మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర మంత్రి శ్రీ జార్జ్ కురియన్ చేతుల మీదుగా కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో పశువుల క్వారంటీన్, ధ్రువీకరణ సేవ ప్రారంభోత్సవం: దీని లక్ష్యం పెంపుడు జంతువులను తీసుకొని ప్రయాణించే వారికి ‘‘జీవన సౌలభ్యా’’న్ని కలగజేయడం

Posted On: 10 OCT 2024 3:46PM by PIB Hyderabad

కేరళ లోని కొచ్చిలో గల కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం (సిఐఎఎల్) లో సరికొత్తగా ఏర్పాటు చేసిన ఏనిమల్ క్వారంటీన్, సర్టిఫికేషన్ సర్వీస్ (ఏక్యూసీఎస్)ను కేంద్ర మత్స్య పాలన, పశుసంవర్థకం, పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్ ఈ రోజు ప్రారంభించారు.  పెంపుడు శునకాలను,  పిల్లులను దిగుమతి చేసుకోవడానికి మార్గాన్ని సుగమం చేసేందుకు ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం ఒక ముఖ్యమైన నిర్ణయం అని చెప్పాలి.  పెంపుడు జంతువుల యజమానులకు ‘జీవన సౌలభ్యా’న్ని పెంపొందింప చేయాలన్న ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఈ కేంద్రాన్ని స్థాపించారు.

పశుగణం, మత్స్య పరిశ్రమ ఉత్పాదనలకు సంబంధించిన దిగుమతి, ఎగుమతి పక్రియలను, తత్సంబంధిత కార్యకలాపాలను మరింతగా మెరుగు పరచడానికి ఈ కార్యకలాపాలతో ప్రమేయం గల వర్గాల వారు తగిన సూచనలను, సలహాలను ఇవ్వాలని కేంద్ర సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్ ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యకలాపాలు ఈ ప్రాంతాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాయని ఆశిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి అండదండలను అందిస్తూ, కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం అనేక సదుపాయాలను నెలకొల్పింది.  వాటిలో- 24 గంటలూ అందుబాటులో ఉండే పెంపుడు జంతువుల ఎయర్ కండీషన్డ్ (ఏసీ) కేంద్రం, ఒక ప్రత్యేక కార్గో విభాగం, ఫోన్ చేస్తే చాలు వచ్చి సేవలను అందించే పశువుల డాక్టరు, కస్టమ్స్ క్లియరెన్స్ సెంటర్ లతో పాటు పెంపుడు జంతువులను వెంట తీసుకొని ప్రయాణాలు చేసే వారిని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిన ఒక సౌలభ్యత కేంద్రం వంటివి- ఉన్నాయి.  ఈ కొత్త సేవ, పెంపుడు జంతువులతో సహా ప్రయాణాలు చేసే వారికి అవసర పడే సేవల అందజేతలో ఓ కీలకమైన ముందడుగు అని చెప్పాలి.  అంతేకాకుండా, కేరళలో మొత్తంమీద పశువులు, మత్స్య పరిశ్రమ సంబంధిత ఉత్పాదనల ఎగుమతి, దిగుమతి ప్రక్రియలను మెరుగుపరచడంలో కూడా ఈ కేంద్రం తోడ్పడనుంది.

ఇదే కార్యక్రమంలో, పశువులకు క్వారంటీన్ సదుపాయాల నిర్వహణ నిమిత్తం ఒక ఒప్పంద పత్రం పైన పశుసంవర్థక, పాడి పరిశ్రమ విభాగం అదనపు కార్యదర్శి శ్రీ వర్ష జోషి తో పాటు సీఐఏఎల్ ప్రతినిధి లు సంతకాలు చేశారు. సీఐఏఎల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎస్. సుహాస్ మాట్లాడుతూ, ఈ నిర్ణయం పెంపుడు జంతువులను వెంట తీసుకొని ప్రయాణించే వారికి ఎంతగానో ప్రయోజనాన్ని కలిగిస్తుందన్నారు.  పెంపుడు జంతువుల యజమానులకు ప్రపంచ స్థాయి సేవలను అందిస్తూ ప్రయాణికులు వారి వెంట వారి పెంపుడు జంతువులను కేరళ లోకి తీసుకు వచ్చేందుకు ఉద్దేశించిన ప్రక్రియను సులభతరం చేయడం ఈ భాగస్వామ్యం లక్ష్యమని వివరించారు.

పశుగణంతో పాటు తత్సంబంధిత ఉత్పాదనల దిగుమతిని 1898 నాటి లైవ్‌స్టాక్ ఇంపోర్టేషన్ యాక్టు లో భాగంగా మత్స్య, పశుసంవర్థకం, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్నది.  ఈ చట్టానికి 2001లో సవరణ చేశారు.  దేశం లోకి కొన్ని ప్రత్యేక వ్యాధులు వ్యాప్తి చెందకుండా అడ్డుకోవాలన్నదే ఈ సవరణ ప్రధానోద్దేశం.  ప్రస్తుతం పెంపుడు జంతువులను ఆరు ప్రధాన ఏక్యూసీఎస్ కేంద్రాల గుండా దేశం లోకి దిగుమతి చేసుకొనేందుకు అనుమతిని ఇస్తున్నారు.  ఈ ఆరు కేంద్రాలు .. ఢిల్లీ, ముంబయి, కోల్‌కాతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లలో ఉన్నాయి.  కొత్త కేంద్రాన్ని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసినందువల్ల కేరళ లోకి జంతువులను దిగుమతి చేసుకోవాలనుకొనే వ్యక్తులకు సంబంధిత ఖర్చులతో పాటు శ్రమ కూడా తగ్గుతుంది. వారికి మరింత అనుకూలమైన ఐచ్ఛికం లభించినట్లయింది.

 

****


(Release ID: 2064015) Visitor Counter : 60