ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాంకేతిక ప్రోత్సాహం: మహారాష్ట్రకు విద్యారంగంలో అత్యాధునిక హబ్స్


కృత్రిమ మేధలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), పరిశ్రమ 4.0, త్రీడీ ప్రింటింగ్, అనుబంధ రంగాల ఏర్పాటు

మహారాష్ట్రలోని ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో సామర్థ్య శిక్షణ, పరిశోధనాభివృద్ధి కేంద్రాలకు అవగాహన ఒప్పందం

కేంద్ర నిధులతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి సాంకేతిక విద్యకు బలమైన పునాది వేసిన మహారాష్ట్ర

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సాంకేతిక విద్యపై దృష్టి సారిస్తూ జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఉంది; ఇవి విద్యార్థులకు పరిశ్రమకు కావల్సిన నైపుణ్యాలను, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయి: శ్రీ అశ్విని వైష్ణవ్

Posted On: 11 OCT 2024 4:31PM by PIB Hyderabad

దేశంలో సాంకేతిక విద్యను ప్రోత్సహించే దిశలో భాగంగా, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్ఐఈఎల్ఐటీ)- మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అక్టోబర్ 11 వ తేదీన మహారాష్ట్ర సాంకేతిక విద్యా బోర్డు ద్వారా న్యూఢిల్లీలో అవగాహన ఒప్పందం(ఎంఓయు) కుదిరింది.

"ఎన్ఐఈఎల్ఐటీ, మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య సహకారం ఫలితంగా విద్యార్థులు పరిశ్రమల ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ప్రయోగాత్మకంగా విద్యను పొందుతారు. మహారాష్ట్రలో ప్రారంభమైన ఈ ప్రయత్నాలు ఇతర రాష్ట్రాలకు... ముఖ్యంగా పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐలు, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలపై దృష్టిసారిస్తాం. ఐటి పరిశ్రమలో స్థిరపడాలనుకునే యువతకు ఇదొక ఉత్తేజకరమైన అవకాశం" అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ, రైల్వేలు, సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ నేడు న్యూఢిల్లీలో జరిగిన ఈ అవగాహన ఒప్పంద కార్యక్రమంలో ప్రసంగిస్తూ అన్నారు.

మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి, శ్రీ చంద్రకాంత్ పాటిల్, మహారాష్ట్ర సాంకేతిక విద్యా మండలి డైరెక్టర్, డాక్టర్ వినోద్ మోహిత్కర్, మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ ప్రమోద్ నాయక్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) అదనపు కార్యదర్శి శ్రీ అభిషేక్ సింగ్, మంత్రిత్వ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏఐ(కృత్రిమ మేధ), రోబోటిక్స్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్

కృత్రిమ మేధలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), పరిశ్రమ 4.0, త్రీడీ ప్రింటింగ్, ఇతర అనుబంధ రంగాలలో సామర్థ్య శిక్షణ, పరిశోధనాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటివి ఈ ఒప్పందం ద్వారా నెరవేరనున్నాయి. మహారాష్ట్రలోని ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల్లోని విద్యార్థులకు సామర్థ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ, ఇతర ప్రభుత్వ సంస్థల నుండి ఈ సంయుక్త ప్రాజెక్టుకు ప్రతిపాదనల ద్వారా నిధులు సమకూరుతాయి.

మహారాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యా మంత్రి శ్రీ చంద్రకాంత్ దాదా పాటిల్ ఈ ఒప్పందం కార్యరూపం దాల్చేందుకు కృషి చేశారు. మంత్రిత్వ శాఖ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటును వేగవంతం చేయడంలో ఆయన తీసుకున్న చొరవను కేంద్రమంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు. అవగాహన ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రసంగిస్తూ, పరిశ్రమల డిమాండ్లకు అనుగూనంగా విద్యను అనుసంధానం చేయాల్సిన ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించారు.


మహారాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలు, ఐటీఐలు, ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేసి బలమైన పునాదులను నిర్మించింది. కృత్రిమ మేధ, రోబోటిక్స్ ఐఓటి వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ఇవి ఉపయుక్తం కానున్నాయి. అభివృద్ధి సామర్థ్యాల ఆధారంగానే మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి నిధులను పొందగలిగింది. ఈ ప్రతిపాదనకు మంత్రిత్వ శాఖ చురుకుగా స్పందించి మద్దతుగా నిలిచింది. మహారాష్ట్ర అత్యాధునిక సాంకేతిక విద్య, ఆవిష్కరణలలో ముందంజలో ఉండేలా చేసింది.

మహారాష్ట్ర పారిశ్రామిక శక్తిని గుర్తించడంలో రాష్ట్రమంత్రి పాటిల్ దూరదృష్టిని కేంద్రమంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ కొనియాడారు. నేటి ఆర్థిక వ్యవస్థలో యువతను వారికి సంబంధించిన నైపుణ్యాలతో సన్నద్ధం చేయాల్సిన అవసరాన్ని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. 150-200 ఏళ్ల పారిశ్రామిక పునాది కలిగిన మహారాష్ట్ర, నేటి యువతకు అవసరమైన సాంకేతిక విద్యతో కలిసి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆచరణాత్మక, సాంకేతిక విద్యపై దృష్టి సారిస్తున్న ఈ ఒప్పందం జాతీయ విద్యా విధాన ఫ్రేమ్‌వర్క్‌కు సరిగ్గా సరిపోతుందని మంత్రి అన్నారు.

ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులు గణనీయమైన అవకాశాలను పొందుతారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను, ఉద్యోగావకాశాలను ఇది కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 40 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, 300 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విద్యా బోర్డు ద్వారా ఇప్పటికే 6 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, 3 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ రోబోటిక్స్, ఆటోమేషన్‌ను ఏర్పాటు చేసింది. మిగిలిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఈ ఒప్పందం ద్వారా లభించే నిధులతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు.

 

***


(Release ID: 2064328) Visitor Counter : 64


Read this release in: English , Urdu , Marathi , Hindi