పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ గ్రామీణ స్థానిక సంస్థలకు 15 వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం


గ్రామీణాభివృద్ధికి భారీ ప్రోత్సాహం : మొదటి విడతగా రాజస్థాన్ కు రూ.1267 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు రూ.988 కోట్లకు పైగా విడుదల

Posted On: 12 OCT 2024 11:16AM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని గ్రామీణ స్థానిక సంస్థల (ఆర్ ఎల్ బి) కు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 15వ ఆర్థిక సంఘం మొదటి విడత నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌కు రూ 395.5091 కోట్ల అన్‌టైడ్ (షరతులు లేని) గ్రాంట్లు,  రూ 593.2639 కోట్ల టైడ్ (షరతులతో కూడిన) గ్రాంట్లు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో అర్హత కలిగిన తొమ్మిది జిల్లా పంచాయతీలు, 615 బ్లాక్ పంచాయతీలు, 12,853 గ్రామ పంచాయతీలకు ఈ నిధులను ఉద్దేశించారు. కాగా, రాజస్థాన్ లో అర్హత కలిగిన 22 జిల్లా పంచాయతీలు, 287 బ్లాక్ పంచాయతీలు, 9,068 గ్రామ పంచాయతీలకు రూ.507.1177 కోట్ల అన్ టైడ్ గ్రాంట్లు, రూ.760.6769 కోట్ల టైడ్ గ్రాంట్లు విడుదలయ్యాయి.

అన్ టైడ్ , టైడ్ గ్రాంట్ ల వినియోగం ద్వారా స్థానిక పాలనకు సాధికారత

వ్యవసాయం, గ్రామీణ గృహనిర్మాణం మొదలుకొని విద్య, పారిశుధ్యం వరకు భారత రాజ్యాంగం పదకొండో షెడ్యూలులోని 29 అంశాల్లో నిర్దిష్ట స్థానిక అవసరాలను తీర్చడానికి పంచాయతీలకు ఈ గ్రాంట్లు ఉపయోగపడతాయి. అయితే ఈ నిధులను జీతభత్యాలు, ఎస్టాబ్లిష్ మెంట్  ఖర్చులకు వినియోగించడానికి వీల్లేదు. పారిశుద్ధ్యం, బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) స్థితి నిర్వహణ, వర్షపునీటి సంరక్షణ, నీటి రీసైక్లింగ్, గృహ వ్యర్థాల శుద్ధి వంటి మౌలిక సేవలపై టైడ్ గ్రాంట్లు దృష్టి సారిస్తాయి.

అట్టడుగు స్థాయి నుంచి క్షేత్రస్థాయి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా సమ్మిళిత వృద్ధి

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జి ప్రకారం, ఈ నిధులు అత్యవసర సేవలు , మౌలిక సదుపాయాలను నిర్వహించడానికి పంచాయతీలకు అధికారం ఇస్తాయి.  మహాత్మాగాంధీ 'గ్రామ స్వరాజ్య' దార్శనికతకు అనుగుణంగా స్థానిక స్వపరిపాలనను పునర్నిర్వచించడానికి, క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతమైన, స్పందనాయుతమైన నాయకత్వాన్ని పెంపొందించడానికి గ్రామపంచాయతీలకు ఈ గ్రాంట్ల కేటాయింపు ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పించింది. ఈ సాధికారత ప్రక్రియ ప్రభుత్వ మార్గదర్శక సూత్రం 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్' లో ప్రతిబింబిస్తుంది, ఇది "వికసిత్ భారత్" లక్ష్యాన్ని సాధించడానికి దృఢమైన నిబద్ధతను స్పష్టం చేస్తుంది. స్థానిక పాలనను పెంపొందించడం ద్వారా, ఈ నిధులు భాగస్వామ్య ప్రజాస్వామ్యం గ్రామ స్థాయి పురోగతి పట్ల భారత్ నిబద్ధతను బలోపేతం చేస్తూ,  సమ్మిళిత వృద్ధి , సుస్థిర గ్రామీణ అభివృద్ధికి దోహదం చేస్తాయి,

పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ,  జల్ శక్తి మంత్రిత్వ శాఖ (తాగునీరు , పారిశుద్ధ్య విభాగం) ద్వారా గ్రామీణ స్థానిక సంస్థల కోసం రాష్ట్రాలకు 15 వ ఆర్థిక సంఘం గ్రాంట్లను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది, ఆ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ  గ్రాంట్ లను విడుదల చేస్తుంది. కేటాయించిన గ్రాంట్ల ను ఆర్థిక సంవత్సరంలో రెండు విడతలుగా సిఫారసు చేసి విడుదల చేస్తారు.


 

***


(Release ID: 2064593) Visitor Counter : 74