట్ బాట్ ను తీర్చిదిద్ది రంగంలోకి దించే బాధ్యతను తీసుకోనుంది.

మెటా కు చెందిన ఓపెన్-సోర్స్ ఏఐ నమూనాలను దేశంలోని ఏఐ వ్యవస్థకు సహాయకారిగా మలచడంలోని ప్రధాన ఉద్దేశం  ఏమిటంటే  అది ఏఐ మిషన్ అవసరాలను తీర్చే భారీ సామాజిక, ఆర్థిక పరివర్తనకు దోహద పడే ప్రభావశీల ఏఐ పరిష్కారాలను అమలు లోకి తెచ్చేందుకు ఇ-గవర్నెన్స్ తో కలిసి పని చేయాలి అనేదే.   ఎన్ఎస్‌టీఐ లలో ఏర్పాటు చేసే అయిదు ఉన్నత నైపుణ్య కేంద్రాలు (సీఓఈ స్) ఒక సురక్షితమైన వాతావరణంలో వర్తమాన నైపుణ్యాలకు మెరుగులు పెట్టుకొనేటందుకు అత్యాధునిక వీఆర్ సాంకేతికతను  అటు బోధకులకు, ఇటు విద్యార్థులకు కూడా అందించనున్నాయి.  ఏఐ అసిస్టెంట్ అంశంలో ఏర్పడ్డ భాగస్వామ్యం విద్యార్థులకు డిజిటల్ మాధ్యమం పరంగా నిరంతరం మద్ధతును అందిస్తూ, సమాచార లభ్యతను సాఫీగా ఉండేటట్లుగా చూసి వారి విజ్ఞానార్జన పరిధిని పెంచనుంది. ఈ అయిదు  కేంద్రాలు నైపుణ్యాభివృద్ధి సంబంధిత శిక్షణలో వాస్తవ కాల స్థితిగతులను సృష్టించి, విద్యార్థులు వాటితో మమేకమై ముందంజ వేసేందుకు అవకాశాలను కల్పిస్తాయి.



మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్, పబ్లిక్ పాలసీ అధిపతి శ్రీ శివ్‌నాథ్ ఠుక్ రాల్  మాట్లాడుతూ, ‘‘మెటా సంస్థ లో మేం ఏఐ, వీఆర్, ఎమ్ఆర్ ల వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి, దేశ ఆర్థిక అభివృద్ధి ఫలితాలు లక్షిత వర్గాలకు చక్కని ప్రయోజనాలను అందించేటట్లుగా చూడటానికి కట్టుబడి ఉన్నాం. నైపుణ్యాభివృద్ధి – వ్యవస్థాపక శాఖ (ఎమ్ఎస్‌డీఇ)తో  మేం కుదుర్చుకున్న భాగస్వామ్యాలు సాంకేతిక విజ్ఞానానికి, విద్యకు మధ్య గల అంతరానికి వంతెన వేయాలన్న మా నిబద్ధతను నిరూపిస్తున్నాయి.  ఓపెన్-సోర్స్ లామా (Open-Source Llama) వంటి అధునాతన సాంకేతికతల ఏకీకరణ ద్వారా మేం విద్యార్థులకు సాధికారితను కల్పించడమే కాకుండా విద్యను బోధించే వారితో పాటు వ్యవస్థాపకులకు కూడా- డిజిటల్ మాధ్యమానికే పెద్దపీటను వేస్తున్న ప్రస్తుత ప్రపంచంలో- వారు రాణించడానికీ కావలసిన శక్తియుక్తులను వారికి సమకూర్చాలని ధ్యేయంగా పెట్టుకొన్నాం’’ అని వివరించారు.

దేశంలో నైపుణ్యాల సంపాదన సంబంధిత వ్యవస్థలో ‘స్కిల్ ఇండియా డిజిటల్ పోర్టల్’ ఒక కీలక పాత్రధారిగా మారింది.  లక్షల కొద్దీ విద్యార్థులు ఈ కాలంలో ఉద్యోగాలకు అవసరమైన వివిధ అర్హతలను సంపాదించుకొని వారిని వారు తీర్చిదిద్దుకోవడానికి తగిన  పాఠ్యక్రమాలను అనుసరిస్తున్న ప్రస్తుత పరిస్థితులలో, ఈ పోర్టల్ కు ఉన్న ప్రాముఖ్యం పెరిగింది.  ఏఐ చాట్ బాట్ ను ప్రవేశపెట్టే క్రమంలో ఎమ్ఎస్‌డీఈ, ఇంకా మెటా లు కోర్సు కంటెంట్ తో విద్యార్థులు ఏ విధంగా ముందు పోతూ, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎలా సన్నద్ధులు కావాలో అనే విషయంలో ఒక ముఖ్యమైన ముందడుగును వేయబోతున్నాయి. ఉన్నత నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేయడంలో సాంకేతిక భాగస్వామిగా ఉండే స్కిల్ వెరీ (Skillveri) అత్యాధునిక వీఆర్, ఎమ్ఆర్ సంబంధిత వనరులను, పాఠ్య ప్రణాళికలను, సుశిక్షిత వృత్తి నిపుణులను విద్యార్థినీ విద్యార్థులకు, బోధకులకు సమకూర్చనుంది.


 

***


(Release ID: 2064714) Visitor Counter : 86