గనుల మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లోని ‘జిఎస్‌ఐటిఐ’లో పైకప్పు సౌర విద్యుత్ ప్లాంటుకు కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రారంభోత్సవం
Posted On:
12 OCT 2024 7:12PM by PIB Hyderabad
పరిశుభ్ర, హరిత భారత్ దిశగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక దృక్పథానికి మరింత బలం చేకూరుస్తూ కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్‌లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (జిఎస్ఐటిఐ)లో పైకప్పు సౌర విద్యుదుత్పాదక వ్యవస్థను ప్రారంభించారు. ఎం.ఎస్.కృష్ణన్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సుస్థిర ఇంధనంపై ‘జిఎస్ఐటిఐ’ నిబద్ధతలో ఓ కీలక ముందడుగును సూచిస్తోంది.
ఈ సౌర విద్యుత్ ప్లాంటు ప్రారంభం ద్వారా ‘జిఎస్ఐటిఐ’లో కర్బన ఉద్గారాల తగ్గింపు దిశగానే కాకుండా ప్రభుత్వ సంస్థలలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంలో ముఖ్యమైన ముందడుగు పడింది. కాగా, సంస్థ ఇంధన అవసరాలను గణనీయ స్థాయిలో తీర్చగలిగేలా ఈ ప్లాంటు విద్యుదుత్పాదన చేయగలదని అంచనా. తద్వారా వివిధ మార్గాల్లో ఉత్పత్తయ్యే ఇంధన వనరులలో పునరుత్పాదక ఇంధనం వాటా పెంచాలన్న భారత్ భారీ లక్ష్య సాధనలో ఇది తనవంతు పాత్ర పోషించనుంది.
‘జిఎస్‌ఐటిఐ’లో సౌర విద్యుత్ ప్లాంటును ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ- సుస్థిర ఇంధనం దిశగా సంస్థ నిబద్ధతను ప్రశంసించారు. ఈ మేరకు ‘‘పర్యావరణం పట్ల బాధ్యత, ఇంధన పొదుపు, సుస్థిర ప్రగతి వైపు ఇదొక ముఖ్యమైన ముందడుగు’’ అని ఆయన పేర్కొన్నారు. వాతావరణ మార్పులపై పోరాటంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన వివిధ కార్యక్రమాల అమలు ద్వారా భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఆవిర్భవించిందని తెలిపారు. ‘‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ ద్వారా అనేక కుటుంబాలు నేడు సౌరశక్తిని సద్వినియోగం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ‘జిఎస్‌ఐటిఐ’లో ఏర్పాటు చేసిన 150 కిలోవాట్ల పైకప్పు సౌర విద్యుత్ ప్లాంటు సంస్థ అవసరాలలో 75 శాతం తీర్చగలదు. దీనివల్ల ఏటా రూ.30 లక్షల దాకా ఆదా కావడమేగాక ప్రభుత్వ సంస్థలలో పునరుత్పాదక ఇంధన వినియోగంలో ఇది కొత్త ప్రమాణం సృష్టిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (దక్షిణ ప్రాంత) అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ ఎస్.డి.పట్భాజే కూడా ప్రసంగిస్తూ- సుస్థిర ప్రగతిలో ఈ ప్రాజెక్టుకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. అలాగే జాతీయాభివృద్ధిలో పునరుత్పాదక ఇంధనానికిగల కీలకపాత్రను మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ ప్రముఖంగా ప్రస్తావించారు.
ఈ సందర్భంగా సౌరవిద్యుత్ ప్లాంటు ప్రారంభోత్స ఫలకం ఆవిష్కరణతోపాటు పర్యావరణ సుస్థిరత-పచ్చదనం పెంపుపై సంస్థ నిబద్ధతకు ప్రతీకగా మొక్కలు నాటే కార్యక్రమం కూడా నిర్వహించారు. అనంతరం ప్రముఖులందరూ సౌరవిద్యుత్ ప్లాంటును సందర్శించి, దానికి సంబంధించిన సాంకేతిక వివరాలు, ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు.
పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో ప్రభుత్వ భవిష్యత్ కార్యక్రమాలకు ఈ సౌర విద్యుత్ ప్లాంటు ఒక నమూనాగా నిలుస్తుంది. అలాగే దేశ సుస్థిర ఇంధన భవితకు దోహదం చేయడంలో ‘జిఎస్‌ఐటిఐ’ పాత్రకు ఇదొక ఉదాహరణ కాగలదు. అంతేకాకుండా పరిశుభ్ర ఇంధన ఉత్పాదనలో దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా రూపొందించాలనే ప్రధాని మోదీ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లగలదు.
***
(Release ID: 2064524)
Visitor Counter : 46